Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కావాలంటే.. భరించాల్సిందే

[డా. చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన ‘కావాలంటే.. భరించాల్సిందే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

పొద్దున్నే శ్రీవారి ఫోన్ అదే పనిగా మోగుతోంది. ఆయన, పేరు చూసి, మౌనంగా పేపర్ చూసుకుంటున్నారు. వెంటనే నా ఫోన్ మోగింది. పేరు చూసాను. ‘వెంకట్’. మా మరిది కొడుకు.

“వాడు ఇంటికి రావటానికి వీల్లేదు. ఇక్కడికి వచ్చే పనుంటేనే చేస్తాడు వాడు. ఏం చెప్పుకుంటావో నాకు తెలియదు” అన్నారు సీరియస్‌గా.

“వస్తానన్న మనిషిని వద్దని ఎలా చెప్పటం?” అన్నాన్నేను.

“నువ్వేం దీని కోసం వంకలు వెతుక్కోవక్కర లేదు. నీకిష్టం లేని అబద్దాలు ఆడక్కరలేదు. నేనే వద్దన్నానని చెప్పు” అన్నారు.

“చెప్పటానికి ఒక్క నిముషం కూడా పట్టదండీ. ఆ తర్వాత ఒకళ్ళ ముఖాలు ఒకరు ఎప్పటికీ చూసుకోలేక పోవటం, ఇంత కచ్చితంగా చెప్పారని వాడు అందరితో చెప్పటం, అందరూ తలో రకంగా విమర్శించటం అవసరమా? వస్తే వస్తాడు. ఒకరోజు ఉండి పని చూసుకుపోతాడు. ప్రతి వాళ్లతో ఇలా గొడవలు పెంచుకుంటూ పొతే మనకి ఎవరూ మిగలరండీ ఇంక!” అన్నాను నెమ్మదిగా.

“ఇలాంటివాళ్ళు మిగలకపోయినా ఫరవాలేదు. రేపేదైనా మనకి అవసరం అయితే వీడొస్తాడనే నీ నమ్మకమా?” అన్నారాయన.

“వస్తాడు, రాకపోతాడు. మనుషులతో, అందునా అయిన వాళ్ళతో అలా తెగతెంపులు చేసుకోవటం మంచిది కాదు” అన్నాన్నేను.

వెంకట్‌ది హైదరాబాద్‌లో ఓ చిన్న ఉద్యోగం.  మా వారి తమ్ముడి కొడుకు. అప్పుడప్పుడు విజయవాడ వచ్చి స్నేహితులను కలిసి వెళుతూ ఉంటాడు. డిగ్రీ ఇక్కడే చదివాడు. వెంకట్‌కి కొంచెం బద్ధకం, కొంచెం నిర్లక్ష్యం. ఈయనకి ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. తను ఎవరికైనా అలాగే చేస్తారు. తనకీ అవతలి వాళ్ళు అలాగే చేయాలంటారు. అది వాళ్ళ స్వభావం అంటాను నేను. ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే సొంత పనులు పక్కనపెట్టి మరీ పడీ పడీ చేస్తారు. తర్వాత, ఏదో చిన్న విషయంలో వాళ్ళతో బేదాభిప్రాయాలు రావటం, మాట్లాడక పోవటం, కోపం, నా పెళ్లయిన నాటి నుంచి ఇదే ధోరణి చూస్తున్నాను.

ఉద్యోగం దొరకలేదని బాధ పడుతుంటే వెంకట్‌కి ఈయనే తన పలుకుబడితో హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పించారు. నెల్లాళ్ల క్రితం వెంకట్ మా ఇంటికి వచ్చినప్పుడు, హైదరాబాద్ లోని ఒక ప్రముఖ రచయితకు ఒక పుస్తకం వెంటనే ఇమ్మని, ఇచ్చి పంపారు. ఆ పుస్తకం షాపుల్లో ఎక్కడ దొరకదని, తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని పంపుతున్నానని, అది ఆ రచయితకు చాలా అవసరమని చెప్పారు. ఆయనకు ఇచ్చిన వెంటనే ఫోన్ చేయమని మరీ మరీ చెప్పి, వెంకట్ బ్యాగ్‌లో ఆయనే పెట్టారు. వెంకట్ ఆ రాత్రి వెళ్ళిపోయాడు. మర్నాడు ఫోన్ చేయలేదు. వాడి నుంచి ఫోన్ వస్తుందని, ఆ రచయిత నుంచి మెచ్చుకోలుగా ఫోన్ వస్తుందని ఎదురు చూసారు. ఆ మర్నాడు రాత్రి ఈయనే చేసారు.

“వెళతాను పెద్దనాన్నా, కొంచెం బిజీగా వున్నాను. ఆఫీస్‌లో వర్క్ ఎక్కువగా ఉంది. రేపు ఇచ్చేస్తానుగా!”. అన్నాడు.

ఇంక ఆ రోజు నుంచి వాడి ఫోన్ లేదు. వాడితో మాటల్లేవు. ఎప్పుడు చేస్తాడో చూద్దామని ఈయనా ఊరుకున్నారు. కానీ, లోపల శ్రీవారి కోపతీవ్రత నాకు తెలుస్తూనే ఉంది. నాలుగు రోజుల క్రితం వెంకట్ నాకు ఫోన్ చేసి పుస్తకం ఇచ్చినట్లు చెప్పాడు. ఆ రచయిత థాంక్స్ చెపుతూ చేసారు. అగ్ని పర్వతం మళ్ళీ బద్ధలైంది.

“ఇన్నాళ్ళకా ఇవ్వటం! నేను వెంటనే పంపిస్తున్నానని చెప్పాను. నా మాటేం కావాలి! బుద్ధి, జ్ఞానం లేదు. చదువుకోగానే సరా!” అంటూ ఆ రోజంతా తిట్లే వాడికి.

నిజమే కదా, వాడికి కుదరక పోతే, ఏ రాపిడో సర్వీస్ ద్వారా పంపచ్చు కదా! ఆ డబ్బులు ఇచ్చేసేవాళ్ళం. ‘ఇంత నిర్లక్ష్యం ఏమిటి వెంకట్‌కి?’ అని నాకూ అనిపించింది.

మళ్ళీ ఫోన్ మోగింది. నేను తీసాను.

“పిన్నీ. నేను విజయవాడ బస్సు ఎక్కాను. రెండవుతుంది వచ్చేటప్పటికి. పెదనాన్నకి చేస్తే తీయలేదు. ఇంట్లో వుంటారుగా” అన్నాడు.

“ఉంటాను. వంట చేస్తాను. వచ్చెయ్యి,” అన్నాను అలవాటుగా.

అప్పటికి పదవుతోంది టైం. శ్రీవారు గబ గబా తయారై, “నేను భోజనానికి రాను” అంటూ నేనేదో అనే లోపలే గుమ్మం దాటేసారు.

వాడొస్తున్నాడని ఈయన వెళ్ళిపోవటమేమిటి? ఈ మండుటెండలో ఎక్కడికి వెళతారు? ఇంత పంతమా! పోనీ, వెంకట్‌నే రావద్దని చెపితే! అసలు ఇంటికి ఎవరైనా వస్తున్నామంటే రావద్దని ఎలా అంటాం! కలత చెందిన మనసుతోనే వంట ముగించాను. ఈయన రాను అన్నారంటే రారు. మా ఇద్దరికే వంట. ఓ గంట పోయాక ఫోన్ చేశాను. శ్రీవారు తీయలేదు.

వెంకట్ వచ్చాడు. భోజనం చేసాడు. “పెద్దనాన్న తిన్నారా?” అన్నాడు. ఏదో ఫంక్షన్‌కి వెళ్లారని అబద్దం చెప్పాను.

వెంకట్ నాలుగింటికి బయటకు వెళ్లి ఎనిమిదికి వచ్చాడు. భోజనం చేసి పదింటికి పడుకున్నాడు. రాత్రి పదకొండుకి శ్రీవారు ఇంటికి వచ్చారు. ఏం తినలేదు. పలకరించినా మాట్లాడలేదు.

మర్నాడు పొద్దున్న ఆయన కాఫీ తాగి తన రూంలో పేపర్ చూస్తున్నారు. వెంకట్ తొమ్మిదింటికి నిద్ర లేచి, కాఫీ తాగి లోపలికి వెళ్ళాడు.

“పెద్దనాన్నా” పిలిచాడు. ఆయన పలకలేదు. మళ్ళీ పిలిచాడు. అప్పుడు తలెత్తి చూసారు.

“ఎప్పుడొచ్చావు?” అని అడిగారు.

వాడు నిన్న వచ్చానని, స్నేహితులను కలిసి సాయంత్రం అమ్మ నాన్నల దగ్గరికి గుడివాడ వెళ్తానని అక్కడ నుంచి రేపు హైదరాబాద్ వెళ్ళిపోతానని చెప్పాడు.

“సరే” అనేసి పేపర్ లోకి తల దూర్చారు.

వెంకట్ మాట పెంచుదామన్నా అవకాశం ఇవ్వలేదు. వాడు ఎప్పుడు వచ్చినా హాస్టల్ భోజనం గురించి, ఆఫీస్ పని గురించి, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ఆయన మాట్లాడితేనే ఇంటికి సందడి.

నేను నిన్న రాత్రి వాడికి భోజనం పెడుతూ, “నువ్వు ఆ పుస్తకం వెంటనే ఇవ్వలేదని పెద్దనాన్న కోపంగా ఉన్నారు”, అన్నాను.

“కుదరలేదు లే పిన్నీ!” అనేశాడు.

కనీసం, వెంకట్ “సారీ పెదనాన్నా” అని చెప్పుంటేనన్నా ఆయన కాస్త తృప్తి పడేవారేమో! వాడు వెళ్ళిపోయాడు. అయితే, ఎందుకో మరి గుడివాడ నుంచి వెంకట్ విజయవాడ వచ్చి, ఇంట్లో కాసేపు ఉండి హైదరాబాద్ బస్సు ఎక్కాడు. అప్పుడు ఈయన బాగానే మాట్లాడారు. ప్రథమ కోపం!

మొన్నటిదాకా తమ్ముడితో అంటే వెంకట్ వాళ్ళ నాన్నతో మాటల్లేవు. ఏలూరులో ఉండే మా రెండు పోర్షన్ల ఇంటిని అద్దెకిచ్చాము. అద్దె మొత్తం వాడేసుకున్నాడని, తనకి చెప్పనైనా లేదని తమ్ముణ్ణి కేకలేశారు. ఇప్పుడిప్పుడే కొంచెం మాట్లాడుకుంటున్నారు. ఇపుడు మళ్ళీ వీడితో!

వారం రోజుల తర్వాత, పిన్నత్త గారి మనవడి పెళ్ళికి అందరం కలిసాం. ఆయన తమ్ముడితో, వెంకట్‌తో మాములుగా మాట్లాడుతున్నారు. అదే వాణ్ణి ఇంటికి రావద్దని పరుషంగా చెపితే వాడికి కోపం వచ్చి, వాళ్ళ నాన్నకు కోపం వచ్చి, ఇలా కలిసినప్పుడు కూడా పలకరించుకోకుండా ముఖాలు తిప్పుకునే ఉండేవారు కదా!

“వెంకట్ చెప్పిన పని వెంటనే చేయడు, కాబట్టి వాడికి ఏ పనీ చెప్పకండి. వాడు ఇంటికి వస్తాడు. ఒకట్రెండు రోజులు మనతో గడిపి వెళ్తాడు. చక్కగా మాట్లాడండి. మీకు మీలా నమ్మకంగా చేస్తారనుకున్న వారికే ఏ పనైనా చెప్పండి. తమ్ముడు అద్దెలు వాడుకుంటున్నాడనుకుంటే మీరే వసూలు చేసి, తన భాగం తనకి పంపండి. అందరూ మీలాగే ఉండాలి అనుకుని, అలా ఉండట్లేదని దూరం పెట్టకండి. మనుషులను వదులుకోవద్దు. మనుషులు కావాలంటే వాళ్ళ లోపాలు భరించాల్సిందే. ప్రతి ఇంట్లో ఇలాంటివి ఉంటాయి. బైట పడరు. అంతే!” అని నా ఎప్పటి పాటే పాడాను ఫంక్షన్ నుంచి వచ్చాక.

నా బాట ఎప్పుడూ అంతే అంటారో, మార్చుకుంటారో కాలమే చెప్పాలి!

Exit mobile version