[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘కవి సర్వాంతర్యామి!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అక్షరం అబ్బినా, అబ్బకున్న ప్రతి మనిషిలోను కవి ఉంటాడు
తన మనసుకు తోచినదేదో చెప్పాలనుకుంటాడు
ఔను! ఇది అందరికీ అందని బ్రహ్మ విద్య కాదుగానీ
కానీ! కొందరినే ఘనముగా దీవించునా వీణా పాణి!
కవి తన మదిలో ప్రతి క్షణం ఏవో భావాలతో గోడలు కడ్తూ,
ఎన్నో సార్లు ఆ భావకుడ్యం తనకే నచ్చక దాన్ని కూలగొడ్తూ
ఆలోచనలకు సాన పడ్తూ ఇంకేదో మెరుగ్గా వ్రాయాలంటూ
నిత్యం అక్షర ఉద్యానవనంలో తిరుగాడుతూనే ఉంటాడు.
నలుగురికి తెలిసినదే అయినా తన మదికి తోచినట్టు
నలుగురికి తోచనిదైనా తన మనసుకు తట్టినట్టు
తన మదిలోని పదును తట్టి తన విధంలో తాను చెబుతాడు
తన అక్షర సేధ్యానికి అభినందనల పంటనాశిస్తాడు.
తన ఆలోచనల వ్యాయామంలో ఒక్కోసారి,
తాను ప్రకృతితో మమేకమైన ప్రతీసారి,
మెదడు నిద్ర పోనని మారాము చేసిన మరోసారి,
అంతరంగంలో ఓ మెరుపు మెరిస్తే సరి,
కవి ఆ మెరుపుని ఘనమని నమ్మి
దాన్ని తనదిగా ప్రేమించి నగిషీలు చెక్కితే,
ఓ భావం శరమై కదులుతుంది ముందుకు.
ఆ సరళే నడిపిస్తుంది కవిని ఓ ఉత్పేరకమై.
కవి అల్లిన ఆ స్పందనా సూత్రం, అక్షర సుమాలను
మాలగ కట్టి మోసుకొస్తుంది గుబాళింపుని..
ఆ సుగంధం కొందరినైనా అలరిస్తుంది నిశ్చయంగా
ఆ కవి రవి భావ స్రవంతిలో మమేకమైన అందరినీ తథ్యంగా!!!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు,100 కవితలు రాశాను.