Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కలవరం

[గౌరీ పొన్నాడ గారు రచించిన ‘కలవరం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

చాలా సమయం నుండి బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడింది ఆరాధ్య.

సమయం గడుస్తుంది. సూర్యుడు నెమ్మదిగా పడమర దిక్కుకు పయనమవటంతో చుట్టూ నల్లని చీకట్లు అలముకున్నాయి. కానీ ఆమె ప్రయాణించాల్సిన బస్సు మాత్రం రాలేదు.

శీతాకాలం పొద్దు కావడం వలనో, ఏమో బస్టాండ్ వెలవెల పోతూ ఉండటంతో ఏర్పడిన నిశ్శబ్దం ఆమె గుండెల్లో గుబులు రేపింది.

ఇంతలో ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ట్రింగ్ ట్రింగ్ మంటూ భయంకరంగా ఫోన్ మోగింది.

ఒక్కసారిగా మోగిన ఫోన్ శబ్దానికి అప్పటికే బెదురుతూ ఉన్న ఆరాధ్య తుళ్లిపడి, అంతలోనే తేరుకొని ఫోన్లో కనిపిస్తున్న పేరు చూసి ఊపిరి పీల్చుకుని ఫోన్ ఎత్తింది.

“బయల్దేరావా ఆరాధ్య!” అటు వైపు నుండి సౌమ్యంగా ప్రశ్నించాడు ఆమె భర్త.

 ”ఏమండీ! ఒక్క బస్సు కూడా రాలేదు. బస్టాండ్‌లో కూడా ఎవరు లేరు. ఇక్కడ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. భయం వేస్తోంది.” అని చెబూతుండగానే బస్సు రావడంతో భర్తకు అదే విషయం చెప్పి బస్సు ఎక్కింది ఆరాధ్య.

బస్సులో డ్రైవర్, కండక్టర్, మరో ఇద్దరు మగవాళ్లు మాత్రమే ఉండటంతో పేపర్లో చదివిన నిర్భయ, దిశ సంఘటనలన్నీ వరుసగా గుర్తుకువచ్చి మరింత బెదిరిపోయి సీట్లో ముడుచుకొని కూర్చుంది ఆరాధ్య.

ఆమె దిగాల్సిన స్టేజీ కి టికెట్ తీసుకొని, “నేను దిగేసరికి మీరు అక్కడ సిద్ధంగా ఉండాలి!” అని భర్తకి ఫోన్ చేసి చెప్పి కూర్చున్న ఆరాధ్య, తన వైపే ఒకరకంగా చూస్తున్న ఇద్దరు మగవాళ్ళని చూసి బెదురుగా సీట్లో మరింతగా ముడుచుకు పోయి కూర్చుంది.

సరిగ్గా గంటసేపటి తరువాత ఆరాధ్య దిగాల్సిన స్టేజి రావటంతో, “హమ్మయ్య వచ్చేసాను!” అని ఊపిరి పీల్చుకుని బస్సు దిగి భర్తకోసం చుట్టూ చూసింది.

కానీ దురదృష్టవశాత్తూ ఆమె భర్త ఎక్కడా కనిపించలేదు. ఇంతలో ఆమెను దాటుకుని కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత మళ్లీ బస్సు ఆగింది.

బస్సులో కూర్చున్న ఇద్దరు మగవాళ్ళు బస్సు దిగి ఆమె వైపు నడక మొదలుపెట్టారు. వాళ్లని చూస్తూనే భయంతో వడివడిగా నడక మొదలుపెట్టింది ఆరాధ్య.

ఆ ఇద్దరూ కూడా ఆమె కోసమే అన్నట్లు ఆమె వెనకే అంతే వడివడిగా నడవసాగారు.

వాళ్ళ నడకవేగం ఆమె నడక కంటే వేగంగా ఉండటంతో ఆమెకు చాలా చేరువుగా వచ్చారు ఇద్దరూ.

“రేయ్ రంగా! ఆ మలుపు తిరిగాక అర కిలోమీటరు వరకు చిన్న చీమ కూడా కనిపించదు. చుట్టూ చీకటిగా కూడా ఉంటుంది. ఈ సమయంలో ఇటువైపు ఎవరూ ఉండరు. ఆ చీకటిలోనే మన పని పూర్తి చెయ్యాలి. ఈ అవకాశం చెయ్యి జారిపోతే మళ్లీ ఎన్నాళ్ళకు ఇలాంటి అవకాశం దొరుకుతుందో!” అన్నాడు రెండో వ్యక్తి.

“ష్! నీకు బుద్ధి లేదురా సాంబా. ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు. ఎవరైనా వింటే ఎంత ప్రమాదమో ఆలోచించవా? మన గుట్టు రట్టయిపోదు. అదే జరిగితే మన ఇద్దరికీ జైలే గతి.” రంగను మందలించాడు సాంబ.

దాంతో రంగా మాట్లాడటం ఆపి వేగంగా నడవడం మొదలుపెట్టాడు.

వాళ్ళిద్దరి మాటలు ఆరాధ్య అరికాలి నుండి మొదలై వెన్నుగుండా పాకి ఒళ్ళంతా వణుకుతో అల్లాడిపోయింది.

ఇంతలో వాళ్ళిద్దరి అడుగుల చప్పుడుతో పాటు మరో మనిషి అడుగుల చప్పుడు కూడా వినబడింది ఆరాధ్యకు.

ఇప్పుడు ఒకరికి ముగ్గురు అయినట్లున్నారు. వాళ్ల నుండి ఎలా తప్పించుకోవాలి. అని ఆలోచిస్తున్న ఆమెకు వెనక నుండి తనను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది.

