[శ్రీమతి శాంతిలక్ష్మి పోలవరపు రచించిన ‘కావాలి!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నేలనంతా మించిన సంద్రం లోని చేపకూ
కొంచెం కొంచెం.. గాలి కావాలి..!!
ఇంటి నంతా కాచిన ఇల్లాలికీ
కొంచెం కొంచెం ప్రేమ కావాలి..!!!
కాలపు కొలతలలో బందీలైన
వారందరికీ కొంచెం.. కొంచెం..
స్వేచ్ఛ కావాలి..!!!
సమయానికంతా.. మేత మేసే..
నీరు తాగే పశువుకూ.. కొంచెం.. కొంచెం
ఖాళీ పేగు కావాలి..!!!
ఎప్పుడూ ఊహల అల్లికలల్లే
మనసుకు.. విశ్రాంతి కావాలి..!!!
తనను తాను సర్దుకుందుకు
సూరీడు తోక తలలో పట్టి తిరుగుతున్నట్టు..
తనను తాను పట్టుకుందుకు
భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు..
ప్రతిదీ నిరంతర ప్రవాహంలో
తమను ముంచుకొంటున్నట్లు ఏమిటో పరుగు..!!
సమాధి అరుగుల సంపూర్ణత్వంలో
సర్దుకొనే వరకూ తగ్గని వేగం..
గుండె నిండా పొంగే.. రుధిరం..
భువి నుండీ దివి వరకూ
ఆగకుండా పరుగులు పెడుతోంది..!!
హృదయ కమలపు గంధం..
ఆఘ్రాణించే నాసిక మేలుకోనంత వరకూ..
ఈ పరుగుకు విశ్రాంతి లేదు..!!
ఎవరో తరుముకొస్తున్నట్లు..
తనవి కానివన్నీ తనవై పోయినట్లు..
ఎందుకో.. ఈ పరుగులెక్కడికో.. మరి..!!!
శాంతిలక్ష్మి పోలవరపు గృహిణి, సాహితీ ప్రేమిక, ఆధ్యాత్మిక చింతనాపరురాలు. బాల్యంలో ఇంటనున్న గ్రంథాలయం తనలో సాహితీ పరిమళం నింపిందని చెప్తారు. తనలో ఎగిసిపడే అనేకానేక అలజడులకు అక్షరరూపం ఇచ్చి ఫేస్ బుక్ వేదికగా పంచుకుంటుంటారు.
పిరమిడ్ యోగా సాధకురాలు & శిక్షకురాలు.