Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథల ఇతివృత్తాలు – మార్పులు

[ఆగస్టు 16-17, 2025 నాడు హ్యూస్టన్‌లో జరిగిన 14వ అమెరికా తెలుగు సాహిత్య సదస్సులో తాను చేసిన ప్రసంగ పాఠాన్ని వ్యాస రూపంలో అందిస్తున్నారు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి.]

ధునిక కథ అంటే వర్తమానాన్ని ప్రతిబింబింప చేస్తూ భవిష్యత్తులోకి నడిపించేది. ఆధునిక కథ గతానికి సంబంధినది చారిత్రాత్మకత. (historicity), వర్తమానాన్ని ప్రతిబింబించేది వాస్తవికత. ఈ రెండూ భవిష్యత్ కాలంతో సమన్వయం చేస్తే ఆధునిక కథ అవుతుంది.

ఆధునిక కథా వస్తువు అనగానే మహిళల పురోగమనం, అభివృద్ధి, నాగరికత పెరిగిపోవడం, సమాజంలో అనేక రుగ్మతల వ్యాప్తి ఇలాంటివి అనుకోవచ్చు. కానీ, 19 శతాబ్ది చివరిలో, 20వ శతాబ్ది ప్రారంభంలో ఆధునిక కథ మొదలైంది. సంప్రదాయ కథన పద్ధతుల నుంచి వాస్తవికత, స్వీయ అనుభవాలు ఆధారంగా వినూత్న శైలిలో రాయడం మొదలుపెట్టారు రచయితలు. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ప్రజల జీవనశైలిని మార్చేశాయి. అనేక కొత్త సమస్యలు పుట్టుకువస్తూ, మానసిక సంఘర్షణ కలుగుతుంటే, ఆ సంఘర్షణను, సమస్యలను అక్షరబద్ధం చేయడం జరిగింది. ఆలోచనల పరిధి విస్తృతం అవడంతో సామాజిక సమస్యలు, మానవసంబంధాలు, సంప్రదాయాలు, విలువలు వీటి పట్ల ప్రశ్నలు జనించడం, ఆ ప్రశ్నలకు జవాబులు అన్వేషించడం, చర్చలు, విమర్శలు, విశ్లేషణలు చోటు చేసుకోడం ఇలా విస్తృతి మారుతూ వస్తోంది.

తెలుగు సాహిత్యంలో ఆధునికతకు ఆద్యుడు గురజాడ. కన్యాశుల్కంతో సాహిత్యంలో ఒక కొత్త ఒరవడి మొదలైంది. తరవాత చింతా దీక్షితులు, పాకాల రాజమన్నార్ వీరి గురించి చెప్పుకోవాలి. తరవాత బుచ్చిబాబు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చలం, తిలక్, గురజాడ, పాలగుమ్మి పద్మరాజు, మునిమాణిక్యం నరసింహారావు కొడవటిగంటి, గోపీచంద్ మొదలైన వారంతా గొప్ప ఆధునిక రచయితల కోవలోకి వస్తారు. వీరి చేతుల్లో ఆధునిక కథ అద్భుతమైన రూపం సంతరించుకుని ఉజ్జ్వలంగా ప్రకాశించింది.

ఏ కథ అయినా, వస్తువు ఏదైనా జీవితంలో ఎదురయే అనుభవాలను ఒక సంఘటనగా, కొన్ని పాత్రలపరంగా తీర్చిదిద్దుతూ మనసుకి హత్తుకునేలా చెప్పగలిగితే అది మంచి కథ అవుతుంది. పైన చెప్పుకున్న కథకులు అదే చేసారు. వారి కలాల నుండి ఎన్నో అంశాలు కథలుగా రూపు దిద్దుకున్నాయి. వాటిలో సామాజిక, కుటుంబ, రాజకీయ, కుల, మత ఏ అంశం అయినా వీరి రచనల్లో ఉన్నత అభివ్యక్తి, సంస్కరణాభిలాష, భార్యాభర్తల అన్యోన్యత, కుటుంబంలో స్త్రీల పాత్ర.. స్త్రీ విద్య, వితంతు వివాహాలు ఇలా అనేక అంశాలు ప్రస్తావించారు ప్రజారంజకమైన పరిష్కారాలు ఉండేవి. ప్రతి కథా ఉన్నతమైన విలువలను నేర్పేది. వస్తు వైవిధ్యంతో పాటు చెక్కిన శిల్పంలా ఉండేవి కథలు.

