[మణి గారు రాసిన ‘కంచికి వెళ్ళని కథ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
పద్మనాభం, మల్లికార్జున్ చాలా ఏళ్ళ నుంచి స్నేహితులు. ఒకటే ఆఫీసులో పని చేస్తున్నారు. పైగా, కోలనీలో పక్క పక్కనే, ఇళ్ళు కట్టుకున్నారు. పద్మనాభానికి ఒక కొడుకు. అతని పేరు వాసు. మల్లికార్జున్‌కి ఒక కూతురు. ఆమె పేరు సంధ్య. ఇద్దరూ ఒకటే కాలేజీలో, ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని, ఎం.ఎస్.కి అమెరికా వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్, పైగా పక్క పక్క, ఇళ్ళు. వాళ్ళు, మంచి స్నేహితులే. అలా అని ఎక్కువగా కలిసి తిరగరు.
ఇద్దరికీ అమెరికాలో ఒకటే యూనివర్సిటీలో సీట్లు వచ్చాయి. వీసా కూడా వచ్చింది. ఇంక కొద్ది రోజులలో అమెరికా వెళ్ళడానికి అవసరమయిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఒకరోజు ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ, ఉన్నట్లుండి మల్లికార్జున్ అన్నాడు, “ఒరేయ్ పద్మనాభం! చూస్తూండగానే మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ప్రయోజకులు కూడా అయ్యారు. వాళ్ళని చూస్తూంటే నాకు మనసులో ఒక ఆలోచన వస్తోందిరా.”
పద్మనాభం నవ్వాడు “ఏమిటిరా?” అంటూ.
“వీళ్ళు, ఒకరిని ఒకరు, ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా! మనం వియ్యంకులం అవుతాము” అంటూ సంతోషంగా నవ్వాడు మల్లికార్జున్. మళ్ళీ అన్నాడు,
“ఒకవేళ అదే జరిగితే, కులం వేరంటూ నేను అవుతే, అడ్డు పెట్టను..”
పద్మనాభం కొంచెం ఖంగుతిన్నాడు. ఇబ్బందిగా మొహం పెట్టి, “మనం ఎప్పుడూ ఈ విషయం మాట్లాడలేదు. నువ్వు ఇలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా వుంది. ఏరా మీ అమ్మాయి, నీతో ఏమయినా అందా?” అన్నాడు పద్మనాభం.
“అదేమీ లేదురా. నాకే అనిపించింది. స్నేహితులు వియ్యంకులు అవుతే బాగుంటుంది గదా. చిన్నప్పటి నుండి చూస్తున్నాము. మా అమ్మాయి గురించి నీకు తెలుసు. మీ అబ్బాయి గురించి నాకు తెలుసు. తెలిసి వున్న వాళ్ళతో వియ్యం బాగుంటుంది గదా”, మల్లికార్జున్ తన ధోరణిలో తను మాట్లాడుతున్నాడు, పద్మనాభంలో వస్తున్న మార్పులు చూడకుండా.
పద్మనాభం, మల్లికార్జున్ కేసి ఒకసారి చూసి తల వంచుకుని అన్నాడు “ఆలూ లేదు చూలూ లేదు కొదుకు పేరు బోడిలింగం అంటారు దీనినే. వాళ్ళకి ఇంటరెస్ట్ వుందని నాకు అనిపించటం లేదు. అయినా మా వాళ్ళల్లోనే, ఒక అమ్మాయిని, ఇంతకుముందే, మాట్లాడుకున్నాము. ఉద్యోగం వచ్చాక, చేద్దామని అనుకుంటున్నాము. ఉద్యోగం వచ్చేవరకూ, ఎవరికీ చెప్పొద్దని అనుకున్నాం. అందుకే ఇంతవరకూ నీకూ చెప్పలేదు.”
పద్మనాభం మాటలకి మల్లికార్జున్‌కి, మొహం మీద చల్లనీళ్ళు కొట్టినట్లు అయి తెలివి లోకి వచ్చాడు. ఉత్సాహం కాస్తా, నీరు కారింది.
“అవునా! అలాగా!” అన్నాడు మల్లికార్జున్ నిరుత్సాహాన్ని, నిరాశని దాచుకుంటూ. ఆ తర్వాత వారిద్దరూ మౌనంగా వుండి పోయారు.
