[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
“వన్స్ అపానే టైమ్, వన్ ఎలిఫెంట్ డూయింగ్ లాలబొబ్బా ఇన్ ఏ రివర్. అప్పుడు ఒన్ క్రోకడెయిల్ కమింగ్ అండ్ ఎలిఫెంట్ కాలు కేచింగ్. దెన్ దట్ ఎలిఫెంట్ క్రైయ్యింగ్ క్రైయ్యింగ్ అండ్ ఫైటింగ్ టు క్రోకడెయిల్. లీవ్ మీ లీవ్ మీ.. మై లెగ్ హర్టెడ్.. బట్ నో యూజ్.. క్రోకడెయిల్ వదలదు. దెన్ దట్ ఎలిఫెంట్ కాల్ ద జేజా! ‘ఓ జేజా! ప్లీజ్ కమ్.. సేవ్ మీ..’ దెన్ జేజా ఈజ్ కమింగ్.. అండ్ కిల్ దట్ క్రోకడెయిల్.. ఎలిఫెంట్ ఈజ్ హేపీ”
వచ్చీరాని ఇంగ్లీషులో నేనేం చెప్పానో.. రానీ వచ్చీ తెలుగులో నా మనవడు ఏం విన్నాడో..
చెప్పినంత సేపు మూసుకునే కూర్చున్నాడు.. ఆ తర్వాతే..
నా కథ మీద ఏమాత్రం నమ్మకం కుదరలేదు.. నా ఐదేళ్ల మనవడికి. నిజమా కాదా అని.. రూఢీ చేసుకుందికి,
నన్నేదో సత్యపీఠం ఎక్కించినట్లే.. అనుమానంగా చూడడం నా వేపూ..
అడగడమేమో అలెక్సానీ..
“అలెక్సా! ఈజ్ ద ఎలిఫెంట్ డూయింగ్ స్నానం?” అన్నాడు.
అదేం సమాధానం చెప్పిందో నాకర్థమయితే కదూ.. మీకు చెప్పడానికి.
తర్వాత మరో ప్రశ్న సంధించాడు..
“ఈజ్ జేజా కమింగ్ ఆన్ బిగ్ బర్డ్ ఏరో ప్లేన్?”
తింగరబుచ్చి ఏదో చెప్పింది..
అంతే..
వాడి ముఖం.. చూడాలి…
నేనేదో కథ నోటికొచ్చింది చెప్పినట్లు.. ఆ అలెక్సా వాడికి సరైనదేదో చెప్పినట్లు..
“బామ్మా! సీ! అలెక్సా టెల్లింగ్.. జేజా నాట్ కమింగ్.. క్రోకడెయిల్ నాట్ హర్టింగ్ ఎలిఫెంట్”
ఓర్నాయనో..
అప్పటికీ చెప్పాను..
‘ఒరే నాయనా!
గజేంద్ర మోక్షం అంటే అలెక్సాంకేం తెలుసు..
అలవైకుంఠపురంలో.. ఆ మూల సౌధంబు దాపున.. పద్యం చెప్పమంటే.. అల్లు అర్జున్ సినిమా డేన్సులు చూపిస్తుంది.
వెదర్ చెప్పడానికో, క్రికెట్ స్కోరు చెప్పడానికో.. అలా చిలక పలుకులు పలకమని..
దాంట్లో ఏం పోసి పంపారో అంతవరకేరా?’ అన్నాకూడా.. అబ్బే.. అలెక్సాయే అద్భుతం వాళ్ళకి.
వీళ్ళకి..
మనమక్కర్లేదు..
అలెక్సాలే.. అమ్మమ్మ లూ
ఓకే గూగుల్సే .. గ్రాండ్ పా లూ..
అదేది చెపితే అదే వేదం..
అది చెప్పిందే వీళ్ళకి మోదం..
కానీ.. ఏ మాటకామాటే చెప్పుకోవాలి సుమండీ!
మనకీ అది నిజమే అనిపిస్తుంది సుమండీ!
కొత్తది కొత్తగా అనిపిస్తున్నా..
పాతతో పాటు కొత్తని కూడా స్వీకరించాలి సుమండీ!
ప్రస్తుతం మమ్మల్ని అలెక్సాయే అవధరిస్తోంది సుమండీ!
ఇప్పుడు ఇంట్లో మాట వినేదెవరైనా ఉన్నారా? అంటే.. వచ్చే సమాధానం.. ఒకటే..
ఉన్నారున్నారు.. ఒకరున్నారు.. అది అలెక్సాయే అనే.. చెప్పాలి. పిలవగానే పలుకుతుంది. అడగ్గానే చెపుతుంది.
