[జె. శ్యామల గారు రచించిన ‘కనకరాజు.. కంప్యూటరు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
కనకరాజుకు తనదైన ఏ వస్తువునూ ఇతరులకు ఇవ్వడం కాదు కదా, ఇతరులు తాకడం కూడా ఇష్టం ఉండదు. అంతేకాదు, ఇంట్లో వాళ్ళే కాదు, స్నేహితులు, దగ్గర బంధువులు సైతం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుని, చూపించడానికి తెస్తే, వాళ్లు దాన్ని పట్టుకునే తీరు చూసి విలవిలలాడిపోతాడు. ఆ వస్తువుకు అర్జెంటుగా ఒక ముసుగు (ఓ ప్లాస్టిక్ కవర్) తొడగాల్సిందే అంటాడు. లేదంటే వెంటనే తన దగ్గరున్న ఏదో ఒక కవర్ అందిస్తాడు కూడా. ఇంట్లో వాళ్లయితే ఆయన బాధ పడలేక ‘తప్పదురా భగవంతుడా’ అని వెంటనే వస్తువుకు ముసుగువేసి, ఆయన చూపు పడని సమయాల్లో తీసేస్తుంటారు. బంధువులు, స్నేహితులైతే కనకరాజు చెప్పినట్లు చేసి, బతుకు జీవుడా అని బయటపడి, ఆపైన ఆ కవరును గాల్లో వదిలేస్తారు. వాళ్లంతా చాటుగా కనకరాజును, ‘ముసుగురాజు’ అని చెప్పుకుంటారు. అటువంటి కనకరాజుకు మారిన కాలం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. అదే.. కంప్యూటర్. కనకరాజుకు టెక్నికల్ అంశాల పట్ల, యంత్ర సాధనాల పట్ల ఆసక్తి మెండు. తానూ ఓ కంప్యూటర్ కొనుక్కోవాలనుకున్నాడు. అందుకు చాలానే మార్కెట్ సర్వే చేశాడు.
చివరకు ‘కంపూ వరల్డ్’లో కొనడానికి సిద్ధపడ్డాడు. యక్ష ప్రశ్నలు వేసి, షాపు వాడిని ముప్పుతిప్పలు పెట్టాడు. తీరా ఇంటికి తీసుకెళ్లాక పని చేయకపోతే.. అని సందేహం. షాపు వాడు ఆపరేట్ చేసి చూపిస్తానన్నాడు. తనది అని నిర్ణయించుకున్నాక దాన్ని ఇతరులు తాకడమా.. “అహహ.. వద్దులెండి” అన్నాడు. డబ్బు చెల్లించి భద్రంగా కంప్యూటర్ను ఆటోలో ఇల్లు చేర్చాడు. తన బెడ్ రూమ్‌లో ఓ పక్కగా టేబుల్ పైన దట్టంగా క్లాత్‌లు పరిచి పెట్టాడు అవడానికి అది ల్యాప్‌టాప్ అయినా, దాన్ని స్థిరంగా ఓ చోట ఉంచడమే ఉత్తమం అనుకున్నాడు. కనకరాజుకు కొత్త వస్తువుల విషయంలో సెంటిమెంట్లు ఉన్నాయి. కొబ్బరికాయ తెప్పించి భక్తిగా కొట్టాడు. ఆ తర్వాత ల్యాప్‌టాప్ స్క్రీన్కు ఒక కవరు, కీ బోర్డుకు ఒక కవరు తొడిగేశాడు. ఏనాడో నేర్చుకున్న టైపింగ్ గుర్తు తెచ్చుకుంటూ టైప్ చేయాలని దాని ముందు కూర్చున్నాడు. తాకితే దానికి నొప్పి కలుగుతుందేమో అన్నట్లు సుతి