Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాళరాత్రి

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పారుపల్లి అజయ్‍ కుమార్ గారి ‘కాళరాత్రి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. అసలే నువ్వు వెళ్ళేది విశాఖపట్టణం. తుఫాన్ వస్తే ముందుగా తాకిడికి గురయ్యేది సముద్రతీర ప్రాంతాలే. ఈ ప్రయాణం మానుకోరాదా చిన్నీ” అమ్మ కంఠంలో స్వల్పంగా ఆందోళన తొంగిచూసింది.

నేను ఆ రోజు పేపర్ తీసుకొచ్చి దానిలో వున్న వార్తను చదివి వినిపించాను.

“నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఇది క్రమంగా బలపడి మూడు రోజుల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ నాలుగో రోజు నాటికి తీవ్ర తుఫానుగా బలపడి, పశ్చిమ్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరానికి చేరువుగా వస్తుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వుండదని అంచనా వేశారు. ఇదే అమ్మా వార్త. మన రాష్ట్రానికి తుఫాను ప్రభావం వుండదని చెపుతున్నారుగా. అమ్మా! నాకు మొట్టమొదటి సారిగా వచ్చిన ఇంటర్వ్యూ కాల్ ఇది. ఈ ఇంటర్వ్యూకు వెళ్ళి నన్ను నేను నిరూపించుకోవాలి. నేను గీతమ్స్‌లో చదివేటప్పుడు విశాఖపట్టణంలో ఎన్ని తుఫానులు రాలేదు! అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వస్తున్నది నీకు? ఇక్కడ నాన్న స్టేషన్‌కు వచ్చి రైలు ఎక్కిస్తాడు. విశాఖలో సంధ్య స్టేషన్‌కు వస్తానని చెప్పింది. రైలు దిగటం సంధ్య వాళ్ళింటికి వెళ్ళడమే. ఎల్లుండి ఇంటర్వ్యూ అవగానే ఆ రాత్రికే ట్రెయిన్ ఎక్కి వచ్చేస్తాను. నాన్న తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ కూడా చేసేశారు. మూడు రోజుల్లో మళ్ళీ నీ కళ్ళ ముందే వుంటాను. నన్ను ప్రయాణం మానుకోమని చెప్పకు.”

అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి గారంగా అన్నాను నేను.

నాన్న కూడా అమ్మకు నచ్చచెప్పడంతో అమ్మ కొంత అయిష్టంగానే నా ప్రయాణానికి అంగీకరించింది.

నేను, నాన్న కారులో తొమ్మిదింటికి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాము. కారు దిగి స్టేషన్ లోపలికి వెళుతూ అప్రయత్నంగానే ఆకాశం వైపు చూశాను. మిణుకు మిణుకు మనే చుక్కలతో ఆకాశం వెలిగిపోతూ కనిపించింది.

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైట్ టైమ్‌కే వచ్చింది. నాన్నకు బై చెప్పి, ఎస్ ఫోర్ బోగీ లోకి ఎక్కాను. నాది అప్పర్ బెర్త్. అది అయితేనే ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిద్ర పోవచ్చు. బెర్త్ పైకి ఎక్కి పడుకున్నాను. రైలు కుదుపులకు మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను.

***

“గరం గరం చాయ్, కాఫీ” అనే అరుపులకు మెళుకువ వచ్చింది. రైలు ఏదో స్టేషన్‌లో ఆగివుంది. బోగీ మీద వాన పడుతున్న శబ్ధం వినిపిస్తున్నది.

లేచి కూర్చుని మధ్య బెర్టులో పడుకుని మాట్లాడుకుంటున్న వారిని “ఇది ఏ స్టేషన్ అండీ?” అని అడిగాను.

ఒకతను నా వైపు చూసి “విజయవాడ” అన్నాడు.

“బయట వాన పడుతున్నదా?” అడిగాను వారి వైపు చూస్తూ.

“ఊ” అంటూ వారిద్దరూ తిరిగి మాటల్లో పడ్డారు.

వాతావరణ శాఖ అంచనా తప్పిందో, వాయుగుండం దిశను మార్చుకుందో గానీ తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు కూడా తప్పదని అర్థమవుతున్నది పడుతున్న వర్షాన్ని చూస్తుంటే. బెర్తు మీద నుండి కొద్దిగా వంగి కదులుతున్న రైలు కిటికీ లోంచి చూస్తే చిన్న వాన కూడా పెద్దదిగానే కనిపిస్తుంది.

