Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కస్తూరిరంగని తెలుగింట నిలిపిన వాగ్గేయకారుడు ‘అల్లూరి వేంకటాద్రిస్వామి’-1

[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన – కస్తూరిరంగని తెలుగింట నిలిపిన వాగ్గేయకారుడు ‘అల్లూరి వేంకటాద్రిస్వామి’ – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]

‘అమరము నాంధ్రము కావ్యము’ అంటూ, ఆంధ్ర భాష కూడా దేవభాషేనన్న వాగ్గేయకారుడు శ్రీమాన్ అల్లూరు వేంకటాద్రిస్వామి (1806-1877).

తిరువరసుగానూ, శ్రీమత్ పరమహంస తిరువేంగడ రామానుజ జియరుగానూ వైష్ణవ భక్తకోటిలో ప్రసిద్ధుడు. కాలికి గజ్జెకట్టి ఆడుతూ, తుంబుర మీద పాడుతూ హరికథాగానం చేస్తూ భక్తి ప్రచారం చేసినవాడు. పరమభాగవతోత్తముడిగా ప్రసిద్ధుడు. భద్రాచల రామదాసు పరంపరకు చెందిన భక్తకవి ఆయన.

తమిళ నేలమీద తెలుగు భాషను ప్రతిధ్వనింపచేసిన వాగ్గేయకారుడు.. వైష్ణవ శ్రేణులకు దైవస్వరూపుడు.. అతి సామాన్య తమిళుడు కూడా భక్తికొద్దీ పాడుకునే హరినామ సంకీర్తనలెన్నో రచించి, తుంబుర కరతాళాల సాయంతో పాడి, కాలికి గజ్జెకట్టి ఆడి తమిళ ప్రజలలో నామసిద్ధాంత పరివ్యాప్తి కలిగించిన భాగవతోత్తము డాయన.

తమిళనాట బోధేంద్ర సరస్వతితో ప్రారంభమైన నామసంకీర్తనోద్యమానికి అల్లూరి వెంకటాద్రిస్వామివారు కొత్త సొబగులు సమకూర్చి, భక్తి సముద్రంలో ఆ ప్రజల్ని ఓలలాడించారు.

“యేమయ్యా రామయ్యా” అని పరమాత్ముణ్ణి ప్రాణ స్నేహితుడిలా సంభావించిన వాడాయన. శ్రీరంగ రంగనాథస్వామిని కస్తూరి రంగయ్యగా తెలుగింట నిలిపాడు.

‘కస్తూరిరంగయ్య, కరుణింపవయ్య, సుస్థిరముగ నమ్మితి నయ్య’ అనే హరికీర్తన వీరిదే!

“పరాకు సేయుట, పాడిగాదురా పరమపురుష వరదా” పాట తెలుగు గ్రామీణ ప్రాంతాలలో హరిదాసుల నోట ఈనాటికీ వినిపిస్తూనే అంటుంది.

‘బిరాన బ్రోవక నిరాకరించుట బిరుదు నీకు దగురా-వరదా’ అని ప్రశ్నిస్తాడు ప్రభువును.

ఈ తెలుగు భక్తకవికి తమిళనాడుతో ఏం పని? అని చాలామందికి ఒక సందేహం కలగవచ్చు. పొట్ట చేత పట్టుకుని తంజావూరు లేదా మధుర తెలుగు నాయకరాజులను ఆశ్రయించిన అనేకమంది తెలుగు కవుల మాదిరి అల్లూరి వెంకటాద్రిస్వామి తమిళనాడు వెళ్లలేదు. ఏ ప్రయోజనం ఆశించి శ్రీ నారాయణ తీర్థులు తమిళనాడు వెళ్ళారో, ఏ ప్రత్యేకను చవి చూపించటానికి క్షేత్రయ్య తమిళనాడు వెళ్ళాడో, ఏ పరమ ప్రయోజనాన్ని ఆశించి త్యాగయ్య తమిళనాడులోనే తెలుగులో కీర్తనలను వెలయించి సంగీత మూర్తిత్రయంలో ఒకరుగా భాసిల్లారో ఆ ప్రయోజనమే అల్లూరి వెంకటాద్రిస్వామివారిని తమిళనాడు వైపు నడిపించింది.

