[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతిరావు గారు రచించిన ‘కలిమిలేములు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఏ.సీ. రూమ్‌లో విశాలమైన మంచం మీద కుషన్ పరుపు మీద పడుకున్నా నిద్ర పట్టడం లేదు శ్రీపతిరావుకు. అందుకే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ మసలుతూ అవస్థపడితున్నాడు. తాగిన ఫారెన్ విస్కీ కూడా మత్తు నిచ్చి కళ్ళు మూతలు పడేలా చేయటం లేదు.
ఎన్నో కోట్లకు అధిపతి. గడచిన తరాల నుంచి సంక్రమించిన స్థిరచరాస్తులు – తను వ్యాపారంలో సంపాదించిన కోట్ల ఖరీదు చేసి డబ్బుల కట్టలు – పెద్దపెద్ద ఇళ్లు, న్యూ మోడల్ కార్లు ఇలా బోలెడు ఉన్నాయి.
తన ఇంటి కాంపౌండ్ లోనే ఒక బిల్డింగ్‌ను సపరేట్‌గా కేవలం తన కోసం అన్నట్టు విలాసవంతంగా నిర్మించుకున్నాడు. అందులోకి భార్యా, పిల్లలు కూడా రారు.
తనే, తను ఒక భర్తని అన్నీ విషయం గుర్తుకొచ్చినప్పుడు భార్య సౌదామిని ఉండే భవంతిలోని బెడ్రూమ్‌కు వెళ్ళివస్తాడు. ఒక్కడే ఏకాంతంగా ఎంజాయ్ చేయాలని అనిపించిన రోజు తన బిల్డింగ్ తను ఉంటాడు.
మనుషులతో కలిసి గడపడం కన్నా – ఒంటరిగా డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని ఫారిన్ విస్కీ సిప్ చేస్తూ, వేయించిన జీడిపప్పు పలుకులు నములుతూ మ్యూజిక్ సిస్టమ్‌లో నుంచి వచ్చే రొమాంటిక్ హిందీ పాటలు వింటూ అరమోడ్పు కన్నులతో ఆనందిస్తూ వుంటాడు, నౌకరు టేబుల్ మీద అరేంజ్ చేసి వెళ్ళిన నాన్-వెజ్ వంటకాన్ని కడుపునిండా తినేస్తాడు,
స్త్రీ పొందు కావాలని అనిపించిన రోజు ఏ కాల్ గర్లనో, అంతగా గిరాకీ లేని ఏ సినిమా యాక్ట్రెస్‌నో బుక్ చేసుకుంటాడు.
ఆ రోజు వచ్చిన అమ్మాయి పేరు రీతూ అట! అది సినినూ పేరు. అసలు పేరు ఏ విజయలక్ష్మీ, ఏ లక్ష్మీకాంతమో అయివుంటుంది. కారు పంపిస్తే కారులో వచ్చింది.
ఫెయిర్‌గా, నాజూగ్గా, గ్లామరస్‌గా ఉంది. పేరు అడిగితే ‘రీతూ’ అని చెప్పింది.. అది విన్ని శ్రీపతి పెదవుల మీద ఒక చిరునవ్వు వెలిసింది అదోలా. “నువ్వెందుకు ఈ వృత్తిలోకి దిగావ్?” అని అడిగాడు.
“ఎందుకు దిగుతాం – డబ్బుల కోసం..” అంది ఆ అమ్మాయి ‘ఇది కూడా తెలియదా?’ అన్నట్టు.
“సినిమా నటివి కదా?”
“పేరుకే! ‘ఫిగర్ బాగుంది. నిన్ను సినిమా యాక్ట్రెస్‌ని చేస్తా!’ అంటూ సినిమాల్లో పనిచేసే ఒకడు నా వెంటబడి వాడుకొని నాలుగు సినిమాల్లో వేషాలు – అవి చిన్న చిన్నవి, ఇప్పించినట్టే ఇప్పించి నన్ను అక్కడ వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత వేషాల కోసం వాళ్ళకీ వీళ్ళకీ ఒళ్ళు సమర్పించాల్సి వచ్చింది. అయినా లాభం లేదనట్టు అయిపోయింది అక్కడ నా పరిస్థితి. అందుకే మధ్య మధ్య ఇలా మీలాంటి వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళుతుంటాను” అంది రీతూ అనే ఆ అమ్మాయి.
