Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘కథా సాహిత్యం – గ్రామీణ జీవనం’ అనే అంశంపై ప్రసంగం – నివేదిక

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, తెలుగు అధ్యయన శాఖ వారు 30 జూన్ 2025న నిర్వహించిన తెలుగు సాహితీ సమితి కార్యక్రమం ద్విగ్విజయంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారు వ్యాసంగాన్ని మొదలుపెట్టి 20 పుస్తకాలు వెలువరించారని తెలిపారు. తన చుట్టూ ఉన్న పల్లె జీవితాలను, తాను చూసిన విషయాలను రచనలలో పొందుపరిచారన్నారు. రాజుగారి రచనలు ఆహ్లాదకరంగా ఉంటాయని, విద్యార్థులు రచనలు చదివి మెరుగుపడాలని ఆకాంక్షించారు. ప్రతి సృజనకారునిలో చిన్నపిల్లల మనసు ప్రస్ఫుటిస్తుందని, రాజుగారి రచనల్లో అది విశేషంగా స్ఫురిస్తుందని తెలిపారు. కథా వస్తువు చిన్నదైనా హృదయంలో చెరగని ముద్రగా వారి  రచనలు ఉన్నాయని కొనియాడారు.

సాహితీ సమితి సలహాదారు డా. వై.సుభాషిణి మాట్లాడుతూ – ‘తెలుగు కథా సాహిత్యం- గ్రామీణ జీవితం’ మాట్లాడటానికి విచ్చేసిన కృష్ణస్వామిరాజుగారిని ప్రస్తావిస్తూ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడానికి సాహితీ సమితి కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం ఎంతో అవసరమని, దానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు.

వక్తగా విచ్చేసిన రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు ‘తెలుగు కథా సాహిత్యం – గ్రామీణ జీవితం’ అనే అంశంపై మాట్లాడుతూ తెలుగు విద్యను అభ్యసించడానికి ప్రస్తుత తరంవారు వెనకడుగు వేస్తున్నారని తెలుగు సాహిత్యం చదవాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలని తెలిపారు. రూపాయిలో ఉండే బొమ్మ, బొరుసులో బొమ్మ- సాహిత్యం, బొరుసు – సమాజమన్నారు.

‘గాండ్ల మిట్ట’ అనే రచనపై ప్రసంగిస్తూ గ్రామీణ జీవనంలో ఆర్థిక ఇబ్బందులను అందులోని విలువలను తెలియపరిచారు. సమాజానికి సాహిత్యానికి గల అవినాభావ సంబంధం ‘ఫుల్ మీల్స్’ రచనలో ఉందని పేర్కొన్నారు. ‘గురుదేవోభవ’ అనే రచనలో గురువు గొప్పతనాన్ని, ‘కోడుగుడ్డు కథ’ కథలోని తల్లి ప్రేమను తెలియజేశారు. ‘అమ్మ సినిమాకి వెళ్దాలంటోంది’ అనే కథలో సమాజంలో ప్రస్తుతం ఉద్యోగం చేసే పిల్లలు తల్లిదండ్రులతో సమయం కేటాయించాలని కోరుకొనే విధానాన్ని వ్యక్తపరిచారు. ‘గోల్కొండను చూసి వద్దాం రారండి’ అనే రచనలో సమాజాభివృద్ధి విస్తృతంగా సాగుతుందని తద్వారా మనుషుల్లో సాహిత్యం ఎవరిని ఎలా కదిలిస్తుందో తెలియదన్నారు. తెలుగు విద్యార్థులు మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందాలని ఆకాంక్షించారు. సమాజంలో తెలుగు విద్యార్థులకున్న విభిన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని కాంక్షించారు.

సాహితీ సమితి ఉపాధ్యక్షులు జి.వాణి స్వాగతం పలుకగా; అధ్యక్షులు ఎ. ప్రనూష వక్తను పరిచయం చేశారు. కార్యదర్శి బి.శిరీష వందన సమర్పణ చేయగా, కోశాధికారి ఎ.మోహిత నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డా. బి. లక్ష్మీప్రియ, పరిశోధక విద్యార్థినులు, మహిళా అధ్యయన విభాగం పరిశోధక విద్యార్థినులు, పుర ప్రముఖులు విద్యాసాగర్ గారు, తెలుగుశాఖ విద్యార్థినులు  పాల్గొన్నారు.

డా. వై. సుభాషిణి, సాహితీసమితి సలహాదారు

Exit mobile version