తమిళనాట సామాజిక సంస్కరణలు, రాజకీయ సంస్కరణలతో పాటు భక్తి సంస్కరణలు కూడా అవసరమైన పరిస్థితులు తలెత్తిన ప్రతీసారీ ఒక తెలుగు భక్తకవి అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్ది శాంతిని నెలకొల్పటాన్ని గమనించవచ్చు.

పరమ మాహేశ్వరులు శ్రీ అప్పయ్య దీక్షితులవారు, పరమ భాగవతోత్తములు శ్రీ నారాయణ తీర్థ, మహాకవి క్షేత్రయ్య, త్యాగబ్రహ్మ శ్రీ త్యాగయ్య ప్రభృతులు అక్కడ సంస్కర్తలుగా భాసిల్లారు. సంగీత పరంగానూ, సాహిత్య పరంగానూ, భక్తి పరంగానూ, సమాజపరంగా కూడా వీరి సంస్కరణలు సామాజిక ఉన్నతిని సాధించటానికి ఎంతగానో తోడ్పడ్డాయి.

అల్లూరి వెంకటాద్రి ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు? ఏ కులంలో ఏ శాఖలో జన్మించాడు? లాంటి విషయాల కన్నా ఆ మహనీయుడు తన జీవితకాలంలో సాధించిన విజయాలమీద ఎక్కువ చర్చ జరగవలసి ఉంది. ఆయన భక్తిమార్గాన, సామాజికంగానూ, సాహిత్య, కళా పరంగానూ తెచ్చిన మార్పులమీద చాలినంత చర్చ జరగలేదన్నది వాస్తవం.

తెలుగు వారిలో పట్టనితనం ఎక్కువనే ఆరోపణ ఎవరైనా చేస్తే ఎవరూ ఉలుకుపడవలసిన అవసరం లేదు. మన గురించి కూడా మనకు పట్టదు కాబట్టి, ‘పట్టనితనం’ అనేది మనకు జాస్తి అని అంగీకరించక తప్పదు. ఇప్పటికి కూడా ఆ తెలుగింటి మహనీయుడి గురించి వందలాది వ్యాసాలు తమిళులు వ్రాస్తే, నూటికొక్కరు కూడా తెలుగువారు వ్రాయక పోవటాన్ని ‘పట్టనితనం’ అనక తప్పదు.

వేంకటాద్రి స్వామి శిష్యవర్గ ప్రసిద్ధుల్లో శ్రీ కట్టా రామదాసు, ఆయన శిష్యుడు సిద్ధాంతం నంబి, ఆ నంబి గారి శిష్యుడు బుక్కపట్టణం తిరువేంగడదాసు.. ఇలా వీరి శిష్యపరంపర తమిళనాట ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీ పెరంబూరులో ‘అల్లూరి వెంకటాద్రిస్వామి భక్తజనసభ’ పనిచేస్తోంది. ‘శ్రీమాన్ అల్లూరి వెంకటాద్రిస్వామి దేవాలయ భక్తకోటి సంఘం’ శ్రీరంగంలో ఏటా వెంకటాద్రిస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తోంది.

మరకతం పొదిగిన వజ్రాల కిరీటం తయారీకి ఆర్థిక వనరుల కోసం ఆయన మొదట మద్రాసు నగరం వెళ్లారు. బక్కపలచని బ్రాహ్మడు, నల్లని రూపం, ఏమాత్రం ఆకర్షణ లేని ముఖారవిందం, ఆయన దేవుడికి వజ్రాల కిరీటం చేయించటానికి దాతల కోసం వస్తే స్పందించినవారే కరువయ్యారు. కొందరు హేళనగా చూశారు కూడా! భగవంతునితో ఆయనకు గల అనుబంధం తెలిసేది ఎందరికి? అయినా ఒక సంస్థానాధీశుడు తన జీవిత కాలంలో సమకూర్చుకున్న దానికన్నా ఎక్కువ ఆస్తినే ఆయన భిక్షాటన ద్వారా సమకూర్చి అనేక దేవాలయాల పునరుద్ధరణకు, శాశ్వత కైంకర్యాలకు, ఆభరణాల తయారీకి వెచ్చించ గలిగాడు.

