Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కళాతృష్ణ

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘కళాతృష్ణ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“నాన్నా! ఇలా రండి.. మరీ చిన్న పిల్లాడిలా అవి కనిపిస్తే చాలు పరుగెడతారు.. అలా నిలబడి వాటిని చూస్తూనే ఉంటారు, ఇప్పుడు మనం కొనాల్సింది ఇంటికి సరుకులు” అంటూ మనోజ్ఞ తన తండ్రి పరాశర్‌ని చనువుగా చేయి పట్టుకొని ముందుకు లాక్కుపోయింది.

పరాశర్‌కి ఓ యాభై ఐదేళ్ళ వయసు ఉంటుందేమో, ప్రతి నెలా ఇంటి సరుకుల కోసమని కూతురు, భార్య సురభితో గానీ లేదా ఒక్కోసారి కూతురితో వారింటికి దగ్గరలో ఉన్న ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కి వెళ్తూ ఉంటాడు.

అయితే మాల్‌కి వెళ్ళిన ప్రతిసారి తనతో వచ్చిన వారి కళ్లు కప్పి అలా స్టేషనరీ స్టాల్ వైపు పోతూ ఉంటాడు పరాశర్..

“మనోజ్ఞా! మీ నాన్నేరి” అని సురభి అగగడం.. “వస్తారులే అమ్మా! ఆ స్టేషనరీ కౌంటరు వైపు వెళ్లుంటారు.. ఏ కలర్ పెన్సిల్లో, పెన్నులో కొనుకొని వస్తారు.. ఇది మనకి షరా మాములేగా” నవ్వుతూ అంది మనోజ్ఞ..

మనోజ్ఞ అన్నట్టే పరాశార్ ఓ ప్లాస్టిక్ డబ్బా నిండా పెన్నులు కొనుక్కొచ్చాడు.

“అన్ని పెన్నులెందుకు నాన్నా”.. అన్న మనోజ్ఞతో..

“హోల్‌సేల్లో తక్కువకొచ్చాయమ్మా.. రేపు నవంబర్ పద్నాలుగు నెహ్రు జయంతి కదా.. మన వీధి చివరనున్న స్కూలు పిల్లలకు పంచి పెడదామని తీసుకున్నాను” ఒకింత ఆనందంగా చెప్పాడు పరాశర్.

“సరే నాన్న మంచి ఆలోచన వచ్చింది మీకు.. అయినా ఆ వస్తువులు చూస్తే చాలు మీకు ఇటువంటి ఆలోచనలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి..” ఆట పట్టిస్తున్నట్టు అంది మనోజ్ఞ..

ప్రతిగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు పరాశర్.

పరాశర్‌కి ఆ రంగు పెన్సిల్స్, పెన్నులు, పుస్తకాలు మొదలైనవి చూసిన వెంటనే అతని ప్రమేయం లేకుండానే అడుగులు అటువైపు పడతాయి.

అతనికి చిన్నప్పటి నుండి బొమ్మలు వేయడం ఓ హాబీ.. ఎక్కువగా మనుషుల మొహాలను మొండెంతో చిత్రించడానికి ప్రయత్నం చేసేవాడు. వాటికి మాంచి డిజైన్స్‌తో చొక్కాలను చిత్రించేవాడు.

అదీ మామూలు పెన్సిల్‌తో.

తన సృజనతో మాంచి చొక్కాల డిజైన్స్ అయితే చిత్రించగలిగాడు కానీ.. నలుపు తెలుపు రంగులలో అవి అంత అందంగా అనిపించేవి కావు..

దాని కోసమై ఆకు పసరులతో, బొగ్గుతో, కొన్ని పల్ల తొక్కల రంగులతో.. ఏవేవో ప్రయోగాలు చేసేవాడు. కానీ ఏదో అసంతృప్తి. తన బోటి వారికి ఆ రోజుల్లో కలర్ పెన్సిల్స్ కొనడమంటే.. కొండమీది కోతిని తెమ్మని కోరినట్టే..

ఓసారి అక్కినేని ముఖాన్ని చిత్రించి మాంచి పూల చొక్కా వేసాడు.. దానికి రంగు పెన్సిల్స్ అయితే బాగుంటుందని అనుకుని, ఏం చేయాలబ్బా అని అలోచిస్తుండగా.. ఏదో గుర్తుకు వచ్చి.. ఆ ఊరి ప్రెసిడెంట్ గారింటికి పరుగెట్టాడు.

ప్రెసిడెంట్ గారి అబ్బాయి సుధీర్, పరాశర్ సహాద్యాయులు.

వాడు ఈ మధ్య ఏవో రంగు రంగుల పెన్సిల్లు తరగతి గదికి తీసుకు రావడం చూసాడు పరాశర్.. వాటిని ఓసారి తనివి తీరా చూసి వెనక్కి ఇచ్చేసాడు.

