Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్మఫల త్యాగమే శ్రేష్ఠం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘కర్మఫల త్యాగమే శ్రేష్ఠం’ అనే రచనని అందిస్తున్నాము.]

గవద్గీత 12 వ అధ్యాయము( భక్తియోగం) 12వ శ్లోకం:

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే।

ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్॥

యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది; జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్ఠమయినది. ధ్యానము కంటే కర్మఫల త్యాగము మెరుగైనది, ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభిస్తుందని భగవానుడు పై శ్లోకం ద్వారా సాధకులకు స్పష్టం చేస్తున్నాడు.

సర్వ కర్మఫల త్యాగం మనసా వాచా కర్మణా అమలులో పెట్టినప్పుడు ఫలితాలపై మనకు దృష్టి పోతుంది. ఇచ్చేవాడు, ఇప్పించేవాడు, మన సర్వ కర్మలకు ఫలితాలను ఇచ్చేవాడు భగవంతుడేనన్న స్పృహ కలిగి ఫలితాలపై కాక చేసే పనుల మీదనే మన దృష్టి నిలిస్తుంది. కర్మ సూత్రం ప్రకారం మనం పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఫలితం వచ్చి తీరుతుంది. ఆ వచ్చే ఫలితం మీదనే దృష్టి పెట్టి వస్తుందా? రాదా? అనుకున్నంతగా వస్తుందా? తక్కువగా వస్తుందా? అని ఆలోచిస్తూ ఉంటే చేసేపని మీద శ్రద్ధ ఉండదు. అందువల్ల నైపుణ్యంగా పనులు చేయలేము. అలాకాకుండా వచ్చే ఫలితాన్ని గురించి పట్టించుకోకుండా, దానిమీద ఏమాత్రం ఆసక్తి లేకుండా శ్రద్ధగా, కర్తవ్య భావంతో, తన విద్యుక్త ధర్మంగా కర్మలు చేస్తుంటే ఆ కర్మలు సక్రమంగా జరుగుతాయి, పనిలో నైపుణ్యం కూడా ఉంటుంది. కనుక కర్మఫలాలను భగవంతునికి అర్పించాలి అని భగవంతుడు పై శ్లోకం ద్వారా మావనాళికి హితబోధ చేసాడు.

“ఎవరైతే తమ క్రియల ద్వారా వచ్చే ఫలితాల మీద (కర్మఫలం మీద) ఆధారపడకుండా తన విద్యుక్త ధర్మాన్ని ఆచరిస్తారో వారే సన్యాసులు, యోగులు. వారు త్యజించేది కర్మఫలాన్ని తప్ప కర్మను కాదు” అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. అంతే అన్ని విధానాలలో కెల్లా కర్మఫల త్యాగమే శ్రేష్ఠమని అర్ధమవుతోంది కదా.

సన్యాసి కర్మఫలాన్ని త్యజిస్తాడు తప్ప కర్మను కాదని శ్రీకృష్ణుడు చెప్పాడు. పూర్తిగా కర్మను మానేస్తే బాధ ఉండదు, పాపం ఉండదు అని కొందరు కర్మలను త్యాగం చేయదమే మంచిదని భావిస్తుంటారు కాని మానవాళి తమ ధర్మం నిర్దేశించిన నిత్య నైమిత్తిక కర్మలను తప్పక చేయాలి. కర్మ చెయ్యాలి, కర్మ ఫలం గురించి ఆలోచన వదిలెయ్యాలి అనే శ్రీకృష్ణుడి సూచనను అనుసరించి కర్మలను త్యజించడమే మేలన్న భావనను వదిలించుకొని త్రికరణశుద్ధితో కర్మలను ఆచరిస్తూ కర్మఫలత్యాగ భావన ద్వారా కర్మల ఫలితాలపై ఆసక్తిని పెంచుకోకుండా వాటిని భగవానుని పాదాల వద్ద అర్పితం చేయడమే శ్రేష్ఠం.

హానికారకమైన ఫలాసక్తిని త్యజించడమే నిజమైన త్యాగం. కర్మఫలాలపై అపేక్ష లేనప్పుడు సాధన ముందుకు సాగుతుంది. భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. సర్వోన్నత లక్ష్యం సిద్ధిస్తుంది.

Exit mobile version