పుణ్యభూమి అల్లూరు

ఆహా యేమనియానతిత్తును- యార్యులారమీరందరువినుడు
యండజ గమనుని యంఘ్రిధ్వయముల- నుద్బవించి యీ యుర్విజసులకు
నొదవిన పాపమునొగినడంచిన- గంగకలుషములుకరుగ జేశిన
దివ్యకృస్ణాతీరమునందున నఖిలలోకముల- నభినుతి కెక్కిన యాంధ్రదేశమని
యార్యులు బొగ’డెడి అల్లూరనదగు- యగ్రహారమా యనంతుకైనను..

కృష్ణాజిల్లా నందిగామ దగ్గర వీరులపాడు, కంచికచెర్ల, నందిగామ, జి.కొండూరు మండలాల మధ్య అల్లూరు గ్రామం నెలకొని ఉంది. ఈనాటి కృష్ణాజిల్లా, వీరులపాడు మండలంలో ఆనాటి నైజాం రాజ్యంలోని పరిటాల పక్కన అల్లూరి గ్రామ అగ్రహారం వీరిది. జుజ్జూరు పోష్టు. నందిగామ, కంచికచర్ల, జి. కొండూరు మండలాల మధ్య అల్లూరు గ్రామం ఉంది. ఖమ్మం జిల్లా సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది.

ఒకప్పటి బౌద్ధ క్షేత్రం ఇది. క్రీ.శ. 3వ శతాబ్ది నాటి ఇక్ష్వాకు ప్రభువు యహువల శాంతమూలుడి శాసనం దొరికిన చారిత్రక స్థలం ఇది. ఆ శాసనంలో ఈ ఊరిపేరు హల్లూరు అని ఉంది. పూర్వశైలిక బౌద్ధభిక్షువులకు ఇచ్చిన దానశాసనం ఇది. విష్ణువు దశావతారాలలో బుద్ధుడు కూడా ఒకడు కాబట్టి ఈ బౌద్ధక్షేత్రం వైష్ణవులకూ పవిత్రమైనదే!

ఆ నేలప్రబావాన్ని, ఆ గాలి ప్రభావాన్ని, ఆ క్షేత్ర ప్రభావాన్నీ మనం అంగీకరించ లేకపోతే పుణ్యక్షేత్రాలు, తీర్థాల సందర్శనం అంతా పర్యాటక వినోదమే అవుతుంది. చారిత్రకంగా అల్లూరు పుణ్యభూమి. కనీసం 2000 యేళ్ళ క్రితం వర్తక వాణిజ్య కేంద్రం కూడా! బ్రిటిష్ యుగంలో కలువకొలనువారి బ్రాహ్మణ జమీందారీలో ఈ ప్రాంతం ఉండేది. అల్లూరు, జుజ్జూరు, వీరుళ్ళపాడు, పరిటాల ఈ నాలుగూ ఇరుగూ పొరుగూ గ్రామాలు స్వాతంత్ర్య పోరాట యోధులకు కేంద్రాలుగా ఉండేవి.

విష్ణుచక్రాకారంలో అల్లూరు బౌద్ధస్తూపం

అపరప్రహ్లాదుని జననం

వెంకటాద్రివారి శిష్యుడు పుష్పాల రామదాసుగారు వెంకటాద్రిస్వాముల వారి చరిత్రము అనే గ్రంథంలో చాలా విశేషాలు వ్రాశాడు. ఈ గ్రంథంలోని ఒక కీర్తనలో అల్లూరి గ్రామాన వెంకటాద్రిగారి జననాన్ని ఇలా పాటగా మలిచాడు:

