Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యువభారతి వారి ‘కాళిదాసు కవితా వైభవం’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

కాళిదాసు కవితా వైభవం

ప్రాచీన, అర్వాచీన సాహిత్యాలను దింగ్మాత్రం గానైనా పరిచయం కలిగించాలనే ఆలోచనతో, సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సునిశితంగా, సమవేదనా దృక్కోణంతో పరిచయం చేయాలనే ఉద్దేశంతో యువభారతి ‘సాహితీ వాహిని’ పరంపరను ప్రచురిస్తున్నది. ఈ పరంపరలో ఇంతవరకూ వెలువడినవి కేవలం సాహిత్యాధ్యయనానికి సంబంధించినవే. ఇక ముందు కౌటుంబిక, సాంఘిక, వైజ్ఞానిక విషయాలకు సంబంధించిన పుస్తకాలను కూడా ప్రచురించి పాఠకులకు అందజేయడానికి ప్రయత్నిస్తాము.

కాళిదాస కవితా సమాలోచనం, భారతీయుల కళా వివేచనమే! భారతీయుల నిత్యజీవితంలో కాళిదాసు కవిత్వానికే పర్యాయపదం. అతన్ని చదువని వాడు నిజంగా చదువనివాడే. మన సంస్కృతిలోని సౌందర్యాంశాలనూ, జీవితోన్నత ప్రమాణాలనూ, ఆదర్శాలనూ ఆయన కవిత వ్యంజిస్తుంది. శైలీ సారళ్యం కవితను ఎంత ఆస్వాదనీయం చేస్తుందో, కాళిదాసు తన కావ్యాల్లో నిరూపించాడు. అందుకే అతన్ని ప్రత్యక్షరంగా కొందరు అనుసరిస్తే, మరి కొందరు అతని భావాలకు అద్దం పట్టి కవులనిపించుకున్నారు. తమ భావాలకు ప్రాచుర్యం రావాలనే పేరాసతో కాళిదాసు పేరుతో చెలామణి చేసిన సందర్భాలను విమర్శకులు ఎత్తి చూపారు. కాళిదాసుకున్న చెల్లుబడి అలాంటిది మరి. ఏదో ఒక విధంగా కాళిదాసు తమను ప్రభావితులను చేసినాడనే యథార్ధాన్ని ఉన్నత శ్రేణికి చెందిన కవులుందరూ భంగ్యంతరంగా చెప్పుకొన్నారు. ఋషికల్పుడైన కాళిదాసు కవిత దేశకాలాలు గీచిన గీతలను దాటి నేటికీ ప్రసరిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన విశ్వకవి.

కాళిదాసు కావ్యారామంలోని కొన్ని కుసుమాలను దూసి రసపరీమళాలను ఆఘ్రాణించండని ఆహ్వానించిన ధన్యాత్ములు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఈయన మద్రాసు ప్రాచ్య కళాశాలలో సాహిత్య, వ్యాకరణ, వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేసినారు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలలో MA పట్టాలను సంపాదించారు. రవీంద్రుని ‘గీతాంజలి’ ని మందాక్రాంత వృత్తాలలో సంస్కృతంలోకి అనువదించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/page/n9/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

Exit mobile version