మెత్తగా టైప్ చేయడం మొదలు పెట్టాడు. ఆ కాస్త ఒత్తిడికి అక్షరాలు పడకపోవడంతో అయిష్టంగానే ఇంకొంచెం గట్టిగా నొక్కాడు. అలా కుస్తీ పడుతూ ఓ గంట కూర్చునేసరికి నడుం నొప్పి మొదలైంది. అంతలోనే అతడికి మరో ఆలోచన వచ్చింది. కంప్యూటరుతో పాటు ఉన్న ఒరిజనల్ కీ బోర్డు పాడవకుండా ఉండాలంటే ఎక్స్టర్నల్ కీ బోర్డ్ కొని వాడుకోవడం ఉత్తమం. అనుకోవడమేమిటి ఆ మర్నాడే మరో కీ బోర్డ్ కొనేశాడు కూడా. కొన్నాళ్లకు టైపింగ్ విసుగొచ్చింది. ‘అయినా కంప్యూటర్‌తో అందరూ ఏం చేసుకుంటే నాకెందుకు’ అనుకుని, రోజువారీ లెక్కలు, రాసుకోవడం మొదలుపెట్టాడు. అందులో మళ్లీ గజిబిజి. ఎక్కడో పొరపాటు పడడం.. దాంతో ఆదాయం, వ్యయం, మిగులుకు లంకె కుదరక, ఖర్చులు సరిగా చెప్పడం లేదని ఇంట్లో అందరిపై రంకెలు వేయడం మొదలుపెట్టాడు.
ఇంకో రోజు కనకరాజు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి హాల్లో కొడుకు, స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. ఆ స్నేహితుడు “నువ్వు ఎన్నైనా చెప్పు, అనుపమ బాగుంటుంది” అన్నాడు. అందుకు కొడుకు “పల్లవి కూడా బాగుంటుంది. నాకు అదే ఇష్టం” అన్నాడు. “ఆ మాటకొస్తే నేను కూడా గౌతమి, ప్రగతి, వసంత అవసరాన్ని బట్టి ఇష్టపడతాను” అంటుంటే విన్న కనకరాజుకు మతి పోయింది. ఆగలేక “వీళ్లంతా ఎవరు? మరీ బరి తెగించి మాట్లాడుతున్నారు” కోపంగా అన్నాడు.
వెంటనే ఆ ఇద్దరూ పడీ పడీ నవ్వసాగారు. ఎంతకూ ఆపడం లేదు.
కనకరాజు కోపం ఇంకా పెరిగింది. “సిగ్గుపడాల్సింది పోయి నవ్వుతున్నారేమిటి. పిదపకాలం.. పిదప బుద్ధులు” అన్నాడు. అప్పుడు కొడుకు నవ్వాపుకుంటూ, “ఇవన్నీ కంప్యూటర్లో వాడే తెలుగు ఫాంట్ల పేర్లు నాన్నా” అన్నాడు.
అది విని తన అవగాహనా లోపానికి సిగ్గుపడుతూ, “అదా సంగతి.. అన్నీ అమ్మాయిల పేర్లు వినిపిస్తేనూ..” సణిగి, లోపలకు నడిచాడు.
ఆ తర్వాత తన కంప్యూటర్లో కూడా తెలుగు ఫాంట్స్ పెట్టించుకుని , తెలుగు టైపింగ్ సాధన మొదలు పెట్టాడు. తెలుగు టైపింగ్, ఇంగ్లీష్ లాగా సులభం కాదని తెలుసుకున్నాడు. అయినా విక్రమార్కుడిలా సాధన చేసి, పది నిముషాలకో అక్షరం కొట్టే స్థాయికి వచ్చాడు. దాంతో ఇంట్లో ఉన్న శ్లోకాల పుస్తకాలు ముందు పెట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు.