నవతరించె వేంకటాద్రి సద్గురుడు | యగణితగుణసాంద్రుడు॥ న॥
వివులతీలంబున వేగచేతనుల | నపహతకల్మషులగు కృపవెలుగగ॥ న॥
సారహీనసంసారమార్లసం । చారులబ్రోవగ కారుణికుండై॥ న॥
అజ్ఞా’నేభము లడలిపరులిడగ | ‘సుజ్హానసింహ్మ సూనముతరుమగ॥ న॥
తాషత్రయనిదాఘ ‘దాహమటు మాఫ్రవృష్టినీ | మహివడీగురియగ॥ న॥
థరపుష్పాలరామదాసుని నేలెడు | ధొరశ్రీయఃపతి చరణశాంశజుడై॥ నవతరించె||

క్రీస్తు శకం 1807లో అక్షయనామ సంవత్సర ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సోమవారాన ఆరువేల నియోగి శాఖకు చెందిన శ్రీవత్సగోత్రీకుడు శ్రీ వెంకటాద్రి. కొందరు భారద్వాజ గోత్రీకుడు అని వ్రాశారు. ఆయన ప్రధాన శిష్యుడు పుష్పాల రామదాసు వెంకటాద్రి స్వాముల చరిత్రము గ్రంథంలో శ్రీవత్స గోత్రం అనే వ్రాశారు. తండ్రి వేంకయ, తల్లి వేంకమల పుత్రుడుగా జన్మించారు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటాద్రి. తమిళనాట ప్రజలు భక్తికొద్దీ ఆయనను అల్లూరి వెంకటాద్రిస్వామిగా పిలుచుకున్నారు.

జుజ్జూరులో బాల్యం

కం॥
“తల్గియుతండ్రియునన్నలు
నెల్ల రయెడప్రేమసలుప డేమాత్రము శ్రీ
వల్లభుననిశము మరువడు
తొల్లిటి ప్రహ్లాదుమహిమదోప జగతిన్”

కనీసం ప్రాథమిక విద్యకూడా పాఠశాలకు వెళ్లి చదవని వ్యక్తి ఒక మహా వాగ్గేయకారుడు ఎలా కాగలిగాడన్నది ఆశ్చర్యమే! అంతా భగవదేచ్ఛ అనేవారు ఆయన్ను తెలిసిన ఆప్తులు.

ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ‘ఆంధ్రయోగులు’ గ్రంథంలో వేంకటాద్రి పిల్లవాడుగా ఉన్నప్పుడు పాము పడగ పట్టటం, సీతారాములు కలలో కనిపించటం లాంటి కథలు కొన్ని ఉన్నాయి, గ్రంథ విస్తరణ భీతితో వాటిని ఇక్కడ ఎత్తి వ్రాయటం లేదు. కృష్ణాజిల్లా జుజ్జూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈయన బాల్యం అంతా గడిచినట్టు తెలుస్తుంది.

కారణ జన్ములకు వేరే ధ్యాస ఉండదు. ఒక కార్యం నిమిత్తం కొందరు యోగులు ఈ నేలపై అవతరిస్తారు. అవతార ప్రయోజనం ముగియగానే నిష్క్రమిస్తారు. శంకరాచార్యులవారు, వివేకానందులవారు మూడు పదుల వయసులోనే తమ అవతారాలను ముగించి వెళ్లిపోవటంలో అంతరార్థం ఇదేకావచ్చు!

ఆచార్యబిరుదురాజు రామరాజుగారు

భగవంతుడి దయ అతనిమీద ఉందని చిన్ననాడే గమనించిన తల్లిదండ్రులు అతని భక్తిమార్గానికి అడ్డు రాకుండా ఆయనకు అనుకూలంగా ప్రవర్తించారు. ఆయనకు ఈ సాధారణ గురువులు చాలరని, గురువులకు గురువైన ఆ ఆదిదేవుడే గురువుగా రావాలని ఆయన ఎదురు చూస్తున్నట్టుగా కూడా గమనించారు. పండిత కుటుంబంలో పాఠశాల చదువు లేకుండా ఒక పిల్లవాడు ఆధ్యాత్మికంగా పెరగటం వెనుక ఇలాంటి కారణాలే ఉంటాయి.

