[డా. మజ్జి భారతి గారి ‘కాలం ఘనీభవించింది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
శ్రావణికి తనమీద తనకే కోపం వస్తుంది. ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. వారం రోజుల నుండి మథనపడి చస్తోంది. ఇన్నాళ్లూ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియని శ్రీనుగాడు.. యిప్పుడు వైజాగులోనే వున్నాడట, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమట. క్లాస్‍మేట్స్ గెట్-టుగెదరుకి వాడిని పిలుద్దామని రాజాగాడంటే, వాడిని కలవడానికి అందరూ ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తుంటే మాట్లాడకుండా ఊరుకుందప్పటికి. పదిహేనవ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలని ఎక్కడెక్కడో వున్న వాళ్ళ అడ్రస్సులు సంపాదించి మరీ, అందరూ కలుసుకునేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఏమీ అనలేని పరిస్థితి.
అప్పటినుండి, వాడి గురించిన ఆలోచన వస్తేనే ఒళ్ళు మండిపోతుంది. వాడొస్తే, తను వెళ్లాలా వద్దా అన్న విషయం తేల్చుకోలేకపోతుంది. దుర్మార్గుడు, ఎంత మోసం చేశాడు! వాడి ముఖం చూస్తే తనని తాను కంట్రోల్ చేసుకోగలదా? వెళ్లకపోతే యిన్ని సంవత్సరాలూ తనే ఆర్గనైజ్ చేసి, యిప్పుడే కారణం చెప్పి మానేస్తుంది? ఈ ఆలోచనలతో నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. ఇదంతా శ్రీనుగాడి నుండే వచ్చింది. అసలా వెధవ, ఇప్పుడే వైజాగెందుకు రావాలి? ఎక్కడో ఉండి చావొచ్చు కదా! ఒకప్పటి ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు వాడి పేరు వింటేనే కంపరమెందుకు పుడుతుంది? ఆలోచనల్లోకి జారుకుంది శ్రావణి.
పదిహేనేళ్ల క్రిందటి మాట.. ఎంత స్నేహంగా ఉండేవాళ్లం! ప్రక్క, ప్రక్క ఇళ్లు. ఏ పనైనా, చిన్నప్పటినుండి కలిసే చేసేవాళ్ళం. ఆఖరికి చదువుకోవడంతో సహా. తమ స్నేహం మీద యెంత భరోసా పెట్టుకుంది? ఒక వయసు వచ్చాక ఆడ, మగల మధ్య స్నేహం ముందుకెల్లదని ఎవరైనా అంటే, ఎంత కోపమొచ్చేది? అలా అన్న వాళ్లతో, “మా ఇద్దరికీ పెళ్లిళ్ళై, పిల్లలు పుట్టినా మా స్నేహం యిలాగే ఎప్పటికీ ఉంటుంది” అని పోట్లాడేది. ఎప్పటికీ తమ స్నేహం చెరిగిపోదని, ఎంత నమ్మకంతో ఉండేది? ఆఖరికి స్నేహితురాళ్ళ కన్నా వాడే ఎక్కువ తనకు.
అటువంటిది ఇంటర్ పరీక్ష ఆఖరి రోజు.. తలుచుకుంటేనే ఇప్పటికీ ఒళ్ళు మండిపోతుంది. వెధవ.. ప్రేమలేఖ ఇస్తాడా తనకి? తన స్నేహం అంత చులకనై పోయిందా? అందరి మగవాళ్లలాగ తననొక ఆడదానిలాగే చూశాడా యిన్నాళ్లూ? ఆ ఆలోచన రాగానే కంపరమెత్తిపోయింది. అంతే “నిన్ను చూస్తే ఏమి చేస్తానో నాకే తెలియదు, నీ ముఖం చూపించకు” అని చెడామడా తిట్టేసింది. ఆ తర్వాత వాడి ముఖమే చూడలేదు. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి యెప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్ రావడం, ఆ ఊరి నుండి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత వాడెవరితోనూ కాంటాక్టులో లేడని తెలిసింది. ఆఖరికి రాజాతో కూడా. వాడికున్న ఫ్రెండ్స్ మేమిద్దరమే. నా దగ్గర వెధవ్వేషాలు వేసినట్టు, వాడి దగ్గర యేమి చేశాడో? వాడూ చెప్పలేదు. మా ఇద్దరి మధ్యా యేమి జరిగిందని కూడా అడగలేదు. అటువంటిది యిన్నేళ్ల తర్వాత రాజాగాడు వాడి ప్రసక్తెందుకు తెచ్చాడు? ఆలోచనలు తెగడం లేదు ఎంతకీ.
