Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవిత్వమంటే

[సిహెచ్. కళావతి గారు రచించిన ‘కవిత్వమంటే’ అనే కవితని అందిస్తున్నాము.]

ర్థం కాని పంఖానుపుంఖాల
అభివర్ణనలలో అయోమయం అనిపించే
అంతుపట్టని అల్లికలతో అవాస్తవాలతో
ఆశ్చర్యం కలిగించే విడ్డూరాలతో
నిఘంటువుల్లో నిశితంగా చూస్తే కాని
అర్థం కాని గజిబిజి పదాల
సమాహారాల స్వరూపాలతో
మనస్సు లోతుల్లోకి తొంగి చూడని
పదాల పొందికలతో హద్దులు మీరిన
అర్థం మారిన సరస శృంగార విహారాలతో
చిత్రణ పట్టే పదాడంబర
పద బంధనమా కవిత్వమంటే?

కవిత్వమంటే కవి తత్త్వమంటే అది కాదు
కానే కాదు కాకూడదు కూడా
కవిత్వమంటే మనిషికి దగ్గరగా ఉండాలి
మనిషి మనిషిని కలిపేదిగా ఉండాలి
మనసును తాకేదిగా ఉండాలి
మనిషిని తట్టేదిగా ఉండాలి.
మనిషి తత్త్వాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి
వాస్తవాన్ని కళ్ళ ముందు నిలిపేదిగా ఉండాలి
గుండె లోతుల్లోకి జాలువారేదిగా ఉండాలి
మనిషిని నీడలా వెంటాడే తత్త్వంతో
వెన్నంటేదై ఉండాలి.

అవనిలో కవి లోని
కవితాతత్త్వాన్ని ఆవిష్కరించేదై ఉండాలి
సాహిత్య జగత్తులో కవి చోటును నిలిపేదై ఉండాలి!

Exit mobile version