జుజ్జూరులో కొండపైన నారసింహుని విగ్రహం స్వయంభువు కాగా, దానికి కొంచెం దిగువున యోగానంద నరసింహస్వామి గుడి ఉంది. ఆ నారసింహుని సమక్షంలోనే గడుపుతూ ఉండిపోయే వాడు వెంకటాద్రి. తోటిపిల్లలతో ఆటపాటలు లేవు. చదువు లేదు, సంధ్య లేదు, ఏవేవో కూనిరాగాలు తీసుకుంటూ ఉండేవాడు. చేతనైన రీతిలో నాట్యం ఆడేవాడు.

వెదకుతూవచ్చిన గురువు

“పదియైదేండ్ల పరియంతంబును స్వామికార్యమే
సంభ్రమంబుగను జరుపుచు భక్త జన గోష్టినుండ
తూర్పున నుండియు తూము నృసింహదాసు
లేతెంచిరి తత్పురమునకూ”

తగిన శిష్యుణ్ణి వెదకుతూ గురువే ఎదురౌతాడు. అది దైవ ప్రేరణ. భద్రాచల రామదాసువారి శిష్యుడు, మరో గొప్ప వాగ్గేయకారుడు శ్రీ తూము నరసింహదాసు ఆ గురుస్థానాన్ని స్వీకరించి ఎవరో పంపినట్టు జుజ్జూరు వచ్చారు. నారసింహుని సమక్షంలో తపోదీక్షలో కూర్చునిఉన్న వెంకటాద్రిని చూశారు. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు అతన్ని ఆనందంగా మనసుకు హత్తుకున్నారు.

తూము నరసింహాదాసు విగ్రహం

“గురుదేవా! కరుణించు” అంటూ కన్నీళ్లతో తూము నరసింహదాసు పాదాలను కడిగాడాయన. తనకు జ్ఞానభిక్ష పెట్టవలసిందిగా ప్రార్థించారు. ఆ బాలుని ప్రార్థనకు కరిగిపోయారో లేక అది దైవ సంకల్పమో, విధి ప్రేరణో తూము లక్ష్మీనరసింహదాసయోగి వెంకటాద్రికి ఆ నారసింహుని సమక్షంలోనే తారకమంత్రోపదేశం చేశారు. హరినామ సంకీర్తన మార్గోపదేశం చేశారు. నామసంకీర్తన అనేది శ్రీహరి పాదపద్మాల్ని ఆశ్రయించటానికి దగ్గరిదారి అని సూచించారు.

దరిద్రనారాయుడిసేవలో గడుపుతూ దయ, ప్రేమలతో ఆదరించి వారిని ఉద్ధరించాలనేది తూము నరసింహదాస గురువు చేసిన ఉపదేశం. అందుకు సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనకు ఉపకరణా లయ్యాయి. దివ్యదేశాలను (వైష్ణవ క్షేత్రాలను) అర్చావతారాలను (విష్ణు అవతార రూపాలను) సందర్శించి జ్ఞానం పొందాలనేది గురువు ఆదేశం. ఆ శ్రీమన్నారాయణుడి మహిమ చాటుతూ కీర్తనలు పాడుతూ సాగమన్నారు. స్వామి నామమే తనకు చాలినంత శారీరక మానసిక శక్తినిస్తుందని ఉద్బోధించారు. స్వయంగా తన కాలిగజ్జెల్ని, తుంబురనూ అందించారు. ఆడుతూ పాడుతూ సాగిపోమన్నారు. 14-07-1818న వేంకటాద్రి స్వామికి తూము నరసింహదాసు తన తంబురా, కరతాళాలు అందించాడు. ఈ తాళాలు, తంబుర. చెన్నై ముత్యాలపేట గజేంద్రవరద మందిరంలో భద్రంగా ఉన్నాయని రామరాజుగారు పేర్కొన్నారు.