మౌనంగానే, ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. తను, తొందరపడి అలా మాట్లాడడం, ఎంత స్నేహితుడైనా, సరి అయినది కాదేమో, అనుకుంటూ ఇంకాస్త ఇబ్బందిగా, ఫీలు అయ్యాడు మల్లికార్జున్.
అన్యమనస్కం గానే, భోజనం ముగించి, పద్మనాభం ఇంటికి, వెళ్ళాడు సారీ చెప్దామని. ఇంటికి వెళ్ళి తలుపు తట్టబోతున్న మల్లికార్జున్‌కి, పద్మనాభం మాటలు వినిపించాయి.
“నీకు, సంధ్యకి, మధ్య ఏముందో నాకు తెలియదు. నాకు అవసరం లేదు కూడా! ప్రేమ, దోమ అంటూ, ఎవరి వెనకయినా తిరిగితే, కాళ్ళు విరక్కొడతాను. బుద్ధిగా చదువుకొని, ఉద్యోగం సంపాదించుకో. ఆ తర్వాత మన వాళ్ళ ల్లోనే డబ్బులున్న వాళ్ళ అమ్మాయిని, చూస్తాను, చేసుకుందువు గాని.”
“అసలు నాకూ సంధ్యకి, మధ్య ఏమయినా వుందని ఎవరు చెప్పారు. గట్టిగా చదవడానికే, వున్న సమయం సరి పోవటం లేదు. ఈ గొడవలన్నీ ఏమిటి? మేమెప్పుడూ చదువు గురించి తప్ప మాట్లాడుకున్నదే లేదు. నువ్వేమి ఊహించుకున్నావో!” విసుగ్గా అంటున్నాడు వాసు.
“ఈరోజు మల్లికార్జున్, నన్ను అడిగాడు. కులం వేరయినా, సంబంధం, అడుగుతున్నాడంటే, సంధ్యకి మనసులో, ఏమయినా వుందేమో! లేకపోతే ఎందుకు అడుగుతాడు? ఎవరయినా, ఒట్టి పుణ్యానికి కులం వేరయినా. సంబంధం మాట్లాడుతారా?” పద్మనాభం గొంతులో, ఇంకా కోపం విస్ఫుటమవుతోంది .
మళ్ళీ అన్నాడు. “అబ్బాయి బాగుండి, డబ్బులు వుండి, బాగా చదువుకుంటే, వదలి పెడతారా అమ్మాయి తల్లి తండ్రులు? కులం చూడరు. అంతస్తు చూడరు.”
“నాన్నా! ఇంక ఆపుతావా, ఈ అరుపులు, కేకలు?.. ఇంక రెండు రోజుల్లో నా ప్రయాణం వుంది, నన్ను కాస్త ప్రశాంతంగా, ఉండనిస్తావా?” విసుక్కుంటూ అన్నాడు వాసు.
“మీరింక, ఊరుకుంటారా, మీ అరుపులు, కేకలు? ఎవరయినా వింటే బాగుండదు. ఎంతయినా ఇరుగు పొరుగు వాళ్ళం. లోపాయికారీగా, సద్ది చెప్పుకోవాలి కానీ, ఈ అరుపులేమిటి? వాడు రెండు రోజుల్లో వెళ్ళాలి. ఎన్ని పనులుంటాయి! అది మానేసి ఈ గొడవ ఏమిటి” పద్మనాభం భార్య, వసుంధర, మండిపడింది పద్మనాభం మీద.
ఈ గొడవ అంతా, బయట నుంచి వింటున్న, మల్లికార్జున్ నిశ్శబ్దంగా, అక్కడ నుంచి బయట పడ్డాడు.
పద్మనాభం మాటలు కొత్తగా అనిపించాయి. ఆ విధంగా, పద్మనాభం మాట్లాడుతాడని కానీ, మాట్లాడగలడని కానీ ఎప్పుడూ అనుకోలేదు, మల్లికార్జున్.
చాలా దగ్గర వ్యక్తి, అనుకుంటాం కానీ, ప్రతీ వ్యక్తి లోనూ, బయటకి వ్యక్త పరచని, కోణాలు వుంటూనే వుంటాయి. అందుకే ఎవరి గురించి అయినా, పూర్తిగా తెలుసు, అని అనుకోవడం అవివేకమే అవుతుంది, అనుకుంటూ ఇంటి మొహం పట్టాడు.
