Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కనిపించని తెర

[డా. మజ్జి భారతి రచించిన ‘కనిపించని తెర’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

గకుండా మ్రోగుతున్న ఫోన్ శబ్దంతో మత్తుగా కళ్ళు విప్పి అందుకున్నాను ఫోను. పది మిస్స్‌డ్ కాల్స్ ఉన్నాయి. ఆఫీసులో మీటింగులతో రెండు రోజుల నుండి బాగా అలసిపోయానేమో, సరిగ్గా తిండి నిద్ర లేదేమో, ఒంటి మీద తెలివి లేకుండా పడుకున్నాను. అందుకే మెలుకువ రాలేదు. ఇన్ని కాల్స్ ఎవరు చేశారబ్బా అనుకుంటూ చూశాను. అన్నీ ఫ్రెండ్స్ దగ్గర నుండే. ఒకేసారి యింతమంది చేశారు. ఏమై ఉంటుంది? అనుకుంటూ ఆఖరుగా ఫోను చేసిన రఘుకు ఫోన్ చేశాను “విషయమేమిటి?” అని.

వాడేం చెప్పకుండా “వాట్సాప్ చూడు” అన్నాడు.

వాట్సాప్ ఓపెన్ చేశాను. నా ఫోను నెంబరుకు ఉదయం నుండి దగ్గరగా ఓ పదిహేను మెసేజెస్.. క్లాస్‌మేట్స్ దగ్గర నుండి. “ఏమై ఉంటుంది?” అని ఆత్రుతగా చూడడం మొదలు పెట్టాను. “వాట్సాప్ చూసావా?” ఇంచుమించు అందరి మెసేజుల భావం అదే. అప్పుడు స్ట్రైక్ అయింది క్లాస్మేట్స్ వాట్సాప్ గ్రూప్ చూడాలని. అది ఓపెన్ చేశాను. ఉదయాన్నే శృతి పెట్టిన శుభలేఖ ఉంది. ‘ఎప్పటినుండో అనుకుంటున్నదే కదా? దీనికింత హడావుడి చేస్తున్నారెందుకు వీళ్లంతా?’ నాకేమీ అర్థం కాలేదు.

రఘుకి ఫోన్ చేశాను. “చూసావా?” అన్నాడు. చూశానన్నాను.

“చూస్తే అలా ఉన్నావేంటి?” ఆశ్చర్యంగా అడిగాడు వాడు. ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముందో నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. అదే విషయం అడిగాను వాడిని.

 “నీకేమనిపించలేదా?” షాక్‌లో ఉన్నట్టున్నాడు. తిరిగి నన్నే ప్రశ్నించాడు.

అప్పటికి మత్తు పూర్తిగా వదిలింది. మరలా క్లాస్మేట్స్ గ్రూప్ చూశాను. శృతి శుభలేఖ క్రింద ఒక్క కంగ్రాట్స్ మెసేజ్ కూడా లేదు. అపశృతిలా తోచింది. ఏదో అయింది. ఏమిటది? శృతి పెట్టిన మెసేజ్ ఓపెన్ చేశాను. చదివాక షాక్ నాక్కొట్టింది. ఉదయం నుండి నాకు అన్ని కాల్స్ ఎందుకొచ్చాయో, అన్ని మెసేజెస్ ఎందుకొచ్చాయో అర్థమైందిప్పుడు. ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఫోన్ పెట్టేసి తల పట్టుక్కూర్చున్నాను ఇదెలా జరిగిందానని?

‘మేమే ఇలాగుంటే, వెంకీ పరిస్థితి?’ వెంకీ గుర్తుకు రాగానే ఒక్కుదుటున మంచం నుండి క్రిందికి దూకాను. అర్జంటుగా వాడి దగ్గరకు వెళ్లాలి. వాడెలా ఉన్నాడో? ఏ పరిస్థితులలో ఉన్నాడో? అసలు శృతి ఇలా చేసిందంటే నమ్మాలనిపించడం లేదు. చిన్నప్పటినుండి కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు. చదువుకున్న రోజులలో ఒకరిని విడిచి ఒకరుండడం ఏనాడూ చూడలేదు. రేపో, మాపో వాళ్ళిద్దరి పెళ్లి శుభలేఖ వస్తుందని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో, ఇప్పుడు శృతి దగ్గరనుండి శుభలేఖ. అందులో వెంకీ పేరు బదులు ఎవరో మాధవన్ అట. ఈ రోజే నిశ్చితార్థమట.

అసలు మంచి ముహూర్తాలు లేక ఆగారు కాని, ఆరు నెలల క్రిందటే వీళ్ళిద్దరి తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకున్నారు వీళ్ళ పెళ్లి గురించి. పూణేలో జాబ్ చేస్తున్న వెంకీ, శృతి కోసమని మూడు నెలల క్రిందటే హైదరాబాదు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వచ్చాడు. మరి ఈ మూడు నెలలలో ఏమి జరిగింది? హఠాత్తుగా ఈ వార్త..

