Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కావ్య పరిమళం-22

సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.

బిల్హణీయం

క కవి జీవితం ఆధారంగా రచింపబడిన మూడాశ్వాసాల కావ్యం ఇది. సంస్కృతం నుండి పండిపెద్ది కృష్ణస్వామి తెలుగున కనువదించారు. బిల్హణుడు క్రీ.శ.1062-65 మధ్యకాలంలో కాశ్మీరు నుండి మధరా నగరం చేరి విద్వాంసులను శాస్త్రార్థంలో జయించాడు. అక్కడి నుండి కన్యాకుబ్జం, ప్రయాగ, కాశీయాతలు చేశాడు. అక్కడి నుండి అయోధ్యలో కొంతకాలముండి ధారానగరం చేరాడు. అప్పటికి భోజ మహారాజు పరమపదం చెందాడు. సోమనాథ్ నుంచి దక్షిణ దేశ యాత్రలో రామేశ్వరుని సేవించి తిరుగుప్రయాణంలో విక్రమాదిత్యుని కల్యాణనగరంలో విద్యాపతి పదవినలంకరించాడు. సంస్కృతంలో విక్రమార్క చరిత్ర రచించాడు.

గుర్జర దేశంలో వైరి సింహప్రభువు కుమార్తె శశికళకు గురువుగా బోధలు చేశాడు. వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇది కల్పితమని కొందరి భావన. అర్జునునకు కృష్ణుడు సహకరించినట్లు, కృష్ణస్వామి నారసింహార్యకవికి రచనలో తోడ్పడ్డాడు. సింగరాచార్య వంశం వారు కందుకూరి సీమలో చిత్రకవి అగ్రహార ప్రాంతంలో ఉండేవారు. ఆయనది క్రీ.శ.1775 ప్రాంతం. కావ్యంలో చిత్రకవిత్వానికి చెందిన చక్రబంధం ప్రథమాశ్వాసంలో వుంది. అందులో మూడవ చుట్టలో సింగరార్యకృతి యనీ, ఆరవ చుట్టలో (Round) చంపభూపకృతియనీ చెప్పబడింది.

ఆశ్వాసాంత గద్యం ఇలా వుంది:

“ఇది శ్రీ సీతారామచరణ సేవా ప్రభావ సంపాదిత కవితా విచిత్ర
కాశ్యపస గోత్ర పవిత్ర శ్రీమత్ పండిపెద్ది కృష్ణస్వామి ప్రణీతం
బయిన బిల్హణోపాఖ్యానంబను మహాప్రబంధంబునందు
సర్వంబును తృతీయాశ్వాసము.”

ఈ కావ్యం 543 గద్యపద్యాలతో ప్రబంధ ధోరణిలో కొనసాగింది. అష్టాదశ వర్ణనలో భాగంగా, లక్ష్మీమందిరపుర వర్ణన, వసంత రుతు వర్ణన, వన వర్ణన, సాయం సంధ్య వర్ణన, అంధకార, చంద్రోదయ వర్ణనలు, నాయికా వర్ణన, దేహృదవర్ణనాదులు రసవత్తరంగా సాగాయి. సంప్రదాయ సాహితీమాలలో ఎమెస్కోవారు స్వామి శ్రీ శివశంకర్ స్వామి ఆలోకంతో ఈ కావ్యాన్ని 1997లోనే ప్రచురించారు. రమ్యకవితాఝరి ఈ రచన.

వినసొంపైన కథ:

పాంచాలదేశంలో లక్ష్మీమందిరపురం అనే నగరం వుంది. దానిని రాజధానిగా చేసుకొని మదనాభిరామ భూపతి పరిపాలిస్తున్నాడు. నగర వర్ణనను సుదీర్ఘంగా కవి చేశాడు. అక్కడి చాతుర్వర్ణాల వారు, రథగజతురగపదాతి దళాలు, ఉద్యానవనాలు వర్ణించబడ్డాయి. మదనాభిరాముడు తన ధర్మపత్ని మందారమాలతో క్రీడిస్తూ ఒక పుత్రికను కన్నారు. ఆమె పేరు యామినీపూర్ణతిలక. పేర్లు పెట్టడంలో ఔచిత్యం వుంది. అది లక్ష్మీమందిరపురం. అక్కడి ప్రభువు మదనాభిరాముడు. రాణి యేమో మందారమాల. వారి కూతురు యామిమీపూర్ణతిలక.

ఒక సీసపద్యంలోనే ఆ పుత్రిక శైశవాన్ని దాటి యౌవనవతి అయింది. మూడు సీసపద్యాలలో యౌవన ప్రాభవం వర్ణించబడింది. ఆమె సరస సంగీత నైపుణి అలవరుచుకొంది గురుముఖంగా. ఇంకపై సాహిత్య చతురను చేయాలని ప్రభు సంకల్పం. తన ప్రధాని వసంతునితో చర్చించాడు. ఆ చర్చ సభలో జరిగింది. శాస్త్ర కవితా వైభవాన్ని గూర్చి సభలోని వారు సుదీర్ఘంగా మాట్లాడారు.

