Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాంతి

[బాలబాలికల కోసం ‘కాంతి’ అనే కథ అందిస్తున్నారు ఎస్‌. హనుమంతరావు.]

న్నెండేళ్ల కాంతి చాలా చురుకైన అమ్మాయి. నేల మీద అసలు కాలు నిలవదు. పరుగే పరుగు. చదువులోనూ, ఆటల్లోను ఫస్ట్‌. వీధిలో ఆడపిల్లలూ, మగపిల్లలూ సైకిళ్లు తొక్కుతుంటే, ఆరో ఏట నుండే ఆ సైకిళ్ల వెనుక పరిగెట్టి, వెనుక సీటు మీద ఎగిరి కూర్చునేది. ఒక్కోసారి రోడ్డు మీద పడి మోకాళ్లు చెక్కుకుపోయినా, అలా ఎగిరి కూర్చోవడం మానేది కాదు.

అలా ఆడుతూ పాడుతూనే హైస్కూల్‌కి వచ్చేసింది కాంతి. తనకి స్కూలుకి వెళ్లడానికి సైకిల్‌ కొన్నారు ఇంట్లో. మార్కెట్‌ అవతల వున్న వీధిలో వుంది స్కూలు. పెడల్‌ సరిగా అందకపోయినా, ఏదోలా తంటాలుపడి సైకిల్‌ తొక్కేయడం అలవాటు చేసుకుంది.

వీధిలో చాలామంది పిల్లలు సైకిల్‌ మీద బడికి వెళతారు. ట్రాఫిక్‌ను తప్పించుకోవచ్చని, వీధుల్లోంచి వెళతారు. రోడ్డు దాటే దగ్గర అంతా ఒకేసారి, అటూ ఇటూ చూస్తూ దాటతారు. ఆ పిల్లల గుంపుకి కాంతే నాయకురాలు.

ఇప్పుడు కాంతి పదవ తరగతికి వచ్చింది. ట్యూషన్‌కి కూడా సైకిల్‌ మీదే వెళుతోంది. ఎప్పుడూ సైకిల్‌ని శుభ్రంగా వుంచుకుంటుంది. నాన్నతో వెళ్లి రిపేర్లు చేయిస్తుంది. దసరాకి సైకిల్‌ని చక్కగా కడిగి, పూజలు చేస్తుంది.

ఈ మధ్య ఎక్కడో చూసిందట.. తన సైకిల్‌కి హేండిల్‌ ముందు బిగించడానికి బాస్కెట్‌ని కొనమని గొడవపెట్టడం మొదలెట్టింది. తొట్టి ఎందుకులే అని తేలిగ్గా తీసిపారేశాడు నాన్న. కాంతి ఒప్పుకోలేదు.

ఓ రోజు స్కూల్లో పెట్టిన వక్తృత్వ పోటీలో ‘కత్తి గొప్పదా? కలం గొప్పదా?’ అన్న అంశం మీద మాట్లాడి మొదటి బహుమతి అందుకుంది. బహుమతిగా వచ్చిన డబ్బుని అమ్మ చేతిలో పెట్టింది. ఆమె “నువ్వే నీ కిష్టమైంది కొనుక్కో” అని తిరిగి కాంతికే ఇచ్చేసింది. ఆ డబ్బుకి తన కిడ్డీ బ్యాంకు డబ్బాలో దాచుకున్న డబ్బుని కలిపి, బజారుకెళ్లింది కాంతి, పక్కింటి సునీతను తోడు తీసుకుని. సైకిల్‌ షాపులో బాస్కెట్‌ కొని, బిగించుకుని వచ్చేసింది. వద్దన్నా వినకుండా తొట్టెను కొన్నందుకు నాన్నకి మొదట కోపం వచ్చినా, ‘పాప ఎదుగుతోంది, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతోంది’ అనుకుని సంబరపడ్డాడు. అమ్మ అయితే, తన కూతురు చొరవకి తెగ మురిసిపోయింది.

ఇప్పుడు అమ్మకి అవసరమైన కూరగాయల్ని ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరుకుల్ని సైకిల్‌ తొట్లో వేసుకుని ఇంటికి తెచ్చేస్తోంది కాంతి. అలా నాన్న పనిభారాన్ని కొంత తగ్గిస్తోంది.

