పేరు
ఊరు, పేరు లేనివాళ్ళెవరయినా ఉంటారా! ఉండరు. ప్రతి ఒక్కరికి, ప్రతిదానికి ఒక పేరు ఉంటది. పేరుతోనే ఉనికి. “పేరులో ఏముంది పెన్నిది” అంటారు కాస్త తేలిక చేస్తూ. “పేరు నిలబెట్టిండు” అంటారు గొప్ప చేస్తూ. ఏ విధంగా వ్యాఖ్యానించినా “పేరు” అనివార్యమయినది. పిల్లలకు పేరు పెట్టేటప్పుడు సవాలక్ష జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు బోలెడు కారణాలు చెప్పుతారు. గొప్పవాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, అంతటి వాడు కావాలని. అయ్యేదికాంది తరువాత సంగతి. యాది కోసమని తమ పూర్వీకుల పేరు ప్లిలలకు పెట్టుకుంటారు. ముద్దు పేర్లు అనేకం కనపడతవి. మనిషి లక్షణం పేరుకు సరిపోతే, సార్థక నామధేయుడని అంటారు. ఒక్కోసారి పేరు చెబితే పనులు అవుతాయి. “లక్ష్మీ” అనే పేరుగలామె ఇంట్ల దరిద్రం తాండవించవచ్చు. అయినా పేరు కొనసాగిస్తుంటారు. కొందరికి పేరు మార్చుకుంటే కలిసొస్తుందనే నమ్మకం ఉంటుంది. వాళ్ళ ప్రయత్నం చేస్తారు. ఇదంతా పేరుకున్న ప్రాధాన్యత. సృష్టిలోని సమస్త జీవరాశికి పేరు ఉంది. జీవితాల్ని చిత్రించే కథకు కూడా పేరు పెట్టాల్సి ఉంటుంది. పేరు లేని కథ ఉండదు. పేరుకు లేకుండా పోవద్దు అనడంలో మతలబు ఉంది.
“While a good little is essential, it is a great mistake to have a starting or sensational title followed by a quite little character sketch. Keep the title in it proper proportions to the nature and interest of the story” – Mechonobi
కథకు శీర్షిక శిరసులాంటిది. ఆలోచించి పేరు పెట్టాలి. కథ పూర్తి అయ్యాక పేరు పెట్టడం ఒక పద్ధతి. పేరు పెట్టాక కథ రాయడం మరో పద్దతి. పేరు ఆకర్షణీయంగా ఉండాలి. సారాంశాన్ని, ప్రధాన పాత్ర గుణాన్ని, కథ తాత్వికతను, ఇతివృత్తాన్ని, సంఘటన, సన్నివేశాల్ని తెలిపే పేర్లు పెట్టవచ్చు. సంఖ్యను, కాలాన్ని సూచించే పేర్లు ఉండొచ్చు. ప్రదేశము, సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు పెట్టవచ్చు. కవితాత్మకంగా, కళాత్మకంగా పేర్లు ఉంటే మంచిది. మూడక్షరాల పేర్లను, రెండు పదాలు గల పేర్లను, ఇంగ్లీషు, హిందీ పదాలను పేర్లుగా పెడుతున్నారు. పేరుతో కూడా ప్రయోజనాలను సాధించవచ్చు. ఔచితీమంతం కాని పేర్లను పెట్టవద్దు. కథకు పేరుకు సంబంధం లేదని పాఠకుడు పెదవి విరవకూడదు. కథ అల్లడం కథకుని చేతిలోని పని. కావునా పేరుకు తగ్గట్టు కథ ఉండాలి.
కథకు పేరు పెట్టడం ఒక కళ. కథా కుతూహలాన్ని పేరు ఇనుమడింపజేయాలి. ఒక్కోసారి పేరును చూసి కథను ఆదరిస్తారు. పాత్రమెరిగి దానం చేసినట్లుగా, గుర్తెరిగి పేరు పెట్టాలి. కథకు పేరు పెట్టడంలో ఎన్నో కోణాలు ఉంటాయి. ఎవరి దృష్టి కోణం వారిది. ఎవరు ఎన్ని విధాల ఆలోచించి పేరు పెట్టినా, పేరు కొంత చెప్పాలి. మిగతాది కథ చెప్పాలి.
కొన్ని కథలపేర్లు, వాటి విశేషాల్ని చూద్దాం.
- శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథ-‘అరికాళ్ళకింది మంటలు’ -కథాసారాంశాన్నిసూచిస్తుంది.
- బుచ్చిబాబు కథ – ‘కాగితం ముక్కలు-గాజు పెంకులు’ – రెండు పదాలతో కూడినది.
- మల్లాది రామకృష్ణశాస్త్రి కథ – ‘ఏలేలో’ మూడక్షరాలతో ఉన్నది.
- రావిశాస్త్రి కథ – ‘షోకుపిల్లి’ -వ్యంగ్యం ప్రధానం.
- మధురాంతకం నరేంద్ర కథ – ‘నాలుక్కాళ్ళమంటపం’- ఇందులో సంఖ్యావాచకం ప్రధానం.
- మాగోఖలే కథ – ‘బల్లకట్టు పాపయ్య’ – పాత్ర పేరుతో ఉన్నది.
- చాగంటి సోమయాజులు కథ-‘ఏలూరెళ్ళాలి’ ఊరు పేరు సూచికగా ఉన్నది.
- మహమ్మద్ ఖదీర్ బాబు కథ-‘పెండెం సోడా సెంటర్’-తెలుగు, ఇంగ్లీష్ పదాల కలయికతో పేరు.కథకు కేంద్రబిందువయిన దుకాణం పేరు
- కాళీపట్నం రామారావు కథ-‘యజ్ఞం’-సామాజిక పరిణామాల్ని పట్టించే తాత్వికతను సూచించే పేరు.
- గురజాడ అప్పారావు కథ-‘దిద్దుబాటు’-సంఘసంస్కారాన్ని ప్రతిబింబించే పేరు.
- భండారు అచ్చమాంబ కథ-‘దంపతుల ప్రథమ కలహం’-ఒక వాక్యం పేరుగా పెట్టడం.
- పి.వి.నరసింహరావు కథ-‘గొల్లరామవ్వ’-స్త్రీ పాత్ర పేరుతో ఉంది.
- సురవరం ప్రతాపరెడ్డి కథ-‘గ్యారకద్దు బారా కోత్వాల్’ – తెలుగు కథకు ఉర్దు పేరు పెట్టడం.
- ముదుగంటి సుజాతారెడ్డి కథ-‘9/11 లవ్ స్టోరీ’-తేది, నెలతో కూడిన ఇంగ్లీషు పేరు పెట్టడం.
- అల్లం రాజయ్య కథ-‘అతడు’గా పేరుగా పెట్టడం.
- బి.ఎస్. రాములు-‘కామన్వెల్త్’-పూర్తి ఇంగ్లీషు పేరు.
- జీవన్ కథ- ‘నెత్తుటి గుడ్డు నా తెలంగాణ’-ప్రాంతం పేరు పెట్టడం.
- నెల్లూరి కేశవస్వామి కథ-‘యుగాంతం’ – కాలం పేరు పెట్టడం.
- కాంచనపల్లి చినవెంకటరామారావు- ‘చెరువొడ్డున’-స్థలం పేరు.
- గూడ అంజయ్య కథ-‘గౌరడు’-ఏకవచనం పేరు.
(మరోసారి మరో అంశంతో)
డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.