మధ్య బెర్తులో వాళ్ళు పెద్దగానే మాట్లాడుతున్నారు. వారి మాటలన్నీ నాకు వినపడుతున్నాయి.

“బాబాయ్, మనం వైజాగ్ చేరేసరికి వర్షం యింకా పెద్దది అవుతుందేమో! ఈ తుఫాను సమయంలో మనం బయలుదేరాం. నాకెందుకో భయంగా వుంది.” అని ఒకతను అన్నాడు.

దానికి రెండో అతను పెద్దగా నవ్వాడు.

“దీనికే నువ్వు భయపడుతున్నావా? నా జీవితంలో ఎన్నో భయంకరమైన తుఫానులను చూశాను. అతి భయంకరమైన దివిసీమ ఉప్పెన గురించి విన్నావా? దాన్ని తలుచుకుంటేనే మా దివిసీమ వాసులు ఇప్పటికీ ఉలిక్కి పడుతుంటారు. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. ఆ మహా జలప్రళయంలో మా కుటుంబంలో బ్రతికి బైటబడ్డ వ్యక్తిని నేనొక్కడినే.

1977 నవంబర్ 18న సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాయంత్రానికి వాతావరణం చల్లగా మారిపోయింది. మేఘాలు నల్లగా మారడంతో భారీ వర్షాలు కురుస్తాయని మేమంతా అనుకున్నాము. నవంబర్ 19 న ఉదయం నుండి తీవ్రమైన నల్లటి మబ్బులు ఆకాశం అంతా కమ్ముకొని దాదాపు గంటకు వంద మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో గాలులు మొదలైనాయి. రాత్రి పది దాటిన తర్వాత తుఫాను భీభత్సం పెరిగింది. మిన్నూ మన్నూ ఏకమయ్యేట్లు భీభత్సంగా వర్షం కురిసింది.

ఆ కాళరాత్రిని ఎవరూ మర్చిపోలేరు. సముద్రం మృత్యువులా మారి కాటేస్తే.. పెను ఉప్పెన రూపంలో ముంచేస్తే.. ఎలా ఉంటుందో ఆనాటి రాత్రి కళ్లారా చూశాం మేమంతా. దివిసీమపై ప్రకృతి పగబూని చేసిన కరాళ నృత్యానికి చిహ్నం ఆ రోజు. అలల సంగీతాన్ని మృదు మధురంగా వినిపించే సముద్రుడు ఒక్కసారిగా ప్రళయఘోషతో విరుచుకుపడి చేసిన విలయతాండవాన్ని గుర్తుకు తెచ్చుకుంటేనే ఈ రోజుకూ గుండెలు అదిరిపోతుంటాయి నాకు.

జనులంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో.. తీరం దాటిన ప్రళయ తుఫాను ఉగ్రరూపం దాల్చింది.

తాటి చెట్లను అధిగమించిన ఎత్తులో రాకాసి అలల రూపంలో సముద్రం ఒక్కసారిగా తీర ప్రాంత గ్రామాలపై విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించింది.

రాకాసి అలలకు రాత్రికి రాత్రే, ఊళ్లకు ఊళ్ళు మాయమైపోయాయి. కడలి కల్లోలానికి కకావికలమైన తీరప్రాంత గ్రామాలు ఎన్నో! 200 కిలోమీటర్ల వేగంతో వీసిన ప్రచండ గాలులకు ఎన్నో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. గ్రామాలకు గ్రామాలు శ్మశానాలుగా మారిపోయాయి. తెల్లారెసరికి పదివేల మంది బ్రతుకులు తెల్లారిపోయాయి. దివిసీమ శవాల దిబ్బగా మారిపోయింది. చిమ్మ చీకటిలో ఉధృతంగా విరుచుకు పడ్డ ఉప్పునీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ చెట్టు కొమ్మల మధ్య చిక్కుకుపోయి మూడు రోజులపాటు వంటిమీద స్పృహ లేకుండా ఉండిపోయాను. నాలుగో రోజు హెలికాప్టర్ రాకతో బ్రతికి బయటపడ్డాను.

వేలాదిమంది ప్రాణాలు బలిగొన్న దివిసీమ ఉప్పెన.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు.. భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం అని చెబుతారు.” అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు అతను.

