Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాగితాలు పడవలు

[అనూరాధ బండి గారు రచించిన ‘కాగితాలు పడవలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ళ్ళు రాత్రిని పోల్చుకోవు.
చీకటి నిద్రనివ్వదు.
కలవరమంతా వేళ్ళ కొసలనుండీ జారి
బెంగంతా పదాలై కాగితంపై కురుస్తూ..

కనుమరుగైనవేవో గుర్తుకొచ్చి నొప్పవుతుంది.
ఆనవాళ్ళన్నీ చేతివేళ్ళ మధ్య ఖాళీల్లోనుండీ
పదాలుగా జారిపడతాయ్.

జాలిగా హత్తుకోవలసినవేవో మిగిలేఉంటాయ్.
ప్రేమించాల్సిన విషయాలు కౌగిలికందనివై తప్పుకుంటాయ్.

పెంచుకుందామనుకున్నవి, గూళ్ళతోసహా
మాయమవుతాయ్.
అయినా నచ్చిన చెట్లన్నీ నరకబడ్డాక
తీరికగా దుఃఖపడడమొక్కటే ఇప్పుడు ముందున్నది.

నచ్చే పడవలిప్పుడు నదిలో లేవు.
ఇక చేసేదిలేక, రాసుకున్న కలల
కాగితాలు పడవలయ్యి..

అవతలి ఒడ్డుకి..
కాస్త ఊరట
అంతే..

Exit mobile version