లోపలకి వచ్చి, గది లోకి వెళ్తున్న మల్లికార్జున్‌ని “ఏమిటలా డల్‍గా వున్నారు?” అంది అతని భార్య. ఆమె పేరు విశాల,
గదిలో మంచం మీద కూర్చుని, చెప్దామా, వద్దా, అనుకుంటూ, జరిగింది చెప్పాడు.
పక్కనే కూర్చుని అంది “మీరు, మరీ అమాయకులు. అంతా మీలానే ఆలోచిస్తారనుకుంటారు. ఇందులో పద్మనాభం గారి తప్పేమీ లేదు. వారి స్థానంలో, ఎవరున్నా అలానే, మాట్లాడుతారు. అయినా పిల్లల మనసుల్లో, ఏమీ లేనప్పుడు మీరు, అలా మాట్లాడడం తప్పుగానే భావిస్తారు. మనసుల్లో వుంటే కూడా, పెద్ద వాళ్ళు ఆ విషయం మాట్లాడడం తప్పుగానే భావిస్తారు. పెద్ద వాళ్ళు వున్నది సమాజ నియమాలు పాటించడానికి, పాటించేలా చేయడానికి, అనేది నిశ్శబ్ద శాసనం. మీకు తెలియనిది కాదు.”
మళ్ళీ నవ్వుతూ అంది. “మీ లోకం మీదే కానీ, ఈ లోకంలో, ఎప్పుడు వున్నారు కనుక? లోకం పోకడ, మీకు తెలియక కాదు కదా!.. అందరి లానే మీరు ఆలోచిస్తే, అలా ప్రవర్తిస్తే, మీరు, అలా అడిగేవారు కాదు కదా! సమాజం పోకడికి, రివాజుకి, అనుగుణంగా, మన ఆలోచనలు ప్రవర్తన, లేకపోతే, ఇలాంటివి తప్పవు.. ఇది నాకూ కొత్త కాదు. మీకూ కొత్త కాదు.. వాటి గురించి బాధపడితే ఎలా?”
ఆమె మాటలకి నవ్వాడు మల్లికార్జున్ “నువ్వు చెప్పిందీ కరక్టే” అంటూ తల పంకించి కాస్సేపు మౌనంగా వుండి “థాంక్స్ విశాలా! నన్ను నాకు గుర్తు చేసావు” అంటూ మల్లికార్జున్ కూడా నవ్వేసాడు.
“మీరు ఒకవైపు కూతురికి, అన్ని రకాలుగా స్వతంత్రంగా వుండాలని, ఇష్టపడి, పెళ్ళి చేసుకోవాలని, చెపుతారు. అటువంటిది, తనతో ఒక్క మాట చెప్పకుండా, తన అభిప్రాయం తెలుసుకోకుండా, అలా మాట్లడడం మీ తప్పు కూడా” అంది, కొంచెం కోపం తెచ్చుకుంటూ .
“అవును. ఒప్పు కుంటున్నాను” అంటూ, విశాల చేయి అతని చేతిలోకి తీసుకుంటూ, అన్నాడు.
“నాకెప్పుడూ ఆశ్చర్యం గా అనిపించేది, ఎవరో తెలియని వ్యక్తిని, మా మతం, మా కులం, మా శాఖ, మా గొత్రం అంటూ, పెళ్ళి చేసుకుంటారు. కానీ కళ్ళ ముందు వున్న వ్యక్తులని, తెలిసివున్న వాళ్ళ అని కాస్త కూడా, చొరవ తీసుకుని సంబంధం కలుపుకోరు. మనుషుల మధ్య, కాస్త కూడా పగలగొట్టలేని, గోడలు లాగా, పాతుకుపోయాయి ఈ అంతరాలు. వీటికి అతీతంగా, తెలిసి వున్న వాళ్ళ అబ్బాయితో కానీ, సంధ్యకి ఇష్టమయిన అబ్బాయితో కానీ పెళ్ళి జరగాలి అని, నాకు ఆశ! బహుశః, ఆ ఆశ అలా బయట పడిందేమో!” అంటూ విశాల కేసి చూసి నవ్వాడు.
