Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాంతి రేఖలు

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పి. వి. సుధారమణ గారి ‘కాంతి రేఖలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రు మధ్యలో ఉన్న రావిచెట్టు కింద ఉన్న గట్టు మీద కూర్చొని కూనిరాగాలు తీస్తున్నాడు వీరబాబు. వీరబాబు అక్కడున్నాడంటే అర్థం ఇంకాసేపటిలో వాడి మిత్ర బృందం అందరూ వచ్చేస్తారాన్నమాట. అనుకున్నట్టుగానే మిగతా ముగ్గురూనూ గబ గబా భోజనం కానిచ్చేసి, బిల బిలమంటూ వచ్చేసారు.

వాళ్లంతా రాబోయే వినాయక చవితి పండగ గురించి చర్చించుకుందుకు చేరేరు అక్కడ.

అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెలో సుమారుగా ఇదు వందల ఇళ్ళు ఉంటాయి. ఊర్లో మొత్తం తొమ్మిది పేటలు ఉన్నాయి. ఆ పేటలన్నిటికి మధ్యలో ఒక పెద్ద సెంటరు ఉంది. ఆ ఊరి బజారంతా ఆ సెంటరులోనే ఉంది. అందుకే ఏ పండగలైనా, వేడుకలైనా అక్కడే జరుగుతాయి. ఆ ఊరికి పెద్ద దిక్కు కామందు భూషయ్య. ఆ ఊర్లో మంచి చెడ్డలు అన్నీ కామందే చూసుకుంటాడు. ఆ ఊరి ప్రెసిడెంటు పేరు కామరాజు. అతగాడు బాగా చదువుకున్నవాడు. అందుకని ప్రెసిడెంటు ఏది చెప్తే అది మారు మాట్లాడకుండా చేసేస్తాడు కామందు. వాళ్ళిద్దరికీ మంచి దోస్తీ. కామందు ఉండే పేట కూడా పెద్దదే కాని సెంటరులో అయితే అందరికీ దగ్గర అని, అన్నీ అక్కడే చెయ్యాలంటాడు ప్రెసిడెంటు కామరాజు మరి.

కామందు కొడుకు శ్రీనుకి వాళ్ళ పేటలో కొందరు దోస్తులు ఉన్నారు. శ్రీను దగ్గరలో ఉన్న పట్నములో చదువుకుంటున్నాడు. వాడి దోస్తులుకి మాత్రం చదువు లేదు. ఊళ్ళో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు. ఏదైనా అనుకున్నారంటే అయ్యేవరకు విడిచిపెట్టరు.

“అవునురా వీరిగా, ఏదో సెప్పాలనొచ్చి ఆ కూనిరాగాలెంట్రా” అన్నాడు కిట్టిగాడు. ఉండు ఉండు, ఇంకా ఎవరో రావాలన్నట్టుగా సైగ చేసాడు వీరిగాడు కూనిరాగం తీస్తూనే.

ఇంతలో ఆ ఊరి కామందు కొడుకు శ్రీను వచ్చేడు.

వస్తూనే “హమ్మయ్య! అందరూ వొచ్చేసారా” అంటూ, “ఇప్పుడు నే చెప్పొచ్చేదేమంటే, ..అదన్నమాట సంగతి” అన్నాడు.

“ఏట్రా! ఏటి సెప్పకుండా అదన్నమాట సంగతి అనీసినావు” అన్నాడు భద్రంగాడు.

“ఏటి, వీరిగాడు మీకేం చెప్పలేదా” అంటూ వీరిగాడి వైపు చూసాడు శ్రీను. “అ ఆఁ, బాగుంది యవ్వారం, ఎవలో ఒకలు సెప్పండిఎహె “ అన్నాడు చంద్రం కాస్త విసుగ్గా.

“ఓహో! సరే అయితే నేనే చెప్తాను వినండి. వినాయక చవితి పండగ వస్తోంది కదా, మనమందరం కలసి ఈసారి మన పేటలోనే బొమ్మ నిలబెడదాం. యేమంటారు మీరందరూ” అంటూ ఆగేడు శ్రీను చుట్టూ అందరినీ చూస్తూ.