‘పాత కథే’ అన్నట్టు పెదవి విరిచాడు శ్రీపతి.
అంతే గానీ – సెక్స్ కోరికతో ఆమె ఆ పని చేయటం లేదని – ‘లేమి’తో, కడపాకలి తీర్చుకోవడానికి చేస్తోందని, ఆమె చెప్పినా మనసుకు తట్టి ‘అయ్యో పాపం’ అని అనిపించలేదు ఆ శ్రీమంతుడైన శ్రీపతికి.
ఆడదు ఒళ్ళు అమ్ముకుంటోందంటే ‘కొవ్వెక్కి’ అని అనుకునేవాళ్ళే గానీ దాని వెనుక వున్న మనసు బాధ ఏ పురుఘడికీ అర్థం కాదు.
ఆఖరికి సాటిస్త్రీలకు కూడా అర్థం కాదు. ‘ఇంకే పనయినా చేసుకోవచ్చుగా!’ అని నొసలు చిట్లించే వాళ్ళే గానీ, ఆ పనికే తప్ప, మరో పనికి ఏ మగాడూ పిలవడని వాళ్ళకు అర్థం కాదు, ‘కుటుంబం’ అనే గొడుగు రక్షణ కింద హాయిగా బ్రతికేవాళ్ళకు.
ఓ గంట సేపుండి శ్రీపతికి పడకసుఖాన్ని ఇచ్చి – అతనిచ్చిన నోట్లను పర్సులో పెట్టుకొని వెళ్ళిపోయింది రీతూ.
ఆ తర్వాతనే గంటయినా, రెండు గంటలయినా నిద్ర పట్టలేదు శ్రీపతికి. గుమ్మాలకున్న సిల్కు పరదాలను తొలగించుకుంటూ వచ్చి బాల్కనీలో నిల్చున్నాడు, పుచ్చపువ్వులా వుంది వెన్నెల.
చెట్ల కొమ్మల ఆకుల మీద నుంచి వస్తున్న గాలి చల్లగా, హాయిగా ఒంటికి తగిలి ‘ఎంత బాగుంది – ఎ.సి. చల్లదనం కన్నా బాగుంది’ అనుకున్నాడు.
కిందకి చూస్తే వాచ్‌మన్ కుటుంబం కాపురం ఉండే చిన్న రేకుల షెడ్ దూరంగా కనిపించింది. వాచ్‌మన్ రాములు భార్యాపిల్లలు ఆరుబయట మంచాలేసుకొని పడుకున్నారు వేపచెట్టు కింద. ఇంతలో చిన్న గేటు చప్పుడయింది. రాములు కొంచెం తూలుతూ వస్తుండటం కనిపించింది.
మొగుడొచ్చిన అలికిడికి నిద్ర లేచింది అతని భార్య లక్ష్మి.
“మళ్ళీ సారా తాగొచ్చావా?” అంది కోపంగా.
“ఏదో కొంచెం. ఓ చుక్కేసుకుంటే హాయిగా నిద్ర పడతదని” అంటున్నాడు రాములు, నులక మంచం మీద వాలిపోతూ.
తనూ అదే మంచంమీద అతని పక్కన ఒరిగింది లక్ష్మి.
శ్రీపతి వెనక్కు తిరిగి తన గదిలోకి వచ్చాడు.
పరుపుమీద పడి ఎంత పొర్లినా నిద్ర రాలేదు.