మౌనంగా తన చేతిలో వున్న అతని చేయిని నిమిరింది. “ఆ విధంగానే జరుగుతుంది లెండి. మీరు ఈ విషయం గురించి, ఇంక ఎక్కువగా ఆలోచంచడం, ఆపెయ్యండి” అంది విశాల.
***
సంధ్యకి, వాసుకి సీట్లు వచ్చిన అమెరికన్ యూనివర్సిటీ లోనే, వారు చదివే కాలేజి నుంచే, ఇంకో ముగ్గురికి కూడా, సీట్లు వచ్చాయి. అందరూ, ఆ రోజు హోటల్‌లో, లంచ్‌కి కలుద్దామనుకుని కలిసారు..లంచ్ అయ్యాక, అందరూ ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయ్యారు.
వెళ్ళిపోతున్న సంధ్యతో వాసు, “సంధ్యా! వుండు! నీతో మాట్లాడాలి” అన్నాడు.
సంధ్య ఆశ్చర్యంగా వాసు కేసి చూసి భృకుటి ముడిచి “ఏమిటి??” అంది.
అందరూ వెళ్ళిపోయాక అన్నాడు.
“ఏమిటి, మీ నాన్న, నీకూ నాకు పెళ్ళి సంబంధం గురించి మాట్లాడేడట!” వాసు గొంతులో కాస్త క్యూరియాసిటీ, కొంత వెటకారం.
నోట్లొంచి మాటలు రానట్లు, వాసు కేసి చూస్తూ స్థాణువులా నిల్చుంది.
కాస్సేపటికి తేరుకుని “ఏంటి మాట్లాడుతున్నావు?” అంది కోపంగా .
“కమాన్! ఏమీ తెలియనట్లు మాట్లాడకు!” వ్యంగంగా నవ్వుతూ అన్నాడు.
“ఓకే! మా నాన్న ఏమి చెప్పాడో నాకు తెలియదు. కానీ నాకు అటువంటి ఆలోచన లేదు. ఆ ఇంటరెస్ట్ లేదు” అంది.
ఆ మాటలకి వాసుకి, తనని చిన్నబుచ్చినట్లు, అనిపించింది.
“అంతేలే! మీ లాంటివాళ్ళు అన్ని రకాలుగా బాగున్న అబ్బాయిని ఏదో విధంగా పెళ్ళి చేసేసుకుందామనే అనుకుంటారు. కుదరకపోతే, ఇలా పోజులు కొడతారు” అంటూన్న వాసు మాటలు పూర్తి చేయకుండనే, ఛెళ్ళుమంటూ, చెంప మీద కొట్టింది.
సంధ్య కళ్ళు, అగ్నిగోళాలలా, అగ్నిని కురిపిస్తున్నాయి. వాసు భయపడి, తల వంచుకున్నాడు.
“కాస్త కూడా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నవ్. నీలాంటి బుద్ధి లేని వాడిని, నేను ఎప్పటికీ చేసుకోను” అంటూ సంధ్య అక్కడ నుంచి చెళ్ళిపోయింది.
వాసు కోపంతో, అసహాయంగా ఆమె వెళ్ళిన వైపు చూస్తూ వుండిపోయాడు.
***
సంధ్యకి చాల కోపంగా వుంది. వాసు అలా, ఎలా మాట్లాడాడు ? అమ్మాయిల పట్ల తేలికయిన అభిప్రాయమా? అతనిలో వున్న ఆత్మన్యూనతా భావనా? ఆడపిల్లలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం అన్ని రంగాల్లో రాణించడం, మగపిల్లలు సహించలేపోతున్నారేమో. అందుకేనేమో ఆడపిల్లలని తక్కువ చేసి మాట్లాడుతారు. అమ్మాయిలనే కాదు, ఎవరని అయినా సరే తక్కువ చేసి మాట్లాడేవారిలో తప్పకుండా ఆత్మన్యూనత వుంటుంది. మోపెడ్ డ్రైవ్ చేస్తూ, దారంతా ఆలోచిస్తూనే వుంది.