శ్రీ పుష్పాల రామదాసు ప్రకారం గురుసాక్షాత్కారం పొందేనాటికి పదిహేనేళ్ల వయసు కుర్రవాడు వెంకటాద్రి. మరీ పిల్లవాడు కాదు. అలాగని పెద్దవాడు కూడా కాదు. గురువాదేశాన్ని మించిందేమీ లేదు. ఇంక వెనక్కి చూళ్లేదు. ఇంటికి వెళ్ళాలి.. అమ్మా నాన్నలకు చెప్పి అనుమతి తీసుకోవాలి.. లాంటి ఆలోచన్లేవీ అతనికి లేవు. అట్నుంచి అటే, ఆ నృసింహుని సన్నిధి నుంచే తన యాత్ర ప్రారంభించారు.

విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళే మార్గంలోనే అల్లూరు ఉంది. ఆ దారినే ఆయన భద్రాచలం వైపు నడక సాగించారు. భగవంతుని మీద విశ్వాసం, గురువు చేసిన ప్రబోధం తప్ప మరో ఆసరా ఏదీ లేకుండా అనంత యానాన్ని అలా ప్రారంభించారాయన. హరినామాన్ని జపిస్తూ ఆడుతూ పాడుతూ సాగిపోవటమే లక్ష్యం.

భద్రాచలంలో ఐదేళ్లు

కన్నులకరువుదీర కనుగొంటిరాముని
పన్నగశయను నాపన్నశరణ్యుని నాడు ||కన్నుల||
పంకజకరములనుండు శంఖుచక్రములరెండు
శంకర పూజ్యుమైయుండు।చక్కని పాదములు రెండు కన్నుల॥
శరణన్నవారిని సంరక్షణ జేయు చుండు బిరుదుగల్గి గరుడు నెక్కి
తిరిగెడువానినా రెండు ||కన్నుల||

భద్రాచల రాముని దర్శించుకోవటంతోనే ఆయన మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని, కాలి గజ్జెలతో చేత తుంబరతో రామనామస్తుతి చేస్తూ ఆడిపాడాడని పుష్పాలవారు పేర్కొన్నారు.

గురుపాదస్పర్శతోనే ఆయనలో నిద్రాణంగా ఉన్న వైష్ణవతత్త్వం వెలికివచ్చింది. గురువుకే పాఠాలు చెప్పిన ప్రహ్లాదుడికి ఎవరు నేర్పారా చదువులు? హరినామసంకీర్తనా బలమే విద్యాబలాన్ని కలిగిస్తుందని పరమ భాగవతుల నమ్మకం. గురువు మీట (switch) లాంటి వాడు. మీటనొక్కితేనే విద్యుద్దీపాలు వెలుగుతాయి. యంత్రాలు తిరుగుతాయి. భక్తుడిని పరమ వైష్ణవుడిగా మార్చేది నామ సంకీర్తనా యోగం. ఆ యోగం సిద్ధించిన వాళ్లు పరమ భాగవతులై వాగ్గేయకారు లయ్యారు. అలౌకికమైన పారమార్థ చింతనతో వారు లోకకళ్యాణార్థం జీవిస్తూ ఉంటారు. వారి చుట్టూ అనేక చారిత్రక సంఘటనలు అల్లుకుంటూ ఉంటాయి. వాటితో ఆ పరమ భాగవతులకు ఎలాంటి సంబంధమూ ఉండదు.

రామదాసే గురువు

భక్తరామదాసు చరిత్రలోని సంఘటనలు కానీ, అల్లూరి వెంకటాద్రి జీవితంలో సంఘటనలు కానీ ఈ అంశాన్నే నిరూపిస్తాయి. భద్రాచల రామదాస యోగి నుండి ఆయన పొందవలసిన స్ఫూర్తి ఏదో ఉంది. అది పొందటం కోసం వెంకటాద్రి తనకు 17 యేళ్లు వచ్చేవరకూ భద్రాచలంలోనే గడిపాడు. ఆ ఐదేళ్లలో కీర్తనరచనా సంవిధాన్ని, వాటిని ఆడుతూ, స్వయంగా పాడుతూ జనసామాన్యాన్ని రంజింపచేసి వారిలో నిద్రాణంగా ఉన్న విష్ణుతత్వాన్ని మేల్కొల్పటమే లక్ష్యంగా సాధన చేశాడు.

