[శ్రీ అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ‘కథలూ-గోదావరి నాదాలు’ అనే రచనని అందిస్తున్నాము.]
ఒక నది. దాని చుట్టూ కొన్ని జీవితాలు.. కలిసి సాగే ప్రయాణం. ఒక ప్రవాహం.. రేవులో పలుచబడే ప్రతి అలా ఒక కథ.. ఆ అలలతో దాహం తీర్చుకునే ప్రతి గొంతూ ఒక కథ. ఏరు దాటితే ఓ కథ. దాటలేకపోతే ఓ కథ.. నట్టేట మునిగిపోతే మరో కథ.. చంటి పాపల్లాంటి లంకల్లో నవ్వులూ కథలు, సుడిగుండాల్లోని ఆర్తనాదాలూ కథలే.. సముద్రం లాంటి పాఠకుడి గుండె ల్లోకి కొన్ని దశాబ్దాలుగా కథా గోదావరి సంగమిస్తునే ఉంది.
తెలుగు నాట ఎంతోమంది కవులు, రచయితలు తమ రచనల్లో పాఠకులను అలరించారు. కథకు ఇతివృత్తం ఎంత ముఖ్యమో, శైలి అంతే ముఖ్యం. జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాసే కథల్లో ప్రకృతికి, వాస్తవికతకు స్థానం కల్పిస్తే ఆ కథలు పది కాలాలపాటు ఉంటాయి.
వాస్తవ సంఘటనల ఆధారంగా రాసే కథల్లో మట్టి వాసనలకు పెద్దపీట వేస్తే ఆ కథ పాఠకులని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో కొంతమంది కథకులు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలతో కలిసి వారి జీవన శైలిని చిత్రిస్తూ ఏకంగా కథాసంపుటాలను వెలువరించారు. మరికొందరు రచయితలూ గోదావరి నదిని వర్ణిస్తూ కథల్ని రమణీయంగా తీర్చిదిద్దారు. ఇంకొందరు తమ కథల్లో గోదావరి నదికి సందర్భోచితంగా స్థానం కల్పించారు.
తోలినాటి కథకుల్లో చింతా దీక్షితులు ‘గోదారి నవ్వింది’ కథలో అప్పుడప్పుడే పల్లెల్లోకి చొచ్చుకొస్తున్న నాగరికతను ఆసక్తీకరంగా చూపిస్తారు. పెద్ద ముత్తయిదువలా గోదాట్లోకి సూర్యుడు మునగబోతున్నాడని కథను ప్రారంభిస్తూ కథకుడు, ఏ హంగులూ లేని పల్లెవాసులను, పచ్చని అందాలను ఆస్వాదించి గోదాట్లో సూర్యుడు మునిగేలోగా పల్లెగోదారితో నేస్తం కడతాడు. చివరికి తన పట్నపు పోకడతో ఊరు వదిలిపోతుంటే గోదారి నవ్వినట్లు అనిపించటం వెనుక గాఢమైన అంతరార్థం కథలో వదిలేస్తాడు. ఈ కథలో గోదారి ఓ ప్రత్యేక పాత్రలా కనిపిస్తుంది.
అడివి బాపిరాజు ‘గోదారి సుడులు’ కథలో ఓ రాజమండ్రి యువకుడు గోదావరి నీళ్ళు ఉపయోగించుకునేందుకు తనకు భూమి లేదని వాపోతాడు. కథకుడు అన్నీ కోలుపోయి గోదారి సుడుల్లో ఆత్మహత్య యత్నాన్ని హృద్యంగా మలిచిన తీరు గోదారి సుడులనే గుర్తుకు తెస్తుంది.
గోదారి కాలువ మీద ఓ ‘పడవ ప్రయాణాన్ని’ తనకు నచ్చిన కథల్లో ఒకటని చెప్తారు పాలగుమ్మి పద్మరాజు. మనిషి లోపల ఉన్న బలమైన ఆత్మవిశ్వాసాలు నిండు గోదారంత అచంచల విశ్వాసాన్ని నింపుకొని కథను నడిపిన తీరూ, కథలో రంగి మనస్తత్వమూ గోదారి లోతులను చూపిస్తాయి. మరో కథానిక ‘పంతం’లో గోదారి బీభత్సాన్ని ఏటి ఒడ్డున పుల్లలేరుకునే రామి వెంకడుల మధ్యన సాన్నిహిత్యంలో చూపిస్తారు.
వచన కథల్లో తెలుగుసొగసు చూపించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి ‘దారుకావనం’ కథను ప్రారంభిస్తూ “ఊరికి ఎండెక్కింది – నీలాంటి రేవుల్లో, ఏదో ఒకటో అరో – నిండుకుండ తొణికే ఓపిక లేక అలా నిలిచిపోయింది. రేవు అలా దిగాలు పడినందుకు, పాపం అనుకుని నీటి చాలుకు దిగి నీటిపాయను చెక్కిలి పుణికినట్లు” అనేసి కథకుణ్ణి ముందుకు అడుగు వేయిస్తారు. గోదారి రేవు వర్ణనల్లో ఇదొక ప్రత్యేకమైనది.
ఇక గోదావరి కథలంటే వంశీ రాసిన ‘మా పసలపూడి కథలు’, ‘మా దిగువ గోదారి కథలు’ ప్రత్యేకం. గోదావరి ప్రజల మనస్తత్వాలను ముద్ర వేసినట్టు ఉంటాయి. ‘అచ్యుతానిది అమృతహస్తం’ కథలో రెల్లపాకలతో అందంగా అగుపడే ముక్తేశ్వరం ఒడ్డునూ, ఆ ఒడ్డునే ఉన్న ముసలి రావిచెట్టు పాదాలని సుతిమెత్తగా గోదారిని, రేవు దాటితే వచ్చే అందమైన కోటిపల్లినీ కథాప్రారంభంలో పాఠకుడిని ఎక్కిస్తూ చేసే వర్ణన ఆహ్లాదకరం.
శైలజామిత్ర రాసిన ‘నా’ కథలో గోదావరిని చక్కగా వర్ణించారు. “ఉదయం నుంచి ఉదయించని వాతావరణం మద్య గోదావరి మౌనంగ ఉంది. వెలుగు కిరణాలు ఒకటీ అరా నీటిపై పడుతుంటే ఆ నీరు బంగారు వర్ణం అద్దినట్లు మెరిసిపోతోంది. చుట్టూ మసక చీకటిలో కనిపించీ కనిపించని కొండలు.. విశ్రాంతి తీసూకుంటున్న నావలు.. అక్కడక్కడ తుమ్మెదల ఝుంకారాలు, చల్లగాలి, చెట్లపై ఉదయ సంకేతాల్లా పక్షుల కిలకిలరావాలు,.. తీరం వెంబడి సైకిల్ పై పాలక్యాన్‌ను మోసుకెళుతూ ఈల వేస్తున్న ఆకారం” అంటూ శైలజా మిత్ర ‘నా’ కథను ప్రారంభించిన తీరు రమణీయం.
ఇలా చెప్పుకుంటూ పోతే గోదారమ్మ కథలు గోదారంత ఉంటాయి. నేను అందులో అణువులో పరమాణువును స్పృశించాను.
గోదారమ్మ దీవనలు అందరికీ లభించాలని కోరుకుంటూ.