తండ్రి అంటే ప్రేమతో పాటు వల్లమాలిన గౌరవం సంధ్యకి. “ఆడపిల్లలు, స్వతంత్ర భావాలు కలిగి వుండాలి. స్వయం నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం కలిగి వుండాలి” అని ఎప్పుడూ చెపుతూ వుంటాడు నాన్న.
అటువంటిది నాన్న, తనని కాస్త కూడా అడగకుండా, ఇటువంటి పని ఎందుకు చేసాడు? అనుకుంటూ చాలా అసహనంగా, ఫీల్ అవసాగింది.
అసలే, అసహనంగా వున్న సంధ్యకి, దారిలో ట్రాఫిక్ జామ్ కావడంతో, అసహనం ఎక్కువ అయ్యింది. ఎవరిదో సభలా వుంది. ‘మన ఆడపిల్లలని మనం రక్షించుకుందాం’, అంటూ ఎవరో గొంతు చించుకుంటున్నాడు.
వద్దనుకున్నా చెవుల్లో పడుతున్నాయి మాటలు. “మన ఆడపిల్లలు, మన వాళ్ళళ్ళోనే, పెళ్ళి చేసుకోవాలి. ప్రేమ పేరుతో, మోసం చేసి, ఆడపిల్లలని అమ్ముకుంటున్నారు. అందుకే, మన ఆడపిల్లలని, మన వాళ్ళల్లోనే, పెళ్ళిళ్ళు చేసుకుందాం.”
ఆ మాటలు వింటున్న సంధ్యకి, ఎంత కోపం వచ్చిందంటే, ఆ మాట్లాడే వాడిని, నడ్డి వంచి, గట్టిగా కొట్టేయ్యాలనిపించింది. ఎలా అనిపిస్తున్నారు, ఆడపిల్లలు, వీళ్ళకి? ..వస్తువుల్లా లోపల బీరువాలోపెట్టి దాచి, వాళ్ళు అనుకున్న వాళ్ళతో, పెళ్ళి చేయడానికి. ..అతను చెప్పే ‘వాళ్ళ వాళ్ళు’ ఏదో, వాళ్ళ ఆడపిల్లలని ఉద్ధరించడానికి పైనుంచి ఊడిపడ్డట్లు.
కోపంతో సెగలు కక్కుతున్న సంధ్య, ట్రాఫిక్ క్లియర్ అవడంతో, కాస్తా శాంతించి, ఇంటి మొహం పట్టింది.
ఇంటికి చేరుకున్న సంధ్య, ఇంట్లో అడుగు పెట్టగానే హాలులో, సోఫాలో హాయిగా వెనక్కి జారపడి కబుర్లు చెబుతూన్న మేనత్త సుజాతని, పక్కన నిర్వికారంగానూ నిరుత్సాహం గానూ, నిరాసక్తిగానూ అన్ని వైపులా చూస్తున్న ఆమె కొడుకు కిరణ్‌ని చూసింది.
సంధ్యని చూడగానే “ఆ!! ఆ!! వచ్చావే తల్లీ! నీ కోసమే వచ్చాము! ఎల్లుండి అమెరికాకి వెళ్ళిపోతున్నావుట కదా. మీ అమ్మా నాన్నా చెప్పారులే..” అంటూ మాట్లాడుతున్న సుజాత కేసి, నవ్వుతూ చూస్తూ, పక్కనే కూర్చుంది.
“మా కిరణ్‍ని చేసుకుని, ఇక్కడే హాయిగా వుండవే అంటే.. చెపితే విన్నావు కాదు.. కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. ఆ పూచీ నాదీ” అంటూ విశాల కేసి తిరిగి అంది “వదినా! ఏ మాటకి ఆ మాట అనుకోవాలి. ఈ మధ్య ఆడపిల్లలు ఎలా వుంటున్నారో తెలుసా! వాళ్ళతో పోలిస్తే, మన సంధ్య ఎంత పద్ధతిగా వుంటుందో.”
సంధ్య, ‘ఈ రోజంతా, ఎక్కడకి వెళ్ళినా, ఈ పెళ్ళిమాటలు ఏమిటో నా ఖర్మకి!’ అనుకుంటూ అంది – “అత్తా! నీకు కిరణ్ ఇష్టపడ్డ, అమ్మాయి తప్ప, అందరూ నచ్చుతారు. కిరణ్ కి, రాజ్యం అంటే ఇష్టం. రాజ్యానికి అంతే. ఈ విషయం ఊరందరికీ తెలుసు. అన్నీ తెలిసి, ఇంత ధైర్యంగా కిరణ్‌ని పెళ్ళి చేసుకోమని ఎలా అడుగుతావు?” అంటూ కిరణ్ కేసి చూసి, “ఏరా! నువ్వెలా ఊరుకుంటున్నావు అసలు!” అంది.
