[డా. బి.వి.ఎన్. స్వామి గారి ‘కథా సోపానములు’ అనే వ్యాస సంపుటిని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
కొన్ని పుస్తకాలను నిర్దిష్ట ప్రయోజనం కోసం రచిస్తారు. ఈ పుస్తకం కూడా ఆ కోవలోకే వస్తుంది.
కథా సోపానములు అనే ఈ పుస్తకం ద్వారా రచయిత – ఔత్సాహిక కథకులకు మంచి కథలెలా రాయాలో చెప్తూ, ఒక్కో మెట్టూ ఎక్కిస్తూ, ఉన్నత స్థానానికి చేరుస్తారు.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రొ. బన్న ఐలయ్య గారు “కథా సోపానములు పరిధి, పరిమితిలో చిన్నదే అయినా, చిరకాలం మనగలిగే శక్తి ఉన్నది. రచయిత కాదలుచున్నవాళ్ళకూ, కథానికపై పరిశోధన చేయాలనుకునే వాళ్ళకు మార్గదర్శకంగా ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.
విహారి గారు తమ ముందుమాటలో, “ఈ చిన్న పొత్తం కథా రచయితలందరికీ ఉపయుక్తమయ్యే ‘గైడ్’ అంటే అతిశయోక్తి కాదు” అని పేర్కొన్నారు.
“శీర్షిక మొదలుకొని, ముగింపు వరకు కథకు పనికి వచ్చే పరికరాలను సులభరీతిలో వివరించాను” అని ‘పునాదిరాయి’ అనే నామాటలో వెల్లడించారు డా. బి.వి.ఎన్. స్వామి.
~
కథలు ఎలా రాయాలి అనే దాని కన్నా, ముందుగా అసలు కథ అంటే ఏమిటి? కథానిక అంటే ఏమిటి? ఈ రెండికీ మధ్య ఉన్న తేడా ఏమిటో చక్కగా వివరించారు రచయిత. వాస్తవంగా నేడు వస్తున్నవన్నీ కథానికలేనని అంటారు రచయిత.
పేరు కథకి ఊపిరిలాంటిదని అంటూ, కథకు పేరు పెట్టడం ఒక కళ అనీ, పేరు కథా కుతుహాలన్ని ఇనుమడింప చేయాలని చెప్తారు రచయిత. కొందరు ప్రముఖ రచయితలు తమ కథలకు పెట్టిన పేర్లను ఉదాహరణలుగా పేర్కొన్నారు.
‘ప్రారంభం’ గురించి చెబుతూ “కథలో ఏం చెప్పదలచుకున్నామో, దాంతో మొదలు పెట్టరాదు. అట్లా చేస్తే కథాంశం ముందే తెలిసి, కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. కథలో ఏ అంశం గురించి చెప్పదలచుకున్నామో, ఏ కీలకాన్ని విడమరచదలచుకున్నామో, వాటికి సమర్థింపుగా నిలిచే విషయాల నుండి కథ మొదలు పెట్టాలి” అన్నారు రచయిత. ఈ అంశానికి ఉదాహరణగా పెరూ రచయిత వ్రాసిన కథ గురించి వివరించారు
“సన్నివేశం వంటపాత్ర అయితే, సంఘటన అందులో వుండే వంటకం. ఈ రెండు కూడా కథకు ప్రాణాధారాలే” అని ‘సంఘటన-సన్నివేశము’లో వివరిస్తారు. సన్నివేశానికి దక్షిణాఫ్రికా రచయిత్రి నదీన్ గార్డిమర్ రాసిన కథకు తెలుగు అనువాదాన్ని ఉదహరించారు. సంఘటనకు, స్వీడన్ రచయిత్రి సెల్మా లాయర్లాప్ రాసిన కథకు తెలుగు అనువాదాన్ని ప్రస్తావించారు.
