[శరీరావయవాలకు మాటలు వస్తే, అవి ఒకదానితో ఒకటి తమ బాధలు చెప్పుకుంటూ, మనుషులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నట్లు ఈ రచనలో వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
“అయ్యో నన్ను కాపాడే వాళ్ళే లేరా? నా బాధను తీర్చే వాళ్ళే లేరా? నా గతి ఏమిటి? అమ్మో! అయ్యో!” అంటూ రాగాలు తీస్తూ ఏడుస్తోంది కాలేయం. దీని ఏడుపులకి తమ తమ పనుల్లో మునిగి ఉన్న మిగతా అవయవాలన్నీ బయటకు వచ్చాయి. అందరూ కాలేయం వద్దకు వచ్చి పలకరించారు.
“ఏమైంది మిత్రమా! ఎందుకలా ఏడుస్తున్నావు?” అంటూ మూత్రపిండం దగ్గరకు వెళ్ళి అడిగింది.
“అవునూ! నువ్వేమిటి అలా లావుగా అయిపోయావు. అయ్యో నీ ఒంటి మీద పుండు కూడా కనపడుతోంది” అని క్లోమం వచ్చి ఆశ్చర్యంగా అడిగింది.
“అదే గదా నా బాధ. నాకు క్యాన్సర్ వచ్చిందట. ఒళ్లంతా పుండులా మారిపోయింది. ఎంటో నా బాధ ఎలా తీరుతుందో ఏమో! ఇందాక హాస్పిటల్లో డాక్టర్ గారు చెబుతుంటే విన్నాను!” అంటూ మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది కాలేయం.
“అయ్యోయ్యో మిత్రమా! అంత పని జరిగిందా! ఏమిటో నిన్ను కష్టాలు వదలడం లేదు. మొన్నటి దాకా నీవు పచ్చబడిపోయావు. పచ్చ కామెర్లు తగ్గి ఇప్పుడిప్పుడే మామూలు అవుతున్నావు. మరల ఇప్పుడొక సమస్యా? ముందు ఏడుపు ఆపు? సమస్యకు పరిష్కారం చూద్దాం గానీ ఏడిస్తే పరిష్కారం రాదు కదా!” అంటూ ఊపిరితిత్తులు ఓదార్చాయి.
“నాకు జీర్ణక్రియలో ఉపయోగపడేదానివి ఇట్లా అయిపోయావేమిటి? నాకెవరు సహాయం చేస్తారు. జీర్ణక్రియ లోనూ పెరుగుదలకు అవసరమైన ప్రోటిన్లను తెచ్చిచ్చేదానివి. జీవరసాయన సుశ్లేషణలో పాల్గోనేదానివి. నువ్వే అనారోగ్యం బారిన పడితే నా పరిస్థితి ఏమిటి” అంటూ జీర్ణాశయం కూడా రాగాలు తీయటం మొదలుపెట్టింది.
అప్పుడే గుండె అటుగా వచ్చింది. విషయం విన్నది. “ఏమ్ జీర్ణాశయం! నీ ఏడుపు ఏమిటి? అసలే కాలేయం అనారోగ్యంతో బాధ పడుతుంటే నువ్వు ఓదార్చాల్సింది పోయి ఏడుస్తావేమిటి? కాలేయం మనో ధైర్యం దెబ్బ తీసే వాళ్ళు వెనక్కి వెళ్ళండి” అంటూ గుండె అందర్నీ వెనక్కి పంపింది.
కాలేయం వైపుకు తిరిగి గుండె మాట్లాడటం ప్రారంభించింది. “జబ్బు వచ్చింది ఏం చేయలేము. తగ్గేది ఎలాగో ముందు ఆలోచద్దాం. ఈ మనుషులకు బుద్ధి లేదు, వైన్ షాపులు తెరిచి ఉన్నంత సేపు తాగుతూనే ఉంటారు. పండగైనా పబ్బమైనా, శుభకార్యమైనా, ఆశుభకార్యమైనా తాగటమే ప్రధానంగా పెట్టుకుంటారు. దాని వల్లే కష్టాలు వచ్చాయి” అంది.
“అదే మిత్రమా! మనమింతగా నియమబద్ధంగా పని చేస్తున్నా మనిషికేమీ అర్థం కావడం లేదు. మంచి ఆహార అలవాట్లు చేసుకుని మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా! మనల్ని జాగ్రత్తగా చూస్తే మనమింకా ఆరోగ్యంగా ఉండి ఎంత పనైనా చేస్తాం కదా! ఆ విషయం అర్థం చేసుకోవాలి కదా! ఎంతో తెలివి గల వాన్నని మనిషి విర్ర వీగుతుంటాడు కదా! ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎలా!” అన్నది క్లోమం.
