అర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిబ్బటీనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! పౌరుల పట్ల శ్రద్ధతో వారి సంక్షేమం కోసం సగం నిద్రలో లేచి నా వద్దకు వచ్చావు. వారి స్వేచ్ఛ గురించి కూడా ఇదే శ్రద్ధతో ఆలోచించి ఉంటే నీకిప్పుడీ అవస్థ ఉండేది కాదేమో! ఏది ఏమైనా ఇప్పుడు నేను చెప్పే కథను మాత్రం శ్రద్ధగా విను. లేకుంటే నీ శ్రమంతా వృథా ఔతుంది” అంటూ కథ చెప్పసాగింది.
అనగనగా ఓ ఊళ్లో శ్రీనాథుడనే భాగ్యవంతుడికి ఒక్కగానొక్క కొడుకు చినబాబు. ఎండ కన్నెరక్కుండా, కష్టమంటే తెలియకుండా పెరిగి ఇరవైఏళ్లవాడయ్యాడు.
ఆ ఊళ్లోనే రామయ్యనే పేదరైతుకి ఐదుగురు పిల్లల్లో రెండోవాడు పిచ్చయ్య. ఉన్ననాడు తింటూ, లేనినాడు పస్తులుంటూ, సుఖమంటే తెలియకుండా ఇరవైఏళ్లవాడయ్యాడు.
ఐదేళ్లుగా పిచ్చయ్య చినబాబింట్లో సేవకుడు. పగలంతా చినవాబుని అంటిపెట్టుకునుండి, సేవలు చేస్తాడు. అంతలా కలిసున్నా వాళ్లమధ్య స్నేహభావం లేదు. పిచ్చయ్యకు చినబాబు దేవుడు. చినబాబుకి పిచ్చయ్య పని చేసే యంత్రం.
ఒకరోజున చినబాబు చూసుకోకుండా అరటిపండు తొక్కమీద కాలేసి జారిపడ్డాడు. లేచి నిలబడలేకపోతే, పక్కనున్న పిచ్చయ్య ఎత్తుకునెళ్లి మంచంమీద పడుకోబెట్టాడు. వైద్యుడొచ్చి చూసి, “కాలు బెణికింది. నొప్పి తగ్గడానికి లేపనం ఇస్తాను. పగలు మూడు సార్లూ, రాత్రి మూడుసార్లూ కాలుమీద పూస్తుంటే మూడ్రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఆ మూడ్రోజులూ మంచం దిగొద్దు” అని చెప్పి ఓ లేపనమిచ్చి వెళ్లాడు.
ఇదంతా పిచ్చయ్య అజాగ్రత్తవల్లనేనని శ్రీనాథుడికి కోపమొచ్చింది. ఆయన వాడితో, “ఈ మూడ్రోజులూ ఇంటికెళ్లకు. దగ్గిరుండి చినబాబుని కనిపెట్టుకునుండు. బాబు మంచం దిగేదాకా నీకు మంచినీళ్లొక్కటే ఆహారం” అన్నాడు.
చినబాబు మంచంమీదున్నా మూడుపూటలూ తినేవాడు. పక్కనే ఉన్న పిచ్చయ్యకు నోరూరేది. మొదటి రోజు ఏమనలేదు కానీ రెండో రోజున కొంచెం పెట్టమని అడిగాడు. చినబాబు పెట్టలేదు. మూడోరోజున పిచ్చయ్య ఆకలికి తట్టుకోలేక, తనకీ కొంచెం పెట్టమని కాళ్లావేళ్లా పడ్డాడు. చినబాబు చీదరించుకున్నాడే తప్ప పెట్టలేదు.
అలా చెయ్యని తప్పుకి శిక్షగా మూడ్రోజులు ఆకలితో నరకబాధ అనుభవించినా, నాలుగో రోజునుంచి మళ్లీ మామూలుగానే చినబాబుని సేవించుకుంటున్నాడు పిచ్చయ్య.
ఆ ఊరికి పక్కనే దట్టమైన అడవి ఉంది. అందులో కబళుడనే రాక్షసుడున్నాడు. వాడికి మంత్రతంత్రాలు తెలుసు కానీ నియమనిష్ఠలు పాటించే దైవభక్తి కూడా ఉంది. తిండిపోతే కానీ, జంతువుల్నే తప్ప మనుషుల్ని తినడు. వాడికి నాల్రోజుల క్రితం కడుపునొప్పి వచ్చింది. పాతాళలోకానికెళ్లి రాక్షసవైద్యుడికి తన బాధ చెప్పుకున్నాడు.