ఫోను మోగిన శబ్దానికి ఆలోచనల నుండి బయటకొచ్చింది. ఫోనులో రాజా.
“ఎన్నిసార్లు చేసినా వాడు నా ఫోను లిఫ్ట్ చెయ్యడం లేదు. ఊర్లోనే ఉన్నావు కదా వాడిని పిలువు” అని.
“అసలు మీ ఇద్దరి మధ్యా, యేమి జరిగిందిరా” అంటే, అప్పుడు చెప్పాడు అసలు విషయం.
“జరిగింది చెప్తే నువ్వు నన్ను పాతరేస్తావని తెలుసు. ఇన్నాళ్లూ చెప్పనందుకు క్షమించమని అడిగే ధైర్యం కూడా చెయ్యలేను. అయినా చెప్పక తప్పడం లేదు. ఆరోజు నీకు ప్రేమలేఖ యిమ్మని చెప్పింది నేనే” అన్న చావుకబురు చల్లగా చెప్పి, పైపెచ్చు “నువ్వు బీపీ పెంచుకోకు, నువ్వు చెప్పకముందే నేను గోడకుర్చీ వేసే మాట్లాడుతున్నాను. ఇంటర్ పరీక్షల ఆఖరిరోజు, రాముగాడు నీకు ప్రేమలేఖ ఇవ్వాలనుకుంటున్నాడనే విషయం తెలిసి, ఒకవేళ నువ్వు వాడి ప్రేమలో పడితే, మాతో నిన్ను మాట్లాడనివ్వడేమోనని.. అసలే వాడికి మేమంటే పడదని, నీకూ తెలుసు కదా! శ్రీనుగాడు వద్దన్నా వినకుండా నేనే ఫోర్స్ చేశాను. తర్వాత జరిగింది నీకూ తెలుసు. నేనెన్నిసార్లు ఫోను చేసినా పగ బట్టినట్టు, సమాధానమివ్వడం లేదు. వాడి అడ్రస్ పెడుతున్నాను. తప్పు నాదే. ఏ శిక్ష విధించినా భరిస్తాను. కాని ఈ ఒక్కసారి క్షమించి, వాడినెలాగైనా తీసుకురా” అని చెప్పి, ఫోన్ స్విచ్చాఫ్ చేసి పడేసాడు.
ఎదురుగా ఉంటే చూపులతోనే మాడి మసి చేసేసేది. బతికిపోయాడు వెధవ. మా స్నేహం చెడిపోవడానికి కారణం వీడా? ఈ విషయం తెలియక శ్రీనుగాడినిన్నాళ్లూ యెన్ని శాపనార్థాలు పెట్టాను? అయినా నా బుద్ధేమైంది? ప్రేమలేఖ ఇచ్చాడే అనుకో! ఇదేమి పాడుబుద్ధిరా అని నాలుగు తిడితే సరిపోయేది కదా! అసలే నోట్లో నాలుక లేని మనిషి. ఇన్ని సంవత్సరాలూ మా ఇద్దరికీ దూరంగా యెలా వున్నాడో? ఆ ఆలోచన రాగానే రాజా మీదకు మళ్ళింది కోపం. చేసిందంతా చేసి, యిన్నాళ్లూ ముంగిలా నోరు విప్పలేదు. వెధవన్నర వెధవ.
