గ్రామే పురేథ నగరే ప్రాసాదోన కశ్చన్। హర్షరాజ తురుష్కేణ నయో నిష్కృతిమీకృతః॥ (కల్హణ రాజతరంగిణి 7, 1095)
హర్షుడు దిగజారటం వేగవంతమైంది. దేవాలయాల ధనంపై కళ్లు పడటంతో హర్షుడు నీచాతినీచంగా ప్రవర్తించటం ఆరంభించాడు. రాత్రిళ్లు యువతులు, ఉదయం పూట తప్పుదారి పట్టించే స్వార్థపరులైన సలహాదార్లు హర్షుడిని సంపూర్ణంగా దిగజార్చారు. దేవాలయాల ధనాన్ని కొల్లగొట్టటంలో, విగ్రహాలను ధ్వంసం చేయటంలో తురుష్కుడిలా ప్రవర్తించాడు హర్షుడు. అందుకే హర్షుడిని ప్రజలు ‘తురుష్క హర్షుడు’ అనటం ప్రారంభించారు. ఏ ప్రజలయితే, హర్షుడు రాజు అయినప్పుడు సంబరాలు చేసుకున్నారో, హర్షుడికి నీరాజనాలు పట్టారో, ఆ ప్రజలే ఇప్పుడు హర్షుడిని తీవ్రంగా దూషించటం ప్రారంభించారు. హర్షుడి దుష్కృత్యాలు వివరిస్తుంటే అసహ్యం కలుగుతుంది. బాధ కలుగుతుంది. ఆ కాలంలో ప్రజలు హర్షుడిని ఎలా భరించారో, వారెంతగా వేదనను అనుభవించారో ఊహకందదు. తురుష్క ప్రభావంతో హర్షుడు జరిపిన దుశ్చర్యలను రాస్తుంటేనే చేయి వణుకుతుంది. ఒక వ్యక్తి ఇంత నీచంగా, ఇంత క్రూరంగా, ధూర్తుడిలా వ్యవహరించటం ఊహకందని విషయం. ఎంత పాపం చేసుకుంటే, ఇలాంటి ప్రభువులు గద్దెనెక్కుతారనిపిస్తుంది. పండితుడు, కవి, గాయకుడు అయిన హర్షుడు ఇలా దిగజారటం పట్ల అడుగడుగునా కల్హణుడు బాధను వ్యక్తపరుస్తూనే ఉంటాడు.
దేవాలయాల ధనాన్ని కొల్లగొట్టటానికి, విగ్రహాలను ధ్వంసం చేసి ధనంగా మార్చటానికి హర్షుడు ‘ఉదయరాజు’ అనేవాడిని మంత్రిగా నియమించాడు. ఆ మంత్రికి ‘దేవాత్పాటన నాయకుడు’ అని నామకరణం చేశాడు. ఇతడి పని విగ్రహాలను పడగొట్టి దేవాలయాలను దోచటమే! నగ్న సన్యాసులతో విగ్రహాలపై విసర్జింప చేసేవాడు. విగ్రహాలను కట్టెలను దొర్లించినట్లు దొర్లించేవారు. విగ్రహాలపై పూలు వెదజల్లే బదులు, ఉమ్మించేవాడు. తాళ్ళతో లాగించేవాడు. గ్రామంలో, నగరంలో శ్రీనగరంలో తురుష్క హర్షుడు నాశనం చేయించని మందిరం లేదని అంటాడు కల్హణుడు. రణస్వామి, మార్తాండ మందిరాలు తప్ప, మిగతా మందిరాలన్నింటినీ హర్షుడు కొల్లగొట్టాడు.
అయితే, గ్రామ ప్రజలు, కవులు, పండితులు, రాజును అభ్యర్థించటం వల్ల రెండు బుద్ధ విగ్రహాలు హర్షుడి బారి నుంచి తప్పించుకున్నాయి. శ్రీనగరానికి చెందిన గాయకుడు కనకుడు (ఇతడు చంపకుడి బంధువు. చంపకుడు కల్హణుడి తండ్రి), శ్రమణుడు కుశాలశ్రీ అభ్యర్థన మేరకు ఈ రెండు బుద్ధ విగ్రహాలను హర్షుడు తాకలేదు.