“ఏయ్ ఎందుకు అంత వేగంగా నడుస్తున్నావ్, ఆగు! నీ అంత వేగంగా నడవలేకపోతున్నాము. ఆగవే ఆగలేదంటే ఊరుకోను చెప్తున్నా.” అని అరుస్తూ ఆరాధ్య వెనకే వేగంగా నడవడం మొదలు పెట్టారు.

అడుగుల చప్పుడు కొంచెం దగ్గర అయ్యేసరికి ఆరాధ్య గుండె సడి పెరిగింది. ఆమె నడక పరుగులా మారింది.

బస్సు దిగే సమయానికి వస్తానన్న భర్త రాకపోవడంతో ఆమె భయం కోపంగా, ఉక్రోషంగా మారింది. కాళ్ళు తడబడుతున్నాయి. శరీరమంతా చిగురుటాకులా వణికిపోతోంది. నిస్సహాయతతో కళ్ళు వర్షిస్తున్నాయి.

ఇంతలో అడుగుల చప్పుడు ఆమెకు మరింత దగ్గరయ్యంది. భయంతో ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్థించడం మొదలు పెట్టింది.

ఇంతలో ఆమె భుజం మీద చెయ్యిపడింది.

ఆరాధ్య కెవ్వున కేకవేసి కళ్లు తిరిగి పడిపోయింది.

ముఖం మీద నీళ్లు పడటంతో కళ్ళు తెరిచిన ఆరాధ్య, కళ్లముందు కనిపించిన రంగా, సాంబలను చూసి ఏడుస్తూ చేతులెత్తి దండం పెట్టి, “నేను మీ ఆడబిడ్డ లాంటి దానిని. నన్ను ఏమీ చెయ్యొద్దు. దయచేసి నన్ను విడిచిపెట్టండి!” అని ప్రాధేయపడింది.

ఇంతలో సాంబ చెయ్యి ఎత్తడంతో, “అన్నా! నీ చెల్లెలు లాంటిదాన్ని. వద్దన్నా నన్ను కొట్టద్దు. నన్ను ఏమీ చెయ్యొద్దు.” భయంతో వణికిపోతూ అంది ఆరాధ్య.

రంగ చేతిలో ఉన్న మంచి నీళ్ళసీసా తీసుకుని ఆరాధ్యకి ఇస్తూ, “ముందు ఈ మంచి నీళ్లు తాగమ్మా!” అన్నాడు సాంబ.

నీటిలో మత్తుమందు కలిపి తనతో తాగించి, తరువాత అత్యాచారం చేస్తారేమో అని విపరీతంగా ఆలోచిస్తూ చేతిలో ఉన్న బాటిల్ తో వారిద్దరిని కొట్టి తప్పించుకోవాలని ప్రయత్నించింది ఆరాధ్య.

ఇంతలో ఒక వ్యక్తి ఆటో తీసుకుని అక్కడికి వచ్చాడు.

“అయిపోయింది, ఇంక నా పని అయిపోయింది! ఈ రాత్రితో నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి.” అనుకొని ఆటో వైపు బెదిరిపోయి చూసింది ఆరాధ్య.

ఇంతలో ఆరాధ్య దగ్గరకు పరుగున వచ్చి, “ఏమైంది ఆరాధ్య, ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయావు! ఎంత భయపడ్డాను తెలుసా, బైక్ కూడా చెడిపోవడంతో నడుచుకొని వచ్చేసరికి నువ్వు చాలా వేగంగా నడుస్తుంటే నీ వెనుక అంతే వేగంగా వచ్చి చూస్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. సమయానికి వీళ్ళిద్దరూ సహాయం చేయబట్టి నేను వెళ్లి ఆటో తీసుకురాగలిగాను. అదృష్టవశాత్తూ నీకు స్పృహ వచ్చింది.” భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా పొదవి పట్టుకుని చెప్పాడు ఆమె భర్త.

దుండగులు అనుకున్నవాళ్లే సహాయం చేశారని అర్థమైన ఆరాధ్య కృతజ్ఞతగా వాళ్ళిద్దరికీ నమస్కరించి, “అంటే మీరిద్దరూ చీకటిలో పని పూర్తి చేయాలి. మళ్లీ అవకాశం దొరకదు అంటుంటే భయం వేసింది!” అంది గొణుగుతూ.

రంగా బుర్ర గోక్కుంటూ, “అది కాదు అమ్మాయి గారు! బస్సులో ఎవరో కోళ్లను తీసుకెళ్తుంటే ఒక కోడి మా దగ్గరికి ఎగిరిపోయి వచ్చింది. అందరూ దిగిపోయిన తరువాత మేము చూసుకున్నాము. ముందు కండక్టర్‌కి ఇచ్చేద్దామని అనుకున్నాము. తాగుబోతోల్లం కదా మందు లోకి మంచింగ్‌కి పనికొస్తుందని ఎవరికి ఇవ్వకుండా తీసుకొని దిగిపోయాము.

దీన్ని కాల్చడానికి చీకట్లోకి వస్తున్నాము. మళ్లీ ఎవరైనా చూస్తే దొంగతనం అంటగట్టి జైల్లో పెడతారు అని భయంతో.” అంటూ వాళ్ళ సంచిలో ఉన్న కోడిని తీసి చూపించారు.

పరిస్థితి అర్థమైన ఆరాధ్య భర్త వైపు చూసి చిన్నగా నవ్వింది.

ఆరాధ్య కళ్ళల్లో కలవరం గమనించిన ఆమె భర్త పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. సాంబ, రంగా కూడా ఆరాధ్య వైపు చూసి నవ్వడం మొదలు పెట్టారు.

ఆరాధ్య గుండెల మీద చేయి వేసి ఊపిరి పీల్చుకుని వారి నవ్వులో శృతి కలిపింది.

Exit mobile version