[శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ రచించిన ‘కమ్మనైన అమ్మపాట’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నిండు పున్నమి జాబిలి రేడు
కురిపించే పండు వెన్నెల సోనలలో
గగనంలో తారలన్నీ
మెరుపు సోకు చేసుకుని
తళుకుబెళుకు కులుకులు
చిందించే వేళలలో
వీచే గాలులలో పారిజాత పరిమళాలు
మదిని పరవశింప చేయగా
విరులన్నీ విచ్చుకుని
హాయి గొలిపే రాతిరిలో
చిన్నారీ చిట్టితండ్రీ
బోసినవ్వులా బుజ్జాయీ
ముద్దుముద్దుగా నిన్నెత్తుకుని
పాలుగారు చెక్కిలిపై
తీయతీయని ముద్దులు కురిపిస్తూ
నా చేతులనే ఊయల చేసి
ఉయ్యాల జంపాల వూపుతుండగా
నీలాల నీ కన్నుల్లో నిండారా
నిదురమ్మ దోబూచులాడుతుండగా
సరిగమపదని సప్తస్వరాలను కూర్చి
సుమ సుగంధ పిల్ల తెమ్మరలను
తేనెల తేటల పాటగ మార్చి
కొమ్మల్లో కమ్మగా పాడే కోయిల
గొంతును నేనరువుగా తెచ్చుకుని
అచ్చ తెనుగులో అమ్మ భాషలో
రామా లాలీ.. మేఘశ్యామా లాలీ..
అని నే పాడనా లాలిపాట..
ఈ జోల పాట.. కమ్మనైన అమ్మపాట..
శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు. ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణవాసి.
సాహిత్యం అంటే ఇష్టం. నవలలు చదవటం మరీ ఇష్టం. పదవి విరమణ తరువాత సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మంలో ‘పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట – చావా రామారావు మినీ రీడింగ్ హాల్’ పేరిట ఒక చిన్న లైబ్రరీని తమ ఇంటి క్రింది భాగంలో నిర్వహిస్తున్నారు. సుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు.. రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు.
ఉచిత లైబ్రరీ.. మంచినీరు, కుర్చీలు, రైటింగ్ ప్యాడ్స్, వైఫై, కరెంటు అంతా ఉచితమే. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా ఉంటారు.