ఫారిన్ విస్కీ కొనుక్కోగలిగాడు – అందమైన ఆడదాని పొందును కొనుక్కోగలిగాడు – కానీ కంటి మీది కునుకును మాత్రం కొనుక్కోలేకపోతున్నాడు. డబ్బులతో కొనుక్కోలేనివి కూడా మనుషుల జీవితాల్లో కొన్ని వుంటాయని అలాంటప్పుడే అనిపిస్తుంది శ్రీపతికి.
***
నిప్పులు తొక్కిన వాడిలా కోపంతో మద్య హాల్లో గంతులు వేస్తున్నాడు శ్రీపతి. ముఖం కందగడ్డలా ఎర్రగా వుంది. “యూజ్ లెస్ ఫెలో.. యూజ్ లెస్ ఫెలో’’ అన్న మాటలు పదునుగా నోట్లో నుంచి దూసుకొస్తున్నాయి, లోపలి గుమ్మం దగ్గర బిక్కుబిక్కుమంటూ నిల్చుని వుంది ఆయన భార్య సౌదామిని. వీధి గుమ్మం దగ్గర, వసారాలో భయంతో గజగజా వణుకుతూ నిల్చుని వున్నారు డ్రైవర్ రవి, వాచ్‌మన్ రాములు, నౌకర్ జగ్గారావ్. అయ్యగారిని దూరం నుంచి మామూలుగా చూస్తేనే భయపడి పోతారు వాళ్ళు. ఇక కోపంలో ఉన్నాడంటే చెప్పేదేముంది?
ఇంతకూ అంతటి టెన్షన్ వాతావరణానికి కారణం ఏమిటంటే.. శ్రీపతిరావు పుత్రరత్నం, టీనేజ్ కుర్రాడైన మనోజ్ యాక్సిడెంట్ చేసాడని – వేగంగా కారుతో గుద్దదంతో ఒక ఐదేళ్ళ పాప చనిపోయిందనీ – ఆ సమయంలో మనోజ్ తాగి వున్నాడని పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది, అంతకు ఐదు నిముషాల క్రితమే. ఎక్కీదక్కీ డబ్బులున్న శ్రీపతి లావిష్‌గా ఖర్చులు చేసే పనిలో భాగంగా కొడుకు మనోజ్‌కి, కూతురు మనస్వినికి డబ్బులు ఖర్చుచేసే పనిలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఇచ్చేసాడు. లైఫ్‌ని ఎంజాయ్ చేయండి అని డెబిట్ కార్డులు చేతిలో పెట్టాడు.
దాంతో వాళ్ళకు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు అయింది. ఫ్యాషన్స్, ఫ్రెండ్స్, బైక్ మీద, కారులో షికార్లు, పబ్బుల్లో, క్లబ్బుల్లో చిందులు, గెంతులు నిత్యక్యత్యాలు అయిపోయాయి. ఆడపిల్ల అయిన మనస్విని అరకొర బట్టలేసుకుంటుంది. స్మోకింగ్ చేస్తుంది – డ్రింక్ చేస్తుంది.
ఇక మనోజ్ కయితే పట్టపగ్గాలే ఉండవు. ఫ్రెండ్స్‌ని వెంటేసుకొని తిరగటం తప్ప జీవితానికి ఓం లక్ష్యం, కొన్నయినా విలువలు అంటూ లేవు.
‘నాన్న బోలెడు సంపాదించాడు. అది చాలు కొన్ని జనరేషన్స్ అయినా కూచొని అనటానికి. ఇంక నేనెందుకు కష్టపడి సంపాదించటం’ అని అనిపిస్తుందో ఏమో, హాయిగా మోడ్రన్ కల్చర్‌ని ఎంజాయ్ చేయడమే ‘పని’గా పెట్టకున్నాడు.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఆవు బదులు ఇక్కడ ఎద్దు. తండ్రి దుర్వ్యసనాలు చూసి పిల్లలు నేర్చుకోకుండా ఎలా వుంటారు?