వర్ణన గురించి చెబుతూ, “వస్తుతత్వాన్ని పాఠకుడికి అందించడానికి, కథ వేగంగా ముందుకు నడవడానికి వర్ణనలు తోడ్పడుతాయి. వస్తుస్వభావానికి లోబడి వర్ణనలుండాలి. ఇవి కథలో అంతర్భాగం కావాలి. కాని కథను మింగరాదు” అని అంటారు రచయిత. ఉదాహరణగా రష్యన్ రచయిత గొగోల్ రచించిన ‘ఓవర్ కోట్’ కథ లోని ప్రధానపాత్ర అయిన దిగువ మధ్యతరగతి గుమస్తా స్థితి వర్ణనను వివరించారు.
పాత్రల ప్రాముఖ్యత గురించి చెబుతూ, “కథ చెప్పడానికి ఏ విషయాన్నయితే ఎన్నుకుంటామో, దానికి మాత్రమే చెందిన వ్యక్తులను పాత్రలుగా తీసుకోవాలి. విషయానికి సంబంధంలేని పాత్రలను ప్రవేశపెట్టకూడదు” అని సూచించారు. వ్యక్తిగత పాత్రలు, ప్రాతినిధ్య పాత్రలు, విశ్వజనీన పాత్రల వివరణ బావుంది. పాత్రల గురించి వడ్డెర చండీదాస్ గారి అభిప్రాయాన్ని ప్రస్తావించడం ఔచితీమంతగా ఉంది.
సంభాషణల గురించి చెప్తూ, “సంభాషణలు కథను ముందుకు, వెనకకు నడుపుతాయి. తుదకు ముగిస్తాయి కూడా” అని అన్నారు రచయిత. మాటలు శక్తివంతమైనవనీ, ఎక్కడ ఎలా వాడాలో తెలిసి కథలో ప్రయోగించాలని అన్నారు.
స్థలము – కాలము గురించి చెబుతూ. “స్థలకాలాలు కథకు రంగు, రుచులను ఆపాదిస్తవి. రైతు కథకు గ్రామం, పారిశ్రామిక కార్మికుడి కథకు నగరం నేపథ్యంగా ఉంటవి. స్థలం భౌతిక లక్షణం కలిగి ఉంటుంది. కనుక చిత్రణ సులువు. కాలం అభౌతికమైంది. దీని చిత్రణ కష్టం. కాలాన్ని చిత్రించడమంటే ఆ కాలంలో వచ్చిన పరిణామాల్ని, భావజాలాన్ని చిత్రించడమే” అని అన్నారు. ఉదాహరణగా బర్మన్ రచయిత డేగన్ ష్వేమ్యార్ రాసిన ‘ది ప్రిన్స్ ఆఫ్ ది ప్రిజన్’ అనే కథని ప్రస్తావించారు.
ముగింపు గురించి చెబుతో, “మంచి ముగింపులన్నీ కీలక ఘట్టం సమాప్తం కాగానే ముగుస్తాయి. ముగింపు కథకు అతికినట్లుండాలి. అతికించినట్లుండరాదు. కథ కోసం ముగింపే కాని, ముగింపు కోసం కథ కాదు” అని అంటారు. ఉదాహరణగా రచయిత ప్రస్తావించిన గీడిమపాసా రాసిన కథకు తెలుగు అనువాదం ‘ఒక జీవితం’ చక్కని కథ.
కథన పద్ధతులలో ఫస్ట్ పర్సన్ నెరేషన్, థర్డ్ పర్సన్ నెరేషన్ గురించి చక్కగా వివరించారు. వస్తువు గురించి చెబుతూ, వస్తువుకీ, ఇతివృత్తానికి ఉండే తేడాని చక్కని ఉదాహరణతో వివరించారు.
ఔత్సాహిక కథకులకు, వర్ధమాన కథలకు కలిగే అతి ముఖ్య సందేహం శిల్పం అంటే ఏమిటి అని. దీనికి రచయిత అత్యంత సరళంగా జవాబిచ్చారు. “కథను నడిపించే విధానం ఏ విషయాన్నైతే పాఠకుడికి అందించాలను కుంటున్నామో, దాన్ని అందంగా మలచి, ఆకర్షణీయంగా తయారు చేసి, అతనిపై బలమైన ముద్ర వేసేదిగా ముడిచి, ఆత్మీయంగా అందించాలి. అందుకు తీసుకునే జాగ్రత్తల్ని కలిపి శిల్పం అంటాము.” సులువుగా అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్పేశారు.