భద్రాచలంలో ఆయన కోటిసార్లు రామనామం వ్రాసి, “శరణుశరణశరణు శ్రీరామరామరామచంద్రా” అంటూ ఒక కీర్తనను ఆలపించారని చెప్తారు.

తపస్సు చేస్తే చదువొస్తుందా? అని అడగవచ్చు. సంగీత సాహిత్యాది కళలు సాధన వలనే సంక్రమిస్తాయి. ఆ సాధనే తపస్సు. భద్రాచలంలో రామదాసయోగిని గురువుగా భావించి, ఒక ఏకలవ్యుడిగా సాధన చేశారు వెంకటాద్రి. ఈనాటికీ తమిళనాట అల్లూరి వెంకటాద్రి కీర్తనలకు త్యాగరాయ కీర్తనలతో సమానమైన గౌరవం లభిస్తోందంటే అది ఈ సాధన వలనే సాధ్యం అయ్యింది ఆయనకి. అందుకోసం ఐదేళ్లపాటు భద్రాచలంలో గడిపారాయన. అక్కడినుండీ భక్తజనంతో కలిసిపోయి క్షేత్రాలన్నీ పర్యటిస్తూ చివరికి కంచి చేరారు. వైష్ణవ భక్తుల జీవిత కథలన్నీఇలా కంచికే చేరేవి.

తిరుపతి యాత్ర

“..ఉత్తరదేశపు వారుకొందరు
చిత్తము రంజిల శ్రీకంచివరదుని-యుత్సవమునకును వచ్చుచుండగను
తోడుగలిగెనిక తోయజనేత్రుని-పాదసేవకును పాత్రుండైతిని
కరువుదీరగా కరిరాడ్వరదుని- గరుడోత్సవమునుకంటినియనుకొని
కడు ముదంబుతో కడువేగంబున-నదులువనంబులునగరులుపల్లెలు
పర్వతాదులును సర్యముదాటుక-తిరుమల కేగియు దివ్యపురుషుడౌ
శేషగిరీశుని సేవజేసుకొని నతని- మనమునను నుతియించెనిటుల”

శ్రీ వెంకటాద్రి భద్రాచలం నుండి ఉత్తరాది భక్తులతో కలిసి అనేక దివ్యక్షేత్రాలు సందర్శిస్తూ 1824లో తిరుపతి వెళ్లారు. అక్కడ కొన్నేళ్లు హరికీర్తనా గానం చేస్తూ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ గడిపారు. భగవంతుడి దిశానిర్దేశం కావాలి. అంతవరకూ వేచి ఉండక తప్పదు. కొంతమంది యోగులు ఉన్నన్నాళ్ళు కదలకుండా ఉండి, చటుక్కున మాయమై పోతుంటారు. ఎక్కడికెళ్ళారో ఎవరికీ తెలీకుండా వెళ్లిపోతుంటారు. భగవంతుడి అనుఙ్ఞకోసం వేచి ఉండి అది రాగానే నిష్క్రమిస్తుంటారు.

“ఇందిరారమణ నే విందు రారా” మొదలైన కీర్తనలు అక్కడ ఆయన పాడి ఆడినవే! ఒకరోజు స్వప్నసాక్షాత్కారం ఇచ్చి వేంకటేశ్వరుడు వెంకటాద్రిని కంచికి వెళ్లమని ఆదేశించాడు. వెంకటాద్రి వెంకటాద్రిస్వామిగా మారేందుకు ప్రేరణ ఇదే!

