Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాశ్మీరు – సాహిత్యం

[ఆగస్ట్ 16-17, 2025, హ్యూస్టన్, టెక్సస్ లో జరిగిన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో శరచంద్రిక గారి ప్రసంగ పాఠం. తెలుగు సాహిత్య వేదిక మీద తొలిసారిగా సంచిక వెబ్ పత్రిక పేరు వినిపించిన శరచ్చంద్రికగారికి ధన్యవాదాలు. తెలుగు వెబ్ పత్రికలంటే, ఏవో కొన్ని తమ రంగుటుద్యమ పత్రికలను మాత్రమే ప్రస్తావించే, రంగుటద్దాల సాహిత్య ప్రపంచంలో సంచిక పేరు ప్రస్తావించటం ముదావహం. ఉపన్యాసకర్తకు అభినందనలు]

నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసినీ।
త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యాదానంచ దేహి మే॥ 1

ఈ శ్లోకం అర్థం ఏమిటంటే “కాశ్మీరంలో నివసించే శారదా దేవికి నమస్కారం. ఓ దేవి! నేను నిన్ను ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను. దయచేసి విద్యను ప్రసాదించు.” అని.

సభకి నమస్కారం.

సాహిత్యంలో నాకున్న పరిజ్ఞానం, అనుభవము చాలా తక్కువ అనే చెప్తాను. నన్ను నేను ఓ సామాన్య పాఠకురాలిగా భావించుకుంటాను. కాబట్టి నా ప్రసంగంలో తప్పులేవైనా ఉంటే మన్నింప ప్రార్థన.

ఈనాడు నేను ప్రసంగించబోయే అంశము ‘కాశ్మీరు – సాహిత్యం’. 👇👇👇👇

అందుకే నా ప్రసంగాన్ని జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య రచించిన శారదా స్త్రోత్రం లోని, కాశ్మీరు క్షేత్రానికి దేవత అయిన శ్రీ శారదా దేవి శ్లోకంతో ప్రారంభించాను.

ఈ ఏడాది ఏప్రిల్ 22న కాశ్మీర్ లోని పహాల్గమ్ లో జరిగిన మతోన్మాద హత్యాకాండలో అసువులు బాసిన వారికి నివాళిగా ఈ అంశాన్ని ఎంచుకున్నాను.

కాశ్మీర్ భారతదేశపు అంతర్భాగమే

“ఈనాటి కాశ్మీర్ ప్రజలు స్వాతంత్య్రం కోరుకుంటున్నారు” అంటూ, “ఆజాద్ కాశ్మీర్” అనే మాట మాట్లాడుతూ, ‘కాశ్మీర్ వేరు – భారతదేశం వేరు’ అంటూ భావిస్తారు కొందరు మేధావి వర్గం. అటువంటి వారికి “సాహిత్యం ద్వారా కాశ్మీర్ యొక్క చరిత్ర, సంస్కృతి చెబుతూ, కాశ్మీర్ భారతదేశపు అంతర్భాగమే, కాశ్మీర్ లోని అస్తిత్వం భారతీయతే” అని గుర్తు చేసే చిన్న ప్రయత్నమే నా ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

శారదా పీఠం

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శారదాపీఠం ఈనాడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులోని ఉంది. సతీదేవి కుడి చేయి ఇక్కడ పడింది అని ఒక నమ్మకం.

భరత ఖండంలో ప్రతీ క్షేత్రంలో ఒక దేవతామూర్తి, ఆ దేవతామూర్తి సంబంధించిన ఒక ఆలయం, ఆ ఆలయంతో కూడుకున్న ఒక ప్రాంతీయ సంస్కృతి కనపడటం సర్వసాధారణం. అందుకే ఈనాటికి కూడా కాశ్మీరీ పండితులకి శారదా దేవి వారి కులదేవత.

ఈ శారదా పీఠంతో కూడియున్న ఒక సుప్రసిద్ధ విశ్వవిద్యాలయం – వేదాలు, గ్రంథాలు, వ్యాఖ్యానాలు, తత్వశాస్త్రం, వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, వైద్యం మరియు సంగీతం వంటి వివిధ విషయాలను నేర్చుకునే కేంద్రంగా ఉండేది.

ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండీ ఎంతో మంది పండితులు, విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారని చరిత్ర చెబుతుంది.