అత్యంత దిగజారుడుతనం, నైచ్యం నలువైపుల తాండవిస్తున్న సమయంలో భారతీయ ధర్మంలోని పరమత సహనానికి అత్యున్నత నిదర్శనం ఇది. ఓ వైపు ‘తురుష్క హర్షుడు’ ఏ దేవాలయాన్ని విడవకుండా ధ్వంసం చేసి దోచుకుంటున్నాడు. మరో వైపు బుద్ధుడి విగ్రహాలను మాత్రం తాకకూడని అభ్యర్థించి, వాటిని కాపాడుకున్నారు. ఎంతటి ఔన్నత్యం ఇది! చరిత్ర రచయితలు తురుష్క హర్షుడి తుచ్ఛ ప్రవర్తనను చూపి “దేవాలయాలను దోచటం, ధ్వంసం చేయటం భారతీయులకు అలవాటే” అని వ్యాఖ్యానిస్తారు. భారతదేశంపై దాడి చేసిన తురుష్కులు మందిరాలను కూలగొట్టి, వారి ప్రార్థనాలయాలయిన మసీదులను నిర్మించారు అనగానే భారతీయ రాజులూ అదే పని చేశారు అని తురుష్క హర్షుడిని, ఆయన ఏర్పాటు చేసిన ‘దేవాత్పాటన నాయకుడ’నే మంత్రిత్వశాఖల వైపు వేలు చూపుతారు. కానీ హర్షుడిని కశ్మీరు ప్రజలు తురుష్క హర్షుడన్న పేరుతో దూషించేవారన్న విషయం గమనిస్తే, హర్షుడి చర్యలు ప్రజలకు ఎవరిని గుర్తుకు తెచ్చాయో అర్థమవుతుంది. అంటే, భారతీయులకు ‘అలవాటే’ అంటున్న ప్రవర్తన ఎవరి ప్రవర్తనో, ప్రజలు అలాంటి ప్రవర్తనను ప్రదర్శించిన వారిని ఎవరిగా భావిస్తారో సులభంగా బోధ పడుతుంది. ఇలాంటి దుష్ప్రవర్తన భారతీయులకు అలవాటయినది కాదు, వేరే వారిని చూసి నేర్చుకున్నది అనీ స్పష్టమవుతుంది. అయితే చరిత్ర రచయితలు తురుష్క హర్షుడి ప్రవర్తనను భారతీయులకు అలవాటయిన ప్రవర్తనగా నమ్మించాలని ప్రయత్నిస్తారు కానీ, భారతీయులకు అలవాటయిన ‘పరమత సహనాని’కి చక్కటి దృష్టాంతం అయిన బుద్ధ విగ్రహాలను రక్షించిన విషయం ప్రస్తావించరు.
దేవాలయాల నుంచి దోచుకుంటున్న ధనం సరిపోక హర్షుడు ప్రజలపై విపరీతంగా విచక్షణారహితంగా పన్నులు విధించాడు. చివరికి మానవ విసర్జితాలపై కూడా పన్ను విధించాడు హర్షుడు.
ఇక హర్షుడి అమ్మాయిల పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. అతడి చుట్టూ చేరిన దుష్టులు అతడిలోని వికృత లైంగిక ప్రవృత్తిని రెచ్చగొట్టేవారు. దాంతో కనపడిన ప్రతి అమ్మాయి కోసం ఆశపడేవాడు, తపించిపోయేవాడు. చివరికి కర్ణాటక ప్రభవు ‘పర్మాండి’ భార్య చిత్తరువు చూసి మోహించాడు. ఆమెని సంపాదించటం కోసం కర్ణాటకపై యుద్ధం చేయాలని ఆలోచించాడు. ప్రగల్భాలు పలికాడు. అతడి చుట్టూ చేరిన వందిమాగధులు రాజును ఎగదోశారు, పొగిడేవారు. తనని పొడిగిన వారికి, బహుమతులు ఇచ్చేవారికి పదవులు కట్టబెట్టేవాడు హర్షుడు. అంతవరకూ దుష్టులయినవారు రాజులు అయ్యారు, నీచులు రాజులయ్యారు. కానీ హర్షుడిని మించిన దుష్టుడు, నీచుడు ఎవరూ లేరని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు.