అతను చెపుతున్నది వింటుంటే నాకు భయంతో ఒళ్ళు జలదరించింది. నిద్రపోదామని కళ్ళు గట్టిగా మూసుకున్నా. బోగీ మీద పడుతున్న వర్షం చప్పుడు నా చెవుల్లో గింగురుమంటున్నది.

వర్షం పెద్దదవుతున్నట్లు తెలుస్తూనే వున్నది.

కలత నిద్రలో నీళ్లలో తేలుతున్న శవాల గుట్టల మధ్య నేను ఈదులాడుతున్నట్లు కలగని ఉలిక్కిపడి లేచాను.

నా గుండె ఎప్పుడూ లేనంత వేగంగా కొట్టుకుంటున్నది. అంత చలిలో కూడా నా ఒళ్ళు చెమటతో తడిసిపోయింది. మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించలేదు. తెల్లవార్లూ శివరాత్రి జాగరణలా అయింది నా పరిస్థితి. తుఫాను దెబ్బకు రైలు మధ్యలో ఆగిపోతుందా అని ఒకరిద్దరు మాట్లాడుకోవడం వింటుంటే భయంతో నా గుండె దడదడలాడింది. ఏదైనా స్టేషన్లో, లేదా అవుటర్‌లో రైలు అయిదు నిమిషాలు మించి ఆగితే ప్రాణం విలవిలా కొట్టుకులాడేది. రైలు చాలా నెమ్మదిగా కదులుతున్నది. నా భయానికి ఆజ్యం పోసినట్టు రైలు అనకాపల్లి సమీపంలో ఆగిపోయింది. తెల్లవారటానికి ఇంకా రెండుగంటల సమయం వుంది. నేను బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. నా భయాందోళలకు తెరదించుతూ రైలు ఒక గంట తరువాత ముందుకు కదిలింది.

ఆరింటికి గమ్యస్థానం చేరాల్సిన రైలు మూడు గంటలు ఆలస్యంగా తొమ్మిదింటికి చేరుకున్నది.

బోగీ నెంబర్ సంధ్యకు ముందుగానే మెసేజ్ చేసాను. నేను రైలు దిగేసరికి ఎదురుగా సంధ్య గొడుగు వేసుకుని నిలబడి వుంది. కుశల ప్రశ్నలు అయ్యాక ఇద్దరం ఆటోలో సంధ్య ఇంటికి బయలుదేరాం. వర్షం దంచి కొడుతున్నది. గాలి తూర్పు నుంచి పడమరకి ఈడ్చి ఈడ్చి కొడుతున్నది. ఆ ఈదురు గాలులకు ఆటో తిరగబడుతుందేమో అనిపించింది. ఆటోలో కూర్చున్నా ఇద్దరం తడిసి ముద్దయిపోయాం. మొత్తానికి క్షేమంగానే ఇంటికి చేరుకున్నాం.

సంధ్య నాన్నగారు గుమ్మంలోనే మాకోసం ఆతృతగా చూస్తూ నిలుచుని వున్నారు. మేము దిగిన ఆటోను ఆగమని చెప్పారు.

“సంధ్యా, విశ్వం బాబాయి చనిపోయారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మనం వెంటనే వెళ్ళాలి. ఈ వర్షానికి కారు నడపలేను. ఈ ఆటోలోనే వెళదాం. అమ్మమ్మకు తోడుగా శ్రీ వుంటుంది. సాయంత్రానికల్లా వచ్చేద్దాం.” అన్నారు.

ఎదురు చూడని ఈ పరిస్థితికి సంధ్య సందిగ్ధంగా నావైపు చూసింది.

“నాకు మీ ఇల్లు కొత్త కాదుగా. నా గురించి ఆలోచించవద్దు. మీరు వెళ్ళి రండి.” అన్నాను.

సంధ్య బట్టలు మార్చుకుని వాళ్ళ అమ్మ, నాన్నతో కలిసి అదే ఆటోలో వెళ్ళిపోయింది.

వండిన వంటలు డైనింగ్ టేబుల్ మీద వున్నాయి. నేను స్నానం చేసి సంధ్య అమ్మమ్మకు అన్నం పెట్టి, తరువాత నేను తిన్నాను. రాత్రంతా నిద్ర సరిగా లేని నాకు అన్నం తినగానే కళ్ళమీదకు నిద్ర కూరుకు వచ్చింది. సోఫాలో పడుకుని నిద్రపోయాను.

మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయింది. ఇల్లంతా చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. లైట్ వేయబోతే వెలగలేదు.

“కరెంటు ఎప్పుడో పోయింది. రాత్రంతా రైలులో నిద్రపోలేదా? చాలా సేపు పడుకున్నావ్.” అంది అమ్మమ్మ నన్ను చూస్తూ.

“ఇన్వర్టర్ ఉండాలిగా” అన్నాను అమ్మమ్మ వైపు చూస్తూ.

“అది చెడిపోయి వారం రోజులైంది. మెకానిక్‌కు కబురు చేస్తే ఇంతవరకూ రానేలేదు.” అమ్మమ్మ నింపాదిగా అంది.

సంధ్య వాళ్ళు ఇంకా రాలేదు.

టీ పెట్టి అమ్మమ్మకు ఇచ్చి నేనూ తాగాను.

బయట వర్షం పడుతున్న చప్పుడు బాగా ఎక్కువయింది. గాలి హోరు భయంకరంగా వినపడుతున్నది. కిచెన్‌లో చీకట్లోనే అగ్గిపెట్టె, కాండిల్ కోసం వెతికాను.

అగ్గిపెట్టె దొరికింది గానీ దానిలో మూడే మూడు అగ్గిపుల్లలున్నాయి. వెతగ్గా వెతగ్గా చిన్న కాండిల్ కనిపించింది. అవి తీసుకొచ్చి హాల్లో టీపాయ్ మీద వుంచాను. నా ఫోన్ తీసి చూశాను. లోఛార్జింగ్ అంటూ స్క్రీన్ పై రెడ్ కలర్ మార్క్ కనిపించింది. ఇంట్లో వున్న లాండ్ లైన్ తీసి చూశా. అదికూడా డెడ్ అయింది.

ముందు తలుపు తీసి బయటకు చూడబోయాను. ఒక్కసారిగా గాలి, వర్షం ఉధృతంగా నన్ను తాకాయి. క్షణంలో తడిసి ముద్దయ్యాను. క్రింద పడబోయి గట్టిగా నిలదొక్కుకుని తలుపు మూయబోయాను. ఎదురు గాలి తలుపును బలంగా వెనక్కు తోస్తోంది. నా బలమంతా ఉపయోగించి తలుపు మూసి గడిపెట్టాను. గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకున్నాను.

చీకట్లోనే తడుముకుంటూ వెళ్ళి అమ్మమ్మ దగ్గర కూర్చున్నాను. అమ్మమ్మ ఏవో కబుర్లు చెపుతున్నది. కానీ అవేమీ నేను వినడం లేదు. ఎందుకో నా మనసు తెలియని ఆందోళనకు లోనవుతున్నది. బలంగా గాలి వీస్తున్న చప్పుడు వినిపిస్తున్నది.

ఒక్కసారిగా బయట ధడేల్ ధడేల్ మనే శబ్దాలు వినిపించాయి

“అమ్మమ్మా అవేం శబ్దాలు?” అని అడిగాను.

“మనింటికి కొద్ది దూరంలో రేకుల షెడ్లు వున్నాయి. సుడిగాలుల బీభత్సానికి ఇళ్ల పైకప్పులు, ఇనుప రేకులు గాలిలోకి లేచి ఎక్కడెక్కడో పడివుంటాయి. ఆ శబ్దాలు అవే అనుకుంటా. ఈ తుఫానుకు ఎన్ని ఇళ్ళు, ఎన్నిచెట్లు నేల కూలాయో రేపు బయటకు వెళితే తెలుస్తుంది.”

“సంధ్య వాళ్ళు యింకా రాలేదు..” అని నేను అంటుండగానే

“ఉదయం నుండి ఎడతెరపిలేకండా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోయి వుంటాయి. ఈ తుఫానులో ఇంకేం వస్తారు. ఈ రాత్రికి రారు. తుఫాను తగ్గితే రేపు ఉదయానికి వస్తారేమో.” అంది అమ్మమ్మ.

ఫోన్, టీ.వి, రేడియో ఏవీ పని చేయడం లేదు. నా సెల్ లో చార్జింగ్ అయిపోయింది.

మనిషి, మనిషిని నిరంతరం కలిపివుంచే కమ్యూనికేషన్ చానెల్స్ అన్నీ మూగబోయాయి. అమ్మకు, నాన్నకు ఉదయం సంధ్య ఇంటికి చేరినట్టు చెప్పాను. మళ్ళీ ఫోన్ చేయలేదు. అమ్మ గాభరా పడుతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితిలో చిక్కుకు పోయాను.