వాడికెలాగైనా నరమాంసాన్ని అలవాటు చెయ్యాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడా వైద్యుడు. ఇదే మంచి సమయమని, “జంతుమాంసం తేలిగ్గా అరగదు. అందుకే ఈ కడుపునొప్పి. నరమాంసం తేలిగ్గా అరుగుతుంది. అందులో రాక్షసులకి మేలు చేసే ఔషధాలున్నాయి. వెంటనే వెళ్లి ఇరవైఏళ్ల వయసున్న ఇద్దరు యువకుల్ని ఒక్కసారిగా తినేసేయ్. నొప్పి చేత్తో తీసినట్లు మాయం కాకపోతే నన్నడుగు” అన్నాడు. ఒకసారి నరమాంసానికి అలవాటు పడితే, ఇక వదలడని ఆ వైద్యుడి నమ్మకం.
కబళుడా మాటలు నమ్మాడు. అదృశ్యరూపుడై వెళ్లి అడవి పక్కనున్న ఊరంతా తిరిగాడు. శ్రీనాథుడింట్లో చినబాబు, పిచ్చయ్య వాడి కళ్లబడ్డారు. వెంటనే వాళ్ల రూపాల్ని చిటికెన వేలంత చేసి అడవిలోకి ఎత్తుకెళ్లాడు. ఓ చెట్టుకింద కూర్చుని వాళ్లని మళ్లీ మామూలు మనుషుల్ని చేశాడు.
అప్పుడు కనబడ్డ పర్వతాకారుడైన కబలుణ్ణి చూసి చినబాబు, పిచ్చయ్య మూర్ఛపోయారు. కబళుడు వాళ్లకు తగిన ఉపచారాలు చేశాడు. ఇద్దరూ మూర్ఛనుంచి తేరుకుని, ఎదుట మళ్లీ రాక్షసుడు కనబడగానే భయంతో కెవ్వుమన్నారు.
“భయపడకండి. నేను దుర్మార్గుణ్ణి కాను. జంతువునైనా నొప్పి తెలీకుండా చంపి తినడం నా ప్రవృత్తి. తినడానికే నేను మిమ్మల్నిక్కడికి తెచ్చాను. మీకు చావు తప్పదు. చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పండి. తీరుస్తాను” అన్నాడు కబళుడు.
అన్ని కోరికలూ ఇంట్లో తీరుతున్న అదృష్టవంతుడు చినబాబు. అందుకని ఏమడగాలో అతడికి తెలియలేదు. పిచ్చయ్య మాత్రం వెంటనే, “జీవితంలో ఎన్నడూ కడుపునిండా తిని ఎరుగను. ఒక్కరోజు మూడుపూటలా కడుపునిండా తినాలనుంది” అన్నాడు.
కబళుడు ఆశ్చర్యంగా, “ఇది చాలా చిన్న కోరిక. దీన్నిప్పుడే తీర్చగలను” అన్నాడు.
పిచ్చయ్య తల అడ్డంగా ఊపి, “ఇప్పటికీ రోజులో సగభాగం పైనే ఐపోయింది. రేపైతే రోజంతా కడుపునిండా తినొచ్చు. కానీ రేపు ఏకాదశి. పుణ్యదినం. ఉపవాసం ఉండాలని మా ఇంట్లో నియమం. చావుకి ముందు ఆ నియమాన్ని భంగం చెయ్యడం నాకిష్టంలేదు. కాబట్టి ఎల్లుండికి నా కోరిక తీర్చు. ఆ మర్నాడు నన్ను భుజించు” అన్నాడు.
ఏకాదశి అన్న మాట వినగానే కబళుడు ఉలిక్కిపడి, “ఔనూ, ఏకాదశి పుణ్యదినమని నేనూ ఆ రోజు పరమశివుడికి అర్చన చేస్తుంటాను. కానీ ఉపవాసం ఉండాలని తెలియదు. ఈసారికి నీతోపాటు నేనూ ఉపవాసముంటాను” అన్నాడు.
వాళ్లలా మామూలుగా మాట్లాడుకుంటుంటే, చినబాబు మాత్రం భయంతో నోట మాట రాక బిక్కచచ్చి కూర్చున్నాడు. అది గమనించిన పిచ్చయ్య, “అయ్యా! మనం కలిసి ఉపవాసం, శివార్చన కూడా చేద్దాం. కానీ మా చినబాబు ఆకలికి ఆగలేడు. తిండి లేకపోతే మూడోరోజు దాకా బ్రతకడు. కాబట్టి అందాకా అతడికి చక్కని విందు ఏర్పాటు చెయ్యి” అన్నాడు. కబళుడు సరేనని అలాగే చేశాడు.