నిబ్బరంగా అవ్వాడు కిరణ్.
“మీ ఇద్దరూ, ఇద్దరికి ఇద్దరే. ఆవిడ ఈ పెళ్ళికి ఒప్పుకోదు, పోనీ వీడు ఏమయినా ధైర్యం చేసి, చేసుకుంటాడా అంటే అదీ లేదు. అత్తా!, ఇప్పుడే ఒక అతను, పెద్ద సభ పెట్టి మాట్లాడుతున్నాడు. ’ఎవరి కులం వాళ్ళు, వాళ్ళ కులం వాళ్ళని, ఎవరి మతం వాళ్ళు, వాళ్ళ మతం వాళ్ళని చేసుకోవాలి. శాఖలు, గోత్రాలు లాంటివి వుంటే, అవీ కూడా తూ.చా. తప్పకుండా పాటించే, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, లేకపోతే ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు’ అని గట్టిగా చెప్తున్నాడు. నీకు తమ్ముడో, అన్నయ్యో. మరి. ఆ ఉద్యమంలో చేరిపోకూడదూ?” అంది మళ్ళీ.
సుజాత విశాల కేసి చూసి, “చూడు వదినా, దీని వెటకారం!” అంది కొంచెం కోపంగా .
“లేకపోతే ఏదో శాఖ తేడా, అని ప్రేమించుకుంటున్న వాళ్ళని విడదీయాలని చూస్తున్నావు. ఆ పాపం ఊరికే పోదు. నువ్వు ఇలా పట్టుపట్టి, కూర్చో. కిరణ్ చూస్తూండగానే, ముసలివాడు అయిపోతాడు. రాజ్యం విసిగిపోయి, వేరేవాడిని చేసుకుంటుంది. ఒక్కడే, మిగిలిపోతాడు” సంధ్య గొంతులో చిరాకు, ఎంత దాచుకున్న దాగకుండా, కాస్త వ్యక్తమవుతూనే వుంది.
“నువ్వూ, మీ నాన్నలానే మాట్లాడుతావే!” అంది సుజాత నిష్ఠూరంగా.
“దాంట్లో ఆశ్చర్యం ఏముంది? ఆయన కూతురినే కదా నేను. కానీ నాకిప్పటికీ, ఆశ్చర్యం కలిగించేది, అర్థం కానిదీ, నీకూ, మా నాన్నకి, అన్నాచెళ్ళెళ్ళు అయినా, ఆలోచనలలో అంత తేడా, ఎలా వచ్చిందని?” సంధ్య నవ్వుతూ అంది.
సుజాత, “నీ మాటల కేం కానీ, వచ్చి చాలాసేపు అయింది. నిన్ను చూసాముగా” అని, విశాల కేసి చూస్తూ, “ఇంక వెళ్తాం, వదినా! వచ్చిన పని అయ్యిందిగా, సంధ్యని చూసాము” అంటూ కూర్చున్నదల్లా లేచింది.
“జాగ్రత్త రా! అంటూ సంధ్యని దగ్గరకి తీసుకుని బుగ్గలు పుణికింది. “వస్తాము మరి!” అంటూ బయటకి దారి తీసింది.
“ఆల్ ది బెస్ట్ సంధ్యా!” అంటూ కిరణ్ వెనకే నడిచాడు.
***
వాళ్ళు వెళ్ళాక, సంధ్య లోపలకి వెళ్ళి, ఫ్రెష్ అయి, తల్లి దగ్గర కూర్చుని, నెమ్మదిగా విషయం, ప్రస్తావించింది.
“అమ్మా! నాన్న, పద్మనాభం అంకుల్‌తో, నాకూ వాసూకి పెళ్ళి ప్రొపోజల్ ప్రస్తావించారుట. వాసు ఎంత అవమానంగా మాట్లాడో తెలుసా? వాడంటే, నాకూ ఏమీ ఫీలింగ్స్ లేవు. వాడికీ అంతే. నన్ను అడిగి కదా, మాట్లాడాలి?!” కోపంగా అంది సంధ్య.