అయినా “వాడికి బుద్ధిలేదు సరే! శ్రీనుగాడి బుద్ధేమైంది. ఎవడో ఇమ్మంటే ప్రేమలేఖ ఇచ్చేస్తాడా? ఇచ్చాడు సరే! చెంపదెబ్బ పడ్డాకైనా, ఇది తన ఆలోచన కాదని చెప్పాలి కదా! కోపం వచ్చి తిట్టానే అనుకో, వచ్చి బ్రతిమలాడాలి కదా! నా దగ్గర వాడికా మాత్రం స్వాతంత్ర్యం లేదా? చిన్నప్పటినుండి కలిసి పెరిగాం. ఒకరికొకరై తిరిగాం. అటువంటిది నా దగ్గరే నిజం దాచి, యిన్నాళ్లు దూరంగా ఉండడమేమిటి? స్నేహానికి విలువ లేదా వాడి దృష్టిలో? పదిహేనేళ్లు నాతో మాట్లాడకుండా ఉంటాడా? వాడు కనిపించనీ కడిగిపారేస్తాను. వీడు కనిపించనీ! ఉతికి ఆరేస్తాను” కోపంతో ఊగిపోతుంది శ్రావణి.
“కడిగిపారేస్తాన్, ఉతికి ఆరేస్తానంటున్నావ్. ఎవరినేమిటి?” అంటూ వచ్చాడు భర్త శేఖర్.
అప్పటికి గాని తెలిసి రాలేదు శ్రావణికి, తనలో తానే మాట్లాడుకుంటున్నాననే విషయం.
“పిల్లల్ని చూసుకోండి. నేను బయటికెళ్తున్నా” శేఖర్ ఆశ్చర్యంలో నుండి తేరుకోకముందే, గేటు దాటేసింది.
***
తనను చూసి శ్రీను ఎలా రియాక్ట్ అవుతాడోనని భయపడుతూ, భయపడుతూ శ్రీను ఇంటికెళ్లి, తలుపు కొట్టిన శ్రావణికి “ఎవరు?” అంటూ తలుపు తీసింది శ్రీను వాళ్ళావిడ.
చిన్ననాటి స్నేహితురాలినని, పదిహేడేళ్లు కలిసే పెరిగామని, అడ్రస్ ఇప్పుడే తెలిసిందని, పరిచయం చేసుకొని శ్రీను గురించడిగితే “బయటికెళ్లారు, కూర్చోండి” అంది.
హమ్మయ్య ప్రస్తుతానికి బ్రతికిపోయాననుకుంటూ, ధైర్యాన్ని కూడదీసుకుంటూ, పిచ్చాపాటి మొదలు పెట్టింది శ్రీను వాళ్ళావిడతో. పేరు స్వాతి అట, కలుపుగోలుగానే ఉంది.
“ఆయన మీ గురించెప్పుడూ చెప్పలేదు” అంటే, “చిన్న పొరపాటు జరిగింది” అంది శ్రావణి.
“ఆయనలాంటి సిల్లీ విషయాలు పట్టించుకోరే?” ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది స్వాతి. తెలివైనదే. శ్రీనును బాగానే అర్థం చేసుకుంది. ఇక తప్పక “ప్రేమలేఖ ఇచ్చాను” అని నెపం తనమీద వేసుకుంది.
“టీనేజ్^^లో అవన్నీ కామనే కదా!” కొట్టిపారేసింది స్వాతి.
ఇంతలో యింటికొచ్చిన శ్రీనుతో, “ఏవండీ! మీ క్లాస్‌మేట్ శ్రావణిగారు వచ్చారు” అని స్వాతి చెప్తున్నా పట్టించుకోకుండా, చురుక్కున ఒక చూపు చూసి, లోపలికెళ్ళిపోయాడు.
తెల్లబోయిన స్వాతి “ఆయన సరిగ్గా విన్నట్టు లేదు” అని లోపలికెళ్ళింది. లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరూ బయటికి రారు. మండిపోయింది శ్రావణికి.
