Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కదిలిపోయే కాలమా..

[సిహెచ్. కళావతి గారు రచించిన ‘కదిలిపోయే కాలమా..’ అనే కవితని అందిస్తున్నాము.]

కాలమా కదిలిపోతున్నావా
ఎవరితో ఏమీ పని లేదన్నట్లు
ఎన్నిటినో నీలో ఇముడ్చుకొంటూ
మరెందరి జ్ఞాపకాలనో కాలరాస్తూ

ఎందరికో ఎన్నెన్నో మధుర స్మృతులందిస్తూ
ఇంకొందరిని ఆ స్మృతులలో వదిలి వైచి
వీనిని తల్చుకొంటూ ఏడ్వమంటూ
ఎందరెందరో దీనుల ఆర్తనాదాలు
వినీ విననట్లు నటిస్తూ..

కొందరికి సంతోషపు కేరింతలు గలిగిస్తూ
మరి కొందరికి గుణపాఠాల గురుతులు మిగుల్చుతూ
ఎవరి కోసం దేని కోసం
ఎదురు చూడక ఆగక
అన్నిటిలో నీదై పై చేయంటూ
కదలిపోతున్నావా కాలమా!

ఎందరినో ఊరిస్తూ కలలైనా కరగకముందే
అగాధాల్లో పడవేస్తూ
మొదలు చివరా లేని నీవు
ఇంకా మరెన్నింటినో నీలో కలుపుకోవాలని
ఆరాటంతో ఆతృతలో కదలిపోతున్నావా!

కాలమా నిన్నేమని పిలువను
మంచనా? చెడనా?
ఆశావాదులు అనుకొంటారు ఆనందంలో
ఆ క్షణాలు శాశ్వతమవ్వాలని
బాధితులు తలుస్తారు
పాడు కాలం ఎంతకూ గడవదేమని?

ఇందరి నిందలను మోస్తూ
నవ్వుతూ నవ్విస్తూ గడిచే కాలమా
నీలాగే పరుగులు తీస్తూ గతించాలని
ప్రతి జీవి కోరిక
సుఖదుఃఖాలను పట్టించుకోక
సాగే నీ తత్త్వం
సామాన్య మానవులకు సాధ్యమా?

Exit mobile version