[లేఖిని సంస్థ ప్రచురించిన ‘కథల లోగిలి’ అనే కథా సంకలానాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంపాదకత్వంలో లేఖిని సంస్థ ప్రచురించిన రెండు భాగాల కథా సంకలనం ‘కథల లోగిలి’.
“ఏ తరానికా తరంలో నూతన రచనావిధానం, వినూత్న ఇతివృత్తాలు, జీవన వాస్తవ పరిస్థితులు కథాంశాలుగా వస్తున్నాయి. అలాంటి వాటిని కొన్నింటిని ఇప్పుడు మరో సంకలనంగా వేసి భద్రపరచాలన్న కోరిక నా మనసులో ఎప్పుడో జనించింది. మొదటి ప్రయత్నం అయినా, 74 మంది రచయిత్రులు ముందుకు రావడంతో ఈ కథా సంకలనాన్ని రెండు భాగాలుగా ప్రచురించాలని నిర్ణయించాము” అని అన్నారు సంపాదకురాలు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి తమ ముందుమాటలో.
~
మొదటి భాగంలోని కొన్ని కథల గురించి ప్రస్తావించుకుందాం.
ఆరుగురు యువతులు అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ బాలికని కిడ్నాప్ నుంచి కాపాడిన వైనాన్ని డా. అమృతలత ‘బోగన్విలియా’ కథలో చెబుతారు. ఎంతటి తెలివైన నేరస్థుడైనా, ఒక చిన్న తెలివితక్కువ పని వల్ల పట్టుబడిపోతాడని, ఆ యువతుల సహకారం లేకపోతే, ఈ కేసుని ఇంత సులువుగా ఛేదించగలిగేవాళ్ళం కాదని పోలీస్ ఇన్‍స్పెక్టర్ అనడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.
భర్తని మగసావిత్రి అని అన్నా, తనను కాపాడుకోవడంలో భర్త చేసిన ప్రయత్నాలను మనసులోనే అభినందిస్తుంది రాధిక, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారి ‘ఆ చీకటి రోజుల్లో..’ కథలో. కరోనా కాలంలో నియమాలను పట్టించుకోకుండా, తెలిసినవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, వాళ్ళని ఇబ్బంది పెట్టిన జనాల గురించి ఈ కథ చెబుతుంది.
చిన్న కథే అయినా, తల్లులు తమ బిడ్డలపై చూపే ప్రేమను – ఆత్మీయంగా కనులముందు నిలిపింది అత్తలూరి విజయలక్ష్మి గారి ‘ఆమె అమ్మ’ కథ. అల్లూరి గౌరీలక్ష్మి గారి ‘కొత్త మట్టి’ కథ – రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల మానసిక స్థితిని, దంపతులలో ఒకరికి వేరే రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తే, వాళ్ళెదుర్కునే సమస్యలను ప్రస్తావిస్తుంది. చిన్న అపోహతో, ప్రాణం తీసుకోబోయిన లక్ష్మమ్మకి తాను చేయబోయిన తప్పేమిటో అర్థమయ్యాకా, తన ప్రవర్తనని సిగ్గుపడుతుంది.
రేణుక అయోల గారి ‘చనుబాలు’ కథ మనుషుల్లోని సంకుచిత్వాన్ని ప్రశ్నిస్తుంది. మూర్ఖంగా, మనుషులనీ, బంధాలని పోగొట్టుకునే వ్యక్తుల గురించి చెబుతుంది.
“ఇంట్లో అంతా బానే ఉంటుంది. ఐశ్వర్యం లేదన్న వాస్తవం బయటివాళ్ళకే కనిపిస్తుంది” అన్న ఈ వాక్యాలు ఓ కుటుంబపు ఆర్థిక పరిస్థితిని చాటుతూనే, ఆ కుటుంబస సభ్యులు అల్లుకున్న మమతానురాగాలను చాటుతాయి అప్పులకుట్టి రాజ్యలక్ష్మి గారి ‘డబ్బు’ కథలో.
మాధవి బైటారు గారి ‘చిక్కం’ కథ గంగిరెద్దులను ఆడించేవారి ఛిద్రమైన జీవితాలని కళ్ళ ముందు నిలుపుతుంది. ఆ కుటుంబంలోని ఓ కుర్రాడు – చదువుకుని, జీవితంలో ఎదుగుతాడు. కానీ విలువైన వాటిని పోగొట్టుకుంటాడు.