‘అప్పుడు కోపంలో ఏదో అనేశానే అనుకో! అయినా ఇంటికి వచ్చిన నన్నింత అవమానిస్తాడా? పలకరించకుండా చూడనట్టు వెళ్లిపోతాడా?’ అనుకుంది. అంతే! అంతవరకూ వున్న భయం పోయి పూనకమొచ్చేసింది. ఎక్కడున్నాననే విషయం కూడా మర్చిపోయి గదిలోకి దూసుకెళ్లింది.
“ఏంట్రా నీ పొగరు?” అంటూ అరిచింది.
“పొగరంటావేమిటి? నా ముఖం చూపించొద్దని చెప్పావ్ కదా! అందుకే లోపలికి వెళ్ళిపోయాను” అంతకన్నా కోపంగా అన్నాడు శ్రీను.
“అంటే అన్నాను. నేనన్నవన్నీ చేసేసావా ఏంటి?” పులిలా మీదకెళ్ళింది శ్రావణి.
“ఏమి చెయ్యలేదో చెప్పు” ఎదురుగా వచ్చి నిలబడ్డాడు శ్రీను.
“రాజాగాడు ప్రేమలేఖ యిమ్మంటే యిచ్చానని చెప్పావా?” అరిచింది శ్రావణి.
“మేటరది కాదు. నువ్వు చెప్పిందేమి చెయ్యలేదో అది చెప్పు” మొండికేశాడు శ్రీను.
“ఇన్నాళ్లూ నువ్వు చేసిన దానికి గోడకుర్చీ వెయ్” అరిచింది శ్రావణి.
“నేనెందుకెయ్యాలి. అసలు ప్రేమలేఖ యిచ్చానే అనుకో! నచ్చితే తీసుకోవాలి, లేకపోతే మానెయ్యాలి అంతేకాని నా ముఖం చూపించొద్దంటావా? నన్నలా అన్నందుకు నువ్వే గోడకుర్చీ వెయ్” ఎదురు తిరిగాడు.
“అవేం మాటలండి” ముందుకొచ్చింది స్వాతి.
“లేకపోతే ఏం చెయ్యమంటావ్? అన్నేళ్ళ స్నేహాన్ని పక్కనపెట్టి, ఛీ! ఛీ! మీ మగవాళ్ళందరూ ఒక్కటే! ఫ్రెండువని ఎంత నమ్మాను నిన్ను? స్నేహానికి నువ్విచ్చిన విలువ ఇదేనా? ఇన్నాళ్లూ నన్నొక ఆడదానిగానే చూసావా? నీ దుర్బుద్ధిని తెలుసుకోకపోవడం నాదే తప్పు. నాకెదురుపడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలియదని, తిడుతుందా? నా స్నేహానికి తనిచ్చే విలువ ఇదేనా? నేనొక మగ వెధవలా కనిపించానా? అయినా తను చెప్పినట్టే చేశాను కదా! మరలా నామీద అరుస్తుందెందుకు?” స్వాతి మీద అరిచాడు.
“తన మీద అరుస్తావెందుకు? వాడెవడో చెప్తే ప్రేమలేఖ యిచ్చెయ్యడమేనా? నీ బుద్ధేమైందని?”, శ్రావణి అంటే, “ప్రేమలేఖ యిస్తే ఎప్పుడూ మాతోనే కలిసుంటావని చెప్పాడు. నిజమనుకున్నాను” మొరాయించాడు శ్రీను.
“అప్పుడంటే తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా! పదిహేనేళ్లు స్నేహానికి దూరమయ్యాం. ఇంకా తిరిగి సమాధానం చెప్తున్నావా? నీకిలా కాదు. బడిత పూజ చెయ్యాల్సిందే!” కర్ర కోసం అటూ ఇటూ చూసి కనిపించక, వంటగదిలోకి వెళ్లి అట్లపుల్ల పట్టుకొచ్చింది శ్రావణి. ఏమనుకున్నాడో! కిక్కురు మనకుండా చెయ్యి చాపాడు. నాలుగు దెబ్బలు వేసి, భోరున ఏడ్చేసింది శ్రావణి.