కొందరు రచయితలు గ్రాంథికంలో వ్రాయడం వలన ఆ కథలు అందరికీ అర్థం కావడం కష్టంగా ఉండేది. ముఖ్యంగా పెద్దగా చదువుకోనివారికి. కానీ, ఈ ప్రముఖ రచయితలు భాషకి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. గ్రాంథికం నుంచి నెమ్మదిగా శిష్ట వ్యవహారిక భాషకి ప్రయాణిస్తూ, సామాన్యులకు సైతం అర్థం అయే శైలిలో వీరి కథలు ఉండేవి. (ముఖ్యంగా ఈరోజు అసభ్యత పాళ్ళు ఎక్కువ ఉంటున్న భాష చదవడానికే రోతగా ఉంటున్నది. కానీ నాటి రచయతల భాష సంస్కారవంతమైన భాష.) ప్రతి ప్రాంతంలో కొందరు రచయితలు ఉంటారు. ఆయా ప్రాంత జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయం వీటితో పాటు భాష కూడా మారుతోంది. ప్రాంతీయ భాష వాడడం వలన ఎన్నో మాండలికాలు సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. ప్రామాణికమైన భాష ఒకటి ఉంటే, ఫలానా ప్రాంతానికి మా భాషే ప్రామాణికం అనే వితండ వాదం మొదలైంది. దానివలన కొన్ని ప్రాంతీయ భాషల్లో అసభ్యత, అశ్లీలత చోటు చేసుకుని సాహిత్యం ఇది కాదుకదా అనే భావన కలిగిస్తోంది.

స్త్రీ విద్య ఆవశ్యకత గురించి కందుకూరి ప్రస్తావిస్తే, వ్యసనపరుడైన భర్తని ఎలా మార్చుకోవాలో తెలిసిన విచక్షణా జ్ఞానం కలిగిన స్త్రీ పాత్ర చిత్రీకరణ గురజాడది. చలం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, స్త్రీ స్వేచ్ఛకి పరిమితులు సడలించిన స్త్రీవాది. అలాగే బుచ్చిబాబు కథ ‘నా గురించి కథ వ్రాయవూ’లో కౌమారదశలో నిశ్శబ్దంగా ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమ వ్యక్తం చేయలేక, తల్లి,తండ్రుల నిర్ణయానికి తలవంచి తాళి కట్టించుకుని జీవితంతో రాజీపడి బతికిన స్త్రీ. కేవలం సంభాషణలతో సుదీర్ఘమైన కథని ఇంకా చింతా దీక్షితులు గారి కథ ‘అభిప్రాయభేదం’ చాలా సామాన్యమైన అతి సరళమైన భాషలో ఒక పేదరాలి తల్లి మనసు అందంగా ఆవిష్కరించారు. గుమాస్తా కూతురు మెడలోని కంటె తన కూతురు మెడలో చూడాలన్న ఆమె కోరిక తీర్చుకుని, ఈ కంటె కన్నా నేను అక్కడక్కడా తీసుకొచ్చి అలంకరించిన పూలే అందంగా ఉన్నాయి కదా అనుకోడం కథలో చాలా గొప్ప పాయింట్.

వీరందరి దయవలన స్త్రీలు విద్యావంతులై, ఉద్యోగినులై కుటుంబ బాధ్యతలతో పాటు, అదనంగా ఆర్ధిక భారం భుజాల మీదకు ఎత్తుకున్నా, ఎక్కడా తమ వ్యక్తిత్వాలు దిగజారకుండా ఎంతో చక్కగా ఎదగడం మొదలుపెట్టారు. ఆలోచనా జ్ఞానం వచ్చాక రచయిత్రులుగా రాణించడం మొదలుపెట్టారు. ఈ పరంపరలోనే రచయిత్రుల హవా మొదలైంది. విద్యావంతులైన స్త్రీలు చక్కని సామాజికాంశాలతో పాటు, కుటుంబ నేపధ్యం, భార్యాభర్తల సంబంధాలు, ఇల్లు, పిల్లలు, బంధువులు, బంధుత్వాలు, బంధాలు. వీటి చుట్టూ కథలు వ్రాసారు. ప్రేమ కథల సంగతి చెప్పనక్కరలేదు. జీవితంలో ప్రధాన భాగం ప్రేమ. ప్రేమ లేని జీవితం లేదు. అది తల్లి, పిల్లల ప్రేమ, తండ్రి ప్రేమ, భార్య్యాభార్తల ప్రేమ, అన్నాచెల్లెళ్ళ ప్రేమ, ఇలా విశ్వవ్యాప్తమైన ప్రేమని రచనల్లో ప్రస్తావించకుండా ఏ కథా ఉండదు, కవిత్వము ఉండదు, నవలా ఉండదు. సంగతి అయితే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనేది జీవితంలో ఒకభాగం కాబట్టి. వారే ఆద్యులు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ కోడూరి కౌసల్యా దేవి, ద్వివేదుల విశాలాక్షి, ఇల్లిందల సరస్వతి ఇలా ఎందఱో ముందుకు వచ్చారు.