శ్రీపతి రావు ఎంత గుట్టుగా మెయిన్‌టెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నా ఆ గుట్టంతా పిల్లలకు, భార్యను, ఆఖరికి పనివాళ్ళయిన వాచ్‌మన్, డ్రైవరు, ఇంటిపనులు, వంటపనులు చేసేవాళ్ళు అందరికీ ఆయనేంటో తెలుసు, పైకి ఎవ్వరూ రూ నోరువిప్పరు గానీ చాటుగా చెవులు కొరుక్కుంటూనే వుంటారు.
ఆ రోజు శ్రీపతి కొడుకు మనోజ్ యాక్సిడెంట్ చేసాడని తెల్సి ‘డబ్బు మదం’ అని అనుకుంటూనే వున్నారు లోలోపల. కోపంతో చిందులు తొక్కుతున్న అయ్యగారిని చూసి పైకి భయపడుతున్నా, లోలోపల విమర్శిస్తూనే ఉన్నారు.
“రవీ!” డ్రైవర్‌ని పిలిచాడు శ్రీపతి.
“సార్” చేతులు కట్టకొని వచ్చి నిల్చున్నాడు జగ్గారావు.
“బాబుతో మీ అబ్బాయి గోపి కూడా ఉన్నాడా?”
“ఉన్నాడు సార్.”
“మరి వాడు డ్రైవ్ చేయకుండా అబ్బాయి గారెందుకు డ్రైవ్ చేస్తున్నాడు?” చిరాకుపడుతూ అడిగాడు శ్రీపతి – అందులో కొంత కోపం కూడా తొంగిచూస్తోంది.
“అబ్బాయి గారే ‘నేనే డైవ్ చేస్తాను. నువ్వెళ్ళి వెనక కూర్చో’ అన్నారట సార్. పక్కన ఒక ఫ్రెండ్ కూర్చున్నాడట. మావాడు ఎంత చెప్పినా వినకుండా అడ్డదిడ్డంగా బండి నడుపుతూ – చాలా స్పీడ్‌గా పరుగులు పెట్టించారట.”.
“ఊ. అదంతా నేను అడిగానా?” గుడ్లురుముతూ అన్నాడు శ్రీపతి.
“సారీ సార్” భయంతో రెండడుగులు వెనక్కు వేశాడు రవి.
“ఇదంతా నీకు ఎవరు చెప్పారు? “
“మావాడే చెప్పాడు – ‘ఎలా అయిందిరా యాక్సిడెంట్. బండి నువ్వు నడుపుతున్నావా?’ అని అడిగితే.”
“ఊ! అది సరే గానీ, ఇలారా – బాగా దగ్గరికి రా! ఎవ్వరూ వినకూడదు” రహస్యంగా చెయ్యి ఊపి పిలిచాడు శ్రీపతి.
“అక్కడి ట్రాఫిక్ పోలీస్‌తో నేను మాట్లాడి ఎలాగో ఒకలా కేసును మ్యానేజ్ చెయ్యమని అడిగాను. అలాగే అన్నారు. నువ్వు ఒక పని చెయ్యాలి. నీకు బాగానే ముట్టజెపుతాను అందుకు!”
“ఏంటి సార్?”
“ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవింగ్ చేస్తోంది నేనే అని మీ అబ్బాయిని పోలీసులకి చెప్పమను – ఎందుకంటే ఆ కేసులు, ఆ పోలీసు స్టేషన్ చుట్టూ తిరగటాలు, ఆ శిక్ష అవన్నీ అబ్బాయిగారు తట్టుకోలేరు – అందుకని మీ అబ్బాయిని -”
“సార్” ఆశ్చర్యంతో అరిచినట్టుగా అన్నాడు రవి.
“ఏం పరవాలేదు – నేను చూసుకుంటాను. ఏదో కొద్ది నెలలు మ్యానేజ్ చెయ్యమను మీవాడిని – డబ్బు సంగతి నేను చూసుకుంటా అక్కడ కట్టాల్సిందీ – నీకు ఇవ్వాల్సింది” అని, “ఇక వెళ్ళు. త్వరగా ఆ పని చెయ్యి వెళ్ళి”, ‘ఇక నా మాటకు తిరుగులేదన్నట్టుగా, ఇది నా ఆజ్ఞ’ అన్నట్టుగా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్లాడు శ్రీపతి.