“బాగానే ఉంది గాని ఎప్పుడూ పెద్ద సెంటరు కాడే అందరం కలిసి బొమ్మ నిలబెడుతున్నాం గందా, ఉప్పుడు మనం యేరుగా ఎట్టుకుంటాం అంటే పేసిడెంటు బాబు ఉరుకుంతాడా అనిపిస్తంది” కళ్ళు చిట్లిస్తూ అన్నాడు భద్రం శ్రీనుని చూస్తూ, ఇదంతా జరిగే పని కాదు అన్నట్లుగా చేతులు అటూ ఇటూ ఆడిస్తూ.

“హే అవన్నీ నాకొగ్గేయ్యండి, నాను సూసుకుంతాను గందా, ఇప్పుడు మనం బొమ్మ ఎట్టాలంటే ఏటేటి కావాలో శీను బాబు సెప్తాడు ఇనుకోండి, ఆనక మల్లా అరదం అవ్వనేదని అనకండ్రోయ్” కసురుకున్నాడు వీరిగాడు.

“సర్లే అయితే నువ్వు సెప్పు శీనుబాబు” అన్నారు అంతా ఒకేసారి. శ్రీను చెప్పడం మొదలుపెట్టాడు.

“చూడండి, ముందు బొమ్మ పెట్టే దగ్గర నేల చదును చేసి పందిరెయ్యాలి. “బాబూ పందిరెయ్యాలంతే సానా ఖరుసు కదా అన్నాడు చంద్రం మధ్యలో కల్పించుకొని. “ఇదిగో మీరు ఇలా మధ్యలో మాటాడితే కష్టం మరి, నేను చెప్పడం అయ్యేక, ఒక్కొక్కరు అడగండి” చిరాకు పడ్డాడు శ్రీను.

శ్రీను చిరాకు పడేసరికి అందరూ కంగారు పడి “వాకే ఓల్ రైటు” అన్నారందరూ. వారందరూ అలా అన్న తీరు చూసి, పక పకా నవ్వేసి, “పందిరికి కొలతలు చూసుకొని ఆ ప్రకారం బొమ్మ చేయమని చెప్పాలి. బొమ్మ చేసేవాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు పట్నంలో ఉంటారు. నే మాటాడుతా, ఇక పోతే మైకు సెట్లు, పరదాలు, కుర్చీలు బల్లలు ఇవన్నీ ఉండాలి. వీటికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకోవాలి” అని ముగించాడు శ్రీను.

“ఓయబ్బో పెద్ద యవ్వారమే ఇది సూత్తుంటే” అన్నాడు కిట్టిగాడు.

“అయితే, శీనుబాబు ఏపాటి అవుద్దేటి కరుసు” అన్నాడు వీరిగాడు.

“ఈయన్నీ సూత్తే గట్టిగానే కరుసు అవుద్ది. మరేటి దారి” అన్నాడు భద్రం.

“ఏముంది రేపటి నుండి మనం మన పేటోళ్లందరిని చందాలు అడుగుదాం. ఎంత వచ్చిందో చూసుకొని, దానిని బట్టి ఏర్పాట్లు చేసుకుందాం” అన్నాడు శ్రీను అదేమంత కష్టం అన్నట్టుగా చేతులు ఆడిస్తూ.

“మీ అయ్య కామందు గదేటి, సెందా ఇత్తాడు, కానీ మిగతావోల్లు, మామెందుకియ్యాలా, సెంటరు కాడ బొమ్మకి ఇత్తన్నాం గందా అంటారు, ఇది అంత బేగా తేలే ఎవ్వారం కాదు శీను బాబూ” పెదవి విరిచేశాడు చంద్రం.

