Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కైంకర్యము-52

ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి.

[రాఘవకు రోజు రోజుకు ఊపిరి ఆడనట్టుగా ఉంది. లోలోపల అంతర్మథనం మొదలయింది. అతని దృష్టి దేని మీద కుదరటం లేదు. బలవంతంగా తింటుంటాడు. మిగిలిన సమయం ఆ యతిని తలుచుకుంటూ కళ్ళు మూసుకు కూర్చుంటాడు. ఓ రోజు తండ్రి సుదర్శనాచారి రాఘవని తన గదికి పిలిచి – రాఘవ పాత కంపెనీ ఎం.డి. కేసు ఉపసంహరించుకున్నాడని, అసలు నేరస్థుడు తన తప్పును అంగీకరించాడనీ, అందువల్ల రాఘవకి పెద్ద హోదా ఇచ్చి తిరిగి చేర్చుకుంటామని ఫోన్ చేశాడని చెప్తాడు. రామచంద్ర కూడా బాగా ఎగ్జైట్ అవుతాడు. రాఘవ మథనాన్ని గమనించిన తండ్రి – యాత్రల ఫలం దక్కిందని అంటాడు. తానేమీ తప్పు చెయ్యలేదనీ, ధర్మానిదే విజయమని తనకు తెలుసునని అంటాడు రాఘవ. అప్పుడతనికి పెళ్ళిలో తమ మావగారి ఆశీర్వచనం గుర్తొస్తుంది. తనకేం కావాలసలు అని తనని తాను ప్రశ్నించుకుంటాడు రాఘవ. కలలో ఆ యతి దర్శనం లభిస్తుంది మళ్ళీ. తనకు కావల్సిందేమిటో తెలుస్తుంది. ఇంటి నుంచి బయలుదేరుతాడు రాఘవ. – ఇక చదవండి.]

ర్లో ఉన్న అహోబిల మఠానికి వెళ్ళాడు రాఘవ.

ఆ మఠం ఉస్మానియా క్యాంపస్ ప్రక్కన ఉంది. రాఘవ వెళ్ళే సమయానికి అక్కడ అప్పుడే నివేదన జరిగింది. ఇక ప్రసాదం పంచి మూసివేస్తారు కోవెలను.

రాఘవ ఒక్కడే అక్కడ. అందరు వెళ్ళిపోయినట్లున్నారు.

అతను లోపల చూస్తే అర్చకుడు సర్దుకుంటున్నాడు. రాఘవ ఆయనను పిలిచాడు.

ఆయన బయటకొచ్చి “మూసే సమయం అయింది. అర్చనకు సాయంత్రం రా బాబు!” అన్నాడు.

“నాకు కొంత సమాచారం కావాలి. అర్చన కాదు..”

“ఏమి సమాచారం?”

“మఠాధిపతిని కలవాలి?”

“ఆచార్యులనా? ఏం పని?”

“నేను ఒక ఆచార్యుల కోసం వెతుకుంటున్నాను. ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు. వారిని ఎక్కడ చూడాలో కూడా తెలియటం లేదు. వారు వీరేనేమో? అని..”

“మీరు వైష్ణవులా?”

తల ఊపాడు రాఘవ.

“మరి మీ పూజాగృహంలో ఆచార్యుల చిత్రపటం ఉండునే..” ఆశ్చర్యంగా అడిగారాయన.

రాఘవకు గుర్తురాలేదు.

“మీ వద్ద ఉన్నది చూపండి..”

“నీ వద్ద ఫోటో ఉంటే నీవది చూపు ముందు..”

“నా దగ్గర ఫోటో లేదు..”

“బావుంది. నా కల్లో కనపడినవాడు రాజు అంటే ఎలాగయ్యా?”

రాఘవ కళ్ళలో నీరూరాయి. అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. ఆ కోవెలలో గోడలకు కొంత మంది గురువుల ఫోటోలు వేలాడుతున్నాయి. కాని అందులో ఎవ్వరు రాఘవ చూచిన యతిలా లేరు.

అతను డీలా పడటం చూసి “విచారపడకు బాబు..” అని అహోబిలం మఠం అడ్రస్ ఇచ్చాడాయన.

“రామానుజ తిరువడిగళే శరణం” అంటూ దీవించాడు.

రాఘవ నమస్కరించి బయటకు వస్తు అక్కడ రాసిన అక్షరాలు చదివాడు..

‘శ్రీ అహోబిల మఠం పరంపరాధీన

శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక’

***

పంచరాత్ర సాంప్రదాయం పాటించే అహోబిలమఠం పురాతనమైనది. దీనిని 800 సంవత్సరాల పూర్వం స్థాపించారు. ఈ మఠం రామానుజుల విశిష్టాద్వైతంను అనుసరిస్తుంది. శఠగోప యత్రీంద్ర మహాదేశికుల సాంప్రదాయం. వారి ఆచార్యులను జీయర్లు అంటారు. వైష్ణవ మతవ్యాప్తి, విద్యావ్యాప్తి, సమాజ శ్రేయస్సు వారి ప్రధాన కర్తవ్యాలుగా నడుస్తారు.

