[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘కన్యాశుల్కం నాటకంలో ఆనాటి దేశ రాజకీయాలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
దేవుడికి వందనం అనే స్థితి నుంచి, దేశానికి వందనం అనే స్థాయికి భారతీయులను మళ్లించినవాడు బంకించంద్ర చటర్జీ. దేశమంటే మట్టికాదనీ, మనుషులనీ అంటూ, తన దేశభక్తి గీతం ద్వారా స్వదేశీ బావనను రగిలించి తెలుగు జాతికి దిశానిర్దేశం చేసిన వాడు గురజాడ.
1905లో మొత్తం దేశాన్ని కదిలించి వేసిన వందేమాతరం ఉద్యమం లోంచే స్వదేశీ ఉద్యమం పుట్టింది.
“జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయి” అనే వాక్యాలు గురజాడ స్వదేశీ ఉద్యమానికి తార్కాణాలు.
“నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోషపెట్టడానికైనా వొదులుకోలేను” అని తన డైరీలో 1911 మార్చి, 27న గురజాడ రాసుకొన్న మాటలు ఆయనను నవయుగ నిర్మాతగా భాసిల్లచేశాయి.
“విద్యలనెరయ నించిన యాంగిలేయులు” (1912) అనీ, “కన్నుకానని వస్తుతత్త్వము కాంచనేర్పరు లింగిరీజులు; కల్ల నొల్లరు; వారి విద్యలకరచి సత్యము నెరసితిన్” అనీ ఆంగ్లేయులను గురజాడ ప్రశంసించినప్పటికీ, ఆంగ్లేయ సంస్కృతి పట్ల ఆయన విముఖతనే ప్రదర్శించారు.
“పాశ్చాత్య నాగరికత కొన్ని అంధ విశ్వాసాలను పోగొట్టుతున్న మాట యథార్థమే అయినప్పటికీ, అది ప్రబోధించే స్వాతంత్ర్యము సాంఘిక ప్రగతి శూన్యమైనది. ఇది సంపూర్ణ స్వాతంత్ర్యము కాదు, నామ మాత్రమైనది.” (గురజాడ డైరీ-1901, పుట215/సం: అవసరాల).
“శతాబ్దాల తరబడి రాజకీయ బానిసత్వం వలన మరుగు పడి ఉన్న ఉదాత్త జాతీయ మనః ప్రవృత్తిని విద్యావంతులైన హిందువులకు బహిర్గతం చేసి, వారిలో, వారి ప్రభావానికి లోనౌతున్న వ్యక్తులలో అట్టి వృత్తినే కలిగించటానికే ఇది దోహద పడును – (గోమఠం శ్రీనివాసాచార్యులు గారి హరిశ్చంద్ర నాటకం ఇంగ్లీషు అనువాదానికి గురజాడ పీఠిక) అని స్వదేశీ ఉద్యమం గురించి చెప్పిన వాక్యాలు గురజాడ నిబద్ధతను చాటుతాయి.
గురజాడ స్వహస్తంతో వ్రాసిన ‘దేశభక్తి’ గీతం చిత్తుప్రతిలో
“నిన్నవచ్చారింగిలీషులు
మొన్నవచ్చిరి ముసల్మను; లటు
మొన్న వచ్చిన వాడ వీవని
మరచి, వేరులు బెట్టుకోకోయి” అనే చరణం ఉంది.
ఇందులో గురజాడ ప్రదర్శించిన ఆంగ్లేయానుకూలత ఏమీ లేదు. అన్ని కులాల, మతాల వారికీ దేశమే దేవత అనే భావన బలపడుతున్నదశలో అందుకు ప్రతిబంధకంగా నిలిచే వారికి చేసిన హెచ్చరిక ఇది. హిందూ శబ్దాన్ని దేశీయులనే అర్థంలో గాక, మతస్థులనే అర్థంలో ప్రయోగించి, ఈ దేశంలో అన్యమతస్థులకు తావులేదని వాదించే వాళ్ళ పైన ఇది అంటించిన చురక.
కాంగ్రెస్ సభలో తాను పాల్గొన్నట్టు రాసుకున్నారు. కానీ, కాంగ్రెస్ లోని మితవాద ధోరణులపట్ల ఆయన తన విసుగుదలని కన్యాశుల్కంలో ఎన్నో పాత్రల ద్వారా ప్రదర్శిస్తారు.