“నన్ను కొట్టి నువ్వేడుస్తున్నావేమిటే! మీ ఆయన చూస్తే నేను కొట్టాననుకుంటాడు. నీకు పుణ్యముంటుంది. నువ్వేమి చెయ్యమంటే, అది చేస్తాను. ఏడుపు ఆపవే!” బ్రతిమలాడుకుంటున్నాడు శ్రీను.
“అసలు నిన్ను కాదు. రాజాగాడిని చితక్కొట్టాలి” ఏడుపు వెనక్కిళ్ళిపోయి కోపం ముంచుకొచ్చింది శ్రావణికి.
“నువ్వెలాగూ వేయిస్తావని ముందే గోడకుర్చీ వేసి కూర్చున్నాడట వాడు. ఇందాకే మెసేజ్ పెట్టాడు. తెలియక చేసాం. మమ్మల్ని క్షమించవే! నీ కాళ్లు పట్టుకుంటాను” స్వాతి ఉందని మర్చిపోయి బ్రతిమిలాడుకుంటున్నాడు శ్రావణిని, శ్రీను.
వాళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు అలుగుతుంటుంటే, అరగంట క్రితం భయపడుతూ, భయపడుతూ తమ ఇంటికొచ్చిన శ్రావణి, ఇప్పుడు ఈయన మీద పెత్తనం చెలాయిస్తున్న శ్రావణి ఒకరేనా అని ఆశ్చర్యంగా చూస్తుంది స్వాతి. మాటల్లో ప్రేమలేఖ ఇచ్చానంది గాని, ఆ మాట నమ్మశక్యంగా అనిపించలేదప్పుడే. ప్రేమించిన వాడింటికి ఏ ఆడది వస్తుంది చెప్పండి? ఈయన కూడా, యే ఒక్కరోజూ ఆమె ప్రసక్తి తీసుకురాలేదు. అటువంటిది ఇన్నేళ్ల తర్వాత కలిసినా కూడా, ఇన్ని సంవత్సరాల దూరాన్ని కూడా వాళ్ళిద్దరూ మరిచిపోయారంటే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఎంత గట్టిదో అర్థమౌతుంది. జీవితంలో ఎంతో మంది స్నేహితులవుతారు కాని, కాలంతో పాటు ఆ స్నేహం కూడా మార్పులు చెందుతూ ఉంటుంది. ఒక్క చిన్ననాటి స్నేహం మాత్రమే, ఏ మార్పూ లేకుండా, కాలంతో పాటు ఘనీభవించి, యిప్పటి వయసును కూడా మరిపించేస్తుంది, మురిపించేస్తుంది.
ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే తను చదువుకున్న సైకాలజీ పాఠాలు, ప్రాణం పోసుకొని తన ఎదురుగా నిలబడినట్టు అనిపించింది స్వాతికి. బిగిలో మరియు లగైపాల సిద్ధాంతం ప్రకారం సన్నిహితంగా మెలగడం వలన ఏర్పడిన చిన్ననాటి స్నేహంలో లింగ బేధముండదు. సామాజిక, ఆర్థికాంశాలు కూడా పరిగణనలోకి రావు. అందుకే ఆ స్నేహం స్వచ్ఛమైనదని అంటారు. కాలం మారినా ఆ స్నేహం విలువ మారదు. వయసుతో పాటు వచ్చే ఒడిదుడుకులకు కూడా లోనవ్వకుండా, మనసు పొరలలో అలాగే నిలిచిపోతుంది. అందుకే ఎన్నేళ్ల తర్వాత కలిసినా, వయసుతో సంబంధం లేకుండా బాల్యావస్థలోకి వెళ్ళిపోతారు చిన్ననాటి స్నేహితులు. వాళ్లకు కాలం కూడా ఘనీభవిస్తుంది. అందులో వాళ్ళు తప్ప వేరెవ్వరూ ఉండరు. ఇప్పుడటువంటి స్థితిలో ఉన్న వాళ్ళిద్దరిని చూసి, తనకటువంటి స్నేహితులు లేనందుకు చింతిస్తూ, పక్క గదిలోకి తప్పుకుంది స్వాతి.