ఇక హర్షుడు ఎంతగా తన చుట్టూ చేరిన వారి ప్రలోభంలో పడ్డాడంటే వారు ఓ ముసలామెను తీసుకువచ్చి “ఈమె స్వర్గం నుంచి వచ్చిన మీ అమ్మ” అని చెప్తే, నమ్మేసి వారిపై కనక వర్షం కురిపించాడు. ఆమె చుట్టూ మహిళలను నిలబెట్టి “వీరంతా మీ అమ్మకు సేవ చేసే దేవతలు” అంటే నమ్మేసి వంగి వంగి దండాలు పెట్టే హర్షుడిని చూసి అందరూ హేళనగా నవ్వేవారు. అపహాస్యం చేసేవారు. కానీ హర్షుడికి ఇదేమీ అర్థమయ్యేది కాదు. ఎవరేం చెప్తే దాన్ని నమ్మేసేవాడు. అతని చుట్టూ చేరినవారు ఓ ద్రావకం ఇచ్చి “ఇది మిమ్మల్ని చిరంజీవిని చేస్తుంది” అని చెప్తే, నమ్మేసి, తనకు చావు లేదని విర్రవీగేవాడు. తన మూర్ఖత్వం వల్ల హర్షుడు అంతులేని చీకటి అగాధంలోకి దిగజారాడు. ఈ సందర్భంగా కల్హణుడు ఆలోచన కలిగించే వ్యాఖ్యను చేస్తాడు.
ప్రస్తుత సమాజంలో మేఘవాహనుడి గొప్పతనం, అతడు సాధించిన అద్భుతమైన కార్యాల గురించి చెప్తే నమ్మనివారు ఉన్నట్లే, హర్షుడి నీచ ప్రవర్తన, దుష్ట కార్యాల గురించి చెప్తే కూడా నమ్మని వారుంటారు అంటాడు. ఇది నిజం.
హర్షుడిని చంపాలని ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు. ఓసారి హర్షుడికి కోపం వచ్చి తన చుట్టూ ఉన్న మహిళలను, వారి ప్రేమికులను చంపించాడు. ఇలాంటి హర్షుడి ప్రవర్తనను వర్ణిస్తూ కల్హణుడు, హర్షుడి దుష్ట ప్రవర్తనకు కారణాన్ని సూచనప్రాయంగా వెల్లడిస్తాడు.
స తురుష్క శతధీషాననిశం పోషయన్ల ధవైః। నిధనావధి దుర్భుద్ధిర్భుభుజే గ్రామ్య సూకరాన్॥ (కల్హణ రాజతరంగిణి 7, 1149)
వందల సంఖ్యలో తురుష్కులను పోషిస్తూ, ధూర్తుడయిన హర్షుడు జీవించినంత కాలం, గ్రామ పందుల మాంసం తినడానికి అలవాటు పడ్డాడు. పరోక్షంగా హర్షుడిని ‘తురుష్క హర్షుడి’గా దిగజార్చిందెవరో చెప్పకనే చెప్తుందీ శ్లోకం.
తురుష్కులు పంది మాంసం తినరు. కానీ పంది మాంసం తినటం వల్ల మ్లేచ్ఛుల కన్నా దిగజారినవాడయ్యాడు హర్షుడు అని సూచిస్తున్నాడు కల్హణుడు. అంతేకాదు, కశ్మీరులో తురుష్కులకు ఆదరణ కల్పించటమే కాదు, వారిని సైన్యంలో కీలకమైన పదవులలో ఉంచేవాడు హర్షుడు అని అర్థమవుతుంది.