కవులే రసజ్ఞులని నిర్ధారించారు. వ్యాకరణవేత్తను జనకునిగాను, తార్కికుని సోదరునిగాను, మీమాంసకుని నంపుసుకుని గాను, వైదిక అధ్యాపకుని దూరస్థుని గాను కవిత్వకన్య దూరంగా పెడుతుంది. కావ్య నాటక అలంకార భావ నవరసాభిజ్ఞుని తన నాయకునిగా ఎన్నుకొంటుంది – అని తీర్మానించారు. అయితే అలాంటి మహాకవి మన సామ్రాజ్యంలో ఎవరున్నారు అని ప్రశ్నించాడు ప్రభువు. అప్పుడు వారు మల్హణ, బిల్హణులని ఇద్దరు కవులున్నారు, అందులో బిల్హణుడు శ్రేష్ఠుడన్నారు.

“ఆ వాచాలత, ఆ కవిత్వ సరసం భా ప్రౌఢి, ఆ
భావం, బా పదశబ్దగౌరవము, ఆ పాండిత్య, మా శాస్త్ర బో
ధావిర్భావక, మా సుధా రసవ బో వ్యాపారా, మా ప్రజ్ఞ ఇం
దే విద్వద్బలభేది కైన గలదే ఎంతేని చింతించినన్.” – అన్నారు (1-62).

కవీంద్రులలో మేటి అయిన ఆ కవిరాజును సభ కాహ్వానించారు. అతని సౌందర్యాన్ని చూసి రాజు చకితుడయ్యాడు. రాజ సన్మానం చేసి ఆతనిని గురువుగా తన పుత్రికకు నియమించడానికి సందేహించాడు. అప్పుడు మంత్రి ఒక చతురోపాయం సూచించాడు. “కవి పుట్టుగ్రుడ్డివాడని రాజపుత్రికకు చెబుదాం. ఆమె అంధుని చూడదనే నియమం వుంది. వారిరువురి మధ్య ఒక తెర ఏర్పరుద్దాం. రాజకుమారి కుష్ఠురోగియని కవికి చెబుదాం” అని సలహా ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన తెర మరుగున అటు, ఇటూ కూర్చొని బిల్హణుడు, యామిని – సాహిత్య సమభ్యాసం కొనసాగించారు. కావ్యాలంకారాలు, నాటక ప్రక్రియలు, కామశాస్త్ర, జ్యోతిష, సంగీతాభినయ కళల శ్లోకార్థాలు చతురంగా నేర్చుకొంది యామిని.

చంద్రవర్ణన:

ఓ సాయంకాలం యామిని వసంత రుతు శోభను తిలకిస్తూ నెచ్చెలులతో గూడి క్రీడా వినోదంగా ఉద్యానవనంలో పండు వెన్నెలను ఆస్వాదిస్తోంది. ఆ సమయాంలో బాగా అలసి సొలసి పోయి చెలులు ఉపచారాలు చేయగా ఒక శయ్యపై నిద్రించింది. గాఢంగా నిద్ర పట్టింది.  కొంతసేపటికి చెలులు ఆమెను నిద్ర లేపారు. దిగాలున లేచి ఆమె తనకు కలిగిన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది.

“ఒక కలగంటి, కంటి ఘను నొక్కని, చక్కెరవింటి వాని పో
లిక తనరారు వాని, అమలీమస కాంతుల నొప్పువాని, సం
వికసిత సారసాక్షు, మరి విన్నది, కన్నది కాన, మెవ్వడో?
సకి! ఇట వచ్చి నా సరస జాణతనమ్మున నుండె కాంతరో!” (2-37).

ఆ స్వప్న సుందరుడు ఒక ప్రేమ దివ్యఫలాన్ని ఆమెకిచ్చి అదృశ్యుడయ్యాడు. ఈ స్వప్నం త్వరలో ఫలిస్తుందనీ, శుభప్రదమౌ రాకుమారుడు నిన్ను చేపడతాడని పలికారు చెలులందరూ.

చంద్రోదయ శోభను తిలకించిన బిల్హణుడు పరవశుడై అద్భుత కవితాగానం చేశాడు. 16 పద్యాలలో చంద్రుని వర్ణిస్తూ గంభీరంగా గానం చేశాడు. గురువు చేసిన చంద్రవర్ణనను విన్న యామినికి అనుమానం కలిగింది. అంధుడు ఆ విధంగా వర్ణించలేడు. తెర వొత్తిగించి బిల్హణుని మధురాకృతిని చూచి యామిని మూర్ఛపోయింది. అదే సమయంలో రాకుమారి అద్భుత సౌందర్యాన్ని చూచిన బిల్హణుడు రసావేశంలో ఆమెను వర్ణించాడు (44 పద్యాలు). వారు పరస్పరం అనురాగ బద్ధులై శయ్యను చేరారు.

