Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కలియుగదైవం కార్మికుడు..

[సూర్యదీప్తి గారు రచించిన ‘కలియుగదైవం కార్మికుడు..’ అనే కవితని అందిస్తున్నాము.]

గధగ మెరిసే నగలే లేవని
నగలకు బదులుగ స్వేదము మెరిసెన్..

మిల మిల మెరిసే కన్నుల కాంతులు
సలసల కాగే ప్రేగులు దోచెన్..

వేకువ తోనే వేదన మొదలై
చీకటి తోనే చింతలు మరియున్..

రేపటి కోసం చూపులు త్రిప్పక
నేటిని వేటాడి మరీ బతుకున్..

డబ్బుల కట్టలు లెక్కకు లేవని
జబ్బులకయ్యే ఖర్చులు తలచున్..

పట్టు బట్టలూ పరమాన్నాలూ
మురికి బతుకులకు సరికావనుచున్

పచ్చడి మెతుకుల పళ్లెంపట్టీ
పక పక నవ్వుచు కడుపే నింపున్..

స్వార్థపు నీడల జాడే తెలియని
సాధుపుంగవుడు కార్మికుడనగన్..

కార్మికుడనగా కలియుగ దైవము
చేతులనెత్తి మొక్కగ వలయున్..

పనికి ఫలమ్ము గౌరవమిస్తూ
పరంధాముడని అతని నుతిస్తూ

తీరని ఋణమే ఆతని శ్రమయని
గుర్తించుచు ఆర్చించవలెన్..

Exit mobile version