అదంతా చూస్తున ఆ ఇంటి ఇల్లాలు మనసు ‘ఇది అన్యాయం’ అని మూలిగింది.. పైకి అనే ధైర్యం లేక.
లోపలికి తన రూమ్ లోకి వెళ్ళి మంచం మీద వాలిన శ్రీపతి అంతరాత్మ ‘కొడుకు చేసిన తప్పును – అతని నుంచి తప్పించడానికి ఓ మనిషిని కొనుక్కోగలిగాడు తను ఈ రోజు, డబ్బు ఎంత పనయినా చేయగలదని నిరూపించాడు’ అనుకుంది.
మళ్ళీ అంతలోనే, ‘కానీ- కానీ, ఈ అపరాధ భావం ప్రతిక్షణం తన మనసుకు మనశ్శాంతి లేకుండా చెయ్యదా? దాన్ని ఎలా కొనుక్కోగలడు?’ అని ప్రశ్నించింది.
ఎన్నికోట్లు పెట్టినా అది దొరకదుకదా? అని ఆలోచిస్తున్నాడు.
***
ఆ రోజు సిటీకి దూరంగా వున్న ఓ ఇంటీరియర్ ప్లేస్‌లో ఓ ఫామ్‌హౌజ్ అమ్మకానికి వుందని తెలిసి కారులో డ్రైవర్‌ని తీసుకొని బయలుదేరాడు శ్రీపతిరావు. ముందుగా తను వెళ్లి చూసి నచ్చితే అప్పడు కుటుంబాన్ని, సంబంధిత అధికారులను, సిబ్బందిని తీసుకెళ్ళి దాని విలువకు సంబంధించిన లెక్కల అంచనా వేయించాలని అనుకున్నాడు. సిటీ అవుట్‌స్కర్ట్స్ దాటి చెట్లు, పొదలు, మైదానాలు, నరసంచారం లేని నిర్మానుష్య ప్రదేశాలూ దాటి ముందుకు వెళుతోంది కారు.
“ఇదేంటి రవీ – ఇంత దూరం వుంది? సిటీకి దగ్గరే, పెద్ద దూరం కాదు అని చెప్పాడు ఆ ఫామ్‌హౌజ్ ఓనర్ పి.ఏ.” అన్నాడు శ్రీపతి.
“దూరమే సార్! వాళ్ళదేముంది, అమ్ముడు పోవటం కోసం అని వాళ్ళు అంతే చెబుతారు” అన్నాడు రవి.
దాంతో ఆ చెప్పిన రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కి పోన్ చేద్దామని ఫోన్ తీసాడు, కానీ సిగ్నల్స్ లేనట్టు చూపిస్తోంది, సెల్ స్క్రీన్.
“ఛ! సిగ్నల్స్ లేవు” అన్నాడు.
“ఇదంతా కొండప్రాంతం సర్” అన్నాడు రవి.
ఇంతలో ఉన్నట్టుండి కారు సడన్‌గా ఆగిపోయింది.
“ఏమయింది?”
“ఏమో సార్, చూడాలి.”
“పెట్రోలు వుంది కదా!”
“ఉంది సార్” అని చెప్పి, కారు దిగి బోయ్‌నెట్ ఎత్తి చూసి “ఇంజన్‌లో ప్రాబ్లమ్ సార్. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాలి. బండి కదలదు. గనుక మెకానిక్‌నే ఇక్కడికి తీసుకురావాలి.” అన్నాడు రవి, యజమానికి భయపడుతూ. బయట చాలా ఎండగా వుంది. కారు లోపల ఏ.సి. కూడా పనిచెయ్యటం లేదు. దాంతో టెన్షన్ పడ్డాడు శ్రీపతి.