ఒకరోజు మార్కెట్‌ నుండి కాంతి సైకిల్‌ మీద వస్తోంటే, నల్లటి బుజ్జి కుక్కపిల్ల రోడ్డు పక్కన కనిపించింది. దాని తల్లి తెల్లవారుజామున లారీ కింద పడి చనిపోయిందని ఎవరో అన్నారు. అంతా దానిమీద జాలి చూపుతున్నారు. కాని దాన్ని ఆదుకునేవారే కనిపించలేదు.

కాంతి పక్కనున్న పాలబూతులో ఓ పాలప్యాకెట్‌ కొంది. ఒక కాగితం కప్పుని తీసుకుంది. ప్యాకెట్‌ని షాపువాడి దగ్గర కత్తెర తీసుకుని ఓ మూల కట్‌చేసి, కప్పులో పాలు నింపి, పప్పీ ముందు వుంచింది. అది పాలని తాగడానికి వెనుకా ముందూ ఆడుతోంది. “ఛు.. ఛు” అని తనకొచ్చిన చప్పుడు చేసింది కాంతి. ఆ శబ్దానికి ఏదో మహిమ ఉన్నట్టు పప్పీ తన చిన్ని ముట్టెను కప్‌లో పెట్టి, నాలుకతో చప్పుడు చేస్తూ పాలని తాగసాగింది. ఆ దృశ్యం కాంతికి ఎంతో సంతోషం కలిగించింది. పప్పీ పాలు తాగడం అయిపోయాక, ఊలుబంతిలా వున్న దాన్ని చేతుల్లోకి తీసుకుని, సైకిల్‌ తొట్టెలో పెట్టింది.

ఇంటికి వెళ్లకుండా తిన్నగా ఊరికి అటువైపు ఉన్న పశువులాసుపత్రికి సైకిల్‌ పోనిచ్చింది.

ఆసుపత్రిలో డాక్టరు గారు ఖాళీగా వున్నారు. సెల్‌లో రేడియో యాప్‌లో వస్తున్న లలిత సంగీతం వింటున్నారు.

“నమస్తే డాక్టరు గారు. నా పేరు కాంతి. హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను. ఈ పప్పీ రోడ్డు మీద దొరికింది. పాపం! దీని తల్లి చనిపోయింది. దీన్ని నేను పెంచుకోవాలనుకుంటున్నాను. దీనికి టీకా వెయ్యరా?” అని అడిగింది. జంకూగొంకూ లేకుండా కాంతి ధోరణికి డాక్టరు గారు ఎంతో ముచ్చటపడ్డారు. పప్పీకి రేబిస్‌ టీకా వేసాక, దాన్ని కాంతి చేతుల్లో పెడుతూ “బెస్టాఫ్‌ లక్‌” అన్నారు డాక్టరు. బూస్టర్‌ డోస్‌కి మళ్లీ తీసుకురావాలి అంటూ, వివరాలు రాసిన కార్డు కాంతి చేతికిచ్చారు.

పప్పీని సైకిల్‌ బాస్కెట్‌లో పెట్టుకుని ఇంటికొచ్చింది కాంతి.

“ఇప్పుడు దీన్ని పెంచడం అవసరమా?.. దాని వల్ల ఎన్నో ఇబ్బందులున్నాయి” అని అన్నారు అమ్మా నాన్న.

“అవి అన్నీ నేను చూసుకుంటాను. నాకు పెంచుకుందామనిపించింది.. అంతే!” అంది కాంతి దృఢంగా.

పప్పీని వుంచడానికి ఇంట్లో వున్న ఓ పాత వెదురుబుట్టను వరండాలో ఓ మూల ఏర్పాటు చేస్తారు అమ్మా నాన్న.

ఇప్పుడు కాంతి చదువుకుంటూ వుంటే, ఎదురుగా కూర్చుని, చప్పుడు చేయకుండా కన్నార్పకుండా చూస్తూ వుంటుంది పప్పీ.

Exit mobile version