ఆడపిల్లలకి ‘ఒడి బియ్యం’ పోసే ఆచారం ఉద్దేశాన్ని, ఆ వేడుక జరిపే పద్ధతిని ఇద్దరు స్నేహితురాళ్ళ కథగా మలిచి అందించారు దాసు శ్రీహవిష. ఒకే ఒక వాక్యంతో ఇచ్చిన సందేశం రెండు జంటల జీవితాలకు మార్గదర్శనం చేస్తుంది ఈరంకి ప్రమీలారాణి గారి ‘ఇది మయసభ కాదు’ కథలో.
పిల్లల్ని పెంచి పెద్ద చేసి, వారిని సక్రమ మార్గంలో నడిపి, ఉద్యోగమో/వ్యాపారమో చేసి, కుటుంబానికి ఆర్థికంగా ఆసరగా నిలిచి, పిల్లలు పెద్దవాళ్ళయ్యాకా, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి, మనవల్ని పెంచి, వాళ్ళ ముచ్చట్లు తీర్చి – జీవితంలో ఏం సాధించాం అని తమని తాము ప్రశ్నించుకునే వారికి, తామేం సాధించామో, ఇంకా ఏం సాధించవచ్చో సుజల గంటి గారి ‘బకెట్ లిస్ట్’ కథ చెబుతుంది.
కార్యాలయాలలో లైంగిక వేధింపులని తెలివిగా, సమయస్ఫూర్తితో ఎలా ఎదుర్కోవాలో కిరణ్మయి గోళ్ళమూడి గారి ‘ఎదురీత’ కథ చెబుతుంది. కొనుగోలు ఉన్మాదానికి అలవాటు పడ్డ మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో కలవల గిరిజారాణి గారి ‘బై వన్ గెట్ టూ’ కథ వ్యంగ్యంగా చెబుతుంది. తమకంటూ ఓ గది ఉండాలనుకున్న దంపతుల గురించి, వారు తీసుకున్న నిర్ణయం గురించి ఉమాదేవి కల్వకోట గారి ‘మాకేది గది?’ కథ చెబుతుంది.
~
రెండవ భాగంలోని కొన్ని కథల గురించి ప్రస్తావించుకుందాం.
ఆధునికంగా ఉంటూనే, పార్టీలలో అదుపుతప్పే భర్తని మార్చుకుంటుంది సంధ్య డా. మంథా భానుమతి గారి ‘దండేషు మాతా’ కథలో. పొత్తూరి విజయలక్ష్మి గారి ‘అమ్మ ఫొటో’ ఆర్ద్రమైన కథ. ఏదో తెలియని ఆనందం కలుగుతుందీ కథ చదివాకా.
చిన్నప్పటి నుంచి తండ్రిని సంతోషపెట్టడానికి అలవోకగా అబద్ధాలాడడానికి అలవాటు పడ్డ హరిశ్చంద్ర, ఒకసారి, అతి ముఖ్యమైన విషయంలో నిజం చెప్పాలనుకుంటాడు. కానీ ఆయనని జీవితాంతం బాధించే ఆ నిజాన్ని చెప్పి వేదనకి గురిచేయడానికి ఇష్టపడడు. కానీ ఆ నిజం ఎంతో కాలం దాగదు. తమిరిశ జానకి గారి ‘ఒక నిజం ఒక మనసు’ కథ బాధా వీచిక.
తురగా జయశ్యామల గారి ‘పావలా కావాలి’ కథాకాలం చాలా ఏళ్ళ క్రితంది అయి ఉంటుంది. పావలాకి విలువ ఉన్న కాలం నాటి కథ. పావలాకి ఇప్పుడు విలువలేకపోయినా, పావలా బదులుగా వంద రూపాయాలు అని మార్చుకున్నా, కథాగమనానికి, ఔచిత్యానికీ భంగం కలగదు. పావలాకి విలువ లేకపోవచ్చు, కథకి విలువుంది.
మంగు కృష్ణకుమారి గారి ‘ఇదే ఆఖరు’ భార్యాభర్తల మధ్య అన్యోన్యాన్ని చాటితే, మాలా కుమార్ గారి ‘నీ జతగా నేనుంటాను’ కథలో ఒకప్పుడు తనని పెళ్ళి చేసుకోవాలనుకున్న మరదలు తన స్నేహితుడిని పెళ్ళి చేసుకుని అమెరికా వస్తే, ఆమెలోని భయాలని దూరం చేసి, ఆమెను తన స్నేహితుడికి దగ్గర చేస్తాడు శంకర్.