కంచివరదరాజస్వామి ఎత్తయిన విగ్రహం

కథలన్నీ కంచికే చేర్తాయని తెలుగువాళ్ల నమ్మకం. కథ కంచికి మనం ఇంటికి.. అని కథను ముగించటం మన అలవాటు. కంచికి వెళ్ళాలని శ్రీ వెంకటేశ్వరుడి అనుఙ్ఞ అయ్యిందంటే అది తన అనంత యాత్రకు ఆఖరి మజిలీ అని, ఇంక తన ప్రధాన కార్యక్షేత్రం కంచే కాగలదనీ, తన భవిష్యకార్యక్రమాలన్నీ కంచి కేంద్రంగా సాగుతాయనీ వెంకటాద్రి గారికి అర్ధం అయిపోయింది. ఆ శ్రీహరికి శతకోటి వందనాలు చెప్పుకుంటూ పరమానందభరితంగా కంచి చేరారాయన.

వెంకటాద్రిని స్వామిగా మార్చిన కంచి

శ్రీ వెంకటాద్రిస్వాముల చరిత్రము గ్రంథంలో పుష్పాల రామదాసకవి అల్లూరివారు భట్టరణ్ణన్ లాంటీ ఆచార్య పంక్తి నెరిగి వైష్ణవ సిద్ధాంతవర్తి అయ్యడంటూ ఇలా వ్రాశారు:

సీ||
“రంగనాధునిపాద రాజీవములుతన యంతరంగనునందు నమరనిలిపి
శ్రీరంగనాంచారు శ్రీ శేనమొదలిని శ్రీశఠకోపుల సేవచేసి
శ్రీభాష్యకారుల శ్రీవరవరముని ప్రభృతులౌ యాచార్యపంక్తి నెఱగి
సాంప్రదాయస్ఫూ ర్తి చయ్యనపాటించి వైష్ణవ సిద్ధాంత వర్తియగుచు
భట్టరణ్ణను మొదలైన భాగవతుల నరసి సేవించి హర్షించి యద్భుతముగ
నఖిలకైంకర్యములు జేసి యనుదినంబు రంగ ధామనివాసియై రహిచెలంగె”

తిరుక్కోవళూరు మొదలైన వైష్ణవ క్షేత్రాలను వరుసగా సందర్శించి వైష్ణవ తత్త్వాన్ని బాగా జీర్ణింపచేసుకున్నారాయన.

వరదరాజ స్వామి పుష్ప కైంకర్యం కోసం పూలతోట పెంచాలని డబ్బు సంపాదించటానికి, వీధులలో బిచ్చమెత్తటానికి తన ఆటని, పాటని ఉపయోగిస్తూ కంచిలో ఆయన జీవితం ప్రారంభించారు.

వైష్ణవ సిద్ధాంతవర్తిగా మారటానికి కంచిలో ఆయన జీవితం ఒక శిక్షణా కేంద్రంగా ఉపయోగపడింది. భద్రాచలంలో కన్నా ఎక్కువగా వైష్ణవతత్త్వం ఇక్కడ తాను అలవరచుకోవాల్సి వచ్చింది. శ్రీ రంగనాంచారు, శ్రీ శేనమొదలి శ్రీశఠకోపులస్వామి లాంటి భక్తశ్రేష్ఠులు ఆయనకు సరైన దిశానిర్దేశం చేశారని చెప్పాలి. సాంప్రదాయ స్ఫూర్తి ఆయనకు బాగా వంటబట్టినప్పుడే దాన్ని నిలబెట్టేందుకు ఆయన ఒక సాధనంగా మారగలుగుతాడు. భట్టరణ్ణన్ లాంటి వ్యక్తులు ఈ విషయంలో ఆయనకు ఎంతగానో సహకరించారు. వైష్ణవ విధానంలో ఎన్ని కైంకర్యాలు ఉంటాయో అన్నింటినీ మినహాయింపు లేకుండా వరదరాజస్వామికి జరిగేలా చూడటం ఆయన తనకు తాను విధించుకున్న విధి.

కేవల ప్రబోధం సరిపోదు. అది నెరవేరటానికి కావాల్సిన యంత్రాంగం ఉండాలి. అందుకు ఆర్థిక వనరులు కావాలి. వాటిని సమకూర్చటమే ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం.

(సశేషం)

Exit mobile version