జీర్ణాశయం తన ఏడుపును ఆపి నిదానంగా మాట్లాడటం మొదలు పెట్టింది. “మిత్రులారా! మరి మన కాలేయం ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది. మళ్ళీ మామూలుగా అవుతుందా ఆరోగ్యం చేకూరుతుందా! ఏం జరుగుతుందంటారు?” అని అందరి వైపు చూస్తూ అడిగింది.
“ఏం భయపడాల్సినదేమి లేదు మిత్రమా. క్యాన్సర్ క్కూడ మందులు వచ్చాయి. కాలేయానికి ఎక్కడైతే! పుండు ఏర్పడిందో అక్కడి వరకు కత్తిరించి తీసేస్తారు. అంతటితో క్యాన్సర్ తగ్గిపోవచ్చు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కాలేయం ఆరోగ్యం బాగుపడుతుంది” అంటూ గుండె సావధానంగా సమాధానం చెప్పింది.
కాలేయం భయపడుతూ అన్నది. “అయ్యో నాలో సగ భాగం కత్తిరించేస్తారా! నేనెలా బతుకుతాను. చచ్చిపోతానేమో! నన్ను నమ్ముకున్న ఈ మనిషి ఏమై పోతాడు?” అంటూ గడగడా మాట్లాడుతూ బొట బొటా కన్నీళ్ళను కార్చింది కాలేయం.
“శరీరం మొత్తంలోకి పెద్ద గ్రంధివే గానీ ధైర్యంలో కొద్దిగా కూడా లేవు. ఎలా నీతో సమస్య వచ్చినపుడు పరిష్కారం దిశగా ఆలోచించాలి గానీ ఏడుస్తూ కూర్చుంటే పనవుతుందా. మనిషి తాగటం వల్లే నీకీ సమస్యను తెచ్చాయి. మళ్ళీ మనిషి ఏమవుతాడోనని ఆలోచిస్తావేమిటి? అంత మంచితనం పనికిరాదు” అని మూత్రపిండం కాలేయాన్ని కాస్త సముదాయిస్తూనే బెదిరించింది.
“కాలేయ మిత్రమా! నువ్వు భయంలో నీ శక్తిని మర్చిపోతున్నావు. నీకు పూనరుత్పాదక శక్తి ఉన్నదని మర్చిపోయావు. ఇప్పుడు ఆపరేషన్ చేసి శరీర భాగాన్ని తీసేసినా మళ్ళీ పెరుగుతుంది నువ్వేమి బాధపడాల్సిందేమి లేదు. కానీ మనిషి అలవాట్లు మార్చుకుంటే బాగుంటుంది సమస్యలన్నీ మనిషితోనే కదా! మనమేం చేయగలం” గుండె, కాలేయానికి మనో దైర్యాన్నీస్తూ, తన శక్తిని తనకు గుర్తు చేసింది.
“అవును మిత్రమా! నిజంగా మర్చేపోయాను. నాకిప్పుడు ఏమీ గుర్తు రావడం లేదు. నన్ను ఆపరేషన్ ద్వారా తొలగిస్తారన్న భయమే వెంటాడుతోంది. మిగతావేమి గుర్తుకు రావడం లేదు. నాకు ఆలోచనలే రావడం లేదు. నేనేం మాట్లాడుతున్నానో ఏ పని చేస్తున్నానో తెలియడమే లేదు” అని కంగారు కంగారుగా మాట్లాడుతూ ఉన్నది కాలేయం.
“అది సహజమేలే, ఆపద సమయంలో నీలో ఉన్న బలాలు, బలహీనతలు అన్నీ మరుగున పడిపోతాయి. అందుకే స్నేహితులు, బంధువులు ఉండేది. మేమందరం నీకు తోడుగా ఉన్నాము భయపడకు” అని మూత్రపిండం ధైర్యం చెప్తుంటే అన్ని అవయవాలూ వంత పాడాయి.
“నీకు బాగయ్యేదాకా మేం సహాయం చేస్తాం. నీ బాధని పంచుకుంటాం. మనిషి మాట వినేటట్లు చేద్దాం. అందరం కలిసి స్టైకు చేద్దాం నీవు బాధపడకు నేస్తం. నీవు ఏడుస్తూ ఉంటే మాకు మనసు ఎలాగో ఉన్నది” అని గుండె కూడా సాంత్వన వచనాలు పలకగానే కాలేయం కాస్త నెమ్మదించింది.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.