Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కామెంగ్!

[డా. కోగంటి విజయ్ రచించిన ‘కామెంగ్!’ అనే కవితని అందిస్తున్నాము.]

నీలి కళ్ళ ఆకసమే మైమరచి పోయే
నీ అనంత ప్రవాహపు దారి
కొండలోయల గుండెలు హోరెత్తి పోయే
వడిగా నీ జలపాతపు అలజడి
రాల మధ్య విముక్త గీతమై నిలిచే
ఆ సెలయేటి మౌన స్థితి – ఎంతటి స్థిత ప్రజ్ఞత నీది

స్వర్గ వీధుల సందేశాలను పొదివి తెచ్చే
హిమసానువుల పూలదారివి కదా నీవు
మరువలేనిది కదా
శిలలను మలిచి దారులు చేసే
నీ చేతి సొబగుల మెరుపు
ఎన్నో యుగాల కాలగీతానివి నువ్వు కామెంగ్

ఎన్ని ఉదయాలు
నీ హొయల మేనికి మంచు తెరలై ఒదిగాయి
ఎన్ని సాయంత్రాలు
నీ నిశ్శబ్ద కాంతిని నీడలై నిలిచాయి
ఎంతటి చెక్కుచెదరని సౌందర్య మౌనివి నీవు కామెంగ్

ఎక్కడి నేను
ఎక్కడి నువ్వు
ఎలా రప్పించుకుని
నిన్నే తలచి మురిసేలా
ఎలా మలిచేసావు నన్ను
ఎలా మరువగలను నిన్ను కామెంగ్

నీతో కలిసి మనసును పరిగెత్తించే
ఆ అలల మాటల ఒరవడి
ఉరకలెత్తే సుడులు తిరిగి
మళ్లీ మళ్లీ నీ దరికి రప్పించే
నీ కలల నవ్వుల పరుగు
నీ నిష్కల్మష అలల శీతల స్పర్శ
నా గుండెను తడుపుతూనే ఉంది
నీ హిమ తుషారపు మధు హృదయం
నను నీ చెంతకు పిలుస్తూనే ఉంది

నాగరికపు తెలినవ్వులకతీతంగా
నీ పరవళ్ళ స్వచ్ఛ ప్రవాహం
మనుషులు నదుల్లా కాలాతీతంగా స్థిరంగా
కదిలిపోవలసిన సందేశాన్నిస్తూనే ఉంది

ఏ కొండ పల్లెల వేణుగానం నీలో నింపుకున్నావో గానీ
మధ్యాహ్నపు నీరెండలో నీ చెంత మెరిసే రాతి సింహాసనాలు
తేనీటి రంగులో పులకింప చేసే నీ నీరు
నా హృదయాన వాడని
తలపులై ఇంకా పిలుస్తూనే ఉన్నై

(అరుణాచల్ ప్రదేశ్ లోని కామెంగ్ నదికి ప్రేమతో)

Exit mobile version