“తమ్ముడూ! గిరీశంగారు గొప్పవారష్రా?” అని బుచ్చమ్మ అడిగితే, వెంకటేశం “గొప్పవారంటే అలా యిలాగా అనుకున్నావా యేవిటీ? సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవారు” అంటాడు. “అతగాడెవరు?” అనడిగితే, వాడికి ఏం చెప్పాలో తెలియక బుర్రగోక్కుని, “అందరికంటే మరీ గొప్పవాడు” అనేస్తాడు.
దేశాన్ని గిరీశంగారు “యెలా మరమ్మత్తు చేస్తున్నార్రా?” అనడుగుతుంది. దానికి వెంకటేశం చెప్పిన సమాధానం ఇది: “నావంటి కుర్రాళ్లకు చదువు చెప్పడం, (నెమ్మళంగా) చుట్టనేర్పడం, గట్టిగా నాచ్చి కొశ్చన్ అనగా సానివాళ్ల నందరినీ దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయించడం ఒహటి. ఇప్పుడు తెలిసిందా..?” అని!
“నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయించడం” అని అన్నది నాటకంలో ఒక బొడ్డూడని కుర్రాడే అయినప్పటికీ, అది గిరీశం అభిప్రాయంగానే కన్పిస్తుంది. అందుకే మరో సీనులో, గిరీశమే అంటాడు: “ఒక సంవత్సరం గానీ నాకు దేవుడు దివాన్గిరీ యిస్తే, బీముని పట్టణానికి పాల సముద్రం, విశాఖపట్టణానికి మంచినీళ్ళ సముద్రం, కళింగపట్టణానికి చెరకు సముద్రం తెస్తాను” అని.
ఇక్కడ దివాన్గిరీ అంటే కాంగ్రెస్ పదవి. “పొలిటికల్ మహాస్త్రం” అంటే, “ఒకడు చెప్పిందల్లా బాగుందండవే! సమ్మోహనాస్త్రం అంటే అదే కదా..!”, “ఒపీనియన్లు అప్పుడప్పుడు చేంజి చేస్తూంటే గానీ పొలిటీషియన్ కానేరడు” లాంటి సంభాషణల్లో కనిపించే ఆనాటి పొలిటీషియన్ నేషనల్ కాంగ్రెస్ వాడే! దేశంలో రాజకీయ సంస్థ ఆనాడు అదొక్కటే కాబట్టి!
“మొన్న బంగాళీవాడు ఈ ఊర్లో లెక్చరిచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ..?”
“పెళ్ళి ఆపడానికి బ్రహ్మ శక్యం కాదు. డిమాస్థనీసు, సురేంద్రనాథ్ బానర్జీ వచ్చి చెప్పినా మీ తండ్రి వినడు”
“మొన్న మనం వచ్చిన బండి వాడికి నాషనల్ కాంగ్రెసు విషయమై రెండు ఘంటలు లెక్చరు ఇచ్చేసరికి ఆ గాడిద కొడుకు, వాళ్ల ఊరు హెడ్ కానిస్టేబిల్ని కాంగ్రెసు వారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు. విలేజెస్‌లో లెక్చర్లు యంత మాత్రం కార్యం లేదు..”
“(దేవుణ్ణి ఉద్దేశించి) యిలాంటి చిక్కులు పెట్టావంటే, హెవెన్‌లో చిన్న నేషనల్ కాంగ్రెస్ లేవదీస్తాను”
“అన్ని మతాలూ పరిశీలించి వాటి యస్సెన్స్ నిగ్గుతీసి ఒక కొత్తమతాన్ని ఏర్పాటు చేశాను. అదే అమెరికా వెళ్ళి ప్రజ్వలింప చేస్తాను” లాంటివెన్నో ఆనాటి రాజకీయపక్షుల మీద వ్యంగ్యాస్త్రాలు కన్యాశుల్కంలో కనిపిస్తాయి.
“దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్”
దేశభక్తి గీతంలోని ఈ చరణంలో వొట్టి గొప్పలు చెప్పుకోవద్దంటూ పెట్టిన వాత ఎవరిని ఉద్దేశించిందో తెలియాలి.
