[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘కర్మఫల త్యాగమే సన్న్యాసం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 6వ అధ్యాయం, 1వ శ్లోకం ఈ కింది విధంగా వుంది.
శ్రీ భగవానువాచ:
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః।
స సంన్యాసి చ యోగీ చ న నిరగ్నిర్న చక్రీయః॥
కర్మఫలముల పట్ల ఆసక్తిని వీడి తనకు విధించిన పనులను నిర్వహించేవాడే సన్యాసి అవుతాడు. అటువంటి వారినే నిజమైన యోగి అంటారు. అంతే కాని కేవలం అగ్నిని రగిలించకుండా మరియు కర్మలను చేయకుండా వుండే వారు యోగులు కాజాలరు అని పై శ్లోకం భావం.
ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరు తమ తమ కుటుంబ పోషణ కోసమే కర్మలను చేస్తారు. తన కోసం లేక తన కుటుంబం కోసం స్వార్థం అనేది లవలేశమైనా లేకుండా పనులను చేయడం ఎవారికీ సాధ్యం కాదు. కాన శాస్త్రం తాము చేసే కర్మల యొక్క ఫలాలను ఆశింపచకుండా భగవంతుని ప్రీతి కోసమే కర్మలను చేయడమే పూర్ణత్వానికి దారి తీస్తుందని స్పష్టం చేస్తోంది. కాబట్టి మానవులందరూ కుల, మత, జాతి, లింగ బేధములు లేకుండా భగవంతుని కోసమే కర్మలను చేసి, తద్వారా వచ్చే ఫలితాలను భగవంతుని చరణాలవిందాల వద్ద సమర్పించాలి. ఇట్టి నిస్వార్థ భావన ద్వారానే భగవంతుడు ప్రీతి చెంది అట్టి భక్తులకు తగిన సమయంలో తగిన రీతిన ఫలితాలను ప్రసాదిస్తాడు.
ఇంకొక ఉదాహరణ: శరీరంలోని అంగాలన్ని తమ కోసం కాక తమను భరిస్తున్న శరీరం కోసమే పని చేస్తాయి. తద్వారా వచ్చే ఫలితం కోసం ఎన్నడూ ఆశించవు. నిస్వార్థ భావనతో తమ తమ విధులను నిర్వర్తించడమే వాటి పని. అట్లే మానవులు తమ కోసం కాక భగవంతుని ప్రీత్యర్థం కర్మలను చేస్తే అట్టి వారే పూర్ణుడైన యోగి లేదా సన్యాసి అవుతారు.
ఎవరైతే పనిచేసినా ఫలాన్ని ఆశించరు, అలా పనిచేసేవాడు నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అతడు మనస్సులో కోపం, ఆశ, చెడు ఆలోచనలు లేకుండా, తన బాధ్యతను నిస్సంకోచంగా చేస్తాడు.
ప్రపంచం కోసం బాహ్యంగా కాషాయం ధరించడం, ప్రజలకు వేదాంతాన్ని అనుభవ జ్ఞానం లేకుండా బోధించేవారిని సన్యాసిగా లేదా యోగిగా చేయవని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు.. దేవునికి తమ కర్మల ఫలాలను అర్పించడం ద్వారా వాటిని త్యజించగలవారు నిజమైన సన్యాసులు మరియు యోగులు అవుతారు.