[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]
[భారతదేశానికి చెందిన కొన్ని పురాతన విగ్రహాలను స్మగ్లింగ్ చేస్తూ ఓ వ్యక్తి జె.కె.ఎఫ్. ఎయిర్‍పోర్టులో పట్టుబడిన వార్తను ప్రస్తావించి, కళాఖండాల విషయంలో జాగ్రత్తగా ఉండమని మేరుకి, ఇతర సిబ్బందికి చెప్తారు చారీగారు. శ్రీశైలం సైట్‍లో దొరికిన వస్తువలనన్నీ భద్రమైన ప్రదేశంలో ఉంచామని, వాటికి జి.వి. ఇన్‍ఛార్జ్ అని, ప్రస్తుతం అతను లాంగ్ లీవ్‍లో ఉన్నాడని చెప్తాడు మేరు. అతను లీవ్‍లో వెళ్ళేటప్పుడు బాధ్యతలు ఎవరికి అప్పగించాడు, తాళాలు ఎవరికి ఇచ్చి వెళ్ళాడని అడుగుతారు చారీగారు. అక్కడ పట్టుబడిన విగ్రహాలు శ్రీశైలం సైట్ లోనివని అనుమానిస్తున్నారా అని రమణ అడుగుతాడు. ప్రత్యేకించి శ్రీశైలంవి అని చెప్పలేదు, కానీ ఆంధ్ర ప్రదేశ్‍ని అని చెప్పారా వార్తలో అంటారు చారీగారు. తరువాత తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు మాట్లాడుకుంటారు. కాసేపటికి చంద్రం వచ్చి మేరుని పలకరిస్తాడు. నీకో రహస్యం చెప్పాలి అంటాడు. జివిని తాను చిత్తూరులో కలిసాననీ, అతను కేతకిని పెళ్ళి చేసుకున్నాడని చెప్తాడు. కానీ కేతకి తనని గుర్తుపట్టలేదని అంటాడు. ఇంకో విషయం అంటూ, టోనీ లెపెంటో, జివి, మరికొందరు కలిసి హోటల్లో డ్రింక్ తాగుతూ కనిపించారని చెప్తాడు. ఈ స్మగ్లింగ్‍కీ, వీటికి ఏమైనా లింక్ ఉందా అని ఆలోచిస్తాడు మేరు. నెల రోజుల తరువాత నాడీ జ్యోతిష్యుడి అపాయింట్‍మెంట్ దొరుకుతుంది మేరుకి. నాడీ జ్యోతిష్యం గురించి తనకి తెలిసినదంతా చెప్తాడు చంద్రం. లోపలికి పిలిచిన నాడీ జ్యోతిష్యుడు మేరుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. తరువాత మేరుకి సంబంధించిన అనేక విషయాలు ఆయన చెబుతాడు. అప్పుడు మేరు తన పూర్వజన్మ గురించి అడుగుతాడు. పూర్వజన్మలో మేరు ఓ రాజవంశీకుడనీ, గుప్తనిధులని సాధించేవాడనీ, ఏదో కోరిక తీరకుండానే చిన్న వయసులోనే చనిపోయాడని చెప్తాడు. తన భార్య రాణియా అని అడిగితే, ఆ జన్మలో మేరుకి చాలామంది భార్యలున్నారనీ, ఒక స్త్రీ తన ప్రేమని కించపరిచినందుకు మేరుని శపించిందందనీ, ప్రాయశ్చిత్తం చేసుకుంటే శాంతి, ప్రేమ లభిస్తాయని ఆయన చెబుతారు. అందుకోసం మళ్ళీ రమ్మని చెబుతారు. ఒక శిష్యుడు తమిళంలో ఆయన చెప్పినదంతా రికార్డు చేసిన కాసెట్‍ను, నోట్‍బుక్‍ని మేరుకి ఇస్తాడు. అవి తీసుకుని బయటకి వచ్చిన మేరుని, ఏం చెప్పారు, నమ్మకం కుదిరిందా అని చంద్రం అడిగితే, బాగా చెప్పారనీ, కానీ తాను తన పూర్వజన్మ వివరాలు తెలుసుకోవాలని అంటాడు మేరు. చెప్పినంత వరకు వినమనీ, దాన్నే నమ్ముకొని మనసు పాడుచేసుకోవద్దని అంటాడు చంద్రం. – ఇక చదవండి.]