గబగబా రెడీ అయి దొరికిన ఫ్లైట్ పట్టుకొని హైదరాబాదులో వాలిపోయాను. ఏ పరిస్థితిలో వెంకీని చూడాల్సి వస్తుందోనన్న భయంతో గుండెలు దడదడా కొట్టుకుంటుంటే వాడింటికి చేరాను. పెరిగిన గడ్డంతో, నలిగిపోయిన బట్టలతో.. చూడగానే తెలుస్తుంది.. చెప్పుకోలేని బాధతో కృంగిపోయాడని.. కోరుకున్న అమ్మాయి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడిందంటే.. కృంగిపోక.. వాడిని హత్తుకొని “సారీ రా” అని భుజం మీద తట్టాను.

“దేనికిరా” ఆశ్చర్యంగా అడిగాడు. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతయింది.

‘దేనికంటాడేమిటి? ఇడియట్’ మనసులోనే అనుకొని “శృతి పెళ్లికార్డు చూశాను” అన్నాను.

“గ్రూపులో పెట్టిందా? బిజీగా ఉండి నేనింకా చూడనేలేదు. అంటే కార్డు ముందే చూశాననుకో. అసలు సెలక్షన్ నాదేలే” కూల్‌గా చెప్పాడు వాడు. ఐస్ గడ్డలు నెత్తిమీద పోసినట్టు అనిపించింది. మైండ్ మరొక్కసారి బ్లాంక్ అయిపోయింది. “ఏంట్రా మాట్లాడుతున్నావ్?” అయోమయంగా అడిగాను నేను.

అప్పటికి నా పరిస్థితి అర్థమయింది వాడికి. “కొంపదీసి నువ్వు నా గురించి వైజాగ్ నుండి..” మాట మధ్యలోనే ఆపేసాడు. నీరసంగా తలూపాను.

“సారీ రా” ఈసారి వాడు చెప్పాడు.

“అసలేం జరిగిందో చెప్పరా?” నిలదీశాను.

“నీకు తెలుసు కదా! శృతి ముందు నుండి ఇక్కడే, ఇదే ఆఫీసులో పనిచేసింది. దానికి తోడు శృతి ఆడ మగ అని చూడకుండా అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి తనకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. శృతి ఎవరితోనైనా మాట్లాడుతుంటే.. ముఖ్యంగా అబ్బాయిలతో.. అందులోనూ పెళ్లి కానివాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు.. నన్ను నిర్లక్ష్యం చేస్తుందేమోనన్న భావం మనసులో చోరబడేది.  అక్కడితో ఊరుకోకుండా, ఆ భావం నా ఆలోచనలను ప్రభావితం చేసేది.

స్నేహితుడిగా శృతిలో నాకే తప్పులు కనిపించేవి కాదు. తను ఏది చేసినా నాకు గొప్పగానే ఉండేది. కానీ ప్రేమికుడి అవతారం ఎత్తేసరికి, శృతి ఎవరితో నవ్వుతూ మాట్లాడినా.. ఏమిటో అసహనం.. అనుకున్న సమయానికి ఒక్క నిమిషం ఆలస్యం అయినా.. ఏదో తెలియని అనుమానం.. ఇటువంటి ఆలోచనలతో నా మీద నాకే కోపం.. ఇన్ని సంవత్సరాలూ శృతితో అన్ని విషయాలూ పంచుకున్న నేను.. నా ఈ అంతర్మథనాన్ని శ్రుతికి  చెప్పడానికి చిన్నతనం.. ఎటు వెళ్తున్నాను నేను? ఇలాగే ఉంటే రేపు పెళ్లయ్యాక మా భవిష్యత్తు ఏమిటి? ఎంతో ఇష్టపడి శృతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నేను, భర్తగా ఆమెకు ఎటువంటి జీవితాన్ని అందించబోతున్నాను? ఇటువంటి ఆలోచనలతో నాకు నిద్ర పట్టేది కాదు.

కాని పాపం శృతి.. ‘చిన్నప్పటినుండి నా ఆలోచనలు నీకు తెలుసు కదా! నా గురించి వేరే విధంగా ఎందుకాలోచిస్తున్నావు?’ అని ఒక్కరోజు కూడా నన్నడగలేదు. అప్పుడర్థమయింది, శృతి స్నేహితుడిగా వంద మార్కులు తెచ్చుకున్న నేను, భర్తగా పది మార్కులు కూడా తెచ్చుకోలేనని.. భార్యాభర్తల మధ్య గొడవలెందుకు వస్తాయో కూడా అర్థమైంది. జెలసీ.. తన భాగస్వామి ఇంకొకరితో నవ్వుతూ మాట్లాడినా సహించలేకపోవడం.. అభద్రతాభావం.. గట్టిగా చెప్పాలంటే స్త్రీగా ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించలేకపోవడం.. కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి దగ్గర ఇలాంటి ఆలోచనలతో ఉంటే నా భర్త పొజిసివ్ అని ఆమె అనుకోవచ్చేమో కాని చిన్నప్పటినుండి తెలిసిన శృతి దగ్గర అటువంటి ఆలోచనలతో.. నాకే తలకొట్టేసినట్లు ఉంటుంది. మరి శృతికి ఎలా ఉండి ఉంటుంది?