సంస్కృతం, కాశ్మీరీ మరియు ఇతర ఉత్తర భారతీయ భాషలను వ్రాయడానికి ఉపయోగించే పురాతన శారద లిపి శారద పీఠం నుండే ఉద్భవించింది.

కాశ్మీరు ప్రస్తావన

కాశ్మీరును గురించిన ప్రస్తావన మత్స్య, వాయు, పద్మ, విష్ణు పురాణాల్లో కనిపిస్తుంది.

మహాభారతంలో సభాపర్వంలో కూడా కాశ్మీరు ప్రస్తావన కనిపిస్తుంది.

పాణిని అష్టాధ్యాయిలో కాశ్మీర్ అంటూ ప్రస్తావించి కాశ్మీరు ప్రజలను కాశ్మీఱికలు అన్నారు.

ఆది శంకరులు రచించిన అన్నపూర్ణాష్టకంలో కూడా రెండు సార్లు కాశ్మీర్ గురించిన ప్రస్తావన ఉంటుంది.

‘కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ’

‘కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ’

కాశ్మీరులో విలసిల్లిన సాహిత్యం

కాశ్మీరు సంస్కృత వాఙ్మయ చరిత్రను చూస్తే కాశ్మీరంలో విలసిల్లినంతగా కావ్య రచన భారతదేశంలో మరే ప్రాంతం లోనూ జరగలేదు అంటారు.

ఆది శంకరులు – సౌందర్యలహరి

శంకరాచార్యుల వారు కాశ్మీరులోని, ఈనాడు ‘ఆదిశంకరాచార్య హిల్’ అనబడే జ్యేష్ఠేశ్వరుడి ఆలయం దర్శించి, ఆ ఆలయంలోనే సౌందర్యలహరిని రచించారు.

రామానుజాచార్యులు – శ్రీ భాష్యం

బోదాయన ఋషి కాశ్మీర్‌లో భద్రపరచబడిన బ్రహ్మ సూత్రానికి వ్యాఖ్యానం రాశారు. రామానుజాచార్యుల వారు కాశ్మీర్‌కు ప్రయాణించి, బోధాయన వృత్తి గ్రంథాన్ని సంపాదించి, శ్రీరంగానికి తిరిగి వచ్చి శ్రీ భాష్యం పూర్తి చేస్తారు.

కథాసరిత్సాగరము

భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని 11వ శతాబ్దానికి చెందిన సోమదేవ భట్ట లేదా సోమదేవుడు అనే కాశ్మీర్ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించాడు. ప్రపంచ ప్రఖ్యాతమైన గుణాఢ్యుడి బృహత్కథను ఆధారం చేసుకుని రచించినట్టు సోమదేవుడు పేర్కొన్నాడు.

ఈ కథా సరిత్సాగరము కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు వ్రాయబడింది. తెలుగులో దీనిని ప్రసిద్ధ పండితులు, కవి వేదము వేంకటరాయశాస్త్రి అనువదించారు.

నీలమత పురాణం

కాశ్మీరుకు చెందిన అత్యంత ప్రాచీన సంస్కృత రచన నీలముని రచించిన నీలమత పురాణం.

ఈ పురాణము వైశంపాయనుడు జనమేజయుడికి వినిపించిన పురాణం.

ఈ పురాణం ప్రకారం కశ్యప ముని ఏర్పరచిన భూమి కాబట్టి ‘కశ్యపమీరు’ ‘కాశ్మీరు’ అయ్యింది. ఈ విధంగా ఈ పురాణము కాశ్మీర్ యొక్క ఆవిర్భావం గురించి వివరిస్తుంది.

తరువాత కాశ్మీరులో ఉద్భవించిన సాహిత్యం గురించి ముఖ్యంగా చెప్పుకోవలసినది ఈనాటికి మనం చదువుకునే అలంకార శాస్త్రం.