అగ్గిపుల్ల గీసి కాండిల్ వెలిగించబోయాను.

ఒక అగ్గిపుల్ల అసలు మండలేదు. రెండో అగ్గిపుల్ల వెలిగి ఆరిపోయింది. ‘ఓ గాడ్’ అనుకుంటూ వణికే చేతులతో మూడో అగ్గిపుల్ల గీసి కాండిల్ వెలిగించాను.

చాలా చిన్న కాండిల్ అది. ఎంతసేపు వెలుగుతుందో అనుకుంటూ ఉదయం మిగిలివున్న అన్నం, కూరలతో అమ్మమ్మ, నేను భోజనం ముగించాము.

కాసేపు అయ్యాక అమ్మమ్మ తన గదిలోకి వెళ్ళి పడుకున్నది.

నేను హాల్లోనే సోఫాలో మునగదీసుకుని పడుకున్నాను. బయట తుఫాను వాతావరణం అంతకంతకూ భయానకంగా మారుతున్నది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతున్నది.

వీస్తున్న ప్రచండ గాలుల శబ్ధం చెవులను హోరెత్తిస్తున్నది. మనసులో ఏదో తెలియని గుబులు. నిద్ర రావడం లేదు. ఒక్కసారిగా ఇంటిముందు ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి లేచి అద్దాల కిటికీ దగ్గరకు వెళ్ళి కళ్ళు చిట్లించుకుని బయటకు చూశాను. గాలి విసురుకు ప్రహరీ గోడ దగ్గర వున్న పారిజాత వృక్షం కూలి ప్రహరీ గోడ మీద పడింది.

అంతలోనే బాల్కనీ మీద ఏదో పడినట్టు ఢాం అని పెద్ద శబ్దం వినిపించింది. నేను భయంతో అమ్మమ్మ గదికి వెళ్ళి ఆమెను లేపబోయాను. ఎంత పిలిచినా అమ్మమ్మ లేవలేదు. పడుకునే ముందు నిద్ర మాత్ర వేసుకుని వుంటుంది ఆనుకుని గది నుండి బయటకు వచ్చి మెట్ల వైపుగా నడిచాను.

మెట్లు ఎక్కి బాల్కనీ తలుపు ఓరగా తీసి చూశాను. నీళ్ళ టాంకు మీద ఉంచిన సిమెంటు మూత ట్యాంకుకు అల్లంత దూరంలో పడి ముక్కలై పోయింది.

గాలి విసురుకు తూలిపడి నేను మెట్ల మీదుగా క్రిందకు జారాను. లేచి నిలబడబోయాను. ఎడమకాలు మడమ దగ్గర కలుక్కుమంది. ప్రాణాలు ఉగ్గబట్టి లేచి నిలుచున్నాను.

బాల్కనీ తలుపు మూయకపోతే వాన జల్లు ఇల్లంతా తడిపేస్తుందని అడుగు తీసి అడుగు వేస్తూ మెట్లు ఎక్కి అతి ప్రయాస పడి బాల్కనీ తలుపు మూసి గడిపెట్టాను. నెమ్మదిగా వచ్చి సోఫాలో కూర్చున్నాను.

ఎడమ కాలు బెణికినట్టుంది. మోచేతి దగ్గర మంట అనిపించింది. ఆరిపోతున్న కాండిల్ వెలుగులో చూసుకుంటే చర్మం డోక్కుపోయి కనిపించింది.

కాండిల్ పూర్తిగా ఆరిపోయింది.

కళ్ళ ముందు కటిక చీకటి నన్ను మరింత ఆందోళనకు గురిచేసింది. రైలులో విన్న దివిసీమ ఉప్పెన గుర్తొచ్చింది. ఈ తుఫానుకు విశాఖపట్నం కూడా మునిగిపోతుందా అని భయంతో వణికిపోయాను. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.