వారు పరప్సరం ఆనందాబ్దిలో తేలియాడారు పరవశులై. చాలా రోజుల వరకు రతీ మన్మథుల వలె మోహపరవశులయ్యారు. ఈ తతంగం గమనిస్తున్న చెలులు ఈ విషయం ప్రభువు దృష్టికి తీసుకెళ్ళడం తమ కర్తవ్యంగా భావించారు. రాజా!

“ఎరుగగ రాదు దైవకృత మెట్టిదియో? మన మంజువాణి రా
గురి గొని అద్ధరామరుని గూడిన యట్టులు మాకు తోపగా
గురుతెరి గీ విధంబు మది గోప్యము చేసిన హాని వచ్చునం
చరిమురి చెప్పవచ్చితిమి జనాధిప! ఏమిక బుద్ధి మీదటన్” (3-9) అని వెల్లడించారు చెలులు.

రాకుమారి స్పందన:

రాజు తన కుమార్తెకు పలువిధాలుగా హెచ్చరికలు చేశాడు. నీవు కోరిన రాకుమారునితో వివాహం జరిపిస్తానన్నాడు. యామిని తిరస్కరించింది. మా యిద్దరికీ వివాహం జరిపించమని వేడుకొంది. రాజు కోపాటోపం చెంది సభను పిలిపించి వారికి బిల్హణుని రాజద్రోహనేరాన్ని వివరించాడు. శిక్షను వెంటనే అమలు చేసేలా వధ్యశిలకు బిల్హణుని తీసుకెళ్ళమని తలారికి ఆదేశం జారీ చేశాడు. శిరచ్ఛేదమే కర్తవ్యం!

తలారి వీరసేనుడు – మరోమారు ఆలోచించమన్నాడు. ప్రభువు కోపించాడు. రాజపుత్రి ఈ వార్త తెలిసి బిల్హణుని కలిసి విలపించింది. ఆపమని ప్రజలను పరిపరి విధాలుగా వేడుకొంది. వధ్యస్థానానికి వెళుతున్న బిల్హణుని దీనావస్థ చూచి పౌరులు బాధపడ్డారు. బిల్హణుడు రాకుమారికి తుది సందేశం పద్యరూపంలో పంపాడు. దేవతా వారవనితల వాగురికా వలయంలో చిక్కుకున్న నేను తిరిగి రాలేని స్థితిలో ఉన్నానని వివరించాడు.

బిల్హణుని కవితలు:

నిర్వికార స్థితిలో వున్న బిల్హణుని చూచి వీరసేనుడు ఆశ్చర్యపోయాడు. వధ్యస్థానంపై నుండి 50 పద్యాలను బిల్హణుడు యామినీపూర్ణతిలక సౌందర్యాన్ని వర్ణిస్తు ఆశువుగా లిఖించాడు. వీరసేనుడు వాటిని భటుల ద్వారా రాజునకు చేరవేశాడు. రాజు వాటిని చదివి తలారి ఆలస్యం చేస్తున్నందుకు కోపించాడు.

“రవిజుడు భా గుణింపగ విధురంలోగ భట్టి నశించె, భా రవి
ప్రవరుడడంగె దీర్ఘమున, ప్రాణము బాసె గుడియ్య భిక్షు, డీ
అవనికి తప్పె భీముడు, తదంతగతిన్ మరి కొమ్ముపెట్ట ని
క్కముగ నే భుకుండను, కొమ్మున దీర్ఘము పెట్టకుండ డీ
భువి అతడెన్న నిర్దయుడు, భూపతి నీవు తలంప భూవరా!” (3-164).

యముడు (రవి తనయుడు) భ గుణింతం మొదలుపెట్టి, ‘భట్టి’ని, ‘భారవి’ని, ‘భిక్షు’ని చంపాడు. ‘భు’కుండుని అంతమొందిస్తే, ఆ తర్వాత ‘భూ’పతి మరణం తప్పదని భావం.

రాజు వెంటనే బిల్హణుని శిక్ష తప్పించి తన కుమార్తె నిచ్చి వివాహం ఘనంగా జరిపించాడు. ఆ దంపతులకు ప్రభాకరుడనే రాకుమారుడు జన్మించాడు. ఈ కథాగమనాన్ని కవి ఉత్కంఠతో నడిపాడు. హృద్యమైన పద్యాలతో వార్ణనలు కొనసాగించాడు. ప్రబంధశైలిలో రచన కొనసాగింది.

Exit mobile version