ఐదు నిముషాలకే చెమటలు పడుతున్నాయి. ఉక్కపోతగా వుంది.
దాంతో “బండి కండిషన్‌లో వుందో లేదో ముందుగా చెక్ చేసుకోవా నువ్వు? ఇప్పుడెలా? సిటీతో కనెక్షన్ కూడా లేకుండా పోయింది, ఫోన్ చేసి మరో కారు తెప్పించుకోవడానికి” అని చిరాకు పడిపోయాడు శ్రీపతి.
“చూస్తునే వుంటా సార్ ఎప్పటి కప్పుడు – అయినా అదేంటో ఒక్కోసారి ఇలా అవుతుంటుంది. మీరెళ్ళి ఆ చెట్టు కింద నిలబడండి సార్.. కాస్త చల్లగా వుంటుంది. నేను అదిగో అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ దారి దగ్గరకు వెళ్లి ఏదయినా బండి లిఫ్ట్ ఇస్తుందేమో చూస్తాను. అక్కడా ఒకటీ రెండూ అన్నట్టే పోతున్నాయి గానీ – అడిగి చూస్తాను.” అంటూ శ్రీపతి చెట్టు కిందికి వెళ్ళగానే తను ఆ రోడ్డు వైపు నడిచాడు రవి. నడుస్తూ ఆలోచిస్తున్నాడు. ‘ఎండ కన్నెరగకుండా అస్తమానం ఏ.సీ గదుల్లో కూర్చుని, ఎ.సి. కారుల్లో తిరుగుతుంటే ఇలాంటి కష్టమొచ్చినప్పుడు ఈ దొరబాబులకు కష్టమే. ఈ తండ్రి అంతే – ఆ పిల్లలూ అంతే – డబ్బు మదం కన్నుమిన్నూ కానకుండా చేస్తుంది కాబోలు మనుషులను, ఈ కారు ఈ రోజు ఎంత పని చేసింది – కోట్లకు పడగెత్తిన వాడిని చెట్టునీడన నిలబెట్టింది. ఒళ్లు కొవ్వెక్కి యాక్సిడెంట్ చేసిన కొడుకును ఒడ్డున పడెయ్యడం కోసం నా కొడుకుని జైలుకి పంపించాడు ఇన్ని నోట్ల కట్టలు నా మొహాన కొట్టి. ఎవడికి కావాలి ఆ డబ్బులు – కన్న కొడుకు కన్నా ఆ పాపిష్టి డబ్బు ముఖ్యమా – ఈయనకి భయపడి ఏమీ మాట్లాడలేక పోయాను గానీ నా గుండె చెరువయింది నా కొడుకును చెయ్యని తప్పు౦కు జైలుకు పంపాలంటే. ఎదురు తిరిగి ఏమన్నా అంటే ఆ డబ్బుతోనే ఎక్కడ చావుదెబ్బ కొడతారో ఈ ఉన్నోళ్లు అని భయపడాల్సి వచ్చింది!’ అని అనుకుంటూ వెళుతున్నాడు రవి. అంత ఎండ కూడా అతన్ని ఏమి చెయ్యలేక పోయ్యింది.