హర్షుడు కోపంతో రాజపురి రాజుపై యుద్ధానికి బయలుదేరాడు. హర్షుడి సైన్యాన్ని చూసి రాజపురి రాజు భయపడ్డాడు. యుద్ధంలో హర్షుడిని గెలవలేడు, కాబట్టి లంచగొండి అయిన హర్షుడి సేనాధిపతికి లంచం ఇచ్చాడు. ఆ సేనాధిపతి తురుష్కులు దాడికి వస్తున్నారని భయపెట్టాడు. దాంతో హర్షుడు భయంతో సైన్యం తీసుకుని శ్రీనగరం వచ్చి చేరాడు. అంటే ‘లంచం’తో హర్షుడిని ఓడించి వెనక్కు పంపాడన్న మాట. అయితే, తురుష్కులు దాడికి వస్తున్నారనగానే భయపడి పారిపోయిరావటంతో ప్రజల దృష్టిలో హర్షుడి పట్ల భయం పోయింది. చులకన అభిప్రాయం కలిగింది. ఇది హర్షుడి పతనానికి ఆరంభం అయింది. ‘ప్రతాప చక్రవర్తి’ అన్న హర్షుడి బిరుదు అపహాస్యం పాలయింది.
అక్రమంగా ధనార్జన చేసినవారు, మోసగాళ్లు, రాజుకు తమ మోసాలు తెలుస్తాయేమోనన్న భయంతో రాజు దృష్టిని మళ్ళించాలని ప్రయత్నించారు. దరదులపై రాజును యుద్ధానికి ఉసిగొల్పారు. ఈ యుద్ధంలో ఉచ్ఛల, సుస్సల అనే సోదరులిద్దరూ ఎంతో శౌర్యాన్ని ప్రదర్శించారు. వీరు సింహాసనం అధిష్టిస్తారని జ్యోతిష్యులు చెప్పారు.
కశ్మీర సైన్యం యుద్ధంలో గెలుపొందే తరుణంలో విధి అడ్డుపడింది. ఎగిరే వాడిని క్రిందకు పడేస్తుంది విధి. క్రిందపడిపోయేవాడిని లేపి శిఖరంపై నిలబెడుతుంది విధి. విధి వ్యక్తులతో బంతులాటలాడుతుంది అంటాడు కల్హణుడు.
మంచు కురవటం ప్రారంబించింది. దరదుల కోటకు రక్షణ కవచాన్నిస్తున్నట్లు మంచు దరదుల కోటను కప్పేసింది. అంతలో వర్షాలు ఆరంభమయ్యాయి. దాంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని కశ్మీర సైన్యం యుద్ధరంగం వదిలిపోయింది. పారిపోతున్న కశ్మీర సైన్యాన్ని దరదులు వెంటాడేరు. వారి నుంచి తప్పించుకునేందుకు గుడ్దిగా ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తుతున్న కశ్మీర సైన్యాన్ని దారిలోని నది మ్రింగేసింది. అయితే ఉచ్ఛలుడు, సుస్సలుడు మాత్రం దరదులను ఎదిరించి నిలబడ్డారు. అన్నిటినీ ముంచెత్తే సముద్రంలా దూసుకువస్తున్న దరదుల ప్రవాహానికి వీరిద్దరూ అడ్డుకట్ట వేశారు. ఓడిపోతున్న కశ్మీరీ సేనను విజయపథంవైపు నడిపించారు. ఆ రోజు నుంచీ కశ్మీర ప్రజలు వీరిద్దరిలో ఎవరో ఒకరు రాజుగా అవ్వాలని కాంక్షించసాగారు.