తన దగ్గర కూడా అటువంటి పెన్సిల్స్ ఉంటే ఎంత బాగుండేదో అనుకున్నాడు. ప్రెసిడెంట్ ఆ మధ్య సిటీకి వెళ్లినపుడు తీసుకు వచ్చాడట.

చిత్రం.. సుధీర్‌కి అసలు బొమ్మలు వేయడమే రాదు. కానీ వాడి దగ్గర రంగు పెన్పిల్స్.. ప్చ్!..

సుధీర్‌ని పెన్సిల్స్ అడుగుదామని పరాశర్ వచ్చాడు గానీ.. ఇస్తాడో ఇవ్వడో అనే మీమాంసతో.. ఇవ్వకపోతే.. అనే సందేహంతో.. మొత్తానికి మొహమాటం విడిచి “సుధీర్, నీ కలర్ పెన్సిల్స్ ఓసారి ఇస్తావా! ఒక మంచి బొమ్మ వేసాను.. రంగులు అద్దితే బాగుంటుందని” చిన్న గొంతుతో ఆడిగాడు.

దానికి సుధీర్ వెంటనే స్పందిస్తూ.. “అవి చాలా ఖరీదైనవి, పోతే నాన్న కొడతాడు.. ఇవ్వలేను రా.. అయినా కలర్ పెన్సిల్సే ఉండాలా ఏమిటి నీ బొమ్మకి. నా దగ్గర లేకపోతే ఏం చేసేవాడివి” కొంచెం వెటకారం నిండిన స్వరంతో అన్నాడు.

పరాశర్ చిన్నబుచ్చుకుని, “క్షమించు..ఇంకెప్పుడూ అడగనులే” అని చెప్పి.. అవమానంతో జేవురించిన మొహంతో బయటకు వచ్చాడు.

ఎలాగైనా నేను కలర్ పెన్సిల్స్ కొనుక్కోవాలి అనే శపదం చేసుకుని.. అతనికి అన్న వరుసయైన టీచర్ జయరాజు దగ్గరికి వెళ్లి.. “అన్నా! నీవు టౌనుకి వెళ్తూ ఉంటావు కదా.. నా కోసం ఓ రంగు పెన్సిల్ పాకెట్ తీసుకురావా.. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు.. తరువాత ఇస్తాను” అంటూ అభ్యర్థిస్తున్నట్టు అన్నాడు.

“అలాగే లేరా.. ఈ సారి వెళ్లినపుడు తీసుకు వస్తాను” జయరాజు మాటిచ్చాడు.

మాటిచ్చిన ప్రకారం ఓ వారం రోజుల్లో ఓ చిన్న రంగు పెన్సిళ్ళ పాకెట్ తీసుకుని వచ్చి పరాశర్‌కి ఇచ్చి.. “ఓరేయి.. ఇది నేను నీకిచ్చే గిఫ్ట్ రా.. బాగా చదువుతూ బొమ్మలు కూడా వేయి.. మరి నా బొమ్మ ఎప్పుడు వేస్తావో “ సరదాగా అన్నాడు జయరాజు..

“ధన్యవాదాలు అన్నా!” అని కృతజ్ఞతలు చెప్పి పెన్సిల్స్ పట్టుకొని రాకెట్ వేగంతో ఉడాయించాడు పరశర్.

ఒకచోట నిరాదరణ, మరో చోట ఆదరణ.. మనుషులందరూ ఒకేలా ఉండరు అనుకున్నాడు.

అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చాడు పరాశర్.. ఇంకా ఆర్ట్ బాగా నేర్చుకోవాలని, బాగా చదువుకోవాలని.. పెద్దవాడినై మంచి ఉద్యోగం సంపాదించి తనలాంటి వారికి సహాయం చేయాలని.

అటుపైన బొమ్మలు అలా వేస్తునే ఉన్నాడు.. రకరకాల రంగుల పెన్సిల్స్, స్కెచ్ పెన్లు, ఆక్రలిక్, ఎనామిల్ రంగులు వాడినా.. అతనికి రంగు పెన్సిల్స్ అంటే ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదు.

కూతురి అభిరుచిని గమనించి మనోజ్ఞకు కూడా బొమ్మలు వేయడంలో తర్ఫీదు ఇచ్చాడు. తనలా ఆమె ఇబ్బంది పడకూడదని.. అడగక ముందే అన్నీ సమకూర్చే వాడు.. రంగు పెన్సిల్స్ వగైరా.

దిగువ మధ్య తరగతి నుండి తన స్వయంకృషితో, పట్టుదలతో ఎదిగిన పరాశర్ నగరానికి వచ్చినా ఎవరినీ మరిచిపోలేదు.