పుల్లెల శ్రీరామచంద్రుడు గారు సంస్కృతంనుంచి తెలుగులోనికి అనువదించిన క్షేమేంద్రుడి పుస్తకాలలో ముందుమాటలో “కాశ్మీర పండితుల జీవన విధానము, వాళ్ళ పాండిత్యం, అలంకార శాస్త్రం లాంటి కొన్ని రంగాల్లో – వారు సాధించిన ప్రగతి లాంటివి తలుచుకుంటేనే నమ్మలేనంత దివ్యంగా వుంటుంది. వారి వర్ణనలు, యెత్తుగడలు యేవో గంధర్వలోకాన్ని తలపిస్తాయి. ఎక్కడో మన తెలుగునాట (కోనసీమలో) పుట్టిన జగన్నాథ పండితరాయలు, తమిళుడైన అప్పయ్య దీక్షితులు లాంటి కొందరు గొప్ప ఆలంకారికులని తప్పిస్తే, అసలు భారతీయ అలంకార శాస్త్రజ్ఞులంతా కాశ్మీరపండితులే అని చెప్పుకున్నా తప్పులేదు.” అన్నారు

కాశ్మీరులో అలంకార శాస్త్రజ్ఞులులో ముఖ్యమైన వారు

భరతముని నాట్యశాస్త్రం

వామనుడు

కావ్యాలంకారం అనే గ్రంధం సూత్ర శైలిలో వ్రాసాడు.

ఆనంద వర్ధనుడు

కవితా సౌందర్య రహస్యాన్ని ఆకళింపు చేసుకోవటానికి ధ్వన్యాలోకం అనే గ్రంధం వ్రాసాడు. ధ్వన్యాలోకముతో ఒక క్రొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు

అభినవ గుప్తుడు ఎన్నో శాస్త్రాలలో మహాపండితుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ముఖ్యంగా భరతముని వ్రాసిన నాట్యశాస్త్రానికి ఒక వ్యాఖ్యానం వ్రాసినవాడు. భరతముని చెప్పిన ‘విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తిః’ అని రససూత్రమును వ్యాఖ్యానించిన వ్యాఖ్యాతలలో అభినవగుప్తుడు ముఖ్యుడు.

క్షేమేంద్రుడు

ఇతడు అవంతివర్మ యొక్క ఆస్థాన విద్వాంసుడు. క్షేమేంద్రుడు అభినవగుప్తుని దగ్గర అలంకార శాస్త్రం అభ్యసించినట్లు చెప్పుకున్నాడు. 33 గ్రంథాలను రచించాడు. వాటిలో ఔచిత్యవిచారచర్చ, కవికంఠాభరణము అలంకార శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు

మమ్మటుడు

ఇతడు ‘కావ్యప్రకాశ’ గ్రంథకర్త

యావద్భారత దేశంలో కావ్యప్రకాశకు ఉన్నంత ప్రచారం మరే అలంకార శాస్త్ర గ్రంథానికి లేదు. ఇది రచించబడిన నాటి నుండి నేటి వరకు దీని ఇంత ప్రసిద్ధి ఉంది. మమ్మటుడు నూతనంగా ఆవిష్కరించిన సిద్ధాంతాలేమీ లేవు. అయితే అలంకార శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ నియమబద్ధమైన రీతిలో ఒకచోట చేర్చి కూర్చి ప్రప్రథమంగా ఒక సమగ్రమైన అలంకార శాస్త్ర గ్రంథం అందించిన ఘనత మమ్మటునకే దక్కింది.

ఉద్భటుడుకావ్యాలంకార సార సంగ్రహ

తరువాత లల్లాదేవి అనే సంస్కృత కవయిత్రి అయిన యోగిని గురించి చెప్పుకోవాలి.

లల్లేశ్వరి, లల్లాదేవి, లాల్ దీదీ, లల్ల యోగీశ్వరీ అని పిలువబడే 14వ శతాబ్ది కాశ్మీర్ కి చెందిన స్త్రీమూర్తి. కాశ్మీర్ ప్రజల ప్రేమాభిమానాలు పొందిన ఒక యోగిని. ‘త్వమేవాహం’ అనే మంత్రం తో అందర్నీ మంత్ర ముగ్ధులను చేసింది. ఆమె చెప్పిన కవితా ఖండికలను ‘లల్ల వాక్యాని’ అంటారు. భక్తి తన్మయత్వంలో పాడుతూ నాట్యం చేస్తూ తిరిగేది. ఆమె చెప్పిన ‘లల్ల వాక్యాని’ అతి ప్రాచీన కాశ్మీర సంస్కృత భాషలో ఉంటుంది. ఆమె కవిత్వంలో అనేక సామెతలు, నుడికారాలు దొర్లి ప్రవహించాయి.