ఇవన్నీ ఇలా ఉంటే కంప్యూటర్‌పై, వైరస్ గురించిన మెసేజ్ కనపడింది. అంతే. కనకరాజు గుండెల్లో రాయిపడింది. తన కంప్యూటరుకు వైరస్ సోకితే.. ఇంకేమైనా ఉందా? కనకరాజు గగ్గోలు పెట్టాడు. కొడుకు “బిజీగా ఉన్నా, చూద్దాంలే” అన్నాడు. దాంతో ఏది నొక్కినా వైరస్ వచ్చేస్తుందన్న భయంతో ఓ వారం పాటు కంప్యూటర్ తాకడం మానేశాడు. అంతలో మేనల్లుడు మెతక రావ్, కంప్యూటర్ వైరస్ నిరోధానికి క్యాస్పర్ స్కై లోడ్ చేస్తానని వచ్చాడు. అది కూడా మహద్ ఘట్టమే. దాన్ని గురించి కనకరాజుకు లక్ష సందేహాలు. మనిషి గనుక మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు, కంప్యూటరుకు కూడా వేరే సమస్యలు ఏవైనా వస్తాయేమోనని కనకరాజు భయపడ్డాడు. మెతక రావ్ కంప్యూటర్ ముందు కూర్చున్నంత సేపు కనకరాజు, “జాగ్రత్త! మిగతావేవీ ముట్టుకోకు. అంత గట్టిగా నొక్కకు. ఏమాత్రం కదలనివ్వకు” జాగ్రత్త నామావళి చదువుతూనే ఉన్నాడు. ఎంత మెతక రావ్ అయినా మామను తట్టుకోలేకపోయాడు. భరించలేక.. ఏమీ అనలేక.. కక్కలేక.. మింగలేక, ఉదయాన చదువుకున్న దినఫలం ‘బంధువులతో బాధలు’ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎలాగైతేనేం పని ముగించి, కనకరాజు బారినుంచి ‘బతుకు జీవుడా’ అని బయటపడ్డాడు మెతక రావ్. ఈ కాస్తలోనే తన కంప్యూటర్, కొత్తదనం కోల్పోయినట్లు బాధపడి, పట్టెడు దూది, కొత్త పానెల్ క్లాత్ తీసుకుని కంప్యూటరును తుడవడం మొదలుపెట్టాడు కనకరాజు.
***
కనకరాజుకు తరచు వచ్చే కంప్యూటర్ కష్టాల్లో నెట్ పోవడం ఒకటి. ఆ రోజు కూడా అదే అయింది. కంప్యూటరు ఆన్ చేసి, నెట్ లేదని గ్రహించి.. హూ.. మళ్లీ విఘ్నం.. కంప్లైంట్ చేయడానికి, నెట్ వాడి నంబర్ తీసి, ల్యాండ్‌లైన్ ముందు బైఠాయించాడు. అన్నట్లు కనకరాజుకు మొబైల్ ఫోన్ వాడకం అంతగా గిట్టదు. ఆ ల్యాండ్‌లైన్ పై ఉన్న ముసుగు తీసి, దాని వంక పరీక్షగా చూసి, కాగితం చూస్తూ నంబర్ డయల్ చేశాడు. ఎంతకూ ఎత్తరు. ఎట్టకేలకు పదో ప్రయత్నం ఫలించింది.
“హలో! నేను కనకరాజును మాట్లాడుతున్నాను.. అవును.. విక్రమార్క నగర్.. ఆ.. ఆ.. నూటఇరవై మూడు నంబర్. నెట్ రావడం లేదు.. ఆ.. చూశాను. ఇంటు గుర్తు పడుతోంది. అన్నట్లు హోం పేజీలో వినాయకుడి ఫొటో తీసేసి అమ్మాయి ఫొటో పెట్టారేంటి?” అన్నాడు.
అందుకు అవతల వ్యక్తి పెద్దగా నవ్వి, “వినాయక చవితి అయిపోయింది కదండీ.. అమ్మాయి బొమ్మ అయితే బాగుంటుందని మార్చేశాం” అన్నాడు.
“ఇంతకూ నెట్” అన్నాడు కనకరాజు.
“మా సర్వీస్ సుందరం బయటకెళ్లాడు. కంప్లైంట్ నోట్ అయిందిగా. వచ్చాక చూస్తాడు” చెప్పాడు.