అప్పుడు తనకు రంగు పెన్సిల్స్ ఇవ్వని సుధీర్‌ని గానీ, తనకు పెన్సిల్స్ కొని తెచ్చిన జయరాజుని కానీ మరువలేదు. బొమ్మలు వేయడంలో ప్రావీణ్యం సాధించిన పరాశర్.. ఇప్పుడు చాలా మంది ప్రముఖుల చిత్రాలు వేస్తున్నాడు. ఆ క్రమంలో సుధీర్, జయరాజుల చిత్రాలు కూడా వేసి ఇచ్చాడు.. వాళ్ళు చాలా ఆనందించారు..

పరాశర్‌కి తన కుటుంబ సభ్యుల ప్రతి పుట్టిన రోజున, తన పెళ్ళి రోజున గానీ అనాథాశ్రమాలకు, వృధ్ధాశ్రమాలకు వెళ్ళి, వారికి భోజనం, బట్టలు పెట్టి ఎక్కువ సేపు వాళ్లతో గడిపి రావడం ఇష్టం.

గత కొన్నేళ్ళుగా అది అనుసరిస్తున్నాడు.

ఈసారి తన కూతురి జన్మదినం సందర్భంగా సిటీ శివారులలో ఉన్న ఓ అనాథ బాల బాలికలను సాకే ఆశ్రమానికి వెళ్ళారు.

పిల్లలకు మంచి భోజనం సమకూర్చి, దుప్పట్లు, టవల్స్ మొదలైన బట్టలు ఇచ్చారు.

ఆ పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉండగా.. ఆ భోజనశాల గోడ మీద అతికించివున్న కొన్ని బొమ్మలు కనిపించాయి.. చిత్రంగా అవన్నీ తాను చిన్నప్పుడు వేసినట్టే మామూలు పెన్సిల్తో వేసినవి.. అక్కడ ఉంటున్న పిల్లలు వేసినవేనని తెలుసుకున్నాడు.

పరాశర్‌కి తన బాల్యం గుర్తుకు వచ్చింది. ఎందుకో మనసు ఉద్వేగానికి లోనయి, కంటిలో నీటి చెమ్మ కదలాడింది.

ఏదో ఓ నిర్ణయానికి వచ్చినట్టు.. వెంటనే ఫోన్ తీసుకుని ఏదో ఆర్డర్ చేసాడు. మనోజ్ఞ, సురభి అవేమీ గమనించటం లేదు. వారు పిల్లలతో ఆసక్తిగా ఏవో మాట్లాడుకుంటున్నారు.

ఈలోపల డెలివరీ బాయ్ ఓ పాకట్ తీసుకుని వచ్చాడు. మనోజ్ఞ, సురభి అప్పుడే అటువైపు చూసారు. ఏదో జరుగుతోంది అని ఆసక్తిగా చూస్తున్నారు.

పాకెట్ విప్పి.. ఎవరెవరైతే ఆ బొమ్మలు వేసారో వారందరికి ఒక్కో పాకెట్‌ని అందజేసాడు పరాశర్..

వారి కళ్ళలో ఏదో గొప్ప ఆనందం.. ఏడురంగుల ఇంద్ర ధనస్సు నేలకి దిగివచ్చి వారికి పలకరిస్తున్నంత సంబ్రమం, సంబరం వారి ముఖాలలో దోబూచూలాడుతుండగా.. ఒక్కక్కరూ వచ్చి రంగు పెన్సిల్స్ పాకెట్లు తీసుకుని వరుసగా నిలుచున్నారు.

పరశర్ వారందరికీ ఓ మాటిచ్చాడు.. తాను నెలలో ప్రతి మూడవ ఆదివారం ఆశ్రమానికి వచ్చి ఔత్సాహికులైన పిల్లందరికీ బొమ్మలు వేయడం తర్ఫీదు ఇస్తానని.

పిల్లలు ఆనందంగా కేరింతలతో సమ్మతి తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులు పరాశర్ యొక్క పెద్ద మనసుకు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.

డైరీ రాసుకునే అలవాటున్న పరాశర్ ఇంటికి చేరి తన డైరీలో ఇలా రాసుకుని.. ప్రశాంతమైన నిద్ర లోకి జారుకున్నాడు.

“ఆకలి నిరంతరంగా.. మనిషిని ప్రభావితం చేయలేదు..
తీరగానే కొన్ని గంటలు నిద్ర పోగలదు!
కానీ కళాతృష్ణ అంత సులభంగా తీరేది కాదనే చెప్పాలి..
ఎంత సాధించిన తనివి తీరదు, ఉపశమించదు!
భోజనం చేస్తున్నప్పుడు
ఆ పిల్లలలో కనిపించని ఆనందం..
రంగు పెన్సిల్స్ చూడగానే
ఏదో అనిర్వచనీయమైన ఆనందం కనిపించింది
నా కూతురి పుట్టినరోజున నా బాల్యాన్ని..
ఓసారి పలకరించి వచ్చినట్లు అనిపించింది..
ఈ రోజు ఓ మంచి అనుభూతితో ముగిసింది..!!!
శుభ రాత్రి..

Exit mobile version