శైలి గురించి వివరిస్తూ, “ప్రతి రచయితకు తనదైన వాక్య నిర్మాణ పద్ధతి ఉంటుంది. అదే అతని శైలిగా చెప్పవచ్చు.” అంటారు రచయిత. రచయిత ప్రతిభకు శైలి గీటురాయని అంటూ, ఇది చెబితే, చదివితే, వింటే రాదు. సాధన చేస్తే మాత్రమే అబ్బుతుందని వ్యాఖ్యానించారు.
భాష గురించి ప్రస్తావిస్తూ, “కథలో రకరకాల పాత్ర లుంటాయి. వాటి హోదా, స్థితిగతుల ననుసరించి అవి మాట్లాడుతాయి. అందుకు తమదైన భాషను పలుకుతాయి. కథనంలో భాగంగా కథకుడు రాసే భాష అతని స్థితిని పట్టిస్తుంది. ఎవరికి సహజమైన భాషను వారు మాట్లాడితే అది సహజంగా ఉంటుంది.” అని అన్నారు.
వాస్తవిక కథాశిల్పం గురించి తెలుపుతూ, “వాస్తవిక కథాశిల్పం కథలో తాను అదృశ్యంగా ఉంటూ వస్తువును బహిర్గతం చేస్తుంది. ఈ పద్ధతి పాఠకుడి చేతికి వస్తువును అందిస్తుంది. జీవితంలోని కార్యకారణ సంబంధాలను అర్థం చేయిస్తుంది” అని అన్నారు రచయిత. వాస్తవిక కథాశిల్పానికి భిన్నంగా రూపొందింది చైతన్య స్రవంతి అని వివరించారు. బుచ్చిబాబు, అంపశయ్య నవీన్ చెఫ్ఫిన కీలకమైన విషయాలను ఈ వ్యాసంలో అందించారు,
లాటిన్ అమెరికాలో పుట్టి, మునిపల్లె రాజు గారి లాంటి కథకుల చేతిలో వన్నెలద్దుకున్న మ్యాజిక్ రియలిజమ్ గురించి అందరికీ అర్థమయ్యేలా చాలా స్పష్టంగా వివరించారు. అన్యార్థ కథ (అలెగొరీ) గురించి చక్కని వివరాలు అందించారు.
సైఫి కథగా పేరుపొందిన సైన్స్ ఫిక్షన్ కథ గురించి చెబుతూ, డా. చిత్తర్వు మధు రచించిన ‘అంగారకం’ అనే కథని సంక్షిప్తంగా విశ్లేషించారు. బాలల కథల గురించి, బాలల కోసం పెద్దలు రాసే కథలు, బాలల కోసం బాలలే రాసే కథల గురించి వివరించారు.
తెలంగాణ బాలల కథ – ఒక పరిశీలనలో పిల్లలు కోసం కొందరు బాలసాహితీవేత్తలు అందించిన కథలను ప్రస్తావించి, వాటి సారాంశాన్ని క్లుప్తంగా వెల్లడించారు. తెలంగాణలోని 40 మంది బాలసాహితీవేత్తల కృషిని వివరించే పట్టిక అందించారు.
మొత్తం మీద చక్కని ఉపయుక్తమైన పుస్తకాన్ని అందించిన స్వామిగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత!
***
రచన: డా. బి.వి.ఎన్. స్వామి
ప్రచురణ: నీల్ కమల్ పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 142
వెల: ₹ 300/-
ప్రతులకు:
నీల్ కమల్ బుక్ హౌస్,
సుల్తాన్ బజార్, కోటి,
హైదరాబాద్.
ఫోన్: 9000168953
~
డా. బి.వి.ఎన్. స్వామి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-bvn-swamy/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.