ప్రచురితమైన నెలలోగా ద్వితీయ ముద్రణకు నోచుకుని సంచలనం సృష్టిస్తున్న ఇండస్ మార్టిన్ రచన ‘కటికపూలు’. ‘భాషాభివృద్ధి నాటకాలు, యాసల పెత్తనాలకు వ్యతిరేకంగా జరిగే పొరాటాలు కూడా ఆయా నాయకుల కులాల భాషా యాసల్ని అజమాయిషీలోకి తెచ్చుకోవడానికి మాత్రమే చేస్తారని తెలిసాక గుంటూరు జిల్లా పొన్నూరు, బాపట్ల, రేపల్లె, తెనాలి, నది అవతల క్రిష్ణా జిల్లా లంకల్లోని దళిత భాషకు, నుడికారానికీ, దళిత జీవన విధానానికి చెల్లు కాలం వచ్చిందని బోధ పడిన నేపథ్యంలో ఈ కథలు రాయడానికి నిర్ణయించుకున్నాన’ని కటికపూలు రచనకు కారణం ముందుమాటలో వివరించారు రచయిత ఇండస్ మార్టిన్.
‘కటికపూలు’ కథల్లోని ప్రతి సంఘటనా సత్యమనీ, వీటిల్లో పాత్రల పేర్లు యథార్థమైనవనీ, కటికపూలు మా ఎండిన బ్రతుకుల్నీ, కట్టు మాటల్నీ కటికతనంగా ప్రచారం చేసి, మాంసం కోసే వృత్తిలో ఈ సమాజానికి వేల ఏళ్ళుగా సేవ చేసిన జనాలకు కటికోళ్ళు అని పేరు పెట్టి, ఆ పేరునే ఒక అవమానకరమైన పద ప్రయోగంగా వాడుకుంటున్న ఈ సమాజపు విలువల వ్యవస్థకు మా కటికతనంలో ఉన్న నికార్సుతనాన్నీ, నిజాయితీనీ నేలతనాన్నీ, మాకే సొంతమైన ఆకలిని, పంచుకు తినే మనస్తత్వాన్నీ, కన్నీళ్ళను, కరుణను, మమ్మల్ని దోచుకోవాలనుకునేవాళ్ళకు వేలాది ఏళ్ళుగా వుపయోగపడ్డ అమాయకత్వాన్నీ, దాన్నుండి రోజు కూలీగా దొరికే అవమానాలను కలిపి ఒక్క మాటలో చెప్పే ప్రయత్నమే ఈ శీర్షిక అని కటికపూలు రచన లక్ష్యాన్ని, నేపథ్యాన్ని వివరించారు రచయిత.
‘వెలివాడల మట్టి పరిమళాలు’ పేరిట రాసిన పరిచయంలో డా. చల్లపల్లి స్వరూప రాణి ‘ఇవి కటికపూలు కావు. వీటికి మట్టి వాసన, మనిషి వాసన ఉన్నాయి. ఇండస్ కథా రచనలో కవిత్వం ఉంది. సున్నితమైన హాస్యం ఉంది. అన్నింటినీ మించి దళిత జీవితం పట్ల ప్రేమ, కన్సర్న్ ఉన్నాయ’ని వ్యాఖ్యానించారు.
డా. గోపీనాథ్, డా. గుర్రం సీతారాములు ‘ఆత్మ గౌరవం భూమికగా కటికపూలు’ అన్న అభిప్రాయంలో “కటికపూలలో ఆధునిక దళిత సాహిత్య ఉన్నత స్థితి ఉందనీ, దాని వెనుక వందేళ్ళ క్రింద ‘ఇక్టోరియా’ తరం వేసిన ఆత్మగౌరవ పునాది ఉందనీ, ‘ఈ మన స్వంత భాష’ను రక్షించుకోవాలంటే మార్టిన్ లాంటి రచయితలు ఎందరో ముందుకు రావాలి” అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కటికపూలు
రచయిత: ఇండస్ మార్టిన్
వెల: రూ.100/- పేజీలు: 134
ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్ అన్ని శాఖలు, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~ సంచిక బుక్ డెస్క్
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.