అధ్యాయం 18
రమేష్ మేరుని సాదరంగా ఆహ్వానించాడు. మేరుని కౌగిలించుకొని “ఎలా వున్నావు దోస్త్? స్నేహపూర్వకంగా వచ్చావా, లేక ఒక డాక్టర్ దగ్గరకి పేషంటులా వచ్చావా?” అంటూ తన కౌన్సిలింగ్ రూములోకి తీసుకువెళ్లాడు.
“హంపిలో నిన్ను కలిసాక చాలా సార్లు నిన్ను కలుద్దామనుకొన్నాను. కాని మీ ఆఫీసులో వాళ్ళు నువ్వు లాంగ్ లీవులో వున్నావని అన్నారు” అన్నాడు రమేష్ కూర్చుంటూ.. మేరుని కూడా కూర్చోమని చెబుతూ.
“నాకు అబ్బాయి పుట్టాడు.. అందుకని”
“చాలా సంతోషం. మరి పార్టీ లేదా?” అన్నాడు రమేష్.
కాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాకా, మేరు అసలు విషయంలోకి వచ్చాడు.
“రమేష్, నీకు తెలుసా, నేను చాలా కాలంగా, కొన్నేళ్ళ నుంచి ఎవరైనా సైకియాట్రిస్ట్‌ని కలవాలని అనుకుంటున్నాను. కాని కలవలేదు.. ఏవేవో సందేహాలు” అన్నాడు.
రమేష గట్టిగా నవ్వి, “అవును మన దేశంలో సైకియాట్రిస్ట్‌ని కలవడాన్ని ఓ న్యూనతగా భావిస్తారు. ఒకవేళ ఆ డాక్టరు దగ్గరకి వెళితే పిచ్చివాడనే ముద్రవేస్తారని భయం” అన్నాడు.
“అది కాదు రమేష్, నాకు సైకియాట్రి తెలుసు. అది ఎన్నో మానసిక రోగాలను నయం చేస్తుందని తెలుసు, కానీ నా సమస్య వేరు” అన్నాడు మేరు.
“సమస్య చిన్నదైనా పెద్దదైనా నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఒక్కొక్కసారి అదే చాలా పెద్ద సమస్యగా అయిపోతుంది. ముందు మన ఇద్దరం వేడిగా టీ తాగుదాం.. అందరూ పేషంట్లూ వెళ్ళిపోయారు. నువ్వే ఆఖరు. సారీ పేషంటు అన్నందుకు, నువ్వు నా మిత్రుడివి..” అన్నాడు రమేష్. టీ తీసుకురమ్మని ఆఫీస్ బాయ్‌కి చెప్పాడు.
టీ తాగుతూ మేరు రమేష్ గదిని పరిశీలించాడు. గది చాలా విశాలంగా వుంది. గది అంతా నీలిరంగు పెయింటు చేయబడింది. గదిలో సన్నటి లైట్లు. పల్చటి ఖరీదైన కర్టెనులు.. ఆ గది అంతా చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా వుంది.. రమేష్ కూర్చున్న కుర్చీ వెనకాల అమర్చిన షెల్ఫ్‌లో పుస్తకాలు, కొన్ని మెడికల్ జర్నల్స్ నీటుగా సర్దివున్నాయి. చిన్న బాటరీ లైటు, చిన్న సుత్తి.. కొన్ని బ్లాక్స్ వివిధ ఆకారాలలో, ఆ టేబుల్ నిండా పరుచుకొని వున్నాయి.
మేరు టీ తాగి కప్పు ట్రేలో పెడుతూ.. “రమేష్ నేను ఎక్కువగా కలలు కంటూవుంటాను..” అన్నాడు ఉపోద్ఘాతంగా.
“కలలు కనడం ఆరోగ్యానికి మంచిదే, అసలు మనమందరం కలలు కంటూ వుంటాము. గుర్తించినా గుర్తించకపోయినా కొన్ని కలలు ఎంతో వాస్తవానికి దగ్గరగా వుండి తెలివివచ్చాక కూడా మనల్ని వెన్నడుతాయి, కాని అప్పటికి జ్ఞాపకం వున్నా తరువాత మెల్లగా వాటిని మరచిపోతాము.”
“నిజమే మొదట్లో నేను అలాగే అనుకున్నాను. ఆ కలలు ఊరికినే వస్తున్నాయి అనుకున్నాను కాని అవి నన్ను వెంటాడుతూనే ఉన్నాయి” అన్నాడు మేరు.