స్త్రీల ఆలోచనా పరిధి విస్తరించడం మొదలైంది. హేతువాదం, తార్కికత, అస్తిత్వవాదం, ప్రశ్నించే తత్త్వం రెక్కలు విప్పుకోడం మొదలైంది. గళం విప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రచయిత్రులు స్వరం విప్పడం మొదలుపెట్టారో, అప్పటి నుంచీ అంతరాంతరాల్లో దశాబ్దాలుగా నిశ్శబ్దంగా రగులుతూ ఉన్న విప్లవాగ్ని జ్వాలలు పైకి ఎగిసాయి. స్త్రీ స్వేచ్ఛకి రెక్కలు వచ్చాయి, అస్తిత్వవాదం వ్యాపించింది.

క్రమంగా విలువలు మారుతూ వచ్చాయి. అభిప్రాయాలు విబెదిస్తూ వచ్చాయి. తమ అస్తిత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అలాంటివారిలో అబ్బూరి చాయాదేవి రంగనాయకమ్మ వీరి ద్వారా స్త్రీల అస్తిత్వవాదం మొదలై ఊపందుకుంది. స్త్రీ స్వేచ్ఛతో మొదలై, అనేక విధాలుగా విస్తరించి, ఆకాశంలో సగం నుంచి, ఆకాశం మాదే అనే వరకు ఆలోచనాదోరణుల్లో మార్పులు వచ్చాయి.

80వ దశకం నుంచి స్త్రీలు కేవలం కుటుంబ విలువలను కాపాడే సంప్రదాయ రచనలు మాత్రమే చేయాలా? సమాజం బరువు, బాధ్యత వారిమీదే ఉందా? సంసృతి, సంప్రదాయాలు నిలబెట్టే బాధ్యత స్త్రీలకేనా? పురుషులకు లేదా? అనే విప్లవాత్మక భావాలు చోటు చేసుకున్నాయి. ఈ పరంపరలోనే స్త్రీ స్వేచ్చకు నియమించిన కట్టుబాట్ల మీద దండయాత్ర ప్రారంభం అయి, స్త్రీ వాదం ఎల్లలు దాటింది. కేవలం విద్య, ఉద్యోగం మాత్రమేనా స్త్రీలకు కావాల్సింది అని ప్రశ్నించే స్వరాలు పెరిగాయి. ఆర్ధిక స్వేచ్ఛ మాత్రమే కాదు, తన జీవితం పట్ల, తన అభిరుచుల పట్ల, తన స్వాతంత్ర్యం మీద తనకు మాత్రమే హక్కుంది అనే నిశ్చయానికి వచ్చారు మహిళలు. నెమ్మదిగా అడ్డుగోడలు కూల్చుకుంటూ అనేక ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తూ, నైతిక విలువలకు కొత్త నిర్వచనం ఇస్తూ రచనలు సాగించారు.

ఇటీవల అది ఇంకా విజృంభించి లెస్బియనిజం, హోమో సెక్సువాలిటీ, ట్రాన్స్‌జెండర్ సమస్యలు, లింగమార్పిడికి దారితీసిన పరిస్థితులు, ఆ విధానం కథాంశాలుగా రావడం మొదలైంది. ఇవి అన్నీ అందరికీ ఆమోదయోగ్యం అవునా, కాదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఈ అంశాలు కొందరు ప్రోత్సహిస్తున్నారు. ఎప్పటికప్పుడు నూతనత్వాన్నిస్వాగతించడం తప్పుకాదు, కానీ ఏది రాసినా పాఠకులను convince చేసేది అయి ఉండాలి.

అలాగే సుమారు రెండు దశాబ్దాలుగా డయాస్పోరా కథలు కూడా విరివిగా వస్తున్నాయి. జన్మభూమి దాటి అనేక ప్రాంతాలకు వలసపోతూ, వారి, వారి సంస్కృతీ, సంప్రదాయాలను సాహిత్యం ద్వారా, కళల ద్వారా ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చెందించే ప్రయత్నం చేయడం హర్షించదగినదే. ఈ విషయంలో డయాస్పోరా కథలు తెలుగు భాషనూ, ఆచారవ్యవహారాలను, తెలుగు సంస్కృతినీ కాపాడుతున్నారు అనవచ్చు.

కేవలం భారతీయ జీవన విధానమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవన విధానం మన వేదాలు, మన ఇతిహాసాలు నిర్దేశించాయి. ఒక జాతి సంపద ఆ జాతి జీవన విధానం వలన చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఎవరి పాదముద్రలు తర,తరాలు అనుసరిస్తూ జీవిస్తున్నామో, ఆ పాదముద్రలను శాశ్వతంగా పదిలపరచుకోవడమే సాహిత్యం పరమార్ధం అని భావిస్తూ నాకీ అవకాశం ఇచ్చిన వంగురి ఫౌండేషన్ వారికి, సభ నిర్వాహకులకు ధన్యవాదాలు.

(A diaspora is a population that is scattered across regions which are separate from its geographic place of origin. The word is used in reference to people who identify with a specific geographic location but currently reside elsewhere. India has the world’s largest annual emigration.)

Exit mobile version