[డా. మామిడాల శైలజ గారు రచించిన ‘కాలరేఖ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
సమస్త విశ్వాన్ని తనతో పాటుగా
నడిపిస్తూ వడివడిగా పరిభ్రమిస్తుంది కాలచక్రం!
పరిగెడుతున్న కాలంతో
సహజీవనం చేస్తూ అనుసరించాల్సిందే మానవ మాత్రులం!
ఈ ప్రహసనంలో దుఃఖం చేరువ కావచ్చు
ఆనందం చెంతన చేరవచ్చు!
కాలాన్ని గౌరవిస్తూ కష్టాలకు ఎదురీదుతూ,
సంతోషాలను స్వాగతిస్తూ ముందుకు అడిగేయాల్సిందే అందరం!
కాల ప్రవాహంలో జీవితమనే చిన్న నావలో
మన ప్రమేయం లేకుండా
అటు ఇటు ఊగిసలాడుతూ
గమ్యం తెలియని ఒంటరి ప్రయాణానికి సిద్ధం కావాలి!
ఫలితం ఏదైనా ప్రయత్నం ఆపకుండా
పయనించక తప్పదు.
ఎన్నెన్నో మలుపులు, మరెన్నో మైలురాళ్లు,
రాకాసి అలల సుడిగుండాలు చుట్టేస్తున్నా
వర్ణ రంజితమైన కోరికలు రారమ్మని పిలుస్తున్నా
మదిని నిగ్రహించుకుంటూ
మార్మికంగా ముందుకు సాగడమే మన కర్తవ్యం!
కాలం ఎప్పటికైనా మనకు అర్హమైన
విజయాన్ని ఇవ్వకుండా ఉండదు.
అందివచ్చిన అవకాశాల్ని
సద్వినియోగం చేసుకుంటూ,
ఆశల ఎండమావులకు లొంగకుండా
ఒక కంట కన్నీరు మరుకంట పన్నీరు
ఒలుకుతున్నా స్థితప్రజ్ఞ ప్రదర్శిస్తూ
క్షణభంగురమైన జీవితాన్ని
ఉన్నంతలో ఫలప్రదం చేసుకోవాల్సిందే..
మురిపించి మైమరిపించి
అదృశ్యమయ్యే జలతరంగిణి లాంటి
తాత్కాలిక ఇహలోక సుఖాలను
త్యజిస్తూ మనదైన చేవ్రాలును
లిఖించుకుందాం!
అనంత కాలరేఖలలో అంతర్లీనవువుతాం!
డాక్టర్ మామిడాల శైలజ
సహాయ ఆచార్యులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంగశాయిపేట, వరంగల్.