“సుందరమా.. సరే” అంటూ ఫోన్ పెట్టేశాడు.
సుందరం ఇదివరకు వచ్చినప్పుడు మొబైల్ నంబర్ ఇచ్చాడు. అది గుర్తొచ్చి, సుందరానికి ఫోన్ చేశాడు.
“నేను వచ్చి చూస్తాలెండి. ఇప్పుడు హరిశ్చంద్ర నగర్లో ఉన్నా. ఒక గంట పడుతుంది” తాపీగా అన్నాడు సుందరం.
చేసేదిలేక “మర్చిపోకు” అంటూ ఫోన్ పెట్టేశాడు.
ఓ రెండు గంటలు గడిచాక సుందరం రానే వచ్చాడు.
అల వైకుంఠ పురంబులో, నగరిలో అన్న చందాన కనకరాజు, అతడిని తన బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి, తన కంప్యూటర్ చూపించాడు.
సుందరం గబగబా ఏవేవో ఓపెన్ చేసి, నంబర్లు ఏవో మార్చి చూశాడు. అయినా రాలేదు. కనకరాజు అసహనంగా చూస్తున్నాడు. “సార్.. బయట వైరు చూసి వస్తాను..” అంటూ బయటకు నడిచాడు. వెనకాలే కనకరాజు వెళ్లి గేటు దగ్గర నిలుచున్నాడు. సర్వీస్ సుందరం వెంటనే వెనక్కు వచ్చి “వైరు తెగింది, మార్చాలి.. వైరు తేవాలి మళ్లీ వస్తా” అని బైక్ ఎక్కేశాడు. “తొందరగా రండి” అని ఉస్సురంటూ లోపలికి నడిచాడు. ఎట్టకేలకు ఆ సాయంత్రం నెట్ సర్వీస్ సుందరం కొత్త వైరు తెచ్చి వేశాడు. “సార్! ఇప్పుడు ఓ.కే.నా” అడిగాడు. “ఆ.. ఆ.. ఓ.కే. చాలా థాంక్స్. పాపం.. మీకు ఇలా రోజంతా తిరిగి పనిచేయడం కష్టమే..” అంటూ ధన్యవాదాలతో పాటు సానుభూతి కూడా పంచాడు. అదంతా అవతలివారికి తనపై ప్రత్యేక అభిమానం కలిగిస్తుందని బలంగా నమ్ముతాడు. అందుకు సుందరం “తప్పదు కదా సార్” అంటూ వెళ్లి బైక్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కనకరాజు నమ్మినట్లే సుందరానికి కనకరాజు అంటే పిసరంత గౌరవం పెరిగింది. ఫిర్యాదులకు వెంటనే ప్రతిస్పందించడం, సందేహాలన్నీ సహనంతో విని జవాబులు చెప్పడంతో కనకరాజు మరింత ఆత్మీయత ఒలకబోస్తూ, అతడిని చూడగానే “రండి సుందరం గారూ.. ఎండలెక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్త.. మంచినీళ్లు బాగా తాగాలి. ముందు తాగండి” అంటూ గ్లాసు అందించి మర్యాద చేయసాగాడు.
కనకరాజు, కంప్యూటర్లో యూ ట్యూబ్ ఛానెల్స్ చూడడం అలవాటు చేసుకున్నాడు. ఆరోగ్యం, హాస్య కథలు, పాత పాటలు.. రాజకీయ వార్తా వ్యాఖ్యానాలు వగైరాలు. ఇలా ఉండగా ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్లారు. కనకరాజు, కంప్యూటర్ను తుడుస్తుండగా అతడి చేయి దేనికి తగిలిందో గానీ స్క్రీన్ తల్లకిందులైంది. దాన్ని అలా చూడగానే కనకరాజుకు నిలువుగుడ్లు పడ్డాయి. ఏం చేయాలో అర్థం కాలేదు.. సుందరం గుర్తుకొచ్చి, అతడికి ఫోన్ చేశాడు. రింగ్ అవుతోంది కానీ ఎత్తడంలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అలాగే అయింది. నెట్ వారికి ఫోన్ చేసి అడిగాడు. వాళ్లు, సుందరం తమ వద్ద ఉద్యోగం మానేశాడని చెప్పారు. “అయ్యో.. ఇప్పుడెలా?” అన్నాడు.