తరువాత కుమారజీవుడు అనే మహాయాన బౌద్ద పండితుడు

కుమారజీవుడు మధ్య ఆసియా నగర రాజ్యమైన కూచా (Kucha) లో జన్మించిన సుప్రసిద్ధ బౌద్ధ సన్యాసి.. తన తొమ్మిదవ సంవత్సరం నుండే తల్లితో కలసి దేశాలు పర్యటిస్తూ, కాశ్మీర్, కాష్గర్, కూచా లలో బౌద్ధ సిద్ధాంతాలు అభ్యసించాడు. కుమారజీవుడి తండ్రి స్వస్థలం అయిన కాశ్మీర దేశం. కాశ్మీరులో ప్రసిద్ధ బౌద్ధాచార్యుడు అయిన ‘బందుదత్తు’ని వద్ద సంస్కృతం అభ్యసించాడు. స్థవిరవాదుల సంప్రదాయానికి చెందిన దీర్ఘ, మధ్యమ, ఖుద్దక ఆగమాలను నేర్వడమే కాకుండా భారతీయ వైద్యం, ఖగోళం, జ్యోతిషం, తర్కం, గ్రంథ వివరణ, వ్యాఖ్యాన రీతులలో ప్రావీణ్యం సంపాదించాడు. చైనా చక్రవర్తి కోరిక మేరకు ప్రామాణిక బౌద్ధ గ్రంథాలను పాళీ, సంస్కృత భాష ల నుండి చైనా భాషలోనికి అనువదించే బృహత్తర కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. 12 సంవత్సరాల పాటు నిర్విరామ కృషి చేసి 74 బౌద్ధ గ్రంథాలను చైనా భాష లోనికి అనువదించి చైనీయులకు నిజమైన బౌద్ధతత్వాన్ని పరిచయం చేసాడు. కుమారజీవుని చైనా అనువాదాలనుండే ఇంగ్లిష్ భాషలతోపాటు జపాను లాంటి ఇతర ప్రపంచ భాషల్లో ప్రామాణిక బౌద్ధ గ్రంథాలు అనువదించబడ్డాయి.

తెలుగులో కస్తూరి మురళీ కృష్ణ గారు రచించిన ‘ఉజ్జ్వల భారత మహోజ్వల గాథల’లో మొదటి కథ కుమారజీవుడి గురించి ప్రస్తావిస్తుంది.

కల్హణ ‘రాజ తరంగిణి’.

చివరగా కాశ్మీరులో సాహిత్యం గురించి చెప్పుకోవలసిన, అతి ముఖ్యమైనది, కల్హణుడు సంస్కృతంలో రచించిన కావ్యము ‘రాజ తరంగిణి’. కల్హణుడు కాలగమనంలో వచ్చి పోయే రాజులను, సమాజాలను తరంగాలుగా, కాల ప్రవాహాన్ని తరంగిణిగా చెబుతూ కాశ్మీర రాజుల చరిత్రను ఒక ప్రవాహంతో పోల్చాడు.

కల్హణుడు 11వ శతాబ్దంవాడు. ఈనాటి చరిత్రకారులకే మాత్రం తీసిపోకుండా అనేక పరిశోధనలు చేసి, శిలాశాసనాలు తవ్వి, సేకరించి 7836 శ్లోకాలలో రాజతరంగిణిలో పొందుపరచాడు.

కల్హణుడు. నిజాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, ఉన్నదున్నట్టు తన రచనల్లో ప్రతిబింబించాడు. ఈయనకు ఏ రాజాశ్రయం లేదు.

దీనిని ఆధారంగా చేసుకుని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ‘కాశ్మీరరాజచరిత్ర’ అనే ఆరు నవలలు రచించారు.

పిలకా గణపతి శాస్త్రి గారు రచించిన నవల ‘కాశ్మీర పట్టమహిషి’ కల్హణ ‘రాజ తరంగిణి’ని ఆధారం చేసుకుని వ్రాయబడిన నవల.

కల్హణుడి తరువాత ఆ రాజతరంగిణి రచనను కొనసాగించిన వారు – జోనరాజు, శ్రీ వరుడు, ప్రజ్ఞా భట్టు, శుకుడు.