“ఎవులో దాకో ఎందుకు, మా అయ్యే ఇయ్యడు. ఆళ్లంతా సెంటరు కాడ బొమ్మ కోసం మాటాడీసుకున్నారు” అన్నాడు కిట్టిగాడు.

“మా నాన్న కూడా ఇయ్యడురా. మా నాన్నే కదరా సెంటరు కాడ పందిరి ఏయిపిత్తాడు” అన్నాడు వీరిగాడు.

“ఒరేయ్, అలాకాదురా వినండిరా! చందాలు ఎక్కువగా వస్తున్నా కూడా సెంటరులో పెట్టిన బొమ్మ దగ్గర వినాయకునికి పూజలు మాత్రమే అవుతున్నాయి రెండు పూటలా కదా! కానీ ఈసారి మన పేటలోనే బొమ్మ పెట్టి, ఆ పందిట్లో చాలా కార్యక్రమాలు పెడతామంటే, మన వాళ్ళందరూ ఒప్పుకుంటారు. లేకపోతే మనం ఒప్పిద్దాం, ఏమంటారు” ప్రాధేయపడ్డాడు శ్రీను.

“ఏటేటి ఉంతాయేటి, కొద్దిగా సెప్పుమి ముందు. అప్పుడు సూద్దాం, ఆల్లని ఎట్టా ఒప్పించాలో” అన్నాడు చంద్రం. అయితే వినండి అంటూ చెప్పనారంభించాడు శ్రీను.

“ముందు మనం పందిరికి, బొమ్మకి ఎంత అవుతుందో కనుక్కుందాం. ఆ తర్వాత ముందుగా ఇంట్లో మన వాళ్ళకి చెప్పి ఒప్పిద్దాం. ఐదు రాత్రులు పండగ చేద్దాం. రోజుకో కార్యక్రమం పెట్టిద్దాం. మొదటి రోజు భజన, పూజలు, రెండోరోజు హరికథ, మూడోరోజు పూజలు, ఆ రాత్రి మంచి సినిమా వేద్దాం. నాలుగోరోజు పిల్లలికి, పెద్దలికి పోటీలు పెట్టి బహుమతులు ఇద్దాం. ఇంక ఐదో రోజు అన్నసంతర్పణ చేద్దాం. అన్ని రోజులూ అందరికీ దేవును ప్రసాదం అందేలా చూద్దాం. ఆ తర్వాత అనుపు ఉత్సవం బ్రహ్మాండంగా చేద్దాం” అన్నాడు శ్రీను.

“అంతా బాగానే ఉంది గానీ, ముందు ఈటికి పైకం ఎంతవుద్ది అది సూడు ముందట్ల” అన్నాడు కిట్టిగాడు.

“ఇదిగో మీ అందరికీ నచ్చింది కదా మొత్తం కార్యక్రమం అంతా, అయితే ఇప్పుడు నేను చెప్తాను ఎలాగన్నది. చూడండి మనం మొత్తం ఐదుగురున్నాం కదా, మన పేటలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో లెక్కపెడదాం, దానిని బట్టి ఒక్కొక్కరికి ఇన్ని ఇళ్లు అని పంచుకోని వెళ్లి వాళ్ళందరికీ వివరిద్దాం. ఆ తర్వాత ఐదుగురం ఒకే జట్టుగా వెళ్ళి చందా వసూలు చేద్దాం, నాకు తెలిసీ చందాలు బాగా దండిగానే వస్తాయి” ఉత్సాహంగా అన్నాడు శ్రీను.

“మన పేటలో మొత్తాంగా ముప్పీయారు ఇల్లు ఉన్నయ్యిరా, గుడిసిలు కూడా కలిపేత్తే” అన్నాడు కిట్టిగాడు తన వేళ్ళు లెక్కపెట్టుకుంటూ.

“ఓహో మరేమి ఒక్కొక్కరికి ఏడేసి ఇళ్ళు వస్తాయి. రేపటినుండి పని మొదలుపెడదాం” అన్నాడు శ్రీను.