“ఏమైంది సార్” అడిగాడు అవతల వ్యక్తి.
“నా కంప్యూటర్ స్క్రీన్ తల్లకిందులైంది” చెప్పాడు కనకరాజు.
“సారీ సార్. నెట్‌కు సంబంధించి అయితే చూస్తాం కానీ కంప్యూటర్‌కు సంబంధించి మేమేం చేయలేం” ఫోన్ పెట్టేశాడతను.
కనకరాజుకు కొత్తవారిని పిలవడం ఇష్టం లేకపోయినా తప్పదని ‘తక్షణ సేవ’ కంప్యూటర్ రిపైరర్స్కు ఫోన్ చేశాడు. ఎవరూ ఎత్తలేదు. విశ్రమించని విక్రమార్కుడిలా అదే పనిగా నంబర్ నొక్కుతూనే అన్నాడు. శ్రమ ఫలించింది.. “హలో” అన్నాడు అవతలి వ్యక్తి.
కనకరాజు “నా కంప్యూటర్ తల్లకిందులైంది ఓ సారి వచ్చి చూడండి” అంటూ ఇంటి అడ్రస్ చెప్పాడు. అది విన్న తక్షణ సేవ వ్యక్తికి తల్లకిందులు సమస్య అర్థం కాలేదు. అయినప్పటికి కస్టమర్‌ను దొరకబుచ్చుకోవాలని “మా దగ్గర మనిషి ఈ రోజు రాలేదు. నేను ఒక్కడినే ఉన్నాను. మీరు తీసుకు వస్తే చూస్తాను” అన్నాడు. ‘ఎంత కష్టం వచ్చిందిరా భగవంతుడా’ అనుకుని కనకరాజు “సరే నేనే వస్తాలెండి. మీరు ఉంటారుగా” అని మూడుసార్లు అడిగి, అభయం అందుకున్నాడు. చాలా కాలం తర్వాత ల్యాప్‌టాప్‌కు కవర్లు తొలగించి, టేబుల్ పైనుంచి తీసి, జాగ్రత్తగా బ్యాగ్‌లో పెట్టి, ఇల్లు తాళం వేసి బయలుదేరాడు. ఓ పది నిముషాల్లో ‘తక్షణ సేవ’ రానే వచ్చింది. లోపలికి వెళ్లి, “ఇందాక ఫోన్ చేశాను కదా.. నేనే.. కనకరాజును” అన్నాడు.
“అవునా సార్.. చూపించండి” అన్నాడు.
కనకరాజు బ్యాగ్ లోనుంచి పదిలంగా ల్యాప్‌టాప్ తీసాడు.
షాపు అతను అందుకోబోయాడు.
కనకరాజు ఒక చేత్తో వారిస్తూ, “ఉండండి, ఉండండి.. నేనే చూపిస్తా” అంటూ కంప్యూటర్ను టేబుల్ మీద ఉంచి తెరిచాడు.
ఆన్ చేశాడు. కంగారుగా ఏదో నొక్కాడు. అతడి వేళ్లు దేనికి తగిలాయో గానీ చిత్రం స్క్రీన్ మామూలుగానే దర్శనమిచ్చింది.
కనకరాజు నోరు తెరుచుకుని ఉండిపోయాడు. అద్భుతంగా కొన్ని క్షణాలు.. అయోమయంగా కొన్ని క్షణాలు ఫీలయ్యాడు.
షాపు అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇంతవరకు ఇలాంటి కస్టమర్ తగల్లేదు మరి.
“ఏమైంది సార్” అన్నాడు.
కనకరాజు తేరుకుని స్క్రీన్ వ్యవహారం వివరించాడు.