చెట్టుకింద నిలుచున్న శ్రీపతిరావు పరిస్థితి మాత్రం చెప్పనలవి కానంత దీనంగా వుంది. గాలి కూడా ఆయనకు చల్లదనాన్ని ఇవ్వటానికి నిరాకరించినట్టు చెట్టు మీది ఒక్క ఆకు, ఒక్క కొమ్మ కూడా కదలడం మానేసాయి. ఎండ తీవ్రతకు దాహంగా ఉంది. ఆకలి కూడా వేస్తోందని కడుపులో పేగులు అరిచి మరీ చెబుతున్నాయి. ‘ఎప్పుడూ కారులో తినటానికి, తాగటానికి కాస్త ఏమయినా వుంచుకోండి’ అని భార్య చెప్పిన మాటలను తోసిపుచ్చుతూ – ‘రోడ్డు పొడుగునా బోలెడు హోటళ్ళు, కూల్ డ్రింక్స్ షాపులు వుంటాయి. డబ్బులు పడేస్తే ఏవంటే అవి దొరుకుతాయి.’ అని అనేసాడు. ‘డబ్బులు పడేస్తే’ అన్న ఆలోచనే డబ్బు పట్ల నిర్లక్ష్యానికి, అహంకారానికి నిదర్శనం. డబ్బు ఎంత పడేసినా కొన్ని సందర్భాలలో కొన్నింటిని కొనుక్కోలేమన్నది ఇప్పుడు శ్రీపతికి అనుభవపూర్వకంగా తెలిసివస్తున్న విషయం. దాహార్తిని భరించటం ఎంత కష్టమో ఆకలి అనేదాన్ని అనేదాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో జీవితంలో ఒక్కసారైనా అది అనుభవంలోకి వచ్చిన వాడికే తెలుస్తుంది. తిన్నది అరగక ముందే మళ్ళీ తినేవాడికి ఆ అనుభవం ఎలా అవుతుంది – ఒక్కోసారి ఇలాంటి సంకట పరిస్థితులు అనుకోకుండా వస్తే తప్ప. ఆ రోజు అలా 2 గంటలు ఎండలో, ఉక్కపోతలో ఆకలి దప్పులతో నిల్చున్న తర్వాత అప్పుడు తెలిసివచ్చింది శ్రీవతికి – జేబులో ఎన్ని నోట్ల కట్టలు వున్నా వాటిని నమిలి తినలేమనీ వాటి నుంచి ఒక్క గ్లాసు మంచినీళ్ళు కూడా పుట్టించి గొంతు తడుపుకోలేమని. జీవితం నేర్పే పాఠాలను శ్రీపతి లాంటి వాళ్ళు, ‘నేర్చుకున్నట్టు పైకి కనిపించకుండా ఎంత గంభనంగా వున్నా’ అంతరాత్మ మాత్రం గుర్తిస్తూనే వుంటుంది. ఒప్పుకునేలా చేస్తూనే వుంటుంది.
కాలం కుర్రు కాల్చి పెట్టే వాతలకు మనసు లోలోపల ఆక్రందనలు చేస్తునే వుంటుంది.
***
ప్రకృతికీ మనిషి కలిమిలేములతో సంబంధం వుండదు. ఉన్నవాడు లేనివాడు అన్ని పక్షపాత ధోరణి వుండదు. దాని దృష్టిలో అంతా సమానమే. సృష్టిధర్మం, లోకధర్మం అనే వాటిని కంటికి కనిపించని ఆ దేవుడు అందరి విషయంలో సమంగా వర్తించేలా చేస్తాడు, అలా కాకుంటే డబ్బు మదం వున్న ఈ మనిషికి, అదే సర్వస్యం, అదే అన్నింటినీ నడిపిస్తుంది’ అనుకునే ఈ మనిషికి పట్టపగ్గాలు ఉండేవా?
శ్రీపతి గారికి వయసు మీద పడుతోంది. యవ్వనం తరిగిపోయి, ఒంట్లో పటుత్వం తగ్గిపోయాక ఇప్పుడు జీవితం అంటే ఏంటో తెలిసివస్తోంది.
తనూ అందరి లాంటి మనిషేనని – కాలధర్మాలు, వయోధర్మాలు తనకూ, తన దగ్గర పని చేసే వాళ్లకూ – ఈ ప్రపంచంలోని మనుషులందరికీ ఒకటేనని అనుభవపూర్వకంగా తెలిసి వచ్చాక అలమారా తెరిచి చూస్తే ఇప్పుడు ఆ డబ్బు వల్ల అహం కలగకుండా అవన్నీ కంటికి చిత్తు కాగితాల్లా, చిల్లరపెంకుల్లా కనిపించటం మొదలుపెట్టాయి.