నేషనల్ కాంగ్రేసుకు ఆ తొలినాళ్లలోనే అంతగా వాతలు పెట్టటానికి బలమైన కారణాలే ఉన్నాయి. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్ర విభజనకు నిరసనగా బెంగాలీలు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం ప్రారంభించారు. ఆ సమయంలో వందేమాతరం గీతం బెంగాలంతా ప్రతిధ్వనించింది. అది వందేమాతరం ఉద్యమంగా ప్రసిద్ధి పొంది దేశం అంతా వ్యాపించింది. స్వరాజ్యం, స్వదేశీ, జాతీయ విద్య అనేవి ఈ ఉద్యమ లక్ష్యాలయ్యాయి.
1906 కలకత్తా కాంగ్రెస్ ఈ మూడింటి మీద దృష్టిపెట్టి కొన్ని తీర్మానాలను ఆమోదించింది.
బ్రిటీష్ అనుకూలత ద్వారా దేశానికి మంచి సాధించుకోవాలనే ధోరణిలో నేషనల్ కాంగ్రెసును నడుపుకొస్తున్న సర్ ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలే, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాయ్‌కాట్ లాంటి పదజాలం పట్ల వ్యతిరేకత కనపరచారు. వీళ్ళని ‘నో చేంజర్స్’ అన్నారు
లాలాలజపతి రాయ్, లోకమాన్య తిలక్, బిపిన్ చంద్రపాలు ప్రభృతుల నాయకత్వంలో యువకులు ఈ మార్గాన్ని వ్యతిరేకించి, బ్రిటిష్ వారి పైన పోరాటానికి సిద్ధపడ్దారు. ఈ ముగ్గురినీ ‘లాల్ బాల్ పాల్ త్రయం’ అంటూ, అతివాదులు లేదా చేంజర్స్‌గా ముద్రవేశారు.
ఆ మరుసటి సంవత్సరం 1907లో సూరత్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో అతివాదులకూ, మితవాదులకూ తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. మితవాదులు రాస్ విహారీ ఘోష్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా సూచించగా, అతివాదుల పక్షాన లాలాలజపతి రాయ్‌ని పోటీకి నిలబెడుతున్నట్టు వేదిక మీదనుంచి తిలక్ ప్రతిపాదించాడు. ఆయన అలా ప్రసంగిస్తూ ఉండగా జనం లోంచి ఒక బూటు వచ్చి వేదికపైన ఉన్న ఫిరోజ్ షా మెహతా చెంపకు తగిలి, పక్కనే ఉన్న సురేంద్రనాథ్ బెనర్జీ మీద పడింది. బూటుని మెహతా, బెనర్జీల వర్గం వాళ్ళు తిలక్ మీదకు విసిరారో, తిలక్ వర్గీయులు మెహతా బెనర్జీల మీదకు విసిరారో ఎవరికీ తెలియదు. బూటు వచ్చి తగిలింది.
“నాగాపురం నుంచి వచ్చిన ప్రతినిధులు లాఠీ కర్రలతో ‘తిలక్ మహరాజుకీ జై’ అనుకొంటూ వేదిక మీదకు ఉరికారు. తరువాత గలాటా పెరిగి ఉభయ పక్షాలవాళ్ళూ కుర్చీలూ, బెంచీలు కూడా చేత బట్టి విజృంభించారు. అనేకమందికి గాయాలు తగిలి రక్తం స్రవించింది” అదీ సంఘటన. సరిగ్గా నేటి పరిస్థితికి నాటి పరిస్థితి నకలుగానే ఉంది. దీనికి, తాను ప్రత్యక్ష సాక్షినంటూ, టంగుటూరి ప్రకాశం ‘నా జీవిత యాత్ర’ గ్రంథంలో ఈ సంఘటనకు ఒక నేపథ్యాన్ని ఇలా విశ్లేషించారు:
“ఆ కాలంలో కాంగ్రెస్‌కి ఫిరోజిషా మెహతా నియంతవంటి వాడే! కాంగ్రెస్ సంఘాలు అనిగానీ, ప్రతినిధుల్ని ఎన్నుకోవడం గానీ, ప్రతినిధులు ప్రెసిడెంటును ఎన్నుకోవటం గాని ఏమీ లేవు. మెహతా ఎవరి మీద కటాక్ష వీక్షణం చేస్తే వాళ్ళే కాంగ్రేస్ అధ్యక్షులు. తీవ్రవాదులైన తిలక్ లాలాజీలు ఆయన ఆగ్రహానికి గురయిన ముఖ్యులు” అనేది ప్రకాశంగారి అభిప్రాయం.
ఇలాంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ పెద్దలను మంచి చేసుకుంటే విజిటింగ్ కార్డు పదవి అయినా సరే, పొందగలిగితే, ప్రభుత్వాదరణ దొరికేదని దీన్ని బట్టి తెలుస్తోంది. గురజాడ లాంటి ఆలోచనాపరుడు ఈ సంస్కృతిని ఆమోదించలేక పోవటమే సహజం. అందుకే, ఒట్టి గొప్పలు చెప్పుకోవద్దని మితవాద కాంగ్రెసుకు చురక వేశాడు.
ఆనాటి కాంగ్రెసు తెలుగువారిలో న్యాపతి సుబ్బారావు ప్రముఖులు. ప్రకాశంగారు ఆయనను మధ్యస్థ వాదిగా పేర్కొన్నారు. 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర రాష్ట్ర పర్యటన సమయంలో విశాఖపట్టణంలో ఆయనకు అంతగా ఆదరణ రాలేదు. కాకినాడలో ఒక మోస్తరుగా విజయవంతం అయ్యింది. రాజమండ్రి వచ్చేసరికి అద్భుతమైన విజయాలను సాధించటమే కాదు, తెలుగువారిలో స్వాతంత్ర్య దీప్తిని కలిగించింది. ‘భరత ఖండంబు పాడియావు’ అనే పద్యాన్ని చిలకమర్తివారు ఈ సభలోనే బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని అనువదిస్తూ ఆశువుగా చెప్పారు. 1897 నుంచీ 1912 వరకూ సంస్థాన వారసత్వ దావా విషయంలో అప్పారావు గారు తలమునకలుగా ఉన్న సమయం అది. ఆయన ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు పెట్టుకోకపోయినప్పటికీ, రాజకీయ అవగాహనను ప్రజలలో కలిగించే ప్రయత్నం చేశారు. జాతీయ విషయాలనే కాదు అంతర్జాతీయ విషయాలు కూడా కన్యాశుల్కం నాటకంలో మనకు కనిపిస్తాయి.
హవల్దార్ పాత్ర- సారా కొట్టు సీను:
“కుంపిణీ నమ్మక్ తిన్న తరువాత ప్రాణం ఉన్నంత కాలం కుంపిణీ బావుటాకి కొలువు చెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధం వొస్తే పించను ఫిరకా యావత్తూ బుజాన్ని తుపాకివెయ్యమా?” అంటాడు.
“రుస్సావోడి వోడ నీట్లో ములిగి నడస్తాది గదా, నువ్వు తుపాకుతో యవణ్ణి కొడతావు? అని మునసబు రెట్టించి అడుగుతాడు.
దానికి హవల్దారు, “మొన్నగాక మొన్న యింగిరీజ్ రుషియా దేశానికి దండెత్తిపోయి, రుషియాని తన్ని తగలాడా లేదా? అప్పుడేవైందో, యిప్పుడూ అదే అవుతుంది. మా రాణి చల్లగా ఉండాలి..!” అంటాడు హవలదారు.
“సీమరాణి ఆ కాళీమాయి అవుతారం కాదా?” అనడిగితే,
“కాళీ గీళీ జాంతానై-ఆ రాముడి అవుతారం” అని సమాధానం చెప్తాడు. నేషనల్ కాంగ్రెస్ మితవాదుల సగటు ఆలోచనాధోరణికి ఇది ప్రతీక. మనుషులు చేసిన దేవుళ్ళారా.. మీ పేరేమిటి కథలో కనిపించే శైవ వైష్ణవ భేదాలు కూడా ఇందులో అదనంగా ధ్వనిస్తాయి.
కన్యాశుల్కం నాటకంలో సార్వజనీనత, సార్వకాలీనతలు కొట్టొచ్చినట్టు కనిపించటానికి గురజాడ ప్రదర్శించిన ఈ రాజకీయ చైతన్యం ముఖ్యకారణం.
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.