[బాలబాలికల కోసం ‘కళలు పంచుకో’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రీకు దేశంలో జియానిస్ అనే రచయిత, యాత్రికుడు ఉండేవాడు. తన దేశంలో గ్రంథాలు, విశేషంగా కనుపించే శిల్పాలు, చిత్రించిన చిత్రాలు మాత్రమే ప్రపంచంలో గొప్పవి అనుకునేవాడు. అందుకే ఆయా గ్రీకు కళల మీద అనేక పుస్తకాలు రాసాడు! ఇలా ఉండగా మనదేశం నుండి వెళ్ళిన హర్ష అనే యాత్రికుడు జియానిస్ని కలవడం జరిగింది. జియానిస్ హర్షతో మన దేశ కళల గురించి చర్చించాడు. మన దేశంలో ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఉంటాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. జియానిస్ తన దేశంలో కళలను గురించి తనదైన శైలిలో పొగిడి హర్షను తీసుకుని కొన్ని కోటలు, శిల్ప కళాకృతులను చూపించాడు. హర్ష కూడా భారతదేశంలో అధ్బుతమైన శిల్ప సంపద, ఉత్తమ గ్రంథాలు, సుందర భవనాలు ఉన్నాయని చెప్పాడు. ప్రజల ఆధ్యాత్మిక భావనలు, ధర్మం మంచి మనసులతో ఉన్న ప్రజలు ఉన్నారని కూడా చెప్పాడు.
హర్ష మాటలు విన్న జియానిస్కి నిద్ర పట్టలేదు. హర్షతో పాటు భారతదేశం వెళ్ళి అక్కడి కళలు, సంస్కృతిని కూలంకషంగా పరిశీలించి ఆ విశేషాలను గ్రంథస్థం చేయాలని నిశ్చయించుకున్నాడు. హర్ష గ్రీకు దేశం చూసాక అతనితో కలసి మనదేశం వచ్చాడు. మనదేశంలో పచ్చటి పొలాలు, ఉద్యానవనాలు అతనిని అబ్బురపరచాయి! హర్ష అతనికి శిల్ప సంపదతో నెలవైన సుందర దేవాలయాలను చూపించాడు. అక్కడి ఆధ్యాత్మికత, భక్తి ప్రపత్తులు జియానిస్ని ఆశ్చర్యపరిచాయి!
ఆ తరువాత జియానిస్ని కవులకు పరిచయం చేసాడు హర్ష. వారందరూ సంస్కృత, తెలుగు, తమిళం కన్నడ, హిందీ, సింధీ వంటి భాషల్లో రాస్తున్నారు. ఇంత విభిన్నంగా ఉన్నందుకు జియానిస్ వారి వివరాలు గ్రంథాలు సేకరించాడు. ప్రతి గ్రంథం ఎన్నో కొత్త విషయాలు చెబుతున్నట్టే ఉన్నాయి! మానవ జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టేందుకు ప్రతి గ్రంథంలో ఎన్నో సూచనలు కనబడ్డాయి.
ఆ తరువాత హర్ష పిప్లి (ఒరిస్సా) అనే గ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అనేక మంది కళాకారులు రంగు రంగు బట్టలతో వేరే రంగు బట్టల మీద కళాత్మకంగా కుట్టి అలంకరణ వస్త్రాలు తయారు చేస్తైన్నారు! వారి కళానైపుణ్యాన్ని జియానిస్ పొగిడి కొన్ని వస్త్రాలు కొనుక్కున్నాడు.
మరో రోజు ప్రయాణించి శిల్పాపురం చేరారు. అక్కడి శిల్పులు అధ్బుత శిల్పాలు చెక్కుతున్నారు. రాతితోనే గొలుసులు తయారు చేస్తున్నారు. ఇటువంటి కళ గ్రీసు దేశంలో లేదు. రాతిలో అతి సూక్ష్మ శిల్పాలు కూడా చెక్కుతున్నారు. ఇటువంటి అధ్బుత శిల్పాలు సృష్టించినా వారు తమ పేర్లను శిల్పాల మీద చెక్కలేదు.
“ఇంత మంచి శిల్పాలు చెక్కుతున్నారు మరి మీ పేరు ముందు తరాల వారికి తెలియాలని మీకు అనిపించలేదా? ఆ విధంగా చేస్తే మీ పేరు ఆ శిల్పాలు ఉన్నంత వరకు నిలిచిపోతుంది కదా?” అన్నాడు.
అప్పుడు ఆ శిల్పకళాకారుడు, “అయ్యా, మేము చెక్కుతున్న ఈ శిల్పాలు మీకు నచ్చి ఉండవచ్చు. కానీ మేము ఇంకా చాలా కృషి చేయవలసి ఉంది. మాకంటే అద్భుత కళాకారులు ఎందరో ఉండవచ్చు. అందుకే మేమే గొప్ప అన్నట్లు మా పేర్లు మేము చెక్కుకోవడంలేదు” నమ్రతగా చెప్పాడు ఆ కళాకారుడు.
‘ఔరా ఇది కదా భారతదేశ గొప్పదనం. ప్రతీదీ తామే చేస్తున్నట్టు తామే ఉత్తమ కళాకారులు అని కొందరు గర్వపడుతుంటారు. కానీ ఇక్కడి కళాకారులు ఎంతో ఉన్నతులు’ అని అనుకున్నాడు జియానిస్.
హర్ష జియానిస్ని ఒక కడుతున్న దేవాలయం వద్దకు తీసుకవెళ్ళాడు. ఆ దేవాలయంలో ప్రతి స్తంభం అతి సూక్ష్మ శిల్పాలతో అలంకరించబడుతూ అధ్బుతంగా కనబడసాగింది! అటువంటి సూక్ష్మ శిల్పకళ గ్రీసు దేశంలో లేనందుకు జియానిస్ భారత శిల్పులను పొగడకుండా ఉండలేక పోయాడు. వారిని అడిగి ఎన్శో విషయాలు తెలుసుకున్నాడు తన గ్రంథంలో వివరించేందుకు. తన దేశంలో ప్రదర్శించేందుకు కొన్ని సూక్ష్మ శిల్పాలు కొన్నాడు.
జియానిస్కి కొందరు చిత్రకారుల్ని కూడా చూపించాడు. వారు తైలవర్ణ చిత్రాలు, నీటిరంగు చిత్రాలు అధ్బుతంగా సృష్టిస్తున్నారు. కొందరు చిత్రకళాకారులు సూక్ష్మ చిత్రాలు (miniature art) కూడా చిత్రీకరిస్తున్నారు. కానీ ఎవ్వరూ ఆ చిత్రాల కింద వారి పేర్లు రాసుకోవడం లేదు!
ఇంతటి గొప్ప భారతదేశాన్ని చూచి మన దేశానికి కోటిదండాలు పెట్టి తాను సేకరించిన విషయాలను, కళాఖండాలను వారి దేశంవారికి చూపడానికి గ్రంథస్థం చేయడానికి వెళుతూ హర్షకు కూడా గ్రీసు దేశానికి సంబంధించిన కొన్ని కళాఖండాల్ని బహుమతిగా ఇచ్చాడు.
అందుకే ఇప్పుడు కావల్సినవి దేశాల మధ్య యుద్ధాలు కావు, దేశాల్లోని నైపుణ్యాలు, కళలు, పుస్తకాలను పంచుకుని అందరూ అభివృద్ధి చెందడమే కదా!