[తాటికోల పద్మావతి గారు రచించిన ‘కాలుష్యపు కోరల్లో’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆధునికత మోసుకొచ్చిన
ప్లాస్టిక్ అందాలు
ధరణి కడుపులో దాగి
నేల తల్లి నెర్రెలు బారిపోతున్నది
పశువుల గొంతులో
కట్టెపురుగుల్లా
దుష్ట కాలుష్య సృష్టికర్తలై
గొంతులు ఊడిపోయి
అల్లాడిపోతూ విలవిలా
ప్రాణాలు విడుస్తున్నాయి.
డ్రైనేజీలు నిండి
నీటి బేరేజుల్లా
పర్యావరణ పాలలో
విషపు చుక్కలై
కాలుష్యపు కాలువలు
గుర్రపుడెక్కలై
బద్ధకం నిర్లక్ష్యాల
ఉత్ప్రేరకాలై
ఊరు ఊరంతా
ప్లాస్టిక్ పరచుకొని
చెట్టు పుట్టలలో
కాలువ గట్టుల మీద
జీవుల జీవితాల పాలిట
జిల్లేడులవుతున్నాయి.
చెదపురుగులని తెలిసి
చేత చిక్కించుకుంటున్నాయి.
నగరాలను మురికి కూపాలుగా మార్చి
భూతలాన్ని అతలాకుతలం చేస్తున్న
ప్లాస్టిక్ మహమ్మారి
మన తలరాతలనే మార్చేస్తున్నది.
పర్యావరణం పరిరక్షణ లేకుండా
అందమైన ప్రకృతి అడవిలా మారిపోతున్నది.
మనమే కదా! ఆలోచించాల్సింది.
పెళ్లి పేరంటాలు
విందు వినోదాలలో
ప్లాస్టిక్ అవసరాల ఉత్పత్తికి
అడ్డుకట్ట వేసి
ప్రత్యామ్నాయ వినియోగాన్ని ప్రోత్సహిస్తే
పర్యావరణం సుభిక్షం కాదా!
ప్రతి ఒక్కరూ బాధ్యతగా
పేపర్, గోనెసంచులు
అందంగా మలచుకుంటే
నేల, గాలి నీరు పశువులు సైతం
రక్షింపబడతాయి.
ఎన్నేళ్లయినా మట్టిలో కలవని
శత్రువులు కాల్చితే కళ్ళెర్ర చేసి
విషవాయువుల చిమ్మే విషపేటికలు.
పర్యావరణ కాలుష్యానికి
భూ వాతావరణం
అసమతల్యానికి
అనారోగ్య వాతావరణ సృష్టికి
ఊపిరిలూదుతు
మనిషి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.