“అసలు కలలు, చాలా తక్కువగా ఒకదానికి ఒకటి సంబంధం లేనివిగా వుంటాయి.. కాని మనలో వున్న కోరికలు, అసంతృప్తులు, భయాలు ఇవన్నీ కలసి కూడా కలలుగా వస్తూ వుంటాయి.. కొన్ని ఎందుకో ఒకే రకమైనవి మనల్ని వెంటాడుతూ వుంటాయి. అసలు ఎలాంటి కల నిన్ను వెంటాడుతోందో చెప్పు” అని అడిగాడు రమేష్.
రమేష్ గొంతు మంద్రంగా హుందాగా ఒక పేషంటుని అనునయిస్తున్నట్లుగా ఉంది. ఆ విధానంలో ఎంత ఆప్యాయత కనబడుతోంది. ఆ అభిమానంతోటే మేరుని అర్థం చేసుకోవడాని ప్రయత్నిస్తున్నాడు.
“పాములు, ముఖ్యంగా ఒక పెద్ద నాగుపాము.. కనబడుతుంది.. ఆ ఆడపాము హఠాత్తుగా నృత్యం చేస్తుంటుంది.”
“ఆ పాము ఆడదని ఎలా అనుకుంటున్నావ్ మేరు?”
“నాకు తెలుస్తూవుంటుంది. నా సిక్స్త్ సెన్స్ పని చేస్తూ వుంటుంది. నన్ను రకరకాలుగా రెచ్చగొట్టాలని చూస్తుంది. రమేష్, నా కలలో నేను రాజుని..”
“కలలో మనం ఎవరైనా కావచ్చు మేరూ” అన్నాడు రమేష్.
“కలలో మాత్రమే కాదు, నిజంగా నేను ఒక రాజుని నా పూర్వజన్మలో..” అంటూ తన అనుభవాలన్నింటినీ రమేష్‌కి వివరించాడు మేరు. శ్రీశైలం తవ్వకాల్లో దొరికిన ‘శిల్ప’ విగ్రహం దగ్గర నుంచి కేతకి ద్వారా తనకి జరిగిన అనుభవాల దాక అతనికి వివరంగా వివరించాడు. “ఇంతేకాదు రమేష్, నేను నాడీ జ్యోతిష్యుడిని కూడా కలిసాను.. అతను కూడా నేను రాజవంశీకుడననీ, నేను రాజులకాలం నాటి వ్యక్తినని ఖచ్చితంగా చెప్పాడు.”
“అంతా బాగానే వుంది, కానీ, నువ్వు పునర్జన్మలని నమ్ముతున్నావా?”
“మొత్తం భారతీయ తత్వశాస్త్రమే దీన్ని నమ్ముతుంది. ‘పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం’.. ఇదొక చక్రం. ముక్తి లభించేవరకూ ఆత్మ మరో శరీరాన్ని వెతుక్కుంటూనే ఉంటుంది. అంతా విధి పైనా, కర్మ మీదా ఆధారపడి ఉంటుంది” చెప్పాడు మేరు.
“మేరూ, నువ్వు చెప్తున్నదంతా నువ్వు చదివినవి లేదా విన్నవి మాత్రమే. నువ్వు నిజంగా వీటిని నమ్ముతున్నావా?”
“అవును రమేష్, నాకు దేవుడిపైనా, విధిపైనా విశ్వాసం ఉంది కాబట్టి నేను వీటిని నమ్ముతాను. నీకు నమ్మకం లేదా?”
“నేను అజ్ఞేయవాదిని” చెప్పాడు రమేష్.
“అది సంశయాత్మకం” అన్నాడు మేరు.
“ఒక రకంగా అన్నీ సంశయాత్మకాలే మేరూ, స్థాయిలో భేదమంతే. దేవునిపై అమితమైన విశ్వాసం ఉన్న ఓ వ్యక్తికి జబ్బు చేసిందనుకో, వెంటనే వైద్యుడి దగ్గరకు పరుగెత్తుతాడు. అంతేకానీ కేవలం ప్రార్థన చేసి, చేతులు జోడించి ఊరుకోడు కదా? ఎన్నో సూపర్ స్పెషల్ డిగ్రీలున్న వైద్యులు కూడా ఒక్కోసారి సమస్య తీరాలంటే దేవుడిని తలచుకుంటారు.”
