Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథా దీపధారి కా.రా.

ది 4 జూన్ 2021 నాడు పరమపదించిన శ్రీ కాళీపట్నం రామారావు గారికి నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నారు ఎన్. కె. బాబు.

విశాఖపట్నంలో పుస్తక ప్రదర్శన అవుతోందని వెళ్ళాను. నన్ను పేరు పెట్టి ఎవరో పిలిచినట్లయితే అటువేపు చూశాను “నాయనా ఇలా రా” దగ్గరగా వెళ్ళాను. “అదిగో అక్కడ కనిపిస్తుందే ‘సాహిత్య అకాడమీ’ అని, అందులో ‘పర్వ’ అని పుస్తకం వుంటుంది కొనుక్కో. చదువు”. “అలాగే మాష్టారు” అంటూ ఆయన దగ్గర శెలవు తీసుకొని ఆ షాపు వైపు వెళ్ళాను. ఆయనే ‘కాళీపట్నం రామారావు’ గారు. ముద్దుగా ‘కా.రా.’ అని పిలుస్తారు. పుస్తకాలను ప్రేమిస్తారు, ప్రోత్సహిస్తారు.

గోధుమ రంగు ఛాయతో, దళసరి కళ్ళ జోడుతో, ఒదులైన కుర్తా పైజమాతో ఎంతో సాధారణంగా వుంటారు. ఆయనకు చేతికర్ర ఓ ఆభరణం. ఎప్పుడూ కర్ణుని కవచకుండలాలులా వంటిమీద ఓ శాలువ అడ్డదిడ్డంగా పడివుంటుంది.

1924 నవంబర్ 9న జన్మించిన కా.రా. గారు లెక్కల మాష్టారుగా జీవితాన్ని ప్రారంభించారు. మొదటి కథ 1943లో చిత్రగుప్త పత్రికలో ‘ప్లాట్‌ఫారమ్’తో తన రచనా వ్యాసాంగాన్ని మొదలు పెట్టిన నగమేరు ధీరుడు ఆయన. 1986లో ‘ఆంధ్రభూమి’ దినపత్రిక కోసం ‘నేటికథ’ను నిర్వహించి అనేకమంది యువ రచయితలను తయారు చేశారు మాష్టారు.

1996లో ఓ ఉదయాన్నే తలుపు తట్టిన శబ్దమయి తలుపుతీసి చూద్దును కదా ఎదురుగా ఆజానుబాహుడు కా.రా. గారు. స్థానిక విజయనగరంలో వుండే ఇప్పలవలసు సురేష్‌తో వచ్చారు. మాష్టార్ని అంతకుముందు చాలా సాహితీ సభల్లో చూడ్డమే కానీ అంత దగ్గర నుండి చూడ్డం అదే తొలిసారి. అదీ మా ఇంటికి వచ్చారు. ‘రండి, రండి’ అంటూ ఆహ్వానించాను. “ఏం లేదు నాయనా, ‘కథా నిలయం’ పేరున కథల పుస్తకాలను పోగుచేస్తున్నాం. నువ్వు సాహిత్య అభిలాషివని, పుస్తకాల ప్రేమికుడవనీ, నీ వద్ద చాలా పుస్తకాలు వున్నాయని విన్నాను. కథానిలయానికి ఏమయినా పుస్తకాలు ఇవ్వగలవా” అని అన్నారు. “అదెంత పని మాష్టారు రండి లోనికి” అని ఆహ్వానించాను. నా దగ్గరున్న పుస్తకాల బీరువాలు రెండిటి తలుపులు బార్లా తెరిచి వుంచి “మాష్టారు నా దగ్గర వున్నవి ఇవి. మీకు ఏం కావాలంటే వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు” అనగానే చిన్నపిల్లాడిలా ఎంతో సంబరంగా గబగబా తనకి కావాలసిన పుస్తకాలను ఏరుకొని పైమీది తువ్వాలులో కట్టుకున్నారు. మరికొన్ని పుస్తకాలను తీసి ప్రక్కన ఉంచి “వీటిని యీ అబ్బాయి తర్వాత వచ్చి తీసుకెళతాడు. నువ్వు ఇన్ని ఇస్తావని అనుకోలేను. లేకుంటే గోనె సంచి తెచ్చుకునే వాళ్ళం” అంటూ నవ్వుతూ వెళ్ళారు.

ఆ తర్వాత సంవత్సరమే 1997 ఫిబ్రవరి  నెల రెండో శనివారం ఉదయం పది గంటలకు ‘కథానిలయం’ ప్రారంభోత్సవం శ్రీకాకుళంలో విశాఖ బ్యాంకు కోలనీలో జరిగింది. అప్పటి వరకు తనకి వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, అవార్డుల నగదు అన్నింటినీ కథానిలయానికి ఖర్చు చేశారు మాష్టారు.

విజయనగరంలో ఎన్.కె. పబ్లికేషన్స్ 2001లో ప్రారంభించాను. 2005లో ‘ఒక రాత్రి రెండు స్వప్నాలు’ కథా సంకలనం ఆవిష్కరణకు మాష్టారుగారిని పిలిచాను. వచ్చి ఆవిష్కరించారు. 2006లో ‘నాని’ పిల్లల మాస పత్రికను ప్రారంభించాను. ప్రారంభ సంచికను కారా మాష్టారే ఆవిష్కరించారు. అలా మాష్టారితో అనుబంధం మరింత  చిక్కనయింది. విజయనగరంలో ఎవరు పుస్తకాలు ఇస్తామన్నా నాకు ఫోన్ చేసి వెళ్ళి తీసుకొని కధానిలయానికి చేర్చమనేవారు. రెండు సంవత్సరాల క్రితం కూడా మాష్టారుగారి అబ్బాయి ఫోన్ చేసి “విజయనగరం మహరాజా కాలేజ్‍లో రిటైర్ అయిన ప్రిన్సిపాల్ సాయినాథ శాస్త్రిగారు పుస్తకాలు  ఇస్తామన్నారు. కొంచెం కలెక్ట్ చేసుకుని, విజయనగరంలో మా బంధువు ఇంట్లో పెట్టేయ్యండి. నేను కారులో రేపు వస్తున్నాను తీసుకుంటాను” అన్నారు.