అందరూ బానే ఉంది అంటే బానే ఉంది అనుకున్నారు. “అయితే ఈటన్నిటినీ కాయితం మీద ఏట్టిసుకుందాం. శీనుబాబు నువ్వే ఆ పని సేసేసి మా అందరికి సదివి సెప్పెత్తే, ఆలా కానీచ్చీద్దాం” అన్నాడు చంద్రం. సరే అంటూ శ్రీను జేబులోంచి కాగితం తీసి, వాళ్ళనుకున్నట్టుగా అన్నీ రాసేడు, చదివి వినిపించాడు. అందరూ సరే అంటే సరే అనుకున్నారు. రేపు ఉదయం మళ్ళీ అందరం అక్కడే కలుసుకుందాం అనుకున్నారు.

వెళ్ళడానికి అందరూ లేవబోతుంటే శ్రీను తండ్రి కామందు కారులో వస్తూ వీళ్లందరిని చెట్టు దగ్గర చూసి కారు ఆపమని, దిగి వచ్చేడు. వస్తూనే “అందరూ ఇక్కడే ఉన్నారా, మీకోసం కబురు పెట్టించాలనుకున్నా. అందరూ ఇలా రండి” అంటూ గట్టు మీద కూర్చున్నాడు కామందు.

“ఏంటి నాన్నగారు సంగతి, నేను కూడా మీకో సంగతి చెప్పాలనుకుంటున్నాను” అన్నాడు శ్రీను.

“ఒరేయ్ శ్రీను, అవన్నీ తర్వాత చెపుదువుగానిలే కాని ఇప్పుడు నే చెప్పొచ్చేదేటంటే, మన సెంటరులో పెట్టడానికి మనం రేపు ఉదయాన్నే పట్నం వెళ్లి వినాయకుడి బొమ్మ చేయమని చెప్పాలి. నువ్వెళ్ళి ఆ ప్రయాణం ఏర్పాట్లు చూడు” అన్నాడు కామందు.

“అది కాదు నాన్నగారు, మేమందరం” అని చెప్పబోతున్న శ్రీనుని ఆగమని సైగ చేసి, “ఇంకేమి చెప్పక్కర్లేదు, పద. ముందెళ్ళి నే చెప్పిన పని చూడు. ఇంకేమి మాట్లాడకు” అని గట్టిగా కేకేసాడు కామందు. ఆ కేకకి భయంతో బిక్క చచ్చిపోయి, తలొంచుకొని “అలాగే నాన్నగారు” అన్నాడు శ్రీను.

“ఒరేయ్ మీరంతా ఇలా రండి, సెంటరు దగ్గర బొమ్మ నిలపటానికి ఏమేమి కావాలో మన ప్రెసిడెంటు చెప్తాడు, మీరెల్లి ఆ పనులు చూడండి. అందరం కలసి చేసుకుంటేనే పనులు అవుతాయిరా. ఆఁ ఒరేయ్ చెప్పటం మర్చిపోయాను, ఈ సంవత్సరం కూడా చందాలు బాగా దండండి. ఎల్లండి, యెల్లి మీరా పని మీద ఉండండి” అంటూ పక్కనున్న బడ్డీ కొట్టు రాములుని అడిగి చుట్ట తీసి వెలిగించాడు. దమ్ము గట్టిగా లాగి, వదిలిన పొగలో వెళ్లిపోతున్న కుర్రాళ్ల వైపు తీక్షణంగా చూసాడు భూషయ్య. ఎర్రగా రగులుతున్న చుట్ట కొసలాగే.

వీళ్ళ సంభాషణ అంతా విన్న కిళ్ళీకొట్టు రాములుకి మాత్రం చీకట్లో రగులుతున్న నిప్పెరుపు కన్నా మర్నాటి పొద్దు పొడుపులోని సూరీళ్లలా ఉదయించుబోతున్న కుర్రాళ్ళే ఆనుతున్నారు కమ్ముకొస్తున్న చీకట్ల మధ్య కాంతి రేఖల్లా.

Exit mobile version