“కానీ దైవమంటే పరమాత్మ అనేందుకు నిదర్శనాలున్నాయి.”
“అయినా, మేరూ, ఇవన్నీ నీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటాయి. దేవుడున్నాడని నువ్వు నిరూపించదలచావనుకో, అందుకు తగ్గ తర్కాన్ని నిర్మించుకోవాలి. ఓ నాస్తికుడితో మాట్లాడు. సరే, ఒక జోక్ చెప్తా విను. ఓ మతగురువు దేవుడి ఉనికి గురించి, ఆయన మహిమలని గురించి ఓ నాస్తికుడిని నమ్మించాలని ప్రయత్నిస్తున్నాడు. ‘నాయనా నువ్వు చాలా ఎత్తు నుంచి కిందకి పడిపోయి కూడా, ఏ చిన్న దెబ్బ తగలకుండా బయట పడ్డావనుకో. అప్పుడు ఈ అనుభవం గురించి ఏమనుకుంటావ్?’ అడిగాడు మతగురువు. ‘ఒక్కొక్కసారి అలా జరుగుతూ వుంటుంది..’ చెప్పాడు నాస్తికుడు. మతగురువు తన పట్టు వదల్లేదు. ‘జాగ్రత్తగా ఆలోచించి చెప్పు, మళ్ళీ నీకు అలాగే జరిగి నవ్వు చిన్న దెబ్బ అయిన తగలకుండా బయటపడ్డావనుకో అప్పుడు?’ అన్నాడు.. ‘ఏముంది, అలవాటయింది అనుకుంటాను, సాధన, అంతే’ అన్నాడు మొండిగా నాస్తికుడు, అందుకే, ప్రతి ఒక్కరీ తమదైన సొంత తర్కం ఉంటుంది” చెప్పాడు రమేష్.
ఆ జోక్‍కి నవ్వకుండా ఉండలేకపోయాడు మేరు,
“జోక్ బావుంది, కానీ రమేష్, నేను చెబుతున్నది నీకు అర్థం కావటం లేదు. ‘పూర్వజన్మలో నేను రాజుని’ అన్న కల మాటిమాటికి వస్తోంది.. దీనివెనక ఏదో వుంది అన్న అనుమానం, తెలుసుకోవాలన్న కుతూహలం! నమ్మలా వద్దా అనుకుంటూ ఈ రెండింటి మధ్య మనసు నలిగిపోతోంది.”
“నిజమే ఒప్పుకుంటాను. దీన్నే హిప్నాటిక్ రిగ్రెషన్ అంటాం.. కాని నువ్వు చాలా తెలివైన వాడివి, చదువుకున్నవాడివి. కనీసం నిన్ను నీవు అర్థం చేసుకోగలగుతున్నావు.. ఏవి కలలు ఏవి వాస్తవాలు అని గ్రహించడానికి సమయం పట్టినా నిన్ను నీవు తెలుసుకుంటున్నావు. నువ్వు మరికొంత ప్రయత్నించి ప్రాక్టికల్‍గా ఉంటే, ఇవన్నీ మాయమైపోతాయి.” చెప్పాడు రమేష్.
రమేష్ మాటలని అర్థం చేసుకుంటూ.. “నీకు ఇంకో విషయం చెబుతాను” అన్నాడు మేరు. “నా భార్య శిల్ప చాలా ప్రాక్టికల్ మనిషి.. కలల్ని అంటే వాస్తవం కాని దానిని ఏది నమ్మదు.. కానీ ఎందుకనో ఆమె ధోరణిలో ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తోంది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సౌందర్యాన్ని ఆరాధిస్తున్నట్లుగా, సంగీతం లలితకళలను ఆస్వాదిస్తున్నట్లుగా మాట్లాడుతుంది.”
“నువ్వు ఆమెని బాగా ప్రభావితం చేశావని మాత్రం చెప్పగలను..” అన్నాడు రమేష్.
“మరి కేతకి?”
“ఆమె ఎవరూ? ఆమె ఆలోచనలు నిన్ను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు? నువ్వు ఆమెని మహా అయితే ఒకటి రెండు సార్లు కన్నా ఎక్కువ కలవలేదుగా? ఇంతకీ నువ్వు ఈమె గురించి శిల్పకి చెప్పావా?”