ఒంట్లో బి.పి, షుగరు, కొలస్ట్రాల్ వచ్చిచేరాక -మోకాళ్ళ నొప్పులతో అడుగులేసి అడుగెయ్యలేని పరిస్థితి దాపురించాక ఇప్పుడనిపిస్తోంది ‘ఇంతేనా ఈ జీవితం’ అని.
దబ్బులతో పక్కలోకి ఆడదాన్ని కొనుక్కునట్టు, డబ్బులతో నేరస్థుడైన కొడుకుకి ఓ నకిలీ నేరస్థుడిని తెచ్చిపెట్టినట్టు – ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా తన ఒంట్లోని రోగాలు, తన కాళ్ళలోని అశక్తత మరొకరి ఒంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి తను పర్‌ఫెక్ట్ పర్సన్‌గా నిత్యయవ్వనుడిగా మారిపోలేనని తెలిసివచ్చింది.
ఈ విషయంలో ప్రకృతి దగ్గర తన పప్పులుడకవని బోధపడింది. దాంతో మరింత నిస్తత్తువ అతని, శరీరాన్ని, మనసుని ఆవహించాయి. ఎనభయేళ్ళు దాటిన శ్రీపతిరావుకు తన ఆయుష్షుకు కౌంట్ డౌన్ మొదలయిందని తెలిసివచ్చాక ‘మృత్యుభయం’ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సమవర్తి అయిన ఆ యమధర్మరాజు దగ్గర చావులకు ప్రత్యామ్నాయాలు అంటే అదే ఆల్టర్నేటివ్స్ వుండవని ఎనభయ్యేళ్ళ జీవితానుభవం కళ్ళకు కట్టేలా పదే పదే జ్ఞాపకాల దృశ్యాలను చూపిస్తుంటే కాదనలేక పోతున్నాడు – ‘ఎవడికి మూడినప్పుడు వాడే పోవాలన్న’ యమ సూత్రం వెన్ను మీద ఒక్కటి చరిచి మరీ చెబుతోంది ‘బీ రెడీ’ అన్నట్టు ప్రతి నిముషం.
‘ఇంత డబ్బు సంపాదించాను ఈ జీవితకాలంలో. కడుపులు కొట్టీ, బడగు జీవితాల మీద చావు దెబ్బ కొట్టి మరీ! ఏం బావుకున్నాను – శరీర కష్టం లేకపోవడం వల్ల ఒళ్ళు పెంచడం – అత్యాశతో చేసిన అక్రమాల మూలంగా అందరి ఉసురూ పోసుకొని పాపాన్ని మూటగట్టుకోవడం – అడ్డదారుల్లో సుఖించబోయి ఒంటికి సుఖరోగాలు తెచ్చుకోవడం తప్ప’ అని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు శ్రీపతి.
‘సుఖానికీ – సంతోషానికి మధ్య వున్న వ్యత్యాసం జీవితం సగానికి పడ్డాక అయినా తెలిసివుంటే – అత్యాశకు – సంతృప్తికి మధ్య ఉన్న ఆ గీతను -గుర్తించగలిగి వుంటే – డబ్బు ప్రవాహశీలతను కలిగివుండి చేతులు మారి – అందరికీ పనికొచ్చేది అయితేనే దానికి సార్థకత అన్న విషయం తెలిసి వుంటే!? ఈ జివిత అంత్యదశలో తనకు కాస్త మనశ్శాంతి అయినా ఉండి వుండేది – నా జీవితానికీ ఓ అర్థం- పరమార్థం దక్కేవి’ అనుకున్నాడు శ్రీపతి పశ్చాతప్త హృదయంతో.
డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు డిగ్రీ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు వ్రాసిన 500 పైన కథలు వివిధ పత్రికలలో వచ్చాయి.
కథా వాణి పేరిట వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో తన కథలనే 500 వీడియోల దాకా తన స్వరంతో వినిపించారు ఇప్పటి వరకూ..
ఇంకా రాస్తున్నారు.. వినిపిస్తున్నారు. ఫోన్: 9849212448