కళ్ళు మూసుకుని ధైర్యాన్ని కూడగట్టుకొని మెల్లిగా కళ్ళు విప్పి చూశాను. చీకటికి మెల్లగా నా కళ్ళు అలవాటు పడ్డాయి. ఒక్కసారిగా మిరుమిట్లు గొలిపే మెరుపు కాంతి గ్లాసు కిటికీ లోనుండి వచ్చి నా కళ్ళల్లో పడింది. అప్రయత్నంగా కళ్ళు మూసుకుపోయాయి. వెంటనే ‘ఢాం’ అని భీకరమైన శబ్దం వినిపించింది. నేను ఉలికిపాటుతో చెవులు మూసుకున్నాను. దగ్గరలో ఎక్కడో పిడుగు పడినట్లుంది. ఒళ్ళంతా గజగజా వణికి పోసాగింది. లోపలినుండి ఏడుపు తన్నుకుని వస్తున్నది. భగవంతుడిపై భారం వేసి అలానే సోఫాలో కూర్చుండి పోయాను. అమ్మ చెప్పిన మాటలు వినకుండా ఇక్కడికొచ్చి తప్పు చేశానా అనిపించింది మనసులో.

కిటికీ దగ్గర ఏదో చప్పుడు వినిపించి అటు చూశాను. ఏదో తెల్లటి ఆకారం అస్పష్టంగా కనిపించి మాయమైంది. కాలేజీ రోజుల్లో స్నేహితులు చెప్పిన దెయ్యం కథలు గుర్తుకు వచ్చి ఒళ్ళంతా జలదరించింది. అప్పట్లో అవన్నీ నాన్సెన్స్ అని నేను వాదించడం గుర్తుకు వచ్చింది. మన మనస్సులో కదిలే భయాలే దెయ్యాలుగా కనపడతాయి అనుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుని కిటికీ వైపు చూశాను. అయిదు నిమిషాల పాటు తదేకంగా చూసినా ఏమీ కనపడలేదు. మెల్లిగా కళ్ళు మూసుకుని నిద్ర పోవడానికి ప్రయత్నించాను.

కలత నిద్రలో వున్న నాకు డబేల్ డబేల్ మంటూ తలుపు చప్పుడు వినిపించి ఉలిక్కిపడి లేచాను. బయట వర్షం పడుతున్న చప్పుడులో లీలగా ఎవరో పిలుస్తున్న అరుపులు వినిపించాయి. భయంతో వణికిపోయాను. ధైర్యాన్ని కూడదీసుకుని వెళ్లి కిటికీలో నుండి చూస్తే ఎవరూ కనపడలేదు. వెనక్కు తిరిగే లోపు మళ్లీ తలుపు విరిగిపోయేలా బాదుతున్న చప్పుడు వినిపించింది. ప్రాణం పోయినంత పని అయింది. అదురుతూన్న గుండెను చిక్కబట్టుకుని బెదురుతూనే మళ్ళీ కిటికీలో నుండి కళ్ళు చిట్లించుకుని చూశాను. మెరుస్తున్న మెరుపుల వెలుగులో ఒక మనిషిని చూశాను. ఆ మనిషి గజగజా వణుకుతూ తలుపు బాదుతున్నాడు. తలుపు తీయకపోతే గాలివానకు చచ్చిపోయేలా వున్నాడు. పాపం అనిపించింది. తలుపు కొద్దిగా తెరిచాను. వర్షం విసురుకు ఆ మనిషి లోపలికి వచ్చి బోర్లా పడిపోయాడు. నేను వెంటనే తలుపు మూసేశాను.

ఒక నిమిషం తరువాత ఆ మనిషి లేచి కూర్చోవడం లీలగా కనిపించింది.

“కాండిల్ గానీ, సెల్ ఫోన్ గానీ లేదా?” అన్న మాటలు వినిపించాయి.

“ఏమీ లేవు.” అన్నాను.

“ఇంట్లో గ్యాస్ స్టవ్ వుందా?” వణుకుతున్న స్వరం వినిపించింది.

గ్యాస్ స్టవ్ గురించి ఎందుకు అడిగాడు అనుకునే లోపునే ప్లాష్‌లా ఐడియా తట్టింది. నేను సమాధానం చెప్పకుండా తడుముకుంటూ కిచెన్ లోకి వెళ్ళి స్టవ్ వెలిగించాను. గోరంత దీపం కొండంత వెలుగులా ఇల్లంతా కాంతిమయమై పోయింది. అతను గజగజా వణుకుతూనే కిచెన్ లోకి వచ్చాడు. నలభై సంవత్సరాలు వుంటాయేమో అతనికి అనిపించింది. చేతులూ, కాళ్ళకు దెబ్బలు తగిలి రక్త మోడుతున్నాయి.