“లేదు.. కాని కేతకి ఆలోచనలు నావీ బాగా కలుస్తున్నాయి.. నాలాగే ఆమె కూడా స్వాప్నికురాలు, సున్నితమైనది.. సౌందర్యరాశి. ఆమె రూపంలో శిల్పలాగా అందంగా ఉండకపోయినా.. నా మనసులో వున్న ‘శిల్ప’ ఊహలకి అనుభవాలకి దగ్గరగా వుంటుంది” చెప్పాడు మేరు.
“అన్నీ బాగానే ఉన్నాయి మేరు.. ఇప్పుడేం చేస్తావు? ఐనా ఇన్నేళ్ళు కాపురం చేసిన తరువాత.. కేతకికి దగ్గర అయ్యి నీ భార్యని, కొడుకుని వదిలేస్తావా… అసలు నిన్ను ఏ సమస్య కలవర పెడుతోంది మేరూ? ఎందుకలా సతమతమైపోతున్నావ్? అంటూ మృదువుగా అడిగాడు రమేష్.
ఆ ఆప్యాయతకి మేరు చలించి పోయ్యాడు. కళ్ళలో నీరు. “నేను చాలా అయోమయంలో ఉన్నాను రమేష్” అన్నాడు గొంతు పూడుకుపోగా. “ఎందుకో హఠాత్తుగా జీవితం మీద ఆసక్తి పోయింది.. బోర్‍గా అనిపిస్తుంది, ఈ రొటీన్ లైఫ్ అంటేనే విరక్తిగా వుంది.. ఇలా నా గతం గుర్తుకొచ్చినప్పుడు. మామూలుగా అయితే నా పనిలో నేను మునిగిపోతాను.. కానీ ‘గతం’ గుర్తొస్తేనే ఇబ్బందంతా..” అంటూ మేరు తన మనసులో అలజడిని రమేష్ ముందుంచాడు.
మేరుని ఇంకా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనిపించింది రమేష్‍కి.
“మేరు మనం చాలా మాట్లాడుకున్నాము. ఇక ముగిద్దాం.. ఆలస్యం అవుతోంది. నీవు మంచి చెడు ఆలోచించగలవు. ఇంక నా అవసరం రాకపోవచ్చు. వీలు చూసుకుని శిల్పని తీసుకొని ఇంటికి రా” అంటూ కుర్చీలో నుంచి లేచాడు రమేష్.
మేరు కూడా తేలికపడ్డ మనసుతో భయలుదేరాడు.
అధ్యాయం 19
శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు యొక్క కట్టడం పాతాళగంగకు ఒక కిలోమీటర్ కింద భాగంలో వుంది. దీనివలన చాలా మార్పులు వచ్చాయి. దట్టమైన నల్లమల అడవులలోకి వెళ్లడానికి ఇప్పుడు సులభమైయింది. కొత్త జీపుతో ప్రాజెక్టు దాకా వెళుతున్నప్పుడు రుక్కమ్మ మాటలు జ్ఞాపకం వచ్చాయి మేరుకి. అప్పట్లో శ్రీశైలం వెళ్ళాలంటే ఎంత కష్టమో ఎప్పుడు చెబుతూ వుండేది.
“శ్రీశైలం వెళ్ళడానికి నాలుగు ముఖ్యమైన దారులు వున్నాయి. రెండు దారులు క్రిష్ణానది కుడివైపు నుంచి, రెండు ఎడమవైపునుంచి. అప్పట్లో దట్టమైన అడవి, అందులో క్రూరమృగాలు. అంత దట్టమైన అడవి గుండా వెళ్ళాలంటేనే భయంగా వుండేది.. అడవిలో వుండే చెంచులు, గిరిజనులు, యాత్రికులకు సహాయం చేసేవారు. యాత్రికులలో, భక్తులలో ఒక నమ్మకం వుండేది – శివుడు పార్వతి మానవుల వేషంలో, దారిలో దోపిడీ దొంగల నుంచి, క్రూరమృగాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులను కాపాడుతారని. కావాలంటే, నీకు ఎప్పుడైనా కలిస్తే మీనాక్షమ్మని అడుగు” అనేది, ఆ రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటూ.. ఆ రోజులని తలచుకొన్నప్పుడల్లా కొంగుతో కళ్ళు ఒత్తుకొనేది రుక్కమ్మ. ఆ జ్ఞాపకాలన్నీ మూడు తరాల వెనకనాటివి అయినా ఎప్పుడు చెప్పిన అప్పుడే జరిగినట్లు వివరించేది. “వాళ్ళు ఒకసారి శ్రీశైలం చూడటం కోసం వెళుతున్నప్పుడు అందరూ గుంపుగా వెళుతున్నారు. ఎంత దట్టమైన అడవి అంటే చీకట్లో చెట్టు భూతాల్లా కనిపించేవి, పులి గర్జింపులు వినబడుతూ వుండేవి. నడుస్తూ వెళుతూంటే వాళ్ళ వెనక దొంగల అరుపులు వినబడేవి. భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంటే ఒక చెంచి లాంతరు పట్టుకొని వచ్చింది దేవతలా, ఆ చీకటిలో ఆ లాంతరు వెలుగు వెయ్యి నక్షత్రాల వెలుగులా ఉందని మీనాక్షమ్మ చెప్పింది..”
