[జె.డి. వరలక్ష్మి గారు రచించిన ‘కాలవిమానంలో వస్తున్నా’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
వెచ్చని అమ్మ ఒడిలో
లోకాన్ని మరచిపోయి
నిద్రను పెదాలతో చప్పరించిన జీవితాన్ని
మళ్ళీ ఓసారి చూడాలని ఉంది
కాలం కన్నీరు కార్చే నా స్నేహమై
ఎన్నో ఏళ్లుగా ఓపిక పట్టమంటూ
ఓదారుస్తూనే ఉంది
మా అమ్మ రూపం కన్నీటితో
రెప్పలగట్లు దాటకూడదని
మౌనంతో ఆనకట్ట గుండెకికట్టి
కదలకుండా కూర్చోబెట్టాను
ఉప్పొంగే ప్రేమకు ఏ కవాటం పగిలి
ఉప్పెనై నన్ను ముంచేస్తుందో
తెలియని అసహాయస్థితి నాది
సముద్రం ఆవల బంగారు నిధిని పోగుచేసుకొని
వజ్రాల నగిషీతో రాజహంసల వయ్యారాలను
మంచానికి పొదిగి పడుకున్నా
అమ్మ పొత్తిళ్ల పురిటివాసన రావడం లేదేంటి!
కీర్తి కిరీటాలకు మూడుముళ్ళు వేసి
చిటికినవేలు పట్టి విదేశాలకు ఎగిరిపోయాను
కడుపు నింపే అన్నం మెతుకుని
ఆకలి కంచంలో వదిలి
జీవంలేని కరెన్సీ నోట్లతో కాపురం చేస్తున్నానని
నీకెలా చెప్పేది?
నాకు నిన్ను చూడాలనే పేగుల మెలిక
నీ గుండె
నన్ను పిలవడం ఆపకముందే
నీ ముందు కాలవిమానంలో వాలిపోతాను
కొంతకాలం గుండెని బిగబట్టుకుని
ఏదో వేకువపొద్దు నీ పాదాల స్పర్శ కోసం
బయలుదేరతాను.