Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథా సోపానములు -1

డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథ, కథానికల మధ్య గల భేదాన్ని వివరిస్తుంది.

కథ – కథానిక

థ-కథానిక అనే రెండు పదాలు గందరగోళపరుస్తుంటవి. వీటిని సమానార్థకాలుగా వాడుతుంటారు. వాస్తవానికి ఇవి రెండు కొద్ది బేధాలతో వేరువేరు. పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీమజిలీ కథలు, భట్టివిక్రమార్క కథలు, సాలభంజిక కథలు, భేతాళ కథలు ఇవన్ని కూడా పూర్వకాలం నుండి ఇప్పటి వరకు తెలుగు సమాజంతో కలిసి నడిచాయి. వీటికి ఒక ప్రయోజనం ఉంది. నీతి చెప్పటం వీటి పరమావధి. మానసికానందానికి, ఆహ్లాదానికి, భయం పోగొట్టడానికి ఇవి సహాయపడ్డాయి. ఆధునిక కథానిక ప్రయోజనం కథ కంటే భిన్నమైనది.

పాశ్చాత్య దేశాలనుండి మనకు దిగుమతి అయినది, ఆధునికమైనది కథానిక. “కదిలేది కదిలించేది, మారేదీ మార్పించేది, పాడేది పాడించేది, మునుముందుకు కదిలించేది, పెనునిద్దుర వదిలించేది, పరిపూర్ణపు బ్రతుకునిచ్చేది” కవిత్వమన్నాడు శ్రీశ్రీ. ఈ లక్షణాలన్నీ కథానికకు సరిపోతాయి. అగ్నిపురాణంలో ఆఖ్యానకము, ఆఖ్యాయిక, ఆఖ్యానము, కథానకము అనే పేర్లు కనపడుతున్నాయి. కాని పాశ్చాత్య రచయితలు చెప్పిన కథానికా లక్షణాలు, వివరములు వీటికి సరిపోవటం లేదు. ఇక్కడ లక్షణ చర్చ చేయటం లేదు. కథలు చాలా వరకు కల్పితాలు. ఆంగ్లంలోని ‘షార్ట్ స్టోరీ’ని తెలుగులో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు “కథానిక” అని పిలిచారు. ఆ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చారు. దీన్నే “చిన్నకథ” అని “కథిక” అని పిలిచిన వారున్నారు. మొత్తానికి “కథానిక” అనే పేరు స్థిరపడింది.

కథ పురాణ, ప్రబంధాల్లో ఉంది. అది పద్యరూపంలో సాగింది. నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి పద్యరూపంలోనే వికసించింది. కథ చెప్పాలనే, వినాలనే కోరిక మనకు ప్రాచీన సాహిత్యంలో కనపడుతుంది. అదంతా మార్గకవిత్వ పరిధి లోపలే జరిగింది. ప్రత్యేకంగా ఒక సాహిత్య రూపంలో, విశిష్ట లక్షణాలను సంతరించుకొని తెలుగులో కథ ఇరవైయ్యవ శతాబ్దిలోనే వచ్చింది. అలా వచ్చిన దానిపై ఇంగ్లీషు షార్ట్ స్టోరీ ప్రభావం ఉంది. ఆ చిన్న కథే నేడు కథానికగా పిలువబడుతుంది. వాస్తవంగా నేడు వస్తున్నవన్నీ కథానికలే. కాని మొదటినుండి నోళ్ళల్లో నానుతున్న ‘కథ’ అనే పదం నీడలో కథానిక కలిసిపోయినది. ఈ రోజుల్లో వస్తున్నవన్నీ కథానికలే.

జానపద, సాంఘిక, మానసిక, పౌరాణిక, ఇతిహాస, సాంకేతిక, ఖగోళ, భౌగోళిక విషయాలను ప్రధానం చేసుకొని వేలాది కథానికలు వస్తున్నాయి. భూచర, జలచర, ఉభయచర జీవుల్ని, సాంకేతిక సృష్టి అయిన “రోబో” లాంటి మిషన్లను ప్రధాన పాత్రలుగా చేసుకొని నేటి కథానికలు పాఠకులను ఆలోచింప జేస్తున్నాయి. అలరిస్తున్నాయి. సమాజ జీవనంతో పెనవేసుకున్న ఆనందాల్ని, అంతరాల్ని, సంక్షోభాల్ని, ఘర్షణల్ని, పరిణామాల్ని, విప్లవాల్ని, విలువల్ని, భావజాలాల్ని వెన్నెముకగా చేసుకొని కథానిక మన ముందు ఉన్నది. మానవ జీవన సారాంశాన్ని వస్తువుగా చేసుకొని చారిత్రక వనరుగా కథానిక కనపడుతున్నది.

(మరోసారి మరో అంశంతో)

Exit mobile version