ఆ మధ్యోసారి విజయనగరంలో వేదగిరి రాంబాబు గారు వారి సంస్థ తరపున ఈ ప్రాంతంలోని 100 మంది రచయితలందరిని ఓ వేదిక మీదకు తీసుకొచ్చి కథ మీద చర్చ కార్యక్రమం పెట్టారు. దానికి కా.రా గారు ప్రధాన ప్రసంగం చేశారు. ప్రసంగం అయిన వెంటనే వేరే కార్యక్రమం వుందని మధ్యలోనే సభ నుండి వెళ్తున్నందుకు క్షమించమని చెపుతూ, నన్ను సైగ చేసి పిలిచారు. “నాయనా నన్ను బస్ కాంప్లెక్స్‌కు దింపేయ్’ అని నాతోపాటు బయటకు వచ్చారు. బస్ కాంప్లెక్స్ దగ్గర దిగుతూ “నువ్వు పెద్ద వాళ్ళకి సాయం చేస్తున్నావని విన్నాను. మంచి పని చేస్తున్నావు. పెద్ద వాళ్ళకి సాయం చేయడం కూడా పుణ్యమే. నువ్వు పుణ్యాన్ని సంపాయించుకుంటున్నావు. వస్తాను అదిగో బస్ వచ్చింది” అంటూ బస్ ఎక్కేసారు ఆ సాదా సీదా మనిషి.

ఆ తర్వాత పిఠాపురంలో ఆవంత్స సోమసుందర్ గారి జయంతి ఉత్సవానికి వెళ్ళాం. అక్కడే రచయితల కథలు విజువలైజ్ చెయ్యడం ప్రాజెక్టుగా చేస్తున్నట్లు రామతీర్థ ప్రకటిస్తూ, కారా గారి కథను అక్కడ ప్రదర్శించారు, పవర్ ప్రజెంటేషన్లో. అంటే రచయిత తన కథను తనే చదువుకొని వినిపిస్తాడన్నమాట. చాలా మంది అందులో చేరారు. సాహిత్య అకాడమీ సమావేశాల్లో చాలాసార్లు కలిసాం.

మాష్టారి 90 ఏళ్ళ పండగ విశాఖపట్నంలో వారి శిష్యులు, సాహిత్య అభిమానుల మధ్య వైభవంగా జరిగింది. మాష్టారి ప్రసిద్ధి కథ ‘యజ్ఞం’ నాటకం ఆ రోజు సాయంత్రం కళాభారతిలో ప్రదర్శించారు.

మాస్టారి సాహిత్య కృషికి గాను గౌరవ డాక్టరేట్‌ను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రధానం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ వీరి కథలకు పురస్కారాన్ని అందజేసింది. గుంటూరులో శ్రీ బొమ్మిడాల ట్రస్ట్ పురస్కారాన్ని అందజేసింది. ఇలా పురస్కారాలను, అవార్డులను ఇచ్చి సంస్థలు గౌరవాన్ని పొందాయి.

2019 ఫిబ్రవరి 9న తొలి తెలుగు కథకు పుట్టినిల్లు అయిన విజయనగరం నుండి 45 మంది సాహితీ మిత్రులందరం కలసి ‘కథ కోసం కాలి నడక’ పేరు కథానిలయానికి 1వ తేదీ ఉదయం 9 గంటలకు చేరుకున్నాం. మాకు కథానిలయం ఘనమయిన స్వాగతం పలికింది. మా అందరినీ పేరు పేరున మాష్టారు పలకరించడం అందరికీ ఎంతో తృప్తి కలిగింది. ఆ నడక చరిత్రలో నిలచిపోతుంది. ఆ రోజు కాలినడకన నడచిన వారిలో దాసరి అమరేంద్ర, కళ్యాణి, ద్వారం దుర్గా ప్రసాదరావు, చీకటి దివాకర్, కాకినాడ నుండి జగన్నాథ రాజు, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, వివిన మూర్తి, శాంతారాం మొదలయిన వారితో నేను కలసి వున్నానన్న సంబరం నన్నింకా వీడలేదు. ఆ ప్రాజెక్టు నిర్వాహకుల్లో ‘సహజ’ సాంస్కతిక సంస్థ అధ్యక్షునిగా నేను, క్రియ – కార్యదర్శి జగన్నాధ రాజు, సాహితీ స్రవంతి – విజయనగరం తరపున దివాకర్ నిర్వహించాం. యీ కార్యక్రమానికి దాసరి అమరేంద్ర లీడ్ తీసుకున్నారు. సమాజం నుండి మనం పొందిన దాన్ని సమాజానికి మనం అందించాలన్న సూత్రంతో తన సర్వస్వాన్ని కథానిలయానికే దారాదత్తం చేసిన మహా యోధుడు కాళీపట్నం రామారావు గారు తన 98వ ఏట 04-06-2021న గగన వీధిలో కథా విహారం చేయడానికి తన యశోకాయాన్ని విడచి వెళ్ళారు. కథా నిలయానికి సాహిత్యాభిలాషులంతా ట్రస్ట్ మెంబర్లు అయి చేయూత నిచ్చి మాష్టారి కలను నిజం చేయడమే మనం ఆయనకిచ్చే గొప్ప నివాళి కాగలదు.

Exit mobile version