[బాలబాలికల కోసం కాయగూరల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 2వ భాగం.]
~
ప్రశ్నలు:
11.
పండితే మహిళల పెదవులు
పచ్చిగా పొట్టి బుడంకాయలు
12.
లేతగా అమ్మాయి వేళ్ళు
ముదిరితే బ్రహ్మచారి పెళ్ళిళ్ళు
13.
పలుచని పొరల గౌన్
కొస్తే కళ్ళు మండును
14.
రంపపు ముళ్ళ చర్మం
ఆకారం మొసలి రూపం
చక్కర జబ్బుకు ఔషధం
15.
పైనంతా గరుకు గీతలు
లోనంతా తెల్ల విత్తనాలు
పొట్టలో మెత్తని గుజ్జులు
16.
అన్నంలో చివర్న తినేది
చెట్లు చేమలుండేది
రెండూ కలిపితే వచ్చే కూరేది?
17.
పేరులో పువ్వున్నా
జడలో పెట్టుకోలేనివి
పెద్ద పెద్ద ఆకుల మధ్య
జాబిల్లిలా కాస్తుంది
18.
బెంగుళూరు నుంచి వచ్చింది
రంగుల డ్రస్సులు వేస్తుంది
బొద్దుగా నున్నగా ఉంటుంది
19.
పొరల పొరల బంతులు
ముడతల ముప్పతిప్పలు
వెటకారపు చెవిలో పూలు
20.
మట్టి ముద్దలా! రాతి పెళ్ళలా!
పట్టుకుంటే ముట్టుకుంటే దురదలా!
ఈ పద్యం రాయకుంటే కవి కాడుగా!
జవాబులు:
11. దొండకాయ 12. బెండకాయ 13. ఉల్లిపాయ 14. కాకరకాయ 15. బీరకాయ 16. పెరుగు తోటకూర 17. కాలీ ఫ్లవర్ 18. బెంగుళూరు మిరపకాయ 19. క్యాబేజీ 20. కంద
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.