Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కైంకర్యము-53

ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి.

[ఇంటి నుంచి బయల్దేరిన రాఘవ ఉస్మానియా క్యాంపస్ ప్రక్కన ఉన్న అహోబిల మఠానికి వెళతాడు. అర్చకుడు – ఆలయం మూసే సమయం అయిందనీ, అర్చనకు సాయంత్రం రమ్మని అంటాడు. తాను కొంత సమాచారం కోసం వచ్చానని అంటాడు రాఘవ. ఆచార్యులని కలవాలని చెబితే ఎందుకని ప్రశ్నిస్తాడు అర్చకుడు. తాను ఒక ఆచార్యుల కోసం వెతుకుతున్నానీ, ఆయన ఎక్కడ ఉంటారో తెలియడం లేదనీ, వారిని ఎక్కడ చూడాలో కూడా తెలియటం లేదనీ, వారు వీరేనేమో అనుకుంటున్నాని అంటాడు రాఘవ. నీ వద్ద ఫొటో ఉంటే చూపమని అర్చకుడు అడిగితే, తన వద్ద ఫొటో లేదంటాడు. ఆ అర్చకుడు, రాఘవని విచారపడవద్దని చెప్పి, అహోబిలం మఠం వెళ్ళవలసిందిగా సూచిస్తాడు. కర్నూలు వెళ్ళే బస్ ఎక్కుతాడు రాఘవ. ఆ ప్రయాణంలో తమ మామగారైన రాజన్న గురించి తలచుకుని, ఆయన గొప్పదనాన్ని గుర్తిస్తాడు. చీకటి పడే వేళకు అహోబిలం చేరి, అదురుతున్న గుండెలతో మఠం లోనికి ప్రవేశిస్తాడు రాఘవ. – ఇక చదవండి.]

ఆంధ్రదేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో చాలా పేరు పొందిన నవ క్షేత్రం అహోబిలం. నల్లమల అడవుల మధ్య అందమైన ప్రకృతిలో కలిసిపోయి ఉంటుంది.

పూర్వం అక్కడికి వెళ్ళటానికి ప్రజలు భయపడేవారు. గుంపులుగా వెళ్ళేవారు. పులుల తాకిడి ఎక్కువ అక్కడ. నారసింహుని దేవాలయాలు తొమ్మిది ఉన్నాయక్కడ. నవనారాసింహులని పేరు ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని నానా చిత్రహింసలకు గురి చేసినప్పుడు, మహావిష్ణువు ఒక స్తంభం నుంచి బయటకు వస్తాడు. ఆ ఉగ్రస్తంభం ఉన్నది ఈ అహోబిలంలోనే. దానికి వెళ్ళటానికి అడవి మార్గాన లోపలికి కొండలలో వెళ్ళవలసి ఉంటుంది.

“చక్రి ఏడి చూపు” అని గర్జించిన తండ్రితో

“ఇందుగల డందు లేదని, సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి జూచిన, అందందే గలడు…” అని ప్రహ్లాదుడు చెప్పిన కథ ఇక్కడే జరిగింది.

అలా స్తంభం నుంచి వెడలి వచ్చి భక్తులను కాపాడుతానన్న ఉగ్రనారాసింహుడు వెలసిన క్షేత్రం అహోబిలం.

నారసింహునిగా అవతారం దాల్చి వచ్చిన మహావిష్ణువును ఇంద్రాది దేవతలు కీర్తించారు.

“అహోవీర్య అహోశౌర్య అహోబహుపరాక్రమః।

నారసింహ పరః దైవం ఆహోబిలః ఆహోబిలః॥”

అని అప్పటి నుంచి ఈ క్షేత్రం ‘అహోబిలం’ అని పిలువబడుతోందని చెబుతారు.

అహోబిలం పైన కొండ మీద ఉగ్రనారసింహుడున్నాడు. ఆయన స్వయంభు. ఆ స్వామిని సేవించి అక్కడ తపస్సు చేశాడట గరుడుడు. స్వామి గురుడునికి ప్రత్యక్షమైతే ఆ స్వామిని చూసిన సంతోషంలో గరుడుడు “అహో! బిలం! అన్నాడట. అప్పటి నుంచి ఆ పేరు వచ్చిందని మరో కథ మనకు చెబుతారు.

హిరణ్యకశిపుని తన గోళ్ళతో చంపి, ఆ రక్తం త్రాగుతు తిరుగుతూ రకరకాల భావాలకు లోనయ్యాడు స్వామి. ఆయన భావాలనుసరించి ఆ నారసింహమూర్తి వెలసిందక్కడ. ఆయన ఎంత కాలమైనా మాములుగా అవటంలేదు. లక్ష్మిదేవి ఇక తప్పదని చెంచులక్ష్మిగా అవతారం దాల్చి ఆ అడవిలో ఆయనతో కలిసి తిరిగి శాంతింపచేసింది.

భక్తులు అందుకే భక్తితో నారసింహ చెంచులక్ష్మిలకు కల్యాణం చేస్తారు. శత్రు పీడలకు, గ్రహబాధలకు ఈ స్వామిని సేవిస్తే తొలగుతాయని పేరు. పరమ దివ్యమైన క్షేత్రమిది. శ్రీ లక్ష్మీనృసింహ ఆలయమంత విజయనగర శిల్ప సాంప్రదాయంతో సుందరంగా నిర్మించబడింది. ముఖ మండపం, రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతులతో కన్నులకు మనోహరంగా విందు చేస్తాయి.