అయితే యుద్ధం గెలిచిన ఉచ్ఛలుడు, సుస్సలుడు హర్షుడిని కలవాలని ప్రయత్నించలేదు. హర్షుడు పంపిన బహుమతులు తిరస్కరించారు. దాంతో కశ్మీరమంతా వీరి ఖ్యాతి వ్యాపించింది. ప్రజలంతా ఉచ్ఛలుడిని, సుస్సలుడిని రామలక్ష్మణులని పొగడటం ప్రారంభించారు. హర్షుడిని రావణాసురుడితో పోల్చారు. కశ్మీరాన్ని రావణాసురుడి నుంచి విముక్తం చేస్తారని భావించసాగారు. అయితే, హర్షుడు ఇదేమీ పట్టించుకోలేదు. ప్రజలు తనను ద్వేషిస్తున్నారన్న విషయం పట్టనట్టే ప్రవర్తించాడు. ప్రజలపై అకృత్యాలను పెంచాడు. ప్రజలు మెచ్చే వారందరినీ పదవుల నుంచీ తొలగించటమో, సంహరించటమో చేశాదు. అంటే, రాజులు విధేయుడిగా ఉంటూ మంచి చేసేవారి కన్నా, రాజు మెచ్చే మాటలు చెప్తూ తప్పుదారి పట్టించే వారే రాజు మెప్పు పొందుతారన్న మాట.
రాజు తనకు సన్నిహితుడని భ్రమిస్తూ, రాజుకు నిజాయితీగా సేవ చేసేవారు, విషపు పాముతో స్నేహం చేస్తున్నట్టే అంటాడు కల్హణుడు. ఉదయుడనే వాడిని రాజు చంపించటంతో, అతడి అనుచరులు తిరుగుబాటు చేశారు. ప్రపంచంలో ఎన్ని దురదృష్టాలున్నాయో అవన్నీ కశ్మీరులో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి. కశ్మీరులో దొంగలు విపరీతంగా పెరిగిపోయారు. పట్టపగలు రాజభవనం నుంచి బంగారం ఎత్తుకుపోయేవారు దొంగలు. అంటువ్యాధులు కశ్మీరంలో ప్రబలాయి. దాంతో కశ్మీరం శవాలమయమై స్మశానవాటికలా అయింది. వరదలతో గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. పంటలు నాశనమయ్యాయి. ప్రజల హాహాకారాలతో కశ్మీరం ప్రతిధ్వనించింది. తిండి దొరకక ఆకలి చావులు సర్వసాధారణమయ్యాయి. బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యులు తిండి దొరకక, చెట్లపై ఆకులో, పూవులో తినాలనుకుంటే, తేనెటీగలు పూలను పాడు చేశాయి. జంతువులు పళ్ళను పాడు చేశాయి. ఉప్పు, కారం, వంటి పదాలను ప్రజలు మరిచిపోయారు. శవాలతో నదులన్నీ నిండిపోయాయి. దీనితో సంబంధం లేనట్టు రాజు ప్రజలపై పన్నులు పెంచుతూ పోయాడు.
(ఇంకా ఉంది)
కాశ్మీర్ పతనంలోని వివిధ ఘట్టాలు మనసుని కలచివేస్తున్నాయి
వెయ్యి సంవత్సరాల ముందు నుంచే కాశ్మీర ప్రజలు కాశ్మీరు ను వదిలేసి దక్షిణాపధానికి వలసవచ్చారనడానికి ఇవన్నమాట కారణాలు! ధన్యవాదాలు!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జ్ఞాపకాల పందిరి-180
కాజాల్లాంటి బాజాలు-116: చింకిచేటమొహం మిస్.
జీవన రమణీయం-103
కరనాగభూతం కథలు – 10 పిల్లికి చదువు
ట్విన్ సిటీస్ సింగర్స్-10: ‘సంగీత మహా సముద్రంలో నేనొక బిందువుని మాత్రమే….’ – శ్రీ నేమాని సూర్య ప్రకాష్ – 3వ భాగం
కలగంటినే చెలీ-3
ఎవరది..!?
డైరీ
విలువలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®