మనసులు విప్పి మాట్లాడుకుంటే, కాపురంలో కలతలు దూరమవుతాయని వీణ మునిపల్లె గారి ‘అర్ధాంగి’ కథ చెబుతుంది. స్నేహితులే దంపతులైతే, దాంపత్యంలోనూ స్నేహబంధాన్ని నిలుపుకోవాలని తపన పడిస్తే ఆ ఇల్లాలు ‘మహరాణి’ అవుతుందంటారు నండూరి సుందరీ నాగమణి తన కథలో.
నెల్లుట్ల రమాదేవి గారి ‘చెడిపోయిన మనిషి’ కథ ఒకనాటి తెలంగాణా ప్రజల వ్యథని కళ్ళకు కడుతుంది. కొన్ని దశాబ్దాల వెనుకటి కథాకాలపు ఇతివృత్తంలో అల్లిన కథ ఇది. గ్రామాల్లోని దేవిడీ నిర్మాణం, మోతుబరులు, గ్రామ పెద్దల ఆహార్యం వంటి వివరణలు పాఠకులని మరో లోకం లోకి తీసుకెళ్తాయి.
వృద్ధురాలైన తల్లి పట్ల కనీస బాధ్యత మరచిన కొడుకులున్నట్లే, మానవత్వాన్ని గుండె నిండుగా నింపుకున్న విజయలక్ష్మి లాంటి వాళ్ళూ ఉంటారీ లోకంలో. శైలజా మిత్ర గారి ‘దిగంత’ కథ ఆసక్తిగా చదివిస్తుంది.
అక్క జీవన విధానంలోని లోపాన్ని, సమయస్ఫూర్తితో ఎత్తిచూపి, అక్క నొచ్చుకోకుండా, ఆమెలో మార్పు వచ్చేలా చేస్తుంది చెల్లెలు శ్రీపతి లలిత గారి ‘జీవించు.. నీ కోసమే’ కథలో.
అసహ్యించుకునే వ్యక్తి నుంచే సాయం పొందాల్సి వచ్చి, అతని ఔన్నత్యం పర్వమంతయి, నువ్వో చీమవి అని తన అంతరంగం తనకి చెప్పినప్పుడు సారధి మానసిక స్థితి ఎలా ఉంటుందో మణి వడ్లమాని గారి ‘పిపీలికం’ కథ చెబుతుంది.
దైవాన్ని నమ్ముకున్నవారికి అన్నీ సక్రమంగా జరిగిపోతాయని సంధ్య యల్లాప్రగడ గారి ‘అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే’ కథ చెబుతుంది. నమ్మిన భక్తులకి దైవం, ఏదో ఓ రూపంలో కనిపించి, దర్శన అనుభూతిని కలిగిస్తాడని నళిని యర్రా గారి ‘తపస్సు’ కథ చెబుతుంది.
~
ఈ సమీక్షలో మొత్తం 74 కథలలో కొన్ని కథలనే ప్రస్తావించగలిగాను. ఈ రెండు భాగాలలోని కథలు చక్కని కథలు, నేల విడిచి సాము చెయ్యనివి. కౌటుంబిక, వ్యక్తిగత విలువలకు కాపు కాస్తాయి.
ఈ కథలు మధ్యతరగతి వారి ఆశలను, కోరికలను, అనుబంధాలను వ్యక్తం చేస్తాయి. అవకాశాలకై అన్వేషించటం, సృష్టించుకోవడం, అందలాలకు ఎగరడాన్ని ప్రదర్శిస్తాయి. ఇంట్లో దొరకనివాటిని బయట పొందాలనుకున్నా, కనబడేదంతా వాస్తవం కాదని గ్రహించి, కోరికల గుర్రాలకు కళ్ళేలు వేస్తాయి. సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేస్తున్న చాలా అంశాలు ఈ కథలలో ఇతివృత్తాలుగా ఉన్నాయి.
సంపాదకులకు, రచయిత్రులకు అభినందనలు.
***
కథల లోగిలి (1 & 2)
(రచయిత్రుల కథలు)
ప్రచురణ: లేఖిని సంస్థ
పేజీలు: మొదటి భాగం – 311, రెండవ భాగం – 314
వెల: మొదటి భాగం – ₹ 250, రెండవ భాగం – ₹ 250
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 90004 13413
అత్తలూరి విజయలక్ష్మి: 9676881080
సరస్వతి కరవది: 9849530000
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/te/products/kathala-logili-rachayitrula-kathalu-1-2
~
‘కథల లోగిలి’ సంకలనం సంపాదకురాలు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వూ:
https://sanchika.com/special-interview-with-mrs-athaluri-vijayalakshmi-kl/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.