“ప్లీజ్ పొడి బట్టలు ఏమన్నా వుంటే ఇవ్వండి. చలికి, ఆకలికి చచ్ఛిపోయేలా వున్నాను.” అంటూ ఏడుస్తూ నాకు దణ్ణం పెట్టాడు.

నేను అంకుల్ రూంలోకి వెళ్ళి టవల్, లుంగీ, చొక్కా తెచ్చి ఇచ్చాను. తల తుడుచుకుని బాత్ రూం కెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద మిగిలిన ఆహారం, ఫ్రిడ్జ్‌లో వున్న పళ్ళు పెడితే ఆవురావురుమని తిన్నాడు.

“ఈ తుఫాను వాతావరణం చాలా భయంకరంగా వుంది. కరెంటు స్తంభాలు మెలి తిరగడం మొదటిసారిగా చూసాను. తీగలన్నీ తెగిపోయాయి. భారీవృక్షాలన్నీ కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. ఈ సమయంలో ముఖ్యమైన పని మీద అనుకోకుండా బయటకు వచ్చి తప్పు చేసాను. నా వెహికిల్ గాలి విసురుకు గాల్లో లేచి అల్లంత దూరంలో పడిపోయింది. లక్కీగా నాకు పెద్దగా దెబ్బలు తగలలేదు. ఆ తుఫాను హోరులో నా ప్రమేయం లేకుండానే నేను కొట్టుకు పోయాను. కొద్దిసేపు గాలి ఆగింది. నేను ఎక్కడ ఉన్నానో ఆ చీకటిలో నాకు అర్థం కాలేదు. అయిదు నిమిషాల లోపే మళ్ళీ విలయం మొదలయింది. దక్షిణం నుంచి ఉత్తరానికి వీస్తున్న ప్రచండమైన గాలి నన్ను ఒక్కసారిగా పైకి లేపి ఈడ్చి కొట్టింది. ఆ గాలికి కొట్టుకు వచ్చి మీ ఇంటిముందు పడిపోయాను.”

అని అతను చెపుతుండగానే, గాలి హోరు పెరిగి గడి పెట్టి వున్న కిచెన్ కిటికీ తలుపులు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. వాన జల్లు విసురుగా లోపలికి తోసుకువచ్చింది. కిటికీలో నుండి లోపలికి దూసుకు వచ్చిన గాలికి వెలుగుతున్న గ్యాస్ స్టవ్ మంట గుప్పున పైకి లేచింది. నేను చేష్టలుడిగి చూస్తుండగానే అతను ఒక్క ఉదుటున లేచి సిలిండర్ నాబ్‌ను బంద్ చేశాడు.

ఇల్లంతా మరలా చీకటితో నిండిపోయింది.

త్రుటిలో ప్రమాదం తప్పిపోయిందని నేను నిట్టూర్చేలోపే కిటికీలో నుండి వస్తున్న ఉధృతమైన గాలులకు కిచెన్‌లో వస్తువులన్నీ విపరీతమైన శబ్దాలు చేస్తూ క్రిందపడి పోతున్నాయి. కుక్కర్ అనుకుంటా వచ్చి నా కాలి బొటనవ్రేలు మీద పడింది.

“అమ్మా” అని పెద్దగా అరిచి కాలు పట్టుకుని క్రింద కూలబడ్డాను. బొటన వ్రేలు తడిమి చూస్తే తడి తడిగా తగిలింది. అది రక్తం అని గ్రహించాను. పంటి బిగువున బాధను బిగబట్టి పైకి లేవబోయాను.

ఇంతలో “ఏమైంది?” అంటూ అతను నా దగ్గరకు వచ్చాడు.

“పాదం మీద ఏదో గిన్నె పడి బొటన వ్రేలు చిట్లినట్లుంది.” అంటూ పైకి లేచి ముందుకు అడుగు వేయబోయాను.