“తండ్రికి, తగ్గ కొడుకు అన్నమాట. ‘కళ్ళ ముందే ఇద్దరూ పెరిగారు, ఇద్దరకీ ఇష్టమయి పెళ్ళి చేసుకుంటామంటే నేను అడ్డుపెట్టను’ అని అన్నారుట మీ నాన్న. దానికీ, ఆయన ఇంటికి వెళ్ళి, చాలా తిట్టుకున్నాడని అన్నారు మీ నాన్న” అంటూ మల్లికార్జున్ చెప్పినది సంధ్యకి చెప్పింది విశాల.
“అయినా పిల్లలు, పెళ్ళి వయసులో వున్నప్పుడు, అడిగినా అది, తప్పు పట్టే విషయం కాదు అసలు.. అడిగినంత మాత్రాన అలా చులకన చేస్తూ తిట్టుకోవడం ఏమిటో” అంది విశాల, కాస్త అసహనంగా.
మళ్ళీ అంది – “అంతర్లీనంగా కొన్ని నియమాలు, సమాజాన్ని నడిపిస్తూ వుంటాయి. ‘వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీ వుండాలి’ అని అంటారు. ఎవరి కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళల్లోనే పెళ్ళిళ్ళు చేసూంటారు.. వేరే కమ్యూనిటీ వాళ్ళతో పెళ్ళి సంబంధం మట్లాడితే ఇలా తప్పుగానే అనిపిస్తుంది. మీ నాన్న, ఇవన్నీ పట్టించుకోరు. అందుకే ఆయనికి, చెప్పినా అర్థం కాదు.”
“నాతో ఒక్క మాట చెపితే, నాకిష్టం లేదని చెప్పేదాన్ని నాన్నకి, ఈ పరిస్థితీ తప్పేది. అయినా నువ్వు అన్నది సరైనదే. చెప్పానుగా, నేను ఇంటికి వచ్చేడప్పుడు, ఒక సభలో, ఒక అతను గొంతు చించుకుని, మరీ చెపుతున్నాడు – అందరూ వారి వారి కమ్యూనిటీ ఆడపిల్లలని, జాగ్రత్త చేసుకొని, వాళ్ళ కమ్యూనిటీ ల్లోనే, పెళ్ళిళ్ళు జరిగేలా చూడాలి – అని. అది ఒక విధంగా ఒక కంఫర్ట్ జోన్. అందరూ, దానిలో వుండడానికే ఇష్టపడతారు. దానిని, ఎప్పటికప్పుడు, బలపరుస్తూ వుంటారు. అందుకే, బయటకి రావడానికి భయపడతారు.” అంది సంధ్య.
కాస్సేపుండి మళ్ళీ అంది – “అయినా ఆడపిల్ల అన్నా, ఆడపిల్ల తల్లిదండ్రులు అన్నా, అలుసు ఇంకా పోలేదమ్మా. ఏ తేడాలు వున్నా, కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు, .వేరయినా, ..అబ్బాయి, అతని తల్లి తండ్రులు ప్రొపోజ్ చేస్తే, ఒకలా వుంటుంది. అమ్మాయి, ఆమె తల్లి తండ్రులు ప్రొపోజ్ చేస్తే ఒకలా, వుంటుంది.”
విశాల కాస్సేపు మౌనంగా వుండి మళ్ళీ అంది – “అమ్మాయి, అబ్బాయి అని కూడా కాదు. ఎవరు ఏ విధంగా తక్కువగా అనిపించినా, చులకన చేసి మాట్లాడడం చాలా సామాన్యం అయిపోయింది. ఎవరినైనా తక్కువ చేసి, మాట్లాడడానికి కారణం వుండక్కర్లేదు, ఎవరైనా, ఎలా మాట్లాడుతున్నారన్నదీ, వారి వారి సంస్కారం బట్టి వుంటుంది.”
“ఎవరిని అయినా, కారణం ఏదయినా అలా చులకన చేసి మాట్లాడడం తప్పు కదా అమ్మా!”
“తప్పే మరి!..”
