Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కంగారు ‘దాహం’

[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

పిల్లలూ!

భూగోళంలోని వివిధ ఎడారులలో వివిధ రకాల జంతువులు నివసిస్తున్నాయి.

ఎడారి ప్రాంతాలలో నీటికొరత చాలా ఎక్కువని మనందరికీ తెలిసిన విషయమే! మరి ఈ ఎడారిలో నివసించే ‘కంగారు’ నీటిని సంపాదించుకునే పద్ధతిని తెలుసుకుందాం! ఈ విషయాన్ని పరిశీలిస్తే దాని తెలివితేటలకి మనం ఆశ్చర్యపోతాం. అబ్బురపడతాం. ఆహా! అనుకుంటాం.

కంగారుకి ఉన్ని ముఖం మీదే కాకుండా నోటి కుహరంలో కూడా పెరుగుతుంది. కంగారు దవడ సంచులకు రంధ్రాలుంటాయి. నోటి కుహరం లోని ఉన్ని ఈ దవడ సంచులలోకి చొంగ (లాలాజలం) వెళ్ళకుండా అడ్డుకుంటుంది. ఈ అమరిక వల్ల తేమని వృథా చేసుకోకుండా దాచుకోవడం దీనికి సాధ్యమవుతుంది.

కంగారు రకరకాల మొక్కల విత్తనాలను ఏ మాత్రం తేమ లేని పొడి విత్తనాలను కూడా మింగుతుంది. అయితే వాటిని నమిలి మింగకుండా తేమ చొరబడని తన దవడ సంచులలో దాచుకుంటుంది. పొడి విత్తనాలకు తేమని పీల్చే గుణం వుంది కదా! అలాగే ఈ విత్తనాలు భూమిలో కొంచెం తేమ వున్నా దానిని గ్రహిస్తాయి. పొడి విత్తనాల ద్రవాభిసరణ పీడనం 400 నుంచి 500 ఆట్మిస్పియర్ల వరకు వుంటుంది. ఇంత ఎక్కువ బలంతో నేల లోపలి పొరలలోని తేమని – దవడ సంచులలోని విత్తనాలు బాగా తేమను వీల్చుకున్న తరువాత కంగారు వాటిని తిని ఆకలిని, దాహాన్ని ఒక్కసారే తీర్చుకుంటుంది. ఇదే సృష్టి విచిత్రం.

చూశారా! పిల్లలూ!

నీరు దొరకని ప్రాంతాలలోని జంతువులకి ప్రకృతి యిచ్చిన శక్తి. ప్రకృతిలో అందచందాలనే కాదు అద్భుతమయిన వింతలు – విచిత్రాలను పరిశీలిస్తే – పరిశోధిస్తే ఇటువంటి అద్భుతాలు కోకొల్లలు. – ఇంతకీ మనం ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారులని ఏమంటామర్రా! చెప్పండి – ఓహో! కంగారూస్ – అవునా?

Exit mobile version