నడవలేక ముందుకు తూలి ఎదురుగా వచ్చిన అతని ఛాతీ మీద పడ్డాను. అతను తన రెండు చేతులతో నన్ను పట్టుకున్నాడు. హోరుగాలి విసురుకు నేను అతనికి మరింత దగ్గర అయ్యాను. ఒక్క క్షణంలోనే ఆ మనిషిలో ఏదో తేడా వచ్చింది. నన్ను బలంగా హత్తుకున్నాడు. అతని ఊపిరి వెచ్చగా నా మెడను తాకింది. నా భుజాలను పట్టుకున్న అతని చేతులు క్రమంగా క్రిందికి దిగసాగాయి. నేను అతని పట్టునుండి విడిపించుకోవాలని చూసినకొద్దీ మరింతగా నన్ను తనకేసి అదుముకోసాగాడు. నేను బలాన్నంతా చేతుల్లోకి తెచ్చుకుని అతన్ని తోసివేశాను. అతను క్రింద పడి వెంటనే విసురుగా లేచి విషనాగులా నన్ను చుట్టేశాడు. ఆ భయానక, భీభత్స వాతావరణంలో రాక్షసుడిలా తన కౌగిలిలో నన్ను బంధించి కసితీరా నలిపేస్తున్నాడు.

ఒక్క క్షణం ప్రాణం కడగట్టి పోతున్నట్లు అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని అతని ముఖం మీద గోళ్ళతో గీరాను. అతను గట్టిగా అరుస్తూ, వినరాని బూతులు తిడుతూ ఉడుముపట్టులా నన్ను పట్టుకుని, కిచెన్ గట్టు దగ్గరకు తీసుకెళ్ళాడు. కిటికీలో నుండి వస్తున్న గాలి, వానకు ఇద్దరం తడిసి ముద్దయి పోయాం. కిచెన్ గట్టు మీదకు నన్ను వొంచుతూ నా ముఖం దగ్గరకు తన ముఖాన్ని తెస్తున్నాడు. ఒక చేత్తో అతన్ని ఆపుతూ, మరో చేత్తో కిచెన్ గట్టును తడుముతున్నాను. నా చేతికి ఏదో తగిలింది. దాన్ని తడిమి చూసి గ్రానైట్ రాయితో చేసిన రొట్టెల పీట అని గ్రహించాను. ఒకచేత్తోనే దాన్ని లేపి అతని తలపై గట్టిగా కొట్టాను. అతను నన్ను వదిలి “అమ్మా” అంటూ తల పట్టుకుని క్రింద పడిపోయాడు.

కిటికీ నుండి లోపలికి వస్తున్న మెరుపుల వెలుగులో అతని తల నుండి రక్తం కారటం కనిపించింది. అతను చచ్చాడో, బ్రతికి వున్నాడో పట్టించుకునే స్థితిలో లేను నేను. మనసంతా మొద్దుబారినట్లయింది.

కిచెన్ మొత్తం నీళ్ళతో తడిసిపోయింది.

నెమ్మదిగా కుంటుకుంటూ హాల్ దాటి అమ్మమ్మ పడుకుని వున్న గదిలోకి వెళ్ళి తలుపులు మూసి గడిపెట్టాను. అమ్మమ్మ మంచం పక్కనే నేలమీద నిస్త్రాణంగా కూలబడిపోయాను. కదలకుండా నిశ్శబ్దంగా అలానే వుండిపోయాను.

ఆ భయంకరమైన కాళరాత్రిలో ఇక నిద్ర అన్నదే లేదు. బయట తుఫాను విలయం, గాలి హోరు మరింత ఎక్కువయింది. ఒంటరి ఆడది కనపడితే మనిషి మృగంలా, కామపిశాచిలా ఎందుకు మారిపోతున్నాడు అన్న ఆలోచన నన్ను నిలువునా దహించి వేస్తున్నది. సెకన్లు, నిమిషాలు, గంటలు లెక్క పెట్టుకుంటున్నాను. కాలం స్తంభించినట్లు రాత్రి ఎంతకూ ముందుకు జరగడం లేదు అనిపించింది. ఎంత సేపు అలా వుండిపోయానో నాకే తెలియదు.

వర్షం పడుతున్న శబ్ధం తగ్గినట్లు అనిపించింది. నెమ్మదిగా లేచి అమ్మమ్మ చేతికర్రను తీసుకుని గదిలో నుండి బయటకు వచ్చాను. అప్రయత్నంగానే కిచెన్ వైపు చూశాను. అతను అక్కడ కనిపించలేదు. ముందు తలుపు గడి తీసివుంది. నేను తలుపులు తెరచి బయటకు వచ్చాను. వర్షం పడుతూనే వుంది. రాత్రి అంత భీభత్సంగా అయితే కాదు.

కమ్ముకున్న కారుమబ్బుల మాటు నుండి చీకటి తెరలను చీల్చుతూ తూరుపున వెలుగురేఖలు ఉదయిస్తున్నాయి.

Exit mobile version