ఎక్కువ స్తంభాలమీద చెంచులక్ష్మి, నారసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి.

పట్టాభిరాముడు, దశావతారాలు, వివిధ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయ మండప స్తంభాలపై కొలువుతీరి కనువిందు చేస్తాయి. దేవాలయ బయట విజయనగర రాజులు విజయానికి గుర్తుగా వేసిన జయస్తంభం కూడా మనం చూడవచ్చు. పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం ఈ దేవాలయంలో కూర్చుని రాసారని చెపుతారు. ఇక్కడకు వచ్చి కోరిన పని నెరవేరకుండా ఎవ్వరు వెళ్ళరు. రాఘవకు ఈ విషయం తెలియకపోయినా, అతను అహోబిలం లోకి అడుగుపెట్టాడు.

అహోబిలమఠానికి ముఖ్యమైన క్రేంద్రం అహోబిలమే. ఆధ్యాత్మిక వికాసం కోసం, వైష్ణవ సాంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సాంప్రదాయజ్ఞులచే ఒక మఠం స్థాపించబడింది. ఈ మఠాధిపతుల్ని జీయ్యర్ స్వాములంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ. 1319లో కేశవాచార్యులకు ఒక కుమారుడు కలిగాడు. అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదుని వలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు. అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను, దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలున్ని శిష్యునిగా స్వీకరించాడు.

ఈ బాలునికి సాక్షాత్తు స్వామియే యోగిరూపంలో వచ్చి, అష్టాక్షరి మంత్రాన్ని బోధించారు. శిష్యునిగా స్వీకరించారు. ఆనాటి నుండి జీయ్యరులు శఠగోపయతిగా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యంలో వివిధ సేవా, అభివృద్ధి మత ప్రచార, సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఆ మాఠానికే రాఘవ చేరుకున్నాడు.

***

కారు దిగింది ప్రసన్నలక్ష్మి.

ఆ కారు చప్పుడుకు ఇంటి బయటకొచ్చింది సీత. తల్లిని చూసి లేగదూడలా పరుగున వచ్చి అక్కున చేరింది ప్రసన్నలక్ష్మి.

“ఎలా ఉన్నావమ్మా? నీకింత జబ్బు చేస్తే నాకు తెలియపర్చలేదెందుకు?” కినుకుగా అంది.

“నీ యాత్రలెందుకు పాడు చెయ్యటం? ఎలా జరిగాయి మీ యాత్రలింతకీ?” అంటూ ఆమె కూతురు తల నిమురుతూ.

ఇంతలో రాముడు కారులోని సామాను దింపి “ఎక్కడ పెట్టమంటారమ్మా?” అడిగాడు.

ప్రక్కనున్న చిన్న గది ముందు వరండా చూపుతూ “అక్కడ పెట్టు..” అంది ప్రసన్న లక్ష్మి.

“మీ అత్తగారు పుట్టింటి నుంచి వచ్చే కూతురుతో సారే పంపినట్లుగా పంపుతుంది. వద్దన్నా వినదుగా..” అంది అభిమానంగా సీత.

“నీకు తెలుసుగా అత్తయ్య సంగతి..”

“అవును. మన కోసం ప్రాణం పెడుతుంది..” అన్నది సీత.

ఇద్దరు లోనికి నడిచారు.

అదో చిన్న మూడు గదులుగా ఉన్న గుడిసె. ముందర అరుగులు. పెరటిలో బావి. మందారాలు మల్లెలతో పాటు కాయగూరల చెట్ల పాదులు.

గుట్టుగా సంసారం చేసుకుంటుంది సీత. ఇది లేదని భర్తకు ఎన్నడు చెప్పదు.

పిల్లలే గుడిసె ప్రక్కనే ఒక గది, వరండా సిమెంటుతో కట్టించుకున్నారు.

తల్లి, తండ్రి వనవాసులలో ఆ గుడిసెలో ఉన్నా కొడుకులు మాత్రం వస్తే ఆ గదిలోనే ఉంటారు.

వాళ్ళకు తెలుసు తండ్రి ఒక ఋషి అని.

ప్రసన్నలక్ష్మి మాత్రం తల్లితో ఆ గుడిసెలోనే ఉంటుంది వచ్చిందంటే. ఆమెకు అదో పర్ణశాలలా ఉంటుంది.

ఆ పవిత్రమైన వాతావరణం, చుట్టు వేస్తున్న పువ్వుల సువాసనలతో, తండ్రి తాలూకూ ఛాయలు అణువణువునా కనపడుతాయి అక్కడ.

“నాన్నగారేరి?” అడిగింది తల్లిని.

“వస్తారు..” అన్నదామె.

“ఎక్కడికి వెళ్ళారు?”

“ఏదో మూలిక కోసం వెళ్ళారే..”

“అవునా సరే..” అంటూ తల్లితో తను చూసి వచ్చిన దివ్యదేశాల విశేషాలు వివరించటం మొదలుపెట్టిందామె.

రాజన్నకి ఆయుర్వేదం కూడ తెలుసు. భార్యకు మూలికా వైద్యం చేస్తాడాయన. అక్కడికి దగ్గర్లో కావలసిన మూలికలు ఉన్నాయని సేకరించటానికి వెళ్ళాడు.

(సశేషం)

Exit mobile version