ఈనాడు ఈ రాజతరంగిణి రచనను తెలుగులో సంచిక అంతర్జాల పత్రికలో కస్తూరి మురళీ కృష్ణ గారు ఒక ధారావాహికగా అందిస్తున్నారు

ఇక జోనరాజ విరచిత జైన రాజ తరంగిణి

జోనరాజు అనే పండితుడు సుల్తాన్ జైనులాబిదీన్ ఆదేశం వలన ఈ రాజ తరంగిణి రచనను చేపడతాడు. కానీ కల్హణుడి రాజ తరంగిణిలాగా కాకుండా జోనరాజుకు తన రచన పరిధిలో పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే వేరే ధర్మానికి చెందిన రాజు ఆస్థానంలో, ఆ రాజు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఆ రాజుకి ఎలాంటి కోపం రాకుండా కల్హణుడిలాగా కాకుండా నిజాలను మసిపూసి మారేడు కాయ చేసినట్టు రాయాల్సి ఉంటుంది.

జోనరాజు → సికందర్ బుత్‌షికన్, జైనులాబిదీన్ సుల్తానులకు సమకాలీనుడు.

అందుకే ఈ రాజ తరంగిణి, మతాన్ని ఆధారంగా చేసుకుని సికందర్ బుత్‌షికన్ లాంటి ఇస్లాము సుల్తానులు కాశ్మీరులపైన చేసిన ఘాతుకాలు చెబుతుంది.

సికందర్ బుత్‌షికన్ ఎన్నో గ్రంథాలని తగులబెట్టాడు. దేవాలయాలను ధ్వంసం చేసాడు. అతడు చేసిన మారణకాండలో తెగిపడిన బ్రాహ్మణుల జంధ్యాలు దాదాపుగా ఈనాటి బరువు లెక్కల్లో 260 కేజీలు ఉండచ్చని చెప్పాడు. అంటే ఎంత బ్రాహ్మణుల తలలు తెగిపడ్డాయో అర్థం చేసుకోవచ్చు.

జోనరాజ రాజ తరంగిణి లో కొన్ని ఉదాహరణలు

  1. ఎలాగైతే మత్త గజాలు కన్నుమిన్ను కానక సరోవరాన్ని అల్లకల్లోలం చేసి బురదమయం చేస్తాయో అలాగే మ్లేచ్చులు కాశ్మీరాన్ని అల్లకల్లోలం చేసి ప్రజలను భయభ్రాంతులను చేశారు.
  2. కాశ్మీరం సంపూర్ణంగా రాక్షసులకు హస్తగతం అయ్యింది.

ఇలా ఈ విధంగా ఒక నరమేధాన్ని అధ్యయనం చేసి తన రచనలో ప్రదర్శించిన తొలి వ్యక్తి జోనరాజు. ఈ నరమేధాన్ని ఎంత నర్మగర్భితంగా, ఎంత అంతర్లీనంగా ప్రదర్శించాడు అంటే, ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ అర్థం కాదు.

‘జైనులాబిదీన్ పాలనా కాలానికి కాశ్మీరులో మిగిలింది కేవలం 11 ఇస్లామేతర కుటుంబాలు మాత్రమే’ అంటాడు జోనరాజు.

కాశ్మీరమంతా ధ్వనించిన వేదఘోషలు, శివ భజనలు, శివ స్తోత్రాలు, విష్ణుమంత్రాలు సర్వం గాలిలో కలిసిపోయాయి. ఒక ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, ఉజ్జ్వలమైన గతాన్ని సమూలంగా నాశనం చేసిన విషయాలను జోనరాజు నిక్కచ్చిగా కాక మార్మికంగా, నిగూఢంగా చెప్పాక కూడా ‘కాశ్మీరు భారతదేశంలోని అంతర్భాగమా కాదా’ అన్నమాట నేను ప్రత్యేకంగా వివరించనక్కర్లేదనే అనుకుంటున్నాను.

నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.

References

కుమారజీవుడు

https://collectingmoments.in/kashmir-the-land-of-rishis-part-2-history/

లల్లాదేవి

శారదా పీఠం

పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ముందుమాట

https://pragyata.com/the-wonder-that-was-kashmir/

https://sanchika.com/

Exit mobile version