Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కామ్య కర్మలు

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘కామ్య కర్మలు’ అనే రచనని అందిస్తున్నాము.]

భగవద్గీత 5వ అధ్యాయం, 2వ శ్లోకం ఈ విధంగా వుంది:

శ్రీభగవానువాచ:
సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ।
తయోస్తు కర్మసన్న్యాససాత్ కర్మయోగో విశిష్యతే॥

ఓ అర్జునా, కర్మ పరిత్యాగం మరియు భక్తితో కూడిన కర్మ రెండూ కూడా ముక్తికి దారి తీస్తాయి, అయితే ఆ రెండింటిలో కూడా కర్మ పరిత్యాగం కంటే భక్తియుత కర్మయే అత్యుత్తమమైనది.

కామ్య అనేది భక్తి యొక్క రెండు రూపాలలో ఒకటి, రెండవది నిష్కామ కర్మ. భక్తి అంటే ‘దేవుని పట్ల భక్తి’, మరియు దీనిని దేవుని పట్ల అత్యున్నత స్థాయి ప్రేమగా కూడా వర్ణించవచ్చు. సంస్కృత పదం, కామ్యాన్ని ‘కోరిక’ అని అనువదించవచ్చు. కామ్య భక్తి అనేది ఒకరి కోరికలను సాధించే లక్ష్యంతో భక్తిని సూచిస్తుంది.

కామ్యకర్మలు ఫలాపేక్ష ఆశించి చేసే కర్మలు. ఇవి అన్ని కర్మల కంటే అత్యల్ప స్థాయి కర్మలను శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఈ కర్మలు ఇచ్చే ఫలితాలు అత్యల్పంగా వుంటాయి, ఇవి జనన మరణ బంధకాలు, అశాశ్వతాలు. అయితే ఫలములను ఆశించకుండా కర్మలు చేయుట కష్టము, ఎందుకంటే ఎ ఫలితము లేకుండా ఎవ్వరునూ కర్మ చేయలేడు.

భగవద్గీతలో కర్మయోగంలో భగవానుడు కర్మల యొక్క ప్రాశస్థ్యాన్ని అత్యద్భుతంగా చెప్పారు. జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే, అంటే కర్మాచరణలోనే ఉంది. చేయవలసినది కామ్య కర్మ కాదు, నిష్కామ కర్మ. చేయవలసినది కర్మ త్యాగం కాదు, కర్మఫల త్యాగం. ఎందుకంటే కర్మ త్యాగం ఆత్మ వినాశనానికి దారి తీస్తుంది. అదే కర్మఫల త్యాగం అయితే భగవంతుని దగ్గరగా తీసుకువెళ్తుంది. ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధించబడుతూనే ఉంటాడు. ఇది తెలిసిన జ్ఞాని మాత్రం జనన మరణ చక్రం నుండి విముక్తుడు అవుతాడు.

ఇంద్రియ ప్రీతి పట్ల ఆసక్తులై అనుక్షణం జీవితం గడిపేవారు దుఃఖ భూయిష్టమైన ఈ దేహం గత కర్మల ఫలితంగా లభించింది అని, మనం ఎదుర్కొనే అన్ని కష్ట నష్టాలకు, అనుక్షణం గురయ్యే మానసిక అశాంతికి, ఆందోళనలకు ఈ దేహమే, తద్వారా ఈ దేహంతో చేసే కర్మలే కారణం అని గ్రహించలేరు. ఈ శరీరం అశాశ్వతమైనది, ఇందులో శైవం ఆత్మ రూపంలో ఉన్నంత వరకు జీవులను బాధిస్తునే వుంటుంది.కాబట్టి ఇంద్రియ ప్రీతి కోసం జీవించే మానవులు ఆ స్థితి నుండి బయటపడి భగవంతుని ప్రీతి కోసం జీవించే స్థాయికి ఎదగనంతవరకు కష్టనష్టాలు, దుఃఖాలు, మనోవేదన తప్పదు. ఎప్పుడైతే కామ్య కర్మలను విడిచి భగవంతుని అనుగ్రహం కోసం ప్రయాణం ఆరంభిస్తామో అప్పుడే మనం ముక్తి వైపు తొలి అడుగు వేసినట్లు లెఖ్ఖ. పతంజలి యోగ శాత్రం ప్రకారం మానవులు తమలో వున్న ఆత్మతత్వాన్ని గ్రహించనంత వరకు (రమణ మహర్షి) దానినే ఎరుక లేదే నీవెవరో తెలుసుకోవడం అని అన్నారు) అతి దుర్లభమైన ఈ కష్టాల కడలిలో పడి కొట్టూకోవలసిందే. ఇంద్రియ భోగానుభవ భావనలో వున్నంత వరకు ఆ జీవి వివిధ యోనులలో జన్మిస్తునే వుంటుంది. అజ్ఞానం వలనే మనస్సు క్షణికానుభవం ఇచ్చే కామ్య కర్మలవైపు పరుగులు తీస్తూ వుంటుంది. ఇందులో బయటపడాలంటే భగవంతుని పాదాల యందు స్థిరమైన భక్తి పెంపొందించుకోవాలి.

నిష్కామకర్మలు సమత్వబుద్ధితో చేయబడే కర్మలు. అవి మానవులకు మాధవుని వద్దకు దారి చూపిస్తాయి. ఈ కర్మలు ద్వంద్వములకు అతీతమైనది. చేయుటయందే దృష్టికానీ, ఫలితములపై ఉండదు. ఇలా ఫలాపేక్ష రహితంగా ఈశ్వర బుద్ధితో, సమాజ శ్రేయస్సు దృష్టితో చేయుట వలన సంఘములో శాశ్వత కీర్తిని పొందగలరు మరియు మోక్ష ప్రాప్తికి సోపానముగా మారతాయి.

కాబట్టి మానవులు ఈ కామ్యకర్మలను త్యజించి, నిష్కామంగా కర్మలు చేయాలని భగవానుడు బోధిస్తున్నాడు. అంటే ఏ కర్మలైనా భగవంతుని ప్రీతితో, సమాజ శ్రేయస్సును దృష్టియందు ఉంచుకొని చేయాలి. అవియే మనలను జనమ మరణ చక్ర భ్రమణం నుండి బయటకు పడవేసి చివరకు మోక్షానికి దారి చూపిస్తాయి.

Exit mobile version