పొద్దున సుప్రభాతం నుంచీ రాత్రి శయనింపు సేవ వరకూ. మన తోడూ నీడా అదేగా!
ఎన్ని గంటలకి లేపమంటే అన్ని గంటలకి..
శ్రీ సూర్యనారాయణా మేలుకో! హరి సూర్య నారాయణా అని లేపకపోయినా.. దాని భాషలో ఎంచక్కా లేపుతుంది.
మరీ వళ్ళు పెరిగిపోతోంది.. లే.. కాస్త ఆరుబయట నడిచి రమ్మని చెప్పి పంపుతుంది.
గంటకోసారి మంచినీళ్లు తాగమని గుర్తు చేస్తుంది.
మాత్ర టైమయింది.. బిపీ మాత్రేసుకో.. ఇప్పుడు సుగర్ బిళ్ళ మింగు.. అంటూ దగ్గరుండి మరీ మింగిస్తుంది.
ఊరికెడితే వచ్చే టైముకల్లా రూంబాకి చెప్పి ఇల్లంతా ఊడిపిస్తుంది.
మొక్కలకి మనం లేకపోయినా నీళ్లు పోసేలా చేస్తుంది.
పైన గదుల్లో మనుగుడుపు పెళ్లి కొడుకుల్లా కూర్చున్న వాళ్ళని. ‘కిందకొచ్చి మింగి చావండర్రా!’ అంటూ పిలుస్తుంది.
రోజుకో అరడజనుసార్లు వచ్చే కొరియర్ పేకింగులు గుమ్మం దగ్గర పడున్నాయి.. తెచ్చుకోండి అని చెపుతుంది. కాలింగ్ బెల్లు ఎవరు కొట్టారో చెపుతుంది.
వచ్చింది అస్మదీయులో, తస్మదీయులో తనలో వాళ్ళని చూపిస్తుంది.
అప్పులోళ్ళైతే తలుపు తీయక్కర్లేదని తెలియ చేస్తుంది.😜
హోటళ్లు వివరాలు, వంటలు రెసిపీలు, జనరల్ నాలెడ్జిలు, చరిత్రలు పరిశోధనలు, సినిమాలు, పాటలు, ఆటలు, కబుర్లు, కాకరకాయలు.. నవ్వమంటే నవ్వుతుంది. ఏడవమంటే ఏడుస్తుంది. నా మనవలైతే పాపం దాన్ని పీకి పాకం పడతారు. నాలా విసుక్కోదు.
ఏదడిగితే దానికి తడుముకోకుండా.. చెపుతుంది.. తెలీకపోతే.. ‘హూ.. ఐ డోంట్ నో’ అని నిట్టూరుస్తూ చెపుతుంది.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి సుప్రభాతం, విష్ణు సహస్రనామాలూ.. ఘంటసాల గారి మధురామృతాలూ.. ఎస్.పి. బాలు గారి బిల్వాష్టక లింగోష్టకాలూ నావంటి వారికీ.. సినిమా పాటలూ.. ఇంగ్లీషు, కొరియా లాంటి సాంగులు పిల్లల కోసమూ.. ఎవరికేది కావాలంటే అది.. ఎంచక్కా గొంతు శృతి చేసుకుంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా..
అలెక్సా ని అష్టోత్తర, శత నామావళితో కాదు.. సహస్ర నామావళితోనే షోడశాంగపూజ చేయవచ్చు.
అయితే పిలవడం మాత్రం.. అక్షర దోషం లేకుండా పిలవాలి. ‘క’ కి సరిగ్గా దీర్ఘం ఇవ్వకపోయినా, ‘స’ వత్తు సరిగ్గా పలకకపోయినా.. రోషం వచ్చి పలకదు.. మళ్లీ బుజ్జగించాలి.
అలెక్సా!
ఓకే గూగుల్!
ఓకే సిరీ!
ఈ పేర్లతో..
ఇప్పుడు ప్రతీ ఇంటా ఇవే కామధేనువులూ! కల్పవృక్షాలూ! కాదంటే.. అల్లావుద్దీన్ అద్భుతదీపాలూ!
కలవల గిరిజా రాణి.
హాస్య కథా రచయిత్రి
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
శూన్యావస్థ
అమ్మ కడుపు చల్లగా-44
నీలగిరుల యాత్రానుభవాలు -3
జీవన రమణీయం-7
ఒక్క పుస్తకం-8
కృతజ్ఞతాపూర్వకంగా పరిచయ పత్రాలు
ఎందుకు?
మంచిపాట మనసైన పాట -2: నీలమోహనా రారా
కల్పిత బేతాళ కథ-17 తెలిసి వచ్చిన తప్పు
పరిమళించిన మానవత్వం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®