అంతా విని షాపు అతను ఫెళ్లున నవ్వాడు.
అంతలోనే తనకేమీ గిట్టుబాటు కాలేదని గుర్తొచ్చి అతడి ముఖం నిండా విచారం, కోపం చోటు చేసుకున్నాయి.
కంప్యూటర్ క్షేమంగా ఉండడం, ఇతరులు తాకే పనిపడక పోవడంతో కనకరాజు అపరిమితానందభరితుడై “అదేమిటో మిమ్మల్ని చూసిన తక్షణం నా ల్యాప్‌టాప్ బాగయింది. ‘తక్షణ సేవ’ అని మంచి పేరు పెట్టారండీ. చాలా థాంక్స్. వస్తానండీ” అంటూ ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను పదిలంగా పట్టుకుని ఇంటి ముఖం పట్టాడు.
(సమాప్తం)
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
From J GuruPrasad Excellent narration by smt Syamala garu From J GuruPrasad
పాత తరం కంప్యూటర్లతో పడే బాధలను చక్కగా వివరించారు. అభినందనలు
కథ చాలా హాస్యభరితంగా ఉంది.శ్యామల మేడం గారికి ధన్యవాదములు 💐
చాలా రోజుల తర్వాత జె. శ్యామల గారు కనబడ్డారు కంప్యూటర్ తో. మనల్ని “కంపూ వరల్డ్” లోకి తీసుకెళ్ళి, కనకరాజు ఛాదస్తం తో నవ్వించారు. “పది నిమిషాలకో అక్షరం కొట్టే స్ధాయికి” వచ్చిన కనకరాజు నెట్ కనెక్షన్ తోను, ముసుగుల తోను పడే తిప్పలు చాలామంది అతి జాగ్రత్త పరుల్ని గుర్తుకు తెచ్చింది.👌
The Real Person!
*ఇది జె. శ్యామల గారి స్పందన* మీ విలువైన స్పందనకు ధన్యవాదాలు సి. హెచ్. సుశీలమ్మ గారు. 🙏
కనకరాజు – కంప్యూటర్ లాంటి చక్కని హస్య కధ అందించిన రచయిత్రి శ్రీమతి శ్యామల గారికి అభినందనలు
ఏ జోనర్ లో నైనా కథ రాయడం శ్యామల గారికి కంప్యూటర్ రాక ముందే నేర్చుకున్న విద్య…కంప్యూటర్ తో కనకరాజు పాట్లు కడుపుబ్బా నవ్వించాయి. హాయిగా నవ్వించినందుకు శ్యామల గారికి అభినందనలు.
It is a pleasure to read the story of overpossessive and overcaring Kanakaraju who struggles with his computer.The writer entertains the readers by maintaining the humorous tone throughout.Congratulations to Smt.Syamala. Dr.Ch.Nagamani
కంప్యూటర్ తో కనకరాజు కష్టాలు నవ్వు తెప్పించాయి.
*ఇది జె. శ్యామల గారి వ్యాఖ్య* మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు నంద్యాల సుధామణి గారు. 🙏 శ్యామల
😂😂😂 కంప్యూటర్ తో కనకరాజు గారి కుస్తీ ఆద్యంతం నవ్వు తెప్పించింది. గిలిగింతలు పెట్టే చక్కటి హాస్యకథను అందించిన రచయిత్రి శ్యామల గారికి అభినందనలు 💐💐
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మరుగునపడ్డ మాణిక్యాలు – 43: ద లాస్ట్ డ్యుయెల్
సినిమా క్విజ్-75
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 24 – మధుమతి
డా. గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి గారికి నివాళి
మసకబారని జ్ఞాపకాలు!
కుసుమ వేదన-10
పిండిన సారం : “జ్యూస్”
భాసుని పంచరాత్రమ్
చిన్నయ్య ఎండి కంకణం
‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ – సిద్ధాంత వ్యాసం – త్వరలో
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®