ఆ తర్వాత ఓ విచిత్రం జరిగింది. ఏకాదశి నాడు ఉపవాసం చేసిన మర్నాటికి కబళుడి కడుపునొప్పి చేత్తో తీసినట్లు మాయమైంది. వాడెంతో సంతోషించి, “ఏకాదశీ ఉపవాసఫలితంగా నా కడుపునొప్పి తగ్గిపోయింది. ఇకమీదట ఇలాగే పుణ్యదినాల్లో ఉపవాసం చేస్తాను. నేనిక నరమాంసం తినక్కర్లేదు” అన్నాడు. అంతేకాదు, కోరినప్పుడల్లా కోరిన ఆహారాన్నిచ్చే అక్షయపాత్రని పిచ్చయ్యకు కానుకగా ఇచ్చి, వాళ్లిద్దర్నీ ఊరి పొలిమేరల్లో విడిచిపెట్టాడు.
కొండచిలువ ఈ కథ చెప్పి, “కబళుడి కడుపునొప్పికి కారణం అజీర్ణమనీ, ఉపవాసంతో అది తగ్గిపోయిందనీ తెలుస్తూనే ఉంది. కానీ పిచ్చయ్య పద్ధతే నాకు అయోమయంగా ఉంది. ఓ రోజంతా కడుపునిండా తిని అప్పుడు చావాలని కదా వాడి కోరిక. ఎన్నాళ్లుగానో తిండికి మొహంవాచి ఉన్న వాడు వెంటనే ఆ కోరిక తీర్చుకోక, రెండ్రోజులకి ఎందుకు వాయిదా వేశాడు? పోనీ ఈలోగా ఏదైనా అద్భుతం జరగొచ్చని ఆశ పడ్డాడనుకుందాం. మరి ఈలోగా, దుర్మార్గుడైన చినబాబుకి విందు ఏర్పాటు చేశాడెందుకు? ఆకలితో మాడే తనకు ఎంగిలిమెతుకైనా విదపకుండా వాడు సుష్టుగా తిన్న విషయం మరిచాడా? పోనీ అప్పుడు తప్పలేదు. కానీ ఇప్పుడు తను ఉపవాసమున్న రోజు తన కళ్లముందే కడుపారా తింటున్న చినబాబుని చూసి భరించాల్సి రావడం స్వయంకృతం కాదా? ఈ సందేహాలకి సరైన సమాధానం తెలిస్తే చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నేను నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.
దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “ఎవరి వ్యవస్థకు లోబడి వారు పనిచెయ్యడం దుర్మార్గం కాదు. అందుకని ఈ కథలో అంతా మంచివాళ్లే. మనుషుల్ని తినడం రాక్షస వ్యవస్థ. రాక్షస వైద్యుడు దాన్ని ప్రోత్సహించాడు. ఆ వ్యవస్థ మారాలంటే మనుషులు తిరగబడాలి. లేనివాళ్లని హింసించడం ధనస్వామ్య వ్యవస్థ. అది మారాలంటే లేనివాళ్లు తిరగబడాలి. లేకుంటే చినబాబువంటి వాళ్లకి లేనివాళ్లు మనుషులని కూడా అనిపించదు. ఇక పిచ్చయ్య విషయానికొస్తే, వాడికి తెలిసిందొక్కటే! చినబాబుకి ఆకలి అంటే ఎలాగుంటుందో తెలియదు. అందుకని అతడికి పిచ్చయ్య ఆకలి బాధ తెలియలేదు. పిచ్చయ్యకి ఆకలి బాధ తెలుసు. అందుకని వాడు అతడి ఆకలి తీరే ఏర్పాటు చేశాడు. తనకి ఉపవాసాలు అలవాటే కాబట్టి చావుని మరి రెండ్రోజులకి వాయిదా వేస్తే, ఏమైనా అద్భుతం జరగొచ్చన్న ఆశతో కబళుడికి తన ఉపవాసదీక్ష గురించి చెప్పి ఉంటాడు. అతడి ఆశ ఫలించింది కూడా!”
అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.
(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం రెండవ కథ)
You must be logged in to post a comment.
నవ్వేజనా సుఖినోభవంతు -5: ఆన్ ది వే…
ఆక్రందన
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-15
వరాలు-3
నీదో, నాదో.. పై చేయి
చావా శివకోటి మినీ కవితలు 2
వైద్యో నారాయణో హరి
ఎల్లీశా
మనసులోని మనసా-32
జ్ఞాపకాల తరంగిణి-32
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®