అహోబిల నారసింహుడు వీరి ప్రధాన దైవం. వీరి మఠాల ఉపసంస్థలు ప్రపంచమంతటా వ్యాపించినాయి. ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆచార్యులైన 46వ అహోబిల జీయర్ స్వామి అయిన ‘శ్రీమాన్ శఠగోప శ్రీ రంగనాథ యత్రీంద్ర మహాదేశిక’ల వారి సందర్శనకు రాఘవ బయలుదేరాడు.

ఆయన అహోబిలం లోనే ఉన్నారని తెలిసింది. తను చూచినది ఆయన కాకపోయినా, అక్కడికి వెళితే లీడ్ దొరకవచ్చన్న నమ్మకం కలిగింది.

అహోబిలం వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి. కాని అతను ప్రసన్నలక్ష్మితో పాటు వచ్చినప్పుడు అహోబిలం రాలేదు. కారణమేమిటని ఆలోచనతో కర్నూలు వెళ్ళే బస్సు ఎక్కాడు.

అతనికి తరువాత గుర్తుకొచ్చింది.

ప్రసన్నలక్ష్మి తండ్రి రాజగోపాలాచారి. ఆయన దేశంలోనే అతి కొద్ది వేదాంత ప్రజ్ఞ ఉన్నవారిలో ఒకరు. ఆయన గురించి చాలా మంది శ్రీవైష్ణవులకు తెలుసు. పైసా తీసుకోకుండా ఆయన ద్రావిడవేదం బోధిస్తాడు. ఆయనను అడియన్ శఠగోప శ్రీ రంగనాథ యత్రీంద్ర మహాదేశిక పిలిచారని, ఆచార్యులు పిలిస్తే వెళ్ళాలని అందరు అహోబిలం వెళ్ళారని చెప్పింది. అప్పుడు అడియన్ శ్రీపాదులే వారి కొరకు ఒక ప్రత్యేక వాహనం పంపారు. వీరందరు రంగరాజన్ మామయ్యతో సహా వెళ్ళారని చెప్పింది. తనకెందుకు తెలియలేదు. అయినను ఆ రోజులలో అలాంటివి బుర్రకు ఎక్కేవి కాదుగా అనుకున్నాడు రాఘవ.

అడియన్ స్వామివారు రాజగోపాలాచార్యులకు ప్రత్యేక సత్కారాలు చేసి లక్ష రూపాయల నగదు, బంగారు పతకం ఇచ్చి సత్కరించారని, డబ్బు గోసేవకు సమర్పించి కేవలం బంగారు పతకం మాత్రం తల్లికి ఇచ్చారని చెప్పింది సీత.

ఆయనకు డబ్బు మీద అంత విముఖత కలగటానికి కారణం, అది తనను పడదోస్తుందని చెప్పేవారట. రాఘవకు ఆయన వ్యక్తిత్వంలో హిమాలయలతో పోలిక అన్న విషయం అర్థమయింది.

అతనికి ఆయన పేదరికం మీద, వారి ఇల్లు పరిసరాల మీద ఒక రకమైన చిన్నచూపు ఉండేది.

తల్లికి వారి మీద ఉన్న గౌరవానికి చిరాకు, తనకో పేద పల్లెటూరి పిల్లను కట్టపెట్టిందన్న తలంపు ఏదో డైనమైట్ పేల్చినట్లుగా పేలిపోయింది.

తనెంత అల్పుడు. ఆ మహానుభావుని గురించి ఎంత తక్కువగా భావించానన్న దుఃఖం కలిగింది.

అతని ఆలోచనలకు సంబంధం లేని బస్సు కర్నూలు వైపు సాగుతోంది.

అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు మీదుగా ఆళ్లగడ్డ వెళ్ళి అక్కడ్నుంచి లోకల్ ఆటోలలోనో, బస్సులోనో అహోబిలం వెళ్ళాలి.

కర్నూలు చేరేసరికే సాయంత్రం అయింది. అక్కడ గంట ఎదురుచూసి ఆళ్లగడ్డ బస్సు ఎక్కాడు. రాఘవకు అప్పటి వరకు ప్రభుత్వ బస్సులు ఎక్కే అవసరం రాలేదు. ఇప్పుడు అతను అన్ని వదిలి వచ్చాడు కాబట్టి ఉన్న కాస్త మనీ తనకు కనిపించిన యతి దొరికే వరకు పొదుపుగా వాడాలనుకున్నాడు.

ఆళ్లగడ్డ మరో గంటకు చేరుకున్నాడు. అక్కడ్నుంచి అహోబిలం చీకటి వేళకు చేరాడు. మఠం వెంటనే కనిపించింది. అదురుతున్న గుండెలతో మఠం లోనికి ప్రవేశించాడు

(సశేషం)

Exit mobile version