కవులకు వాంతులవుతున్నాయి!
అరగక, లోపల ఇముడని దంతా వచ్చేస్తూంది
సోషల్ మీడియాలోకి బొళుక్కుమంటూ!
అదంతా పేరుకుపోయింది, డిలీట్ చేయలేనంతగా
దాని కంపు దుర్భరంగా ఉంది!
రెండు వందలు పంపిస్తే చాలు
ఏ చెత్తనైనా సంకలనం చేసేవారు రడీ!
పైగా అందమైన ప్రశంసా పత్రాలు! మెమొంటోలు!
సభలో స్వీయ కవితాగానం!
ఎవరూ వినను కూడా వినని అరణ్యరోదన!
వాట్సాప్ అయ్యింది వాంతులకు వేదిక
ఫేస్బుక్ అయితే చెప్పేదే లేదిక
స్వకుచమర్దనాలూ స్తనశల్య పరీక్షలు
బాగాలేదంటే పరుషపదాల దాడులు
చెత్తకుండీలవుతున్నాయి సామాజిక మాధ్యమాలు
కక్కుకునేది కాదు కవిత్వమంటే
హత్తుకునేది మెత్తగా చదువరి చిత్తాన్ని
ఎదలోపలి స్పందనలను మధురాక్షర రూపమిచ్చి
విదితంగా, విశదంగా, విరజాజుల పరిమళమై
అంతరంగాన్ని అలుముకునేదే కవిత్వం!
ఇతివృత్తాన్ని జీర్ణం చేసే సున్నితత్వగోళీలను
మింగితే బందవుతాయి ఈ అప్రయత్నవమనాలు
భావాన్నీ భాషనూ అందంగా పెనవేసి
పలికించండి కవిత్వాన్ని పరమ మనోహరంగా
మిగిలిపోకండి సాహిత్యంలో అజాగళస్తనాలుగా!
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.