ఇద్దరూ కాస్సేపు మౌనంగా వుండి పోయారు.
కాస్సేపుండి, సంధ్య అంది.
“మీ ఇద్దరూ, నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. స్వతంత్ర భావాలు కలిగి వుండేలా పెంచారు. నాకు ఎవరి మీద అయినా ఇష్టం కలిగితే మీకు చెప్పకుండా, ఎలా వుంటానమ్మా?.. ఇప్పుడు, నాలాంటి చాలామంది పిల్లల దృష్టి, చదువు, ఉద్యోగం, కెరీర్ ప్లానింగ్.. ఇలాంటి వాటి మీదే కానీ, వేరే వాటి గురించి, ఆలోచించే సమయం కానీ, ఆసక్తి కానీ, వుండటం లేదు.”
“అవును. అదీ నిజమే” అంది విశాల ప్రేమగా కూతురి వైపు చూస్తూ.
“నీకు ఇష్టమయిన వ్యక్తిని పెళ్ళి చేసుకో, అంటూ నాన్నలా, చెప్పడానికి ఏ తల్లికి అయినా ఏ తండ్రికి అయినా చాలా ధైర్యం వుండాలి.. చాలా ఎవాల్వ్ అయి వుండాలి.. కానీ ఆ విధంగా, ఎవరు అనుకుంటారు? అనుకోరు సరికదా, చాలా చులకన చేసి మాట్లాడుతారు. అయినా, అది అంత సులువూ కాదు, ఈ సమాజంలో. అసలు ప్రేమ అంటూ పుట్టకుండా, జాగ్రత్త పడుతూ వుంటారు. ఒకవేళ ప్రేమ పుట్టినా, వ్యక్తపరిచే సాహసం, చాలా తక్కువ మందే చేస్తారు. ఇంక వాళ్ళల్లో, ఇంకా కొంచెం మంది, తల్లిదండ్రుల వరకూ విషయం తీసుకు వెళ్తారు. తల్లి తండ్రులు, ఒప్పుకునో ఒప్పుకోకో, పెళ్ళివరకూ వెళ్ళేవాళ్ళు ఎంత మంది ఉంటారు అమ్మా?” అంది సంధ్య నవ్వుతూ.
“ఏమిటే! ఏదో రీసెర్చ్ చేసినట్లే మాట్లాడుతున్నావు?” అంది విశాల నవ్వుతూ .
“దీనికి పెద్ద రీసెర్చ్ అవసరం ఏముందని? చూస్తున్నాముగా!” అంది సంధ్య.
కాస్సేపు వుండి, మళ్ళీ అంది, “ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందని??.. ఎవరు అయినా ప్రేమించుకుంటున్నారంటే, చులకనగా చూసేవారే, ఎక్కువ. అది ఏదో సినిమాలకే, కథలకే పరిమితం కావాలన్నట్లు చెప్పకనే చెప్తారు. ఎందుకో, ప్రేమించుకోవడాన్ని గౌరవించరు. ప్రేమ పుట్టకుండా జాగ్రత్త చేస్తూ వుంటారు. కలిగితే, వెంటనే దానిని చంపేవరకూ వూరుకోరు. బహుశః అన్నిటికన్న, పెద్ద నేరం, ప్రేమించడం ఏమో.. వారి మధ్య, కులం, మతం, ఆస్తి, అంతస్తుల్లాంటి ఎటువంటి అంతరాలు ఏమీ లేకపోయినా, ప్రేమించుకుంటున్నారంటే, ..ఇబ్బందిగానే భావిస్తారు. అంతెందుకు? మన ఇంట్లోనే, అత్తని చూస్తున్నాముగా! మనమంతా, ఎంత చెప్తున్నా, కిరణ్, రాజ్యాన్ని, పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించటం లేదు.”
“అందుకే ఈ ప్రేమ కథలు, ఎప్పటికీ కంచికి వెళ్ళని కథలు లానే మిగిలిపోయి, చర్విత చర్వణం అవుతూనే వున్నాయి.”
తల్లితో మనసు విప్పి మాట్లాడాక సంధ్య కుదుటపడింది.
“నాన్నకి ఇదేమి చెప్పకు. చెపితే బాధపడతాడు.” అంది సంధ్య, తేలికైన మనసుతో.