మన పెద్దలు ‘భార్యా రూపవతీ శత్రుః’ అన్నారు. అందంగా ఉండడం వాళ్ళ తప్పు ఎంతమాత్రం కాదు. మన ప్రేమ మీద మనకే నమ్మకం లేక వాళ్ళని అనుమానిస్తాం. భర్త ఎంత అందగాడైనా ఆడవాళ్లకు ఆ సమస్య ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ మీద వాళ్ళకి గట్టి నమ్మకం. మనలో చాలామందిమి స్నేహాన్నే ప్రేమ అనుకుంటాం. కాని స్నేహం ప్రేమ రెండూ ఒకటి కాదు. ఆ రెండింటి మధ్యా సన్నని తెర ఉంటుంది. అది దాటి వెళ్ళగలిగిన వాడే ప్రేమికుడుగా, మంచి భర్తగా నిలబడగలడు.

అది అర్థమయ్యాక, శృతికి  భర్తగా  దగ్గరగా ఉండి, స్నేహితుడిగా జీవితాంతం దూరమయ్యే బదులు, దూరంగా ఉంటూ జీవితాంతం తనకు స్నేహితుడిగా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాను.

ఆ తర్వాత అమ్మానాన్నలను ఒప్పించడం, శృతి తల్లిదండ్రులు బాధపడకుండా చెప్పడం ఇలా ఇన్ని రోజులూ బిజీ అయిపోయాను. మాధవన్ మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. తమిళియన్. మా గురించి తెలియక ముందునుండి శృతిని ప్రేమించాడట. శృతి కోసం తెలుగు కూడా నేర్చుకున్నాడట. మా ఇద్దరికీ పెళ్లి కుదిరిందని తెలిసాక, తన ప్రేమను మనసులోనే దాచుకున్నాడట. నా నిర్ణయం తెలిసాక తన ప్రేమను ముందు నాకే చెప్పాడు. నేను ఓకే చేశాక ప్రొసీడ్ అయ్యాడు. శృతికి కూడా అతని మీద మంచి అభిప్రాయం ఉండి ఓకే చెప్పింది. అనుకోకుండా ఈ మూడు నెలలలో యిన్ని విషయాలు గబగబా జరిగిపోయాయి. మీరందరూ నా గురించి యింత వర్రీ అవుతారని తెలిసిఉంటే ముందు నేనే చెప్పేవాడిని. సారీ రా.” అని మరొక్కసారి సారీ చెప్పాడు.

విషయం మాకు చెప్పకుండా మా అందరినీ ఇంత క్షోభకు గురి చేసినందుకు వాడిని ఉతికి ఆరేద్దామనుకునేలోగా “ఇంకా ఎంతసేపు మాట్లాడుకుంటారు. అవతల శృతి ఎంగేజ్‌మెంట్‌కు టైం అవుతుంది. తొందరగా బయలుదేరండి” ఆంటీ తొందర చేశారు.

కారులో ఆంటీ, అంకుల్.. ఇద్దరూ.. ఇంకేం మాట్లాడతాను. నోరు మూసుకున్నాను.

ఊహించని నన్ను చూసి శృతి చాలా సంతోషించింది. “అర్జెంటుగా మాధవన్‌ని పరిచయం చెయ్యి” అంటూ తొందర పెట్టాను. విషయం తెలియకపోయినా, పనుల ఒత్తిడిలో ఉన్నా స్నేహితుల మధ్యలో ఉన్న మాధవన్‌ని పిలిచి పరిచయం చేసింది.

శృతి, మాధవన్.. మాధవన్ ప్రక్కన నవ్వుతూ వెంకీ, ఆ ప్రక్కన గుండెల నుండి కొండంత భారం దిగిపోగా రిలాక్స్ అయి నేను.. ఫోటోగ్రాఫర్‌ని రిక్వెస్ట్ చేసి నా సెల్ ఫోన్‌లో ఫోటో తియ్యమన్నాను. తీసిన ఫోటోను మరుక్షణంలో మా గ్రూపు వాట్సాప్‌లో అప్లోడ్ చేశాను. మరో నిమిషం పోయాక చూద్దును కదా! మా వాట్సాప్ గ్రూపులో శృతికి అభినందనల వెల్లువే కురిసింది.

Exit mobile version