ఎప్పుడు శ్రీశైలం ప్రసక్తి వచ్చినా ఈ సన్నివేశాన్ని తప్పకుండా చెప్పేది రుక్కమ్మ. ఆ సన్నివేశాన్ని ఎంతో ఉత్కంట భరితంగా, ఆవేశంగా చెప్పేది. కళ్ళకి కట్టినట్లుగా. వింటుంటే అక్కడికి వెళ్ళినట్టుగా వుండేది. సందర్భానికి తగ్గట్టు గొంతు మార్చి చెప్పడం మేరుని ఆకట్టుకునేది.
ఆలోచిస్తూ నడుపుతున్న మేరు జీపుకి అడ్డంగా కొన్ని జింకలు గుంపుగా పరిగెత్తాయి. సడన్ బ్రేక్ వేశాడు. వాటి అందన్నీ, చలాకీతనాన్నీ చూసేలోగానే రివ్వుమంటూ దూకుతూ వెళ్ళిపోయాయి. మేరు పరిసరాలని పరిశీలించాడు. చుట్టూతా కొండ రాళ్ళు. అన్ని కలిసి ఒక గుహలా కనిపించింది, అందులో నుంచి తెల్లని, బక్కపలచని వ్యక్తి బయటికి వస్తూ కనిపించాడు. ఇంతటి నిర్మానుష్యమైన అడవిలో ఆ వ్యక్తి అక్కడ కనిపించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. జీపుని మెల్లగా నడుపుతూ అతనికి దగ్గరగా వెళ్ళాడు.. అతను చుట్టుపక్కల దేనిని పట్టించుకోకుండా అక్కడ వున్న పొదలలో ఏదో వెదుకుతున్నాడు.. మేరు జీపుని ఆపి కిందకి దిగి అతనికి దగ్గరగా వెళ్ళాడు.
“నమస్తే” అన్నాడు.
అతను చిరునవ్వుతో తల ఊపాడు, నమస్కారం అందుకున్నట్లుగా.
చాలా తెల్లగా వున్నాడు. చూడడానికి విదేశీయుడిలా వున్నాడు.. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చెట్టుకింద గట్టిగా పలకలా ఉన్న బండరాయి మీద కూర్చున్నాడు. మేరు కూడా అతనితో పాటుగా వెళ్ళి అతనికి దగ్గరగా కూర్చున్నాడు.
అతను కాషాయిరంగు పంచ కట్టుకున్నాడు. పైన ఆచ్ఛాదన లేదు. తల మీద వెంట్రుకలు లేకుండా నున్నగా గుండు గీసుకున్నాడు, పిలక పట్టుకోకుండా. విశాలంగా వున్న నుదురు. దాని మీద విభూది లాంటి గుర్తులు కాని కుంకుమ బొట్టుగాని లేదు. చురుకుగా మెరుస్తున్న కళ్ళు జ్ఞానంతో నిండి ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. ఏం మాట్లాడాలో తెలియక మానంగా అతనిని గమనిస్తూ వుండిపోయాడు మేరు.
“మేరు కాంచన, నువ్వు వస్తావని నాకు తెలుసు” అన్నాడు ఆ సన్యాసి అతి సౌమ్యంగా.
మేరు అదిరిపడ్డాడు, ఆశ్చర్యంతో గభాలున లేచి నిలబడ్డాడు.
“మీరు.. ఎవరు స్వామి మీరు?” అని అడిగాడు.
“నేను స్వామి చైతన్యని. పరీక్షగా చూడు. నన్ను చూసినట్లుగాని కలుసుకునట్లు గాని జ్ఞాపకం రావడం లేదా?” అన్నాడు నవ్వుతూ.
మేరు అతన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు, కాని ఏదో తెలియని భయం ఆవరించింది.
“నువ్వు గుర్తు పట్టలేవు, నాకు తెలుసు. నా పూర్వజన్మలో నేను నీ రాజ్యంలో రాజగురువుని. అప్పట్లో నీవు గుప్తనిధుల గురించి విపరీతంగా ప్రయత్నించేవాడివి. నిన్ను అలాంటి స్థలాలకు తీసుకువెళ్ళి, నీకు చూపెట్టేవాడిని. ముహుర్తాలు కూడా పెట్టివాడిని. ఒకసారి ఓ పాడుపడిన దేవాలయంలోకి వెళ్ళాము. అది ఈశాన్య దిశలో ఉన్న దేవాలయం. అక్కడ నీకు బంగారు నాణాలతో నిండిన పెద్ద లంకెబిందె దొరికింది. అది చాలా లోతులో పాతపెట్టబడి వుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా పైకి తీయలేకపోయావు. అప్పుడు ‘బలి’ ఇవ్వమని నేను నీకు చెప్పాను. అందమైన, యవ్వని అయిన అమ్మాయిని బలి ఇవ్వాలని చెప్పాను.”
సన్యాసి మాటలు వింటుంటే మేరు తల తిరిగినట్లయింది, సొమ్మసిల్లిపోతున్నట్లయింది. స్పృహ వచ్చేసరికి తాను – స్వామీజీ పక్కనే చాప మీద పడుకుని ఉండడం తెలిసింది మేరుకి. స్వామీజీ మాత్రం ప్రశాంతంగా చేతిలో వున్న విసెనకర్ర విసురుకుంటూ ఉన్నారు. ఆయన ముఖంలోని చిరునవ్వు బాగా పరిచయం ఉన్నట్లు తోచింది మేరుకి, అభయమిస్తున్నట్లు అనిపించింది.
“కానీ స్వామీ, మీరు చాల వింతగా ఉన్నారు..” అన్నాడు.
“నేను విదేశంలో మళ్ళీ జన్మెత్తాను. అక్కడ నేను పారా-సైకాలజీలో పరిశోధన చేశాను. ఆ క్రమంలో భాగంగా నేను భారతదేశానికి చెందినవాడిననీ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినవాడినని తెలుసుకున్నాను. ఒక రకంగా ఈ భావనే నన్ను లాక్కొచ్చిందనే చెప్పవచ్చు. దాని కోసం నా దేశాన్ని విడిచి దూరంగా ఇక్కడికి వచ్చేశాను. ఈ అడవిలో నేను అక్కమహాదేవి సూక్ష్మశరీరాన్ని కలవగలిగాను. అన్ని బంధాలను వదిలించుకోడానికి తీవ్రమైన ధ్యానం చేశాను” చెప్పాడతను.
“నా గురించి మీకెలా తెలుసు?”
“కాలంలో ప్రయాణించడం సాధన చేశాను. భగవద్గీత, ఉపనిషత్తులు అధ్యయనం చేశాను.
‘బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప॥’
ఇది భగవద్గీతలోని నాలుగవ అధ్యాయంలో అయిదవ శ్లోకం.
కృష్ణభగవానుడుకి – జన్మించిన ప్రతి మనిషి యొక్క పూర్వజన్మ వివరాలు తెలుసు.”
“స్వామీజీ మరి మీరు ఎందుకు ఇక్కడ జన్మించలేదు? విదేశంలో, అదీ వేరే జాతిలో ఎందుకు జన్మించారు? పైగా క్రైస్తవులు జన్మ, పునర్జన్మలని నమ్మరు కదా?”
“నిజమే. కానీ పాశ్చాత్య దేశాలలో ప్రసిద్దికెక్కిన కొంతమంది శాస్త్రవేత్తలు, హిందువులు కాకపోయినప్పటికీ ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. పైథాగరస్ గురించి నీకు తెలుసా? ‘మరణానంతరం, హేతుబద్ధమైన మనస్సు, శరీర బంధాల నుండి విముక్తి పొంది, ఒక అతీంద్రియ యానకాన్ని అధిరోహించి, చనిపోయిన వారి ప్రాంతంలోకి వెళుతుంది, దానిని తిరిగి ఈ ప్రపంచంలోకి – మానవ జన్మలోనో, జంతు జన్మలోనే పంపే వరకు, అక్కడే నివసిస్తుంది. వరుస ప్రక్షాళనలకు లోనైన తర్వాత, అది తగినంతగా శుద్ధి చేయబడినప్పుడు, అది తాను వెలువడిన ఆ శాశ్వతమైన మూలానికి తిరిగి వస్తుంది’ అని ఆయన చెప్పాడు” అన్నాడు స్వామీజీ.
స్వామిజీ చెప్పింది వింటూ ‘ఇది చెప్పింది పైథాగరసా? భగవద్గీత శ్లోకానికి వ్యాఖ్యానంలా వుంది’ అనుకొన్నాడు మేరు మనసులో.
“స్వామీజీ, మీకు ఎవరైనా జ్ఞాపకం ఉన్నారా.. అంటే పూర్వజన్మలోని మనిషిని ఎవరినైనా ఇక్కడ గుర్తుపట్టారా?” అడిగాడు మేరు.
“గుర్తుపట్టాను, ఆమె అప్పటి రాజనర్తకి. ఆ అమ్మాయి ఇప్పటి పేరు కేతకి.”
“కేతకియా? ఎక్కడ స్వామీజీ?”
“ఆమె సూక్ష శరీరాన్ని కలిసాను. ఆమె ‘యోగదృష్టి’ని అధ్యయనం చేస్తోంది.”
మేరు మనసులో ఎన్నో ఆలోచనలు తేనెపుట్ట కదిలినట్లు రొదపెడుతున్నాయి.
“నీ ఆలోచనలని గ్రహించగలను మేరు! ఒక్క విషయం నీకు స్పష్టం చేస్తాను, విను. చావు అనేది అల్పవిరామం మాత్రమే, ముగింపు కాదు. ప్రతి జన్మా మన కర్మ పై ఆధారపడి ఉంటుంది. ఇది ఆధిభౌతికం కాదు.. చాలా సహజమైన చర్య. ప్రతి జన్మలో ప్రతిచర్యని, పర్యవసానాలని అనుభవించాల్సిందే. ఆత్మకి విమోచనం కలిగే దాక.. పాపపరిహారం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మన కర్మలకి దేహం ఒక పనిముట్టు లాంటిది.”
అతను చెబుతున్నవన్నీ చాలా శ్రద్ధగా వింటున్నాడు మేరు.
“ఇదంతా మన సొంత దృక్పథం లాంటిది. ఇంకా సరళంగా చెప్తాను. నేను నీకు కవిత రాసి ఉన్న ఓ కాగితాన్ని ఇచ్చాననుకో. అర్థం తెలియని వాళ్ళకి అది కేవలం ఓ కాగితం ముక్క. అర్థం చేసుకుంటే కవితనే ఆస్వాదిస్తారు, అది ఏలాంటి కాగితం మీద ఉందో గమనించరు.”
తాను చదివిన కొన్ని తత్వశాస్త్రాల గురించి అతనితో చర్చించాలనుకున్నాడు మేరు.
“స్వామీజీ నేను చాలా పుస్తకాలు చదివాను. పారా-సైకాలజీ లోని ఎన్నో ఉదంతాలు చూశాను. కానీ స్వామీజీ నిజం చెప్పాలంటే, నేను నా జీవితం పట్ల చాలా కలత చెందాను, ఎన్నో విషయాలను పరిష్కరించుకోవాలి.”
“మేరూ నువ్వు రేమండ్ మోడి రాసిన పుస్తకం ‘లైఫ్ ఆఫ్టర్ డెత్’ చదివావా?”
“చదివాను, స్వామీజీ, అంతేకాదు దాని తరువాత పుస్తకం ‘రిఫ్లెక్షన్స్ ఆన్ ఆన్ లైఫ్ ఆఫ్టర్ డెత్’ కూడా చదివాను కాని..” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు మేరు.
మేరు చెప్పడం పూర్తి చేయకముందే, స్వామిజీ ప్రశాంతంగా, నిదానంగా “ఆ రేమండ్